పాతనిబంధన Vs. క్రొత్తనిబంధన

జూడాయిజంవారి దుర్బోధ

జూడాయిజంలోని కొందరు లేఖనాలను వక్రీకరిస్తూ క్రొత్తనిబంధనను గురించి చేస్తున్న అసత్యబోధలలో క్రొత్తనిబంధనను గురించి క్రింది విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:

  • క్రొత్తనిబంధన అంటే మోషేద్వారా చేయబడిన నిబంధనను కేవలము తిరిగి నూతనపరచడము మాత్రమే. [❌]
  • క్రొత్తనిబంధన అంటే దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబోతున్న నిబంధన. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల కారణం, క్రొత్తనిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేదు. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల మరొక కారణం, క్రొత్తనిబంధన తరువాత అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను గురించి బోధచేసే అవసరత వుండదు. కాని, అలాంటి జ్ఙానం ఇంకా క్రొత్తనిబంధనలో ప్రవేశించామని ప్రకటిస్తున్న క్రైస్తవులకు రాలేదు. దీన్నిబట్టి యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన క్రొత్తనిబంధన కాదు. [❌]

లేఖనాల సద్బోధ

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

పై లేఖనాలలో ప్రభువైన దేవుడు వాగ్ధానం చేసిన నిబంధన ఒక క్రొత్తనిబంధన. అది కేవలము నూతనపరచబడబోతున్న అదివరకేవుండిన నిబంధన కాదు. ఈ సరికొత్తనిబంధనను గూర్చి పాతనిబంధన కాలములోని ప్రవక్తలద్వారా దేవుడు అనేక వివరాలను ప్రవచనరూపములో అందించాడు (ద్వి.కాం.32:21,43; కీర్తనలు 117:1-2; యెషయా 11:10, 42:5-7; 45:20-25, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28; హోషేయ 2:14-23; జెకర్యా 9:9-17; మలాకి 1:10-11 = లూకా 22:19-20; రోమా.8:2; 1కొరింథీ.11:25; గలతీ.6:2; 1 తిమోతీ.2:3-6; హెబ్రీ.9:15, 12:24).

పాత/మోషే నిబంధన మరియు దానితరువాత చేయబడే క్రొత్తనిబంధన అన్నవి రెండు వేరువేరు నిబంధనలు. లేఖనాల సమగ్ర బోధను కూలంకశంగా పరిశీలించి చూస్తే పాతనిబంధనకు మరియు క్రొత్తనిబంధనకు మధ్యగల వ్యత్యాసాలు అవగతమవుతాయి.

పాతనిబంధన

మోషేనిబంధన (Mosaic Covenant) లేక పాతనిబంధనను (Old Covenant) గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) మోషేనిబంధనను దేవుడు లోకములోని ప్రజలందరితో చేసిన నిబంధనగా లేఖనాలు ఎక్కడా పేర్కొన లేదు.

(2) మోషేనిబంధన అన్నది దేవుడు మోషేకంటే ముందు ఉండిన ప్రజలతో లేక ఇశ్రాయేలీయులతో లేక భక్తులతో చేసిన నిబంధన కాదు.

మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.” (ద్వి.కాం.5:2-3)

పై లేఖన సాక్ష్యం ప్రకారం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరియు పన్నెండు గోత్రాల పితరులుగాని లేక హేబేలు, హానోకు, మరియు నోవహు వంటి పాతనిబంధన పరిశుద్ధులలో ఎవరికి మోషే నిబంధనలో పాలు లేదు.

(3) దేవుడు మోషేనిబంధనను కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను/చేసాను అని ఎక్కడా ప్రకటించలేదు.

(4) మోషేనిబంధన అన్నది దేవుడు ప్రధానంగా మోషే నాయకత్వములో ఐగుప్తులోనుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులందరితో చేసిన నిబంధన.

అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. ” (ని.కాం.24:7-8)
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.” (లేవీ.కాం.26:9)
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.” (2దిన.వృ.5:10)
యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.” (న్యాయాధిపతులు 2:1)

(5) మోషేనిబంధనను దేవుడు ఇశ్రాయేలీయులతోనేగాక వారితోకలిసి వారిమధ్య నివసిస్తూ వారితోపాటే పయనిస్తూ వాగ్ధత్తదేశమైన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న అన్యులతో కూడా చేశాడు.

నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, ​నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకులేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను…మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:10…29)

(6) మోషేనిబంధనను చేస్తున్న సమయములో అక్కడ లేనివారితో అంటే అక్కడవున్నవారి యొక్క రాబోవు తరాలవారితో సహితము దేవుడు ఆ నిబంధనను చేశాడు.

నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:14…29)

(7) మోషేనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఇహలోకానికి చెందినవి.

నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును…అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.” (ద్వి.కాం.28:1..14)

(8) మోషేనిబంధనలో పాలుపొందేవారు దేవుని ఆజ్ఙలను న్యాయవిధులను తామే హృదయాలలో వ్రాసుకోవాలని సూచించబడ్డారు.

కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.” (ద్వి.కాం.11:18)

(9) మోషేనిబంధన శరతులతో కూడిన నిబంధన [Conditional Covenant].

మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా” (ని.కాం.19:3-6)

(10) దేవుడు మోషేద్వార చేసిన నిబంధన ద్వైపాక్షిక నిబంధన [Bilateral Covenant].

మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.” (ని.కాం.19:7-8)
ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.” (ని.కాం.20:19)
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి...అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.” (ని.కాం.24:3…7)

(11) మోషేనిబంధన పశువుల రక్తముతో ఆవిష్కరించబడింది.

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్తులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.” (ని.కాం.24:4-8)

(12) ప్రభువైన దేవుడు నోవహుద్వారా చేసిన నిబంధన సర్వశరీరులతో చేసిన నిబంధన అంటూ పేర్కొనటమేగాక దాన్ని నిత్య నిబంధనగా అభివర్ణించాడు [ఆది.కాం. 9:16]. అయితే, మోషేనిబంధనను నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ b’rith olam=everlasting covenant] తనాక్ (పాతనిబంధన గ్రంథము) అంతటిలో దేవుడు ఎక్కడా పేర్కొనలేదు.

మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1). అయితే, ఇశ్రాయేలీయులు పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆ నిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1). ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, “నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను” అంటూ తెగేసి చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59). అంటే, తాను చేసిన వాగ్ధానాన్ని మీరి ఇశ్రాయేలు జనాగాన్నంతటిని లయము చేయటమో లేక వారితో ఎలాంటి అనుబంధము కలిగి ఉండకుండ ఉండటమో అని కాదు. అది కేవలము ధర్మశాస్త్రములో తెలియచేసిన విధంగా వారిని శిక్షించటము [లేవీయకాండము 26:14-39].

ఈ నేపథ్యములో ఇశ్రాయేలీయులు నిబంధనను పదే పదే భంగం చేస్తూ వచ్చినా, ప్రభువైన దేవుడు తానుమాత్రం తాను యిచ్చిన మాటచొప్పున ఆ నిబంధనను మీరకుండా లేక భంగం చేయకుండా రాబోవు దినాలలో ఇశ్రాయేలీయులు కష్టపడి తమ స్వంత ప్రయత్నాలచేత, స్వనీతిచేత, లేక స్వభక్తిచేత సంపాదించనవసరములేని ఒక పరిపూర్ణమైన మరియు ఉత్కృష్టమైన పరిష్కార మార్గాని అందించే నిబంధనను గురించి వాగ్ధానం చేసాడు.

ఇశ్రాయేలీయులచేత పదే పదే భంగం చేయబడుతూ వచ్చిన మోషేనిబంధన నిత్యనిబంధన కాదు. దానికితోడు, ఆ నిబంధనతోపాటు యివ్వబడిన నిబంధనానియమాలు లేక ధర్మశాస్త్రము కూడా పరిష్కారాన్ని చూపలేకపోయిన కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు అలాగే ఉండిపోయాయి. అవి ఈ క్రింద యివ్వబడినవి:

  • ధర్మశాస్త్రములోని విధులను గైకొనక మరియు వాటిని స్థిరపరచకుండుటనుబట్టి శాపగ్రస్తులుగా మారిన వ్యక్తులకు తిరిగి నీతిమంతులయ్యే మార్గం ధర్మశాస్త్రము చూపలేదు (ద్వి.కాం.27:26)
  • తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
  • మరణకరమైన పాపాలకు [లే.కాం.20:10; ద్వి.కాం.13:7-19; 17:2-7; లే.కాం.24:17] క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
  • తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టికర్త తానే సృష్టించిన లోకములోని మానవులందరికి అబ్రహాము ద్వారా చేసిన వాగ్దానములో [ఆది.కాం.12:3, 28:14] భాగంగా యూదులతో సమానంగా అందరికి ఆత్మీయ మేళ్ళను అందించలేక పొయింది
  • ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16).
    [గమనిక: పాతనిబంధన కాలములోనూ నీతిమంతులున్నారు. అయితే, వారు మోషేధర్మశాస్త్రాన్ని పాటించటముద్వారా గాక, దేవునియందలి విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం!]

పై కారణాలన్నింటినిబట్టి ప్రభువైన దేవుడు మోషేనిబంధన లేక పాతనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక క్రొత్తనిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).

మరోమాటలో చెప్పాలంటే, అపరిపుర్ణంగా మరియు లోపభూయిష్టంగా [హెబ్రీ.8:7] ఉన్న మోషేనిబంధనను తొలగించి దాని స్థానములో దానికన్నా శ్రేష్టమైన వేరొక నిబంధనను అంటే పరిపూర్ణమైన మరియు లోపరహితమైన నిబంధనను అందించబోతున్నట్లు ప్రభువైన దేవుడు తానే ముందుకడుగేసి తన అపార కృపాకనికరాలనుబట్టి ఏకపక్షంగా వాగ్ధానం చేసాడు.

(13) మెస్సయ్య ద్వారా క్రొత్తనిబంధన.

పరమతండ్రి పూర్వ/పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). అయితే, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్ష్యాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).

(14) క్రొత్తనిబంధన మరియు అన్యులు.

ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను” (యెషయా.59:21), “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను” (యెషయా.55:3, 61:8; యిర్మీయ.32:40; యెహెజ్కేలు.16:60, 37:26), “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” (యిర్మీయ.31:31) అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు [కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలము అన్యజనులు అని కాదు] అంటే మానవులందరికి ఒక నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు [యెషయా.42:1-7, 49:20-21]. నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే [ద్వి.కాం.32:21, 43; కీర్తన.82:8, 117:1-2; యెషయా 11:10; 42:5-7; 45:20-24; 49:5-13; 55:1-7; 65:1; హోషేయ 2:21-23; జెకర్యా 9:10] క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ! 

ఈసందర్భంగా తనాక్ లో (పాతనిబంధన గ్రంథము) ప్రభువైన దేవుడు తాను ఇశ్రాయేలీయులతో మరియు భూనివాసులందరితో చేయబోతున్న నిబంధనను గురించి అనేక పర్యాయాలు సవివరంగా పేర్కొన్నప్పటికిని ఎక్కడకూడా “నిబంధనలు” అంటూ అనేక నిబంధనలు లేక పలువిధనిబంధనలు చేయబోతున్నట్లు సూచించలేదు అన్నది గమనార్హమైన విశయం. దీన్నిబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానం చేసిన నిబంధన అలాగే అన్యులకు వాగ్ధానం చేసిన నిబంధన వేరువేరు నిబంధనలు కావుగాని ఒకే సార్వత్రిక నిబంధన అన్నది ప్రస్పుటమవుతున్నది. అదే క్రొత్తనిబంధన!

క్రొత్తనిబంధన

క్రొత్తనిబంధన లేక మెస్సయ్యనిబంధనను గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) క్రొత్తనిబంధన అన్నది దేవుడు ముందే భవిశ్యవాణిరూపంలో ప్రవక్తల ప్రవచనాలలో సూచించబడిన నిబంధన.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

(2) క్రొత్తనిబంధన నూతనపరచబడబోయే మోషేనిబంధన కాదు. అసలు అది మోషేనిబంధన వంటిది కానేకాదు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

ఈ సత్యం ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా కూడా తెలియచేయబడింది.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. ” (యెహెజ్కేలు.16:59-60)

పై లేఖములో ప్రభువైన దేవుడు గతములో తాను చేసిన పాత నిబంధనను జ్ఙాపకము చేసుకొని దాన్నే నిత్యనిబంధనగా స్థిరపరుస్తాను అని చెప్పకుండా, పాతనిబంధనను జ్ఙాపకము చేసుకొని అంటే దాని ఉద్దేశాన్ని గమనములో ఉంచుకొని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకై దాని స్థానములో ఒక నిత్యనిబంధనను అంటే నిత్యము ఉండబోయే వేరే నిబంధనను లేక క్రొత్తనిబంధనను చేసి దాన్ని స్థిరపరచబోతున్నట్లు విశదీకరించాడు. స్థిరపరచబడబోతున్నది క్రొత్తనిబంధన, పాతనిబంధన కాదు!

(3) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు ఇశ్రాయేలీయులతో చేయబోతున్నట్లు వాగ్ధానం చేశాడు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31)
సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.59:20-21)

(4) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను అని లేఖనాలలో ఎక్కడా ప్రకటించలేదు.

ఉదాహరణకు, దేవుడు “నేను ఇష్మాయేలును ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని దాని భావమా…?
ఒకవేల దేవుడు “నేను ఇష్మాయేలును మాత్రమే ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే తప్పకుండా దాని భావం దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని.
లేఖనాలలోని ఈ సున్నిత భావవ్యత్యాసాన్ని గ్రహించని ఆత్మీయ అంధులు యిర్మీయ.31:31 లోని లేఖన వాగ్ధానం కేవలం యూదులకు మాత్రమే చెందినది అందులో అన్యులకు పాలు లేదు అంటు వక్రవ్యాఖ్యానము చేస్తుంటారు. ఇదే లేఖనాలకు కలిపి చెరపడమంటే.

(5) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో అలాగే ఇశ్రాయేలీయుల మధ్య కానానులో స్థిరపడినవారితో చేయడమేగాక లోకములోని అన్యులందరికి అందులో ప్రవేశము కల్పిస్తున్నట్లు లేఖనాలలో వాగ్ధానరూపములో సూచించాడు.

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం.32:43)
యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.” (కీర్తనలు 117:1-2)
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” (యెషయా.11:10)
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను
.” (యెషయా.42:6-7)
మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు.” (యెషయా.45:21-24)
“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను…బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ” (యెషయా.49:5…8)
“చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.” (యెషయా.55:3)
“నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)
“​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)
నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను. ​నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరి శుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.” (యెహెజ్కేలు.37:26-28)
నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ.2:23)
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిదపిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా.9:9-11)
తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకి.1:11)

యూదులతోపాటు అన్యులనుకూడా ఆశీర్వదించాలన్న సృష్టికర్తయొక్క బృహత్ప్రణాలికను గురించి పై లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. అన్యులతో “క్రొత్తనిబంధన” చేస్తాను అంటూ దేవుడు ఎక్కడా ప్రకటించలేదు. కారణం…వారికి పాతనిబంధన లేదు గనుక. కాని, ఇశ్రాయేలీయులతో యూదులతో ప్రత్యేకంగా “క్రొత్తనిబంధన” చేస్తాను అని దేవుడు ప్రకటించాడు. కారణం…వారికి పాతనిబంధన వుండింది గనుక.

యూదులకు అన్యులకు వేరువేరుగా చేసిన వాగ్ధానాలను ఐక్యపరచి ఒకే నిబంధనద్వారా తన వాగ్ధానాలను నెరవేర్చుకునే స్వాతంత్ర్యము హక్కు సృష్టికర్తకు లేవనేవాడు ఆత్మీయ దుస్థితిలోని అధమస్థానములోవున్న అవిశ్వాసి!

(6) క్రొత్తనిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనులందరిని రక్షించబోతున్నాడు.

క్రొత్తనిబంధన ఫలితంగా అనేక అద్భుత పరిస్థితులు నెలకొనబోతున్నాయన్నది లేఖనాల సాక్ష్యం. అయితే, అవన్నీ ఒక్క క్షణములో లేక ఒకే దినములో సంభవించబోతున్నాయంటూ లేఖనాలు వాటి నెరవేర్పుల కాల పరిమితులను స్పష్టపరచలేదు అన్న సత్యాని మరచిపోకూడదు. క్రొత్తనిబంధనా ఫలితాలను ప్రభువైన దేవుడు క్రమక్రమంగా అంచలవారిగా నెరవేర్చబోతున్నాడు.

పై కారణాన్నిబట్టి క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేకపోయినా అది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు సంభవించబోయే అద్భుత ఘటన అన్నది లేఖనాలు సూచిస్తున్నాయి (రోమా.11:25-36). అయితే, ఈ సంఘటన క్రొత్తనిబంధన కాలములోనే సంభవిస్తుంది అన్నది తిరుగులేని సత్యం.

(7) క్రొత్తనిబంధన ఫలితాలు.

“​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.” (యిర్మీయా.31:31-34)

ప్రభువైన దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా తెలియచేసిన క్రొత్త నిబంధన యొక్క విశిష్ఠతలు:

  • ఈ నిబంధన ఇశ్రాయేలీయులతో యూదావారితో చేయబడును
  • ఈ నిబంధన మోషేద్వారా చేయబడిన పాతనిబంధన వంటిది కాదు
  • ఈ నిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు తానే తన ధర్మవిధిని వారి మనస్సులలో ఉంచబోతున్నాడు వారి హృదయముమీద వ్రాయబోతున్నాడు
  • ప్రభువైన దేవుడే వారికి దేవుడై ఉండును వారు ఆయనకు జనులై ఉందురు
  • వారు మరి ఎన్న డును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు
  • ప్రభువైన దేవుడు వారి దోషములను క్షమించి వారి పాపములను ఆయన యెన్నడును జ్ఞాపకము చేసికొనడు గనుక అల్పులేమి ఘనులేమి అందరును ఆయననెరుగుదురు

ఈ సందర్భంగా మరోసారి జ్ఙాపకము చేసుకోవలసిన సత్యం, ప్రభువైన దేవుడు తాను చేసిన నిబంధనలలో భాగంగా కొన్ని వాగ్ధానాలను నిబంధన విశిష్ఠతలుగా ఆయా నిబంధనలతోపాటు తెలియచేసాడు. అయితే, ఆ వాగ్ధానాలన్నీ ఒక్క క్షణములోనె లేక ఒకే దినములోనె నెరవేర్చబడుతాయి అంటూ ప్రభువైన దేవుడు సూచించటం లేదు. వాటి నెరవేర్పులు అన్నవి ఆ నిబంధన అమలులో ఉన్నకాలములో క్రమక్రమంగా నెరవేర్చబడుతాయి. ఈ సత్యం ప్రభువైన దేవుడు నరులతో చేసిన అనేక నిబంధనలను పరిశీలించటముద్వారా గ్రహించవచ్చు.

కనుక, ప్రభువైన యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] కలువరి సిలువపై తన స్వంత రక్తముతో చేయబోతున్న క్రొత్తనిబంధనకు సాదృశ్యముగా చేసిన సంస్కారము తన పన్నెండుగురు శిష్యులతో చేసాడు [మత్తయి.26:26-30; మర్కు.14:22-25; లూకా.22:19-20]. వారంతా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారే. క్రొత్తనిబంధనలో భగంగా ఉన్న ధర్మవిధులు వారి హృదయములో ప్రభువైన దేవుడే తన పరిశుద్ధాత్మద్వారా వ్రాసాడు. ఈ ప్రక్రియను గత రెండువేల సంవత్సరాలుగా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారిలోనుండి మెస్సయ్య అయిన యేసు [యషువ] ద్వారా క్రొత్తనిబంధనలో పాలుపొందుతూ వస్తున్న వ్యక్తుల హృదయాలలో పరిశుద్ధాత్మదేవుడే జరిగిస్తున్నాడు.

నిజవిశ్వాసులు అంటే క్రొత్తనిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నందు ఆయన చేసిన బలియాగమునందు విశ్వాసముంచి ఆత్మీయంగా తిరిగి జన్మించిన ప్రతివ్యక్తి, యూదుదైనా లేక అన్యుడైనా, ప్రభువైన దేవుని వ్యక్తిగతంగా ఎరుగుట అన్నది సంభవిస్తుంది. ఆ కారణాన్నిబట్టి క్రొత్తనిబంధనద్వారా దేవుని కుటుంభములో చేరిన ప్రతివ్యక్తి దేవుని కుటుంభములోని మరొక వ్యక్తికి దేవుని తెలుసుకో అంటూ బోధించే ఆవశ్యకత లేదు.

యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] శిష్యులతో ప్రారంభమైన క్రొత్త నిబంధన పరిధి విస్తరిస్తూ ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందే ఇశ్రాయేలు జనాగమంతా రక్షించబడటముతో పరిపూర్ణమవుతుంది. తద్వారా ప్రభువైన దేవుడు తన ప్రవక్త యిర్మీయాద్వారా క్రొత్తనిబంధనను గురించి చేసిన వాగ్ధానాలన్నీ [యిర్మీయా.31:31-34] సంపూర్ణముగా నెరవేర్చబడుతాయి. అప్పుడు, యూదులందరు అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను పరిచయం చేసే అవసరత వుండదు.

(8) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] బట్టే అన్యులనుకూడా దేవుడు ఇశ్రాయేలీయులతో సమానంగా చేయబోతున్నాడు.

(9) క్రొత్తనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఆత్మీయ జీవితానికి మరియు రాబోవు యుగానికి చెందినవి.

(10) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] శరతులులేని నిబంధన [Unconditional Covenant] .

(11) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] ఏకపక్ష నిబంధన [Unilateral Covenant].

(12) క్రొత్తనిబంధన (మెస్సయ్యనిబంధన) మెస్సయ్య రక్తముతో ఆవిష్కరించబడింది.

“సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా 9:9-11)
“సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.” (యోహాను.12:14-15)
“మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ” (మత్తయి.26:28)

(13) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ brith olam=everlasting covenant] పేర్కొన్నాడు.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు.16:59-60)

(14) భూమిలోని వంశాలన్నింటికి క్రొత్తనిబంధనలో స్థానం!

అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!

అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14=అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!

ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ క్రొత్తనిబంధన ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక, లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్షాన్ని అందించాడు.

పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని  మహోత్తర ప్రణాలిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడుగనుక ఇశ్రాయేలీయులను అన్యజనులవలన రోషము పుట్టించబోతున్నాను అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు అంతా! 

నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే క్రొత్తనిబంధన!

రాబోవు దినాలలో అంటే క్రొత్తనిబంధన కాలములో దేవునిరాజ్యములోకి అన్యజనుల ప్రవేశమునుగురించి అనేక మంది ప్రవక్తలద్వారా దేవుడు భవిశ్యవాణిరుపములో సూచించాడు:

పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరి గించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు.9:11-12) 

సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.” (జెకర్యా.2:11)

యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.” (యిర్మీయ.16:19)

 మోషేనిబంధన మరియు మెస్సయ్యనిబంధన మధ్య వ్యత్యాసాలు

మోషేనిబంధన (పాతనిబంధన)మెస్సయ్యనిబంధన (క్రొత్తనిబంధన)
ముందే ప్రవచించ బడలేదుప్రవక్తలకాలములో ప్రవచించబడింది
రాబోవువాటికి ఛాయా రూపాలుగతములోని ఛాయారూపాల నిజస్వరూపం
ప్రారంభబలి: పశువులుప్రారంభబలి: దేవుని ప్రియకుమారుడు
మధ్యవర్తి: సేవకుడుమధ్యవర్తి: దేవుని ప్రియకుమారుడు
చివరలో నీతిమంతులుగా తీరుస్తుందిప్రారంభములో నీతి ఆపాదిస్తుంది
ధర్మవిధులు వ్యక్తులు వ్రాసుకోవాలిధర్మవిధులు దేవుడే వ్రాస్తాడు
వాగ్దత్తదేశములో పాలుపొందబోతున్నవారికే పరలోకములో ప్రవేశించాలని ఆశించే
వారందరికి
అనేక రక్తబలులర్పిస్తుండాలిరక్తబలులు అర్పించడం లేదు
నిబంధనాకాలము పరిమితమైనదినిబంధనాకాలము నిత్యమైనది
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడలేదు
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడింది
వాగ్ధానాలు ఇహలోకానికి చెందినవి వాగ్ధానాలు పరలోకానికి చెందినవి
అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదుల క్రింద అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదులతో సమానం
ద్వైపాక్షిక నిబంధన ఏకపక్ష నిబంధన
శరతులతో కూడిన నిబంధనశరతులులేని నిబంధన
అపరిపూర్ణ నిబంధనపరిపూర్ణ నిబంధన

3 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *