మెస్సయ్య: దేవుని కుమారుడు

యేసే క్రీస్తు అన్నది క్రొత్తనిబంధన లేఖనాల విస్పష్టమైన ప్రకటన. అయితే, క్రీస్తు అంటే యెవరు అన్నది ఈ వ్యాసంలో పరిశీలించి చూద్ధాం.

క్రీస్తు అన్న పదం హీబ్రూ భాషలోని మషియాఖ్ [המשיח] అన్న పదం యొక్క గ్రీకు అనువాదం. మషియాఖ్ అన్న హీబ్రూ పదాన్ని ఆంగ్లభాషలో మెస్సయ్య [Messiah] గా అనువదించారు. ఈ పదానికున్న భావం “అభిషిక్తుడు.”

పాతనిబంధనలోని మూడు రకాల అభిషేకాలతో ఒక కారణజన్ముడు ఈలోకంలో జనించబోతున్నడంటూ మోషే మొదలుకొని అనేకమంది ప్రవక్తలు ప్రకటిస్తూ వచ్చారు. ఆ కారణజన్ముని “రాబోవు క్రీస్తుగా” గ్రహించవచ్చు.

ప్రవక్తల ప్రకటనలలోని “రాబోతున్న క్రీస్తు” [המשיח=the Messiah] దేవుని కుమారుడన్న సత్యం మొదటి శతాబ్ధపు యూదు మతపెద్దలకు తెలుసు.

మెస్సయ్య: దేవుని కుమారుడు

అరవై ఆరు గ్రంథాల సంపుటియైన సంపూర్ణ దైవగ్రంథం బైబిల్ బోధ ప్రకారం “దేవుని కుమారుడు/కుమారులు” అనేక రకాలు. అందులో ప్రాముఖ్యమైనవి ఐదు.

ఒకటి-దేవదూతలు

పరలోకమందున్న దేవదూతలను సృష్టికర్త ఏ మాధ్యమం లేకుండా తానే సృష్టించాడు. ఆ కారణంచేత వారు బైబిల్ లో “దేవుని కుమారులు” గా గుర్తించబడ్డారు. [యోబు.1:6; 2:1]

రెండు-ఆదాము

మొదటి మానవుడు ఆదామును దేవుడే స్వయంగా సృష్టించాడు. ఆ కారణం చేత ఆదామును లేఖనం “దేవుని కుమారుడు” గా పేర్కొంటున్నది. [లూకా.3:38]

మూడు-ఇశ్రాయేలీయులు

దేవుడు తానే అబ్రహాము యొక్క వాగ్ధత్త కుమారుడు ఇస్సాకు యొక్క రెండవ కుమారుడైన యాకోబుకు జన్మించిన పన్నెండుగురు కుమారులద్వారా కలిగిన పన్నెండు గోత్రాల ప్రజలందరు ఇశ్రాయేలీయులుగా పేర్కొనబడుతారు. వారందరితో సృష్టికర్త ఒక వాగ్ధానం చేసి వారిని తన ప్రజలుగా లేక “దేవుని కుమారులు” గా చేసుకున్నాడు. [కీర్తన.82:6; యెషయా.43:6; యిర్మీయా.31:9]

నాలుగు-క్రైస్తవులు

యేసు క్రీస్తు ద్వారా చేయబడిన నూతన నిబంధనలో చేరి నిజక్రైస్తవులుగా మారిన వారందరికి దేవుని ఆత్మ నడిపింపు లభిస్తుంది. ఆ రకంగా ఆత్మ నడిపింపులో జీవిస్తున్న వారు “దేవుని కుమారులు” గా పేర్కొనబడుతారు. [యోహాను.1:12; రోమా.8:]

ఐదు-యేసుక్రీస్తు

పై నాలుగు రకాల “దేవుని కుమారు(డు)లు” దేవుని సృష్టిలో భాగం. అయితే, పై నాలుగు రకాల “దేవుని కుమారు(డు)ల” కోవకు చెందనివాడు యేసు క్రీస్తు. అందుకు కారణాలు క్రింద యివ్వబడినవి:

(అ) యేసుక్రీస్తు దేవుని లోనుండి ఉద్భవించిన “దేవుని కుమారుడు” [యోహాను.8:42, 13:3].
(ఆ) యేసుక్రీస్తు “దేవుని స్వంత కుమారుడు” [రోమా.8:3,32].
(ఇ) యేసుక్రీస్తు “దేవుని ప్రియ కుమారుడు” [మత్తయి.3:17, 17:5].
(ఈ) యేసుక్రీస్తు “దేవుని అద్వితీయ కుమారుడు” [యోహాను.3:16, 1యోహాను.4:9].
(ఉ) యేసుక్రీస్తు అదృశ్యదేవుని దృశ్యరూపం [యోహాను.14:9; 2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15, 2:9].
(ఊ) యేసుక్రీస్తు దైవతత్వము యొక్క ప్రత్యక్షతయు అలాగే దేవుని మహిమను కనుపరచె తేజస్సును అయివున్నాడు [హెబ్రీ.1:3].
(ఎ) సృష్టికర్తకు సర్వసృష్టి చెల్లిస్తున్న ఆరాధనకు యేసుక్రీస్తు పాత్రుడు [యోహాను.5:23; ప్రకటన.5:11-14].

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *