యూదుమతస్తుల ప్రశ్నలు-7

క్రొత్తనిబంధనను తిరస్కరించే దుష్ట ప్రయత్నములో లేవనెత్తబడుతున్న ప్రశ్నలు

ప్రశ్న: యేసు వంశావళి యేది? యోసేపుద్వారా వచ్చిన వంశావళిలో శాపగ్రస్తుడైన యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వున్నాడు గనుక కన్యక అయిన మరియద్వారా వచ్చిన వంశావళే సరి అయినది. కనుక, మరియద్వారా వచ్చిన వంశావళి యేది?

జవాబు: 

(1) ఈ ప్రశ్నలో రెండు పొరపాటులున్నాయి. 

– ఒకటి, యోసేపుద్వారా వచ్చిన వంశావళిలో శాపగ్రస్తుడైన యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వున్నాడు. అయితే, ఆ శాపం అతనిదినాలలోకే పరిమితమైనదని యిదివరకే సవివరంగా మీముందుంచబడినది. ఇవ్వబడిన వివరాలను మీరు అంగీకరించలేకపోతే మీరు దైవ లేఖనాలనే నమ్మని వారని అర్థమవుతుంది.
యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) తరువాత పన్నెండు తరాల తదుపరి విచ్చేసిన యేసు క్రీస్తుకు (యషువ హ మషియాఖ్) ఆ శాపం అన్వయించబడదు. అయినా మీరు యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) శాపాన్ని పట్టుకొనే యింకా వ్రేలాడుతున్నారు. అది సరి అయినది కాదు. మీరు యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) శాపపు భ్రమలోనుండి బయటికి రావాలి. 

– రెండు, కన్యమరియ ద్వారా వచ్చిన వంశావళే సరియైనదంటున్నారు. మరి తమరు యేసు కన్యమరియకు జన్మించాడని అంగీకరిస్తారా? ఒకవేళ ఈ సత్యాన్ని అంగీకరించకపోతే యిక మరియద్వారా వచ్చిన వంశావళి తమరికి ఏరకంగా ప్రయోజనకరమో వివరించండి?   

(2) ప్రభువైన యేసు క్రీస్తు యొక్క వంశావళిని దేవుని ఆత్మ ప్రేరణతో మత్తయి వివరంగా గ్రంథస్థం చేస్తూ ఈవిధంగా మొదలుబెట్టాడు: “అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.” (మత్తయి 1:1). మత్తయి 1:1-16 వచనాలవరకూగల వంశావళే యేసు క్రీస్తు యొక్క న్యాయబద్ధమైన వంశావళి. 

(3) లూకాద్వార యివ్వబడిన లేఖనాలలోని వివరాలు (లూకా 3:23-38) యేసు క్రీస్తు యొక్క వంశావళి కాదు. ఇందుకు కారణాలు: 

– లూకా పై వివరాలను యిస్తూ ‘యేసు క్రీస్తు వంశావళి ‘ అంటూ పేర్కొనలేదు.
– ఆ వివరాలు కేవళము యోసేపు/మరియ ద్వారా ఆదామువరకు యేసుకుగల మానవసంబంధబాంధవ్యాన్ని చూపిస్తున్నాయి.    
– పాత నిబంధనలో మరియు మత్తయిద్వారా యివ్వబడిన లేఖనాలలో వంశావళులను పేర్కొంటున్నప్పుడు వుపయోగించబడిన ‘కనెను ‘ అన్న పదం వ్యక్తులమధ్య అక్షరార్థమైన శరీరసంబంధాన్ని తద్వార వారసత్వాన్ని సూచిస్తుంది. అయితే, లూకాద్వార యివ్వబడిన వివరాలలో ఎక్కడకూడా ‘కనెను ‘ అన్న పదం వుపయోగించబడలేదు అన్నది గమనార్హం. కనుక ఆ వివరాలు వంశావళి కాదు అన్నది గ్రహించాలి.              
– లూకా యిచ్చిన వివరాలలో ఆదాము దేవునికి కుమారునిగా (అక్షరార్థముగా/శరీరకముగా కాదు), యేసు యోసేపుకు కుమారునిగా (అక్షరార్థముగా/శరీరకముగా కాదు) యెంచబడ్డారు.  అలాగే, యోసేపుకూడా హేలీకి వారసునిగా యెంచబడ్డాడు.       
– పాతనిబంధన హీబ్రూ సంస్కృతి ప్రకారం ఒక వ్యక్తికి కొడుకులు లేనిపక్షంలో అతని అల్లుడినే అతని కొడుకుస్థానములో వారసునిగా లెక్కించడము సాంప్రదాయము. ఇందునుబట్టే హేలీ అల్లుడైన యోసేపు (మరియ భర్త) హేలీ వారసునిగా (సంబంధాన్ని కలిగిన వ్యక్తిగా) లెక్కించబడి లూకా చేత పేర్కొనబడ్డాడు (లూకా 3:23). గమనించాలి, యిక్కడ లూకా వావివరసలను పేర్కొనడము లేదు. కేవలము సంబంధాన్ని/బంధుత్వాన్ని మాత్రమే చూపిస్తున్నాడు. అందుకే హేలీ మరియు యోసేపుల మధ్యనున్న వావివరుసను పేర్కొనకుండా కేవళం వారిమధ్యనున్న సంబంధాన్ని మాత్రమే సూచిస్తున్నాడు.  

***********

ప్రశ్న: యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) శాపం పోయిందని బైబిలులో ఎక్కడవుంది? 

జవాబు:

(1) లేఖనాలప్రకారం అతి తీవ్రమైన దైవదూషణ పాపానికి ప్రభువైన దేవుని శాపాలు మూడు లేక నాలుగు తరాలవరకేనన్నది మరువకూడదు.   

– “ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషముగల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల పర్యంతము, తండ్రుల దోషమును కుమారులమీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యితరముల పర్యంతము కరుణించువాడనై యున్నాను.” (నిర్గ.కాం. 20:5-6) 
– “యెహోవా దీర్ఘశాంతు డును, కృపాతిశయుడును దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక మూడు నాలుగు తరములవరకు తండ్రుల దోషమును కుమా రులమీదికి తెచ్చువాడునై యున్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువుయొక్క బలము ఘనపరచబడును గాక.” (సం.కాం.14:17-18)  

యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) యొక్క పాపము అతితీవ్రమైన దైవదూషణతో కూడిన పాపము కాదు కనుక అతని పాపము అతనికి మరియు అతనికి పుట్టిన కుమారులవరకే పరిమితమైనది. 

(2) ప్రభువైన దేవుడు యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) యొక్క పాపానికి తగిన శాపము అతని దినాలలోకే వర్థిస్తుందని విస్పష్తముగా లేఖనములో సూచించాడు–‘తన దినములలో…’ (యిర్మీయా 22:30) 

(3) యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) కుండిన యేడుగురు కుమారులలో యెవరు వర్ధిల్లలేదు. అయితే అతని వంశములోనుండి వచ్చిన [మనువడు] జెరుబ్బాబేలును (1ది.వృ.3:17; మత్తయి 1:12) దేవుడు వర్ధిల్లచేసాడు: “నా సేవకుడవును షయల్తీ యేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు” [హగ్గయి 2:23]. గమనించాలి, కోన్యా కివ్వబడిన శాపం అతని వంశములోని అన్నితరాలవారికి అయితే జెరుబ్బాబేలును దేవుడు అశీర్వదించేవాడు కాదు. కనుక ఆ శాపము కేవళము యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) కు మరియు అతని కుమారులకు అదీకూడా అతని దినాలలోకే పరిమితమైనది అన్నది గ్రహించాలి. 

(4) చివరగా, పై వివరణలేగాక యూదామతస్తులకు వారి గ్రంథాలుకూడా యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) పశ్చత్తాపపడటమువలన శాపాన్ని కోల్పోయాడని అంతమాత్రమే కాక రాబోవు మెస్సయ్య (హ మషీయాఖ్) అతని వంశములోనుండే రావలసివున్నదని ప్రకటిస్తున్నయి:

అ) “యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) పశ్చత్తాపపడ్డాడు దాన్నిబట్టి దేవుడు అతని శాపాన్ని తొలగించాడు:” 

– సన్ హెడ్రిన్ 37b-38a (Soncino Talmud edition)  
– పెసిక్త ది-రబ్ కహన (Yale Judaica edition translated by William G. Braude and Israel J. Kapstein (Philadelphia: Jewish Publication Society of America, 1975), pp. 376-77)
– లెవిటికస్ రబ్బహ్ XIX-6 (Soncino Midrash Rabbah vol. 4, p. 249)

ఆ) మెస్సయా (హ మషియాఖ్) యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వంశములోనుండే రాబోతున్నాడని తెలియచేస్తున్న యూదామత గ్రంథాలు: 

– తన్ హుమా జెనసిస్, టోలెదోట్  (Midrash Tanhuma-Yelammedenu, translated by Samuel A. Berman (Hoboken, NJ: Ktav, 1996), p. 182.) 
– జెవిష్ ఎన్ సైక్లొపీడియా (Louis Ginzberg, “Jehoiachin,” vol. 7 p. 84.) 

**************

ప్రశ్న: యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) తరువాత అతని వంశములో రాజులున్నారా? 

జవాబు:

(1) ఇది తర్కరాహిత్యమైన ప్రశ్న. ఎందుకంటే, యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) మరణముతరువాత యూదాప్రాంతములో యూదులెవ్వరూ రాజులుగా యేలలేదు. యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) మరణముతరువాత యూదయలో యూదులను యేలడానికి అతనిద్వారా ఏరాజూ రాలేదు. ఆ శాపంలేని యితర యూదులద్వారా కూడా ఏరాజూ రాలేదు. కాబట్టి యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) ద్వారా వచ్చిన రాజులెవరని ప్రశ్నించడము అసందర్భము అర్థరహితము. 

యూదులనేలడానికి యూదయలో యూదులైన రాజులు యేలనారంభించినపుడు తప్పకుండా యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వంశములోని వ్యక్తి రాజుగా వస్తాడు. అంతవరకూ వేచిచూడాల్సిందే.  

(2) యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) ను తొలగించి అతని స్థానములో అతని దినములలోనే అతని పినతండ్రి అయిన సిద్కియాను రాజుగా వుంచారు. దీని తరువాత యూదాలో యూదు రాజులెవరూ యేలలేదు. కనుక యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వంశములోని వారెవరూ రాజులుగా వుండే అవకాశముకూడా లేదు.

(3) ఇక్కడ గమనించాల్సిన విశయము, యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) వంశములోనుండి వచ్చిన జెరుబ్బాబేలు (1ది.వృ.3:17; మత్తయి 1:12) యుదయలో అధికారిగా వర్ధిల్లాడు (హగ్గయి 2:23). ప్రభువైన దేవుడే అతనిని అశీర్వదించాడు. యోఖన్నన్ (కొన్యా/యెహోయాకీము) శాపము అతని తరువాత మరియు అతనికి పుట్టిన యేడుగురు కుమారుల తదనంతరము తొలగిపోయిందని గ్రహించడానికి యిది స్పష్తమైన సాక్షాధారము.

************

ప్రశ్న: యేసు రావడానికి కారణమేమిటి? ఆయన శాపవిమోచకుడని అంటున్నారు, అది యెలా? ఆదాముకు ఇవ్వబడిన శాపం చమటోడ్చి స్రమించాలి, హవ్వకు ఇవ్వబడిన శాపం ప్రసవవేదనపడి పిల్లలను కనాలి. ఈ రెండు శాపాలు యింకా కొనసాగుతూనే వున్నాయి. యేసు శాపవిమోచకుడైతే ఆ శాపాలు యింకా యెందుకున్నాయి? 

జవాబు:

ఆదిదంపతులు ఆదాముహవ్వలు అజ్ఙాతిక్రమముతో మొదటిపాపం చేసారు. దాని ఫలితంగా వారు కొన్ని శాపాలను అందుకున్నారు. అదాముకు చమటోడ్చి స్రమించాలి అన్న శాపము యివ్వబడింది.కాని, హవ్వ విశయములో మీరు చెప్పినది సరికాదు. ఆదికాండము 3:16 ప్రకారము గర్భవేదనతో పిల్లలను కనడముకాదు గాని గర్భవేదన హెచ్చించడమన్నది శాపము. 

క్రొత్త నిబంధన లేఖనాల ప్రకారము ప్రభువైన యేసు క్రీస్తు (యషువ హ మషియాఖ్) శాపవిమోచకుడు. అయితే, యేశాపములోనుండి విమోచించాడని ఆయనను శాపవిమోచకుడని అంటున్నాము?  అందుకు క్రింది లేఖనాలను పరిశీలించి చూడాలి:      

– “ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకంటే “ధర్మశాస్త్ర గ్రంథంలో రాసివున్న విధులన్నిటినీ చేయడంలో నిలకడగా ఉండని ప్రతివాడూ శాపగ్రస్తుడు” అని రాసి ఉంది.” (గలతీ 3:10)
– “ఆత్మను గూర్చిన వాగ్ధానము విశ్వాసమువలన మనకు లభించునట్లు, అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసుద్వారా అన్యజనులకు కలుగుటకై, క్రీస్తు మనకోసము శాపమై మనలను ధర్మశాస్త్రముయొక్క శాపమునుండి విమోచించెను; ఇందునుగూర్చి–మానుమీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” (గలతీ 3:13-14)

ధర్మశాస్త్రము విధించే క్రియలన్నిటిపై ఆధారపడే వారందరు యేక్రియలోను ఎప్పుడూ తప్పిపోకుండా అన్నింటినీ పాటించాలి (ద్వి.కాం.27:15-26; యాకోబు 2:10). అలా  పాటించనిపక్షంలో ఆ వ్యక్తులందరూ శపించబడ్డవారుగా మారుతారు. అలాంటివారికి దేవుని రాజ్యములో మరియు నిత్యజీవములో  ఎలాంటి పాలుపంపులు లేవు. యూదులలో మరియు అన్యజనులలో ఎవరుకూడా ఎప్పుడూ తప్పిపోకుండా ధర్మశాస్త్రాన్ని పాటించినవారు లేరు. గనుక అందరూ, యూదులని అన్యులని బేధం లేదు, శాపగ్రస్తులే. అలాంటి శాపమునుండి మానవులందరినీ విమోచించడానికే ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) ఈ లోకంలోకి వచ్చి మానవుల శాపాన్ని తాను ధరించి భరించి తనను రక్షకునిగా ప్రభువుగా స్వీకరించి విశ్వసించినవారికి  శాపవిమోచకుడుగా మారాడు. ఇది ప్రభువైన యేసు క్రీస్తు తన మొదటి రాకడలో సాధించిన ఒక ప్రధానమైన ఘట్టం.  

మానవులు అనుభవిస్తున్న యితర శాపాలు సృష్టి అనుభవిస్తున్న శాపాలు అన్నీకూడా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడలో సమూలంగా నిర్మూలించడుతాయి.  ఆవిధంగా ఆయన స్వచ్చమైన పాలనతో నిజమైన యూదులను అలాగే అన్యులనుకూడా రాజ్యపాలన చేస్తాడు.

**************************

ప్రశ్న: సిలువ మరణం దేనికి? దాని వుపయోగం ఏమిటి? అది పాపాలను హరించడానికైతే యేపాపాలను హరించింది? ఎందుకంటే 2000 సంవత్సరాల క్రితం ఉన్న పాపాలకన్నా యిప్పుడు యెక్కువ పాపాలున్నయి కనుక అది (యేసు సిలువ మరణం) పాపాలను హరించడంకన్న పాపాలను యెక్కువ చేసింది అని అనుకుంటున్నాను. 

జవాబు:

ఏదేను తోటలో సంభవించిన ఒకేఒక్క పాపాము (దాదాపు ఆరువేల సంవత్సరాల క్రితం) ఈనాడు లెక్కలేనన్ని పాపాలకు దారి తీసింది. కాని మీరు భ్రమపడ్డట్లు ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మరణము 2000 సంవత్సరాల తరువాత పాపాలను యెక్కువ చేయలేదు. “యేసు సిలువ మరణం పాపాలను యెక్కువ చేసింది” అన్న తప్పుడు అవగాహన అపవాదికి చెందిన పచ్చి అబద్దం. అలాంటి అబద్దములో కొనసాగకూడదని నా ప్రేమపూర్వకమైన సలహా. 

అయితే, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ మరణము అన్నది మానవులందరి పాపాలకు తగిన వెల చెల్లించే బలి, పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని కలిగించే బలి. ఇంకా చెప్పలంటే అది మానవులను తమ పాపాలకు ఫలితంగా పొందిన శాపమునుండి తొలగించి ఆ పాపాలకొరకు తాము పొందబోయే శిక్షలోనుండి వారిని విముక్తులునుగా చేసే విమోచనాక్రయధనము.                

మానవులు తాము చేసే పాపాలకు ఫలితంగా శాపగ్రస్తులవుతున్నారు. ఆ శాపపు ప్రభావము వలన అత్మీయంగా మరణించి, హషేముకు (దేవుని) దూరంగా వెళ్ళడమే కాకుండా నిత్యజీవాన్ని పొందకుండా దేవుని రాజ్యానికి వెలుపలే నశిస్తున్నారు. అంతమాత్రమే కాకుండా తీర్పు దినాన తమ పాపాలకు శిక్షను నిత్యాగ్నిలో పొందబోయేందుకు సిద్దమవుతున్నారు. ఈ శాపము మరియు శిక్షలనుండి విడిపించేదే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువ మరణము.

అయితే, విముక్తి/రక్షణ అన్నది మనుషులందరికీ వారికి యిష్టమున్నా లేకున్నా కలిగేది కాదు. యేసును (యషువను) మెస్సయ్య (క్రీస్తు) అని విశ్వసించి ఆయన బలియాగాన్ని స్వీకరించి పశ్చత్తాపముతో క్షమాపణ వేడుకున్నవారికే అది అనుగ్రహించబడుతుంది, అందరికీ స్వయంచాలికంగా జరిగేది కాదు.

***************

ప్రశ్న: పస్కా బలిపశువును ఎలాంటి నొప్పికలుగకుండా ఎలాంటి నొప్పిలేకుందా బలి చేస్తారు. యేసును సిలువవేసెందుకు ముందు ఎంతో హింసించారుకదా మరి ఆయన పస్కా బలి ఎలా అవుతాడు?  

జవాబు:

క్రొత్త నిబంధన లేఖనాలలో చెప్పబడిన విశయము: 

మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయండి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను.” (1కొరింథీ.5:7)   

గమనించాలి, పాతనిబంధనలోని ధర్మశాస్త్రము మానవులు చేసే పాపాలకు క్షమాపణను/పవిత్రతను పొందేందుకొరకై వివిధ బలులను నిర్ధేశించడము జరిగింది. దైవజ్ఙానాన్నిబట్టి యివ్వబడిన ఈ బలులన్నిటి ప్రాథమిక వుద్దేశము మరియు సారాంశము ప్రభువైన యేసు క్రీస్తు సిలువ మరణములో పరిపూర్ణముగా మరియు సంతృప్తికరంగా నెరవేర్చబడ్డాయి. ధర్మశాస్త్రబలుల యొక్క వుద్దేశాన్ని మరియు వాటి సారాంశాన్ని భౌతికభావంగాకాక అత్మీయార్థంగా గ్రహించాలి. 

పస్కాబలిపశువు యొక్క ప్రాథమిక వుద్దేశము మరియు సారాంశము

మీరున్న యిండ్లమీద ఆ రక్తము మీకు గురుతుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడుచేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.” (ని.కాం.12:13) 

పస్కా బలిపశువుయొక్క రక్త ప్రొక్షణద్వారా దేవుని వుగ్రత మరియు శిక్షనుండి కాపాడబడుట

క్రొత్త నిబంధనలో తెలుపబడిన విశయము: “క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను” (1కొరింథీ.5:7). గమనించాలి, యిక్కడ “క్రీస్తు పస్కా పశువు వధించబడాల్సిన విధానంలో వధించబడెను” అని కాదు వ్రాయబడింది. లేఖనం సెలవిస్తున్నదాని ప్రకారం క్రీస్తు చంపబడ్డాడు మరియు అతని రక్తం మనకు పస్కా పశువు రక్తంలా వుంది. అంటే, అతడు కార్చిన పవిత్రమైన నిష్కళంకమైన రక్తం మానవులను దైవోగ్రతనుండి శిక్షనుండి కాపాడుతుంది. ఈ వుద్దేశాన్ని మరియు భావాన్ని దృక్పథంలో వుంచుకొనే క్రీస్తు పస్కా పశువుగా పేర్కొన బడ్డాడు. అంతేకాని ఆయన పస్కా పశువులా వధించబడ్డాడని కాని లేక వధించబడిన పస్కా పశువు భుజించబడ్డట్లు భుజించబడ్డాడని కాని అర్థం చేసుకోకూడదు. ఇక్కడ అక్షరార్థంగా కాకుండా భావార్థంగా గ్రహించే ఆత్మీయపరిణితి అవసరం.      

ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిపూర్ణ బలియాగాన్ని బట్టి ఈనాడు ధర్మశాస్త్ర ప్రకారము నిర్ధేశించబడిన బలిపశువులు మరియు వాటి బలుల అవసరత లేదు.

************************

ప్రశ్న: యెషయా 53 వ అధ్యాయములో “అతడు అన్యులతో పాతిపెట్టబడుతాడు” అన్న ఒక వాక్యముంది. మరి అది ఎందుకు యేసువిశయములో నెరవేర్చబడలేదు? యేసును ఎక్కడ అన్యజనులతో పాతిపెట్టారు? 

జవాబు:

యెషయా 59 వ అధ్యాయములో “అతడు అన్యులతో పాతిపెట్టబడుతాడు” అన్నవాక్యము లేదు. అయితే, ఆ అధ్యాయములోని వాక్యము ఇలా వుంది:

అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో (רָשָׁע=wicked/evil/criminal) అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు.” (యెషయా 59:9). 

ప్రభువైన యేసు క్రీస్తు సిలువవేయబడినప్పుడు అతనితోపాటు యిద్దరు దొంగలనుకూడా సిలువవేసారు. రోమాప్రభుత్వపు పద్దతుల ప్రకారం తాము సిలువ వేసిన వ్యక్తులకు సమాధికూడా వారే యేర్పాటు చేసేవారు. రోమా ప్రభుత్వ పద్దతిప్రకారం యేసుకు కూడా యిద్దరు దొగలతో కలిసి సమాధి నియమించబడింది. ఆ విధంగా అది లేఖనపు నెరవేర్పు జరిగిపోయింది. గమనించాలి, నియమించబడినంతమాత్రాన అలాగే జరగాలని లేఖనాలు సూచించడములేదు. కేవళము నియమించబడటము గురించే లేఖనాలు వివరిస్తున్నయి, కాని ఆ నియమపు నెరవేర్పు విశయము యేమీ చెప్పడము లేదు. చివరి గడియలో యేసును గౌరవించి ప్రేమించిన వ్యక్తులు ఆయన శరీరాన్ని ఆ యిద్దరు దొంగలతొ కలిపి సమాధి చేయకుండా ఒక దనవంతుని సమాధిలో వుంచారు. ఆరకంగా లేఖనపు రెండవ భాగముకూడా నెరవేర్చబడటాన్ని చూస్తాము.  

ప్రశ్న: యేసు “నేను యోనావలె వుంటాను కనుక మూడవ దినమున లేస్తాను” అని అన్నాడు. కాని మూడవదినమున ఎందుకు లేవలేదు?   

జవాబు:

వారు గలలీలో ఉన్నప్పుడు యేసు, “మానవ పుత్రుణ్ణి మనుషుల చేతికి అప్పగిస్తారు, వారు ఆయన్ని చంపుతారు. కానీ ఆయన మూడో రోజు సజీవుడై తిరిగి లేస్తాడు” అని వారితో చెప్పినప్పుడు వారు చాలా దుఃఖపడ్డారు.” (మత్తయి 17:22-23)  
ఆ తరువాతి రోజు, అంటే సిద్ధపడే రోజుకు తరువాతి రోజు ప్రధాన యాజకులు, పరిసయ్యులు, పిలాతు దగ్గరకు వెళ్లి, “అయ్యా, ఆ మోసగాడు జీవించి ఉన్నప్పుడు ‘మూడు రోజుల తరువాత నేను సజీవంగా తిరిగి లేస్తాను’ అని చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉంది.” (మత్తయి 27:62-63) 
ఆయన వాళ్లతో “మానవ పుత్రుణ్ణి శత్రువుల చేతికి అప్పగిస్తారు. వారు ఆయన్ని చంపుతారు. మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి బతికి వస్తాడు” అని అన్నాడు.” (మార్కు 9:31).  “ఆయనను కొరడాలతో కొడతారు. చంపివేస్తారు. కానీ మూడో రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు.” (లూకా 18:33) 

గమనించాలి, యూదులు మరియు గ్రీకులు కలిసివున్న మొదటి శతాబ్దములోని మధ్యప్రాశ్చములో దినాల లెక్కింపు విశయములో “ముడో రోజున” అన్నా “మూడు రోజుల తరువాత” అన్నా ఒకే భావాన్ని తెలియ చేస్తాయి.  

యేసు నిస్సాన్ 14 వ తేదీ మధ్యానము 3:00 గంటలకు చనిపోయాడు. అది బుధవారము దినము. తిరిగి యేసు శనివారము సాయంత్రము మరణము జయించి లేచాడు. అంటే మూడు దినముల తరువాత (బుధవారము, గురువారము, శుక్రవారము) లేచాడనేకదా! అయితే, తాను మొదట మగ్దలీన మరియకు మరియు యితరులకు ఆదివారము నాడు కనిపించడము జరిగింది. దీని భావం ఆయన ఆదివారమునాడే లేచాడని కాదు.  

*********************

ప్రశ్న: మేము బ్రతికుండగా మేము కళ్ళతో చూస్తుండగా రెండవ రాకడ వస్తుంది, ప్రభువు రావడము చూస్తాము అని శిష్యులు వ్రాసారు. మరి ఆ శిష్యులు యెక్కడ? యేసు రేండవ రాకడలో యెప్పుడొచ్చాడు? 

జవాబు:

మీరు చెప్పింది అబద్దం. శిష్యులు అలా ఎక్కడా వ్రాయలేదు. మీరు చెప్పిన విధంగా శిష్యులు చెప్పలేదు. అయితే ఆ విశయం ప్రభువైన యేసు క్రీస్తే చెప్పడం జరిగింది:

నేను మీతో కచ్చితంగా చెబుతున్నదేమంటే, ఇక్కడ నిలబడి ఉన్నవారిలో కొంతమంది మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం చూసేవరకు మరణించరు” అని చెప్పాడు. ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, అతని సోదరుడు యోహానులను తీసికొని ఎత్తైన ఒక పర్వతం మీదికి వెళ్ళాడు. వారు చూస్తూ ఉండగానే ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యుడిలాగా ప్రకాశించింది. ఆయన వస్త్రాలు కాంతి లాగా తెల్లనివయ్యాయి. అకస్మాత్తుగా మోషే, ఏలీయాలు యేసుతో మాట్లాడుతూ వారికి కనిపించారు. అప్పుడు పేతురు యేసుతో, “ప్రభూ, మనమిక్కడే ఉండిపోదాం. నీకిష్టమైతే ఇక్కడ నీకు, మోషేకు, ఏలీయాకు, మూడు పాకలు వేస్తాను” అన్నాడు. అతడు మాట్లాడుతూ ఉండగానే గొప్ప వెలుగుతో నిండిన ఒక మేఘం వారిని కమ్ముకుంది. ఆ మేఘంలోనుండి ఒక స్వరం వారితో, “ఈయన నా ప్రియకుమారుడు, ఈయనంటే నాకెంతో ఆనందం. మీరు ఈయన చెప్పేది వినండి” అని పలికింది. శిష్యులు ఈ మాట విని భయంతో బోర్లాపడిపోయారు.” (మత్తయి 16:27-17:6)    

ఆయన వాళ్లతో “నేను మీతో కచ్చితంగా చెప్తున్నాను. ఇక్కడ నిలుచున్న వారిలో కొంతమంది దేవుని రాజ్యం శక్తితో రావడం చూస్తారు. దానికి ముందు వారు మరణించరు” అని అన్నాడు. ఆరు రోజుల తరువాత యేసు పేతురు, యాకోబు, యోహానులను తీసికొని ఏకాంతంగా ఒక ఎతైన కొండ మీదికి వెళ్ళాడు. అక్కడ వారి ముందు యేసు రూపాంతరం చెందాడు. ఆయన వస్త్రాలు ధగధగా మెరవసాగాయి. ప్రపంచంలో ఏ చాకలీ ఉతకలేనంత తెల్లగా మారిపోయాయి. అప్పుడు ఏలీయా, మోషేలు అక్కడ ప్రత్యక్షమై యేసుతో మాటలాడడం శిష్యులు చూశారు. 5 పేతురు యేసుతో, “రబ్బీ! మనం ఇక్కడే ఉండడం మంచిది. మేము మూడు పాకలు వేస్తాం, ఒకటి నీకు, ఒకటి మోషేకి, ఒకటి ఏలీయాకి” అన్నాడు. తానేమి అంటున్నాడో అతనికి తెలియలేదు. ఆ శిష్యులంతా తీవ్రమైన భయానికి లోనయ్యారు. అప్పుడు ఒక మేఘం వచ్చి వాళ్ళను  కప్పివేసింది. ఆ మేఘం నుండి ఒక స్వరం ఇలా వినిపించింది, “ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన మాట వినండి.”” (మార్కు 9:1-7) 

పై లేఖన వాక్యాల ప్రకారం ప్రభువైన యేసు క్రీస్తు చెప్పిన సంఘటన అంటే మనుష్య కుమారుడు తన రాజ్యంతో రావడం లేక దేవుని రాజ్యం శక్తితో రావడం తన శిష్యులలో కొందరు చూస్తారు అంతకు ముందు వారికి మరణం సంభవించదని చెప్పాడు. ఆయన చెప్పిన విధంగానే కేవళము ఆరురోజుల తరువాత పేతురు, యాకోబు, యోహానులు ఒక కొండపైన యేసు చెప్పినది చూసారు. ఆ సంఘటననే రూపాంతరము చెందడము అని అంటారు. అది మొదలుకొని దేవుని రాజ్యం శక్తితో విస్తరించడం ప్రారంభమయింది.    

గమనించాలి, యిక్కడ యేసు ప్రభువు తన రెండవ రాకడను గురించి చెప్పలేదు. కేవళము దేవుని రాజ్యము ఆత్మీయంగా ప్రారంభించబడటము లేక మనుష్య కుమారుడు తన ఆత్మీయ రాజ్యాన్ని ప్రారంభించడాన్ని గురించి మాత్రమే చెప్పడము జరిగింది. గత 2000 సంవత్సరాలుగా ఆ ఆత్మీయ రాజ్యం విస్తరిస్తూనే ఉన్నది. అయితే, యేసు ప్రభువు యొక్క రేండవ రాకడతో అది అత్మీయంగానే కాకుండా భౌతికంగా కూడా నెలకొల్పబడి స్థిరపరచబడి ఆయన చేత యేలబడుతుంది. కాని, ఆయనను తిరస్కరించి దూషిస్తూ శాపగ్రస్తులుగానే మిగిలిపోయే వారికి ఆ ధన్యత లభించదు.  నిత్యాగ్నిగుండమే వారుపొందబోయే ప్రతిఫలం!