Author Archives: Admin

Permalink to single post

యేసు క్రీస్తు మరణపునరుత్థాన వివరాల మధ్య పొందిక

అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు

– ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)?
– యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)?
– యేసు సిలువ వేయబడింది లేక మరణించింది యేరోజు?
– యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక యితర స్త్రీలకా (మత్తయి.28:8)?
– యేసు సమాధిలోనుండి లేచింది యేరోజు?
– యేసు సమాధిలో ఎన్ని గంటలు మరియు రోజులు వున్నాడు?
– యేసు మరణపునరుత్థానములో యోనా సూచక క్రియ ఏవిధంగా నేరవేర్చబడింది (మత్తయి.12:39-40)?

అవిశ్వాసులు మరియు బైబిలు వ్యతిరేకులు క్రొత్తనిబంధన గ్రంథములోని దైవసత్యాలను తిరస్కరించే తమ వ్యర్థ ప్రయత్నాలాలో భాగంగా పై ప్రశ్నలను లేవనెత్తడం సహజంగా జరిగే విశయమే. అయితే, సత్యం అన్ని వేళల సరళంగానే అందించబడాలి అన్న నియమమేదీ లేదు. మరిముఖ్యంగా, దైవ సత్యం అన్నది మానవాళికి చాలామట్టుకు మర్మఘర్బితంగా యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి. 

క్రొత్తనిబంధన గ్రంథములోని వివరణలు సత్యాన్వేషకులకు మరియు సత్యద్వేషులకు వేరువేరుగా అగుపించే అవకాశాలు ఎక్కువ. బైబిలును తప్పు బట్టి తమ వక్రవ్యాఖ్యానాలద్వారా అమాయకులను తప్పు మార్గం పట్టించే సత్యద్వేషులకు బైబిలులోని ప్రతి సత్యం ఒక అసత్యంగా ప్రతి మర్మం పరస్పర వ్యతిరిక్తంగా కనిపించడం సర్వసాధారణమైన విశయం. అలాంటివారి అజ్ఙానాన్ని దుష్టప్రయత్నాలను ప్రక్కకు పెట్టి సహృదయముతో సత్యాన్ని స్వీకరించే సత్యాన్వేషకులకు సహకరించే సదుద్దేశముతో క్రింది వివరాలను మీముందు వుంచడమైనది. సత్యాన్వేషకులు, సహృదయులు, మరియు విజ్ఙులు అయిన వారిని క్రింది వివరాలను పరిశీలించి సత్యాన్ని స్వీకరించాల్సిందిగా సగౌరవంగా అహ్వానిస్తున్నాము.

నలుగురు సువార్తికులద్వారా యివ్వబడిన యేసు క్రీస్తు మరణపునరుత్థానాల వివరాల సమగ్ర సారాంశము

యూదులు దినాన్ని లెక్కించే విధానము ప్రకారము యేసు క్రీస్తును బుధవారము నిస్సాను 14వ తారీఖునాడు మధ్యరాత్రి తరువాత రోమా సైనికులు బంధించి తీసుకువెళ్ళారు. ప్రాతఃకాలము 6 గంటలకుముందే రోమా అధిపతి పొంతిపిలాతు అతనికి తీర్పుతీర్చి సిలువ వేయబడుటకు అప్పగించాడు (యోహాను.18:28; 19:14).

అదేదినము ఉదయము 9 గంటల ప్రాంతములో ఆయనను సిలువవేసారు (మార్కు.15:25). ఆరోజు మధ్యాహానము 12 గంటలనుండి 3 గంటలవరకు ఆదేశమంతా చీకటికమ్మింది (మత్తయి.27:45; మార్కు.15:33; లూకా.23:44). 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు (మార్. 15:33-37).

అదేరోజు సాయంత్రము 6 గంటలలోపే ఆయన దేహాన్ని దగ్గరిలోనే వున్న ఒక తోటలోని రాతి సమాధిలో వుంచారు (మార్కు.15:42-47; యోహాను.19:41-42). ఇదంతా దగ్గరలోనే నిలుచుండి ఆయనను వెంబడించిన స్త్రీలు (యాకోబు మరియు యోసేపుల తల్లి మరియ, జెబదీ కుమారుల తల్లి, మగ్దలేనె మరియ, మరియు సలోమి) చూసి తమ యిళ్ళకు వెళ్ళి ఆ దినమంతా (బుధవారము సాయంత్రము మొదలుకొని గురువారము సాయంత్రమువరకు) విశ్రమించారు. అది ప్రత్యేకమైన లేక మహావిశ్రాంతిదినం (యోహాను.19:31). అదేదినం ఆ రాతిసమాధిని అధికారులు భద్రంచేసారు (మత్తయి.27:62-66). 

ఆ ప్రత్యేక లేక మహావిశ్రాంతిదినముగడిచిన తరువాత శుక్రవారమునాడు స్త్రీలు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను కొని సిద్దపరచి (మార్కు 16:1) మరునాడు అంటే శనివారము సాధారణ విశ్రాంతిదినము గనుక తిరిగి ఆ దినమంతా విశ్రమించారు (లూకా.23:56).

శనివారము సాయంకాలము 6 గంటల ప్రాంతములో ఆయన సమాధినుండి తిరిగి లేచాడు! ఇది ఆయన చనిపోకముందు చెప్పిన ప్రవచనాల ఆధారంగా మూడు పగళ్ళు మూడు రత్రుళ్ళు గడచాయి (మత్తయి.12:40) గనుక ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచింది శనివారపు చివరిలో లేక ఆదివారపు ప్రారంభములో (బైబిలు లెక్క ప్రకారము ఒక దినము అంటే సాయంత్రము మొదలుకొని మరుసటి సాయంత్రము వరకు) నన్నది గ్రహించవచ్చు.

 ఆదివారము పెందరాళ్ళే యింకా చాలా చీకటిగానున్నప్పుడే యేసు క్రీస్తును వెంబడించిన స్త్రీలు తాము శుక్రవారమునాడు సిద్దపరచిన సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలాలను తీసుకొని ఆయన దేహానికి పూయడానికి సమాధివైపు బయలుదేరారు (మార్కు.16:1-2; లూకా.24:1). మగ్దలేనె మరియ వారిలో ఒకతి (మత్తయి.28:1; యోహాను.20:1). అయితే సమాధి ద్వారానికి అడ్డంగా వుంచబడిన రాతినిగురించి ఆ స్త్రీలు కొంత చింతనచేయాల్సి వచ్చింది (మార్కు.16:3).

ఆ స్త్రీలు సమాధిని సమీపించడానికి ముందే ఆదివారము తెల్లవారుజామున భూకంపము రావడము, పరలోకమునుండి దేవదూత వచ్చి సమాధికి అడ్డుగా వుంచబడిన రాతిని తొలగించి దానిపై కూర్చోవడం జరిగింది (మత్తయి.28:2). ఇదంతా చూసిన కావలివారు భయముతో స్పృహతప్పి పడిపోయారు (మత్తయి.28:4). అటుతరువాత దేవదూత సమాధిలోకి ప్రవేశించి యేసు దేహముంచబడిన స్థలములో ఆయన తల వుంచబడిన కుడిభాగములో కూర్చున్నాడు (మార్కు 16:5). మరికొంత సమయములోనే మరొక దేవదూత వచ్చి యేసు కాళ్ళు వుంచబడిన యెడమభాగములో కుర్చోవడము జరిగింది (లూకా.24:4).

స్త్రీలు యింకా సమాధికి దూరంగా వుండగానే సమాధి రాతి తొలగించబడినట్లు (మార్కు.16:4; లూకా 24:2; యోహాను 20:1) అక్కడే కావలివాళ్ళు నేలపై మృతజీవులలా నిశ్ఛలంగా పడివున్నట్లు గమనించారు (మత్తయి.28:5). ఆ దృశ్యాన్ని చూసిన స్త్రీలు యేసు శరీరాన్ని యెవరో యెత్తుకొనిపోయారన్న తీర్మానానికి వచ్చారు. దాంతో మగ్దలేనె మరియ పేతురుకు మరియు ఇతర శిష్యులకు ఆ విశయాన్ని తెలియచేయడానికి వెంటనే మిగతా స్త్రీలను వదిలి అక్కడినుండే వెనుదిరిగి తిరిగి నగరమువైపు వెళ్ళింది (యోహాను.20:2). 

మగ్దలేనే మరియ తమను విడిచి వెనక్కు వెళ్ళినతదుపరి తతిమా స్త్రీలు ధైర్యం కూడగట్టుకొని తెరచి వుంచిన సమాధిలోనికి ప్రవేశించి అక్కడ యేసు శరీరము లేకుండుట గమనించారు. అంతలోనే మొదట అక్కడ కుడివైపున ఆసీనుడైవున్న దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు (మార్కు.16:5) ఆ దేవదూత వారిని చూసి లేచి మాట్లాడుతున్నప్పుడు రెండవదూత కూడ వారికి ప్రత్యక్షమై నిలబడ్డాడు (లూకా.24:4). కుడివైపునున్న దేవదూత యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి వారికి ప్రకటించి ఆ వార్తను యేసు శిష్యులకు తెలుపవలసినదంటూ వారికి సూచించాడు (మత్తయి.28:6-7). అదివిన్న ఆ స్త్రీలు భయముతోను ఆనందముతోను సమాధిని విడిచి వెళ్ళిపోయారు (మత్తయి.28:8; మార్కు.16:8).

వారందరు తిరిగి నగరములోకి వచ్చారు కాని తాము చూసిన మరియు విన్న విశయాలను యితరులకు చెప్పడానికి తటపటాయిస్తూ వుండిపోయారు (మార్కు.16:8). స్త్రీలు సమాధిని విడిచివెళ్ళిన తరువాత యిద్దరుదేవదూతలు అదృశ్యమయిపోయారు. చివరికి ధైర్యం కూడగట్టుకొని అ స్త్రీలు శిష్యులదగ్గరకు వెళ్ళి తాము చూసిన విశయాలను తెలియచేసారు (లూకా.24:9-12). 

రమారమి అదేసమయములో మగ్దలేనే మరియ యేసు శిష్యులను కలిసి యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్న వార్త అందించింది (యోహాను 20:2). మగ్దలేనే మరియ మరియు మిగత స్త్రీలు ఆశ్చర్యపరిచే అసాధారణవిశయాలను చెప్పడం శిష్యులు విని వారి మాటలను నమ్మలేక పోయారు (లూకా.24:11). పేతురు మరియు యోహానులు స్త్రీలు చెప్పినది వాస్తవమో కాదోనని తేల్చుకోవడానికి పరుగెత్తి సమాధివద్దకు వెళ్ళారు (లూకా.24:12; యోహాను.20:3). మగ్దలేనే మరియ వారివెంబడే బయలుదేరింది కాని వారిలా పరుగెత్త లేక వారికి చాలా దూరంగా వెనుకబడిపోయింది.

మొదటగా సమాధిని చేరుకున్న యోహాను తరువాత అతని వెనుకే వచ్చిన పేతురు ఇరువురూ కలిసి సమాధిలోనికి ప్రవేశించారు. వారికి యేసు శరీరానికుండిన వస్త్రాలు తప్ప యేసు దేహం కనిపించలేదు సమాధిలో. దాంతో ఆశ్చర్యచకితులై వారిద్దరూ తిరిగి తాముంటున్న ఇంటికి వచ్చేసారు (యోహాను.20:4-4-10). 

ఆ తరువాత అక్కడికి చేరుకున్న మగ్దలేనే మరియ సమాధిలోనికి ప్రవేశించింది. ఆమె ప్రవేశించడానికి ముందే యిద్దరు దేవదూతలు తిరిగి దృశ్యరూపులయ్యారు. సమాధిలోనికి ప్రవేశించిన మరియ ఆ యిద్దరు దేవదూతలను చూసింది. అందులోని కుడివైపుననున్న దూత ఆమెతో మాట్లాడాడు (యోహాను.20:11-13). అదివిని వెనుకకు తిరిగిన మరియకు అక్కడే నిలుచున్న యేసు కనిపించాడు, కాని ఆ ప్రాతఃకాల మసకచీకటిలో ఆమె అది యేసు అని గుర్తించలేక అతన్ని అక్కడి తోటమాలి అని భ్రమించింది. అయితే, అప్పుడే “మరియా” అంటూ యేసు ఆమెను సంబోధిస్తూ పిలవడంతో ఆమె అతన్ని గుర్తుపట్టింది (యోహాను.20:14-16).

యేసు ఆమెతో సంభాశించి తన శిష్యులకు తెలుపమంటూ ఒక సందేశాన్ని యిచ్చి ఆమెను వారిదగ్గరకు పంపించాడు (మార్కు.16:9; యోహాను.20:17). పునరుత్థానుడైన యేసు ప్రభువును మొట్టమొదట చూసింది మగ్దలేనే మరియ (మార్కు.16:9). దీని తరువాత సమాధిలో తాము చూసిన విన్న విశయాలను శిష్యులకు చెప్పి అక్కడినుండి తమలోని ఒకరి ఇంటికి వెళ్ళిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వారు పునరుత్థానుడైన ప్రభువును చూసి ఆయనను పూజించారు. వారి ఆరాధనను స్వీకరించిన యేసు వారితో మాట్లాడి వారికో సందేశాన్ని యిచ్చి తన శిష్యులదగ్గరకు తిరిగి పంపించాడు (మత్తయి 28:9-10). 

పై సంఘటనలన్నీ జరుగుతున్న సమయములో కావలివారు స్పృహలోకివచ్చి లేచి నగరములోకి పరిగెత్తుకొనిపోయి యూదామతనాయకులకు తాము చూసినవి తమకు జరిగినవి అన్నీ వివరించి చెప్పారు (మత్తయి.28:11-15). 

ఈసమయానికంతా తోమా తప్ప మిగతా శిష్యులంతా చేరి తప్పిపోయిన ప్రభువు శరీరమును గురించి చర్చించసాగారు. అంతలో ప్రభువైన యేసు మరణములోంచి లేచి సజీవునిగా కనిపించాడంటూ వారిని ఆశ్చర్యముతో తలమునకలుచేసే వార్తను మగ్దలేనే మరియ మోసుకొచ్చింది (మార్కు.16:11; లూకా.24:10; యోహాను.20:18). ఇదే వార్తను నిర్ధారిస్తూ తతిమా స్త్రీలు కూడా శిష్యుల వద్దకు వచ్చి తమకు ప్రభువు తమకు కనిపించి చెప్పిన విశయాలన్నిటిని వారికి పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు (లూకా.24:9). 

ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినతరువాత మూడు సంపూర్ణదినాలు అంటే 72 గంటల సమయం భూగర్భములో (పాతాళములో) వున్నాడు అనటానికి మూడు లేఖన ఆధారాలు

1. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము [μεγάλη=గొప్ప; పెద్ద;] గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.” యోహాను.19:31)

పాతనిబంధన గ్రంథములో వివరించిన ప్రకారము సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్నది ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినములో ఇశ్రాయేలీయులు సమాజముగా దేవుని ఎదుట కూడాలి మరియు వారు ఆదినము జీవనోపాధియైన ఏపనీ చేయకూడదు. విశ్రాంతిదినము రెండు రకాలు. ఒకటి, వారాంతములో వచ్చే సాధారణ విశ్రాంతిదినము (ఏడవదినము లేక శనివారము). రెండు, సంవత్సరములో ఒకేసారి వచ్చే యేడు ప్రత్యేకమైన పండుగ దినాలు. ఈ ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలు వారములోని ఏదినమైనా రావచ్చు. అవి క్రింద యివ్వబడిన పండుగలు: 

(i) పులియనిరొట్టెల పండుగ యొక్క మొదటి దినము లేక “పెసహ్” ( ఆబీబు/నిసాను మాసము 15వ దినము)–లే.కాం.23:7; సం.కాం.28:17-18
(ii) పులియనిరొట్టెల పండుగ యొక్క చివరి/యేడవ దినము లేక “యోం తొవ్” ( ఆబీబు/నిసాను మాసము 21వ దినము)–ని.కాం.12:18, 13:6; లే.కాం.23:8; సం.కాం.28:25
(iii) పెంతెకోస్తు పండుగ లేక “షవూత్” (సివాను మాసము 6వ దినము)–లే.కాం.23:15-21
(iv) బూరధ్వనుల పండుగ లేక “రోష్-హ షాన” (తిష్రీ మాసము మొదటి దినము)–లే.కాం.23:24-25; సం.కాం.29:1
(v) పాపప్రాయశ్చిత్తార్థదిన పండుగ లేక “యోం కిప్పూర్” (తిష్రీ మాసము 10వ దినము)–లే.కాం.23:23-32; సం.కాం.29:7-8
(vi) పర్ణశాలల పండుగ లేక “సుక్కోత్” (తిష్రీ మాసము 15వ దినము)–లే.కాం.23:33-35; సం.కాం.29:12
(vii)పర్ణశాలల పండుగ యొక్క చివరి దినము లేక “షెమిని అట్జెరెత్” (తిష్రీ మాసము 22వ దినము)–లే.కాం.23:36,39; సం.కాం.29:35 

పై ఏడు పండుగదినాలు మహావిశ్రాంతిదినాలు. ఆదినాలలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట కూడి సమాజముగా ఆరాధించాలి మరియు వారు ఆదినమంతటిలో జీవనోపదియైన ఏపని చేయకూడదు. యేసు ప్రభువు మరణించిన దినానికి మరుసటి దినము ఏడు ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలలోని ఒక దినము (యోహాను.19:31). ఒకవేళ, యేసు ప్రభువు మరణించిన దినపు మరుసటి రోజు అయిన మహావిశ్రాంతిదినము కూడా సాధారణ విశ్రాంతిదినమైన శనివారమునాడే వస్తే అది ఒక అసాధారణమైన విశయముగా పరిగణించవచ్చు. అలాంటి అసాధారణ సంఘటన సంభవిస్తే నలుగురు సువార్తికులలో ఒక్కరైనా ఆవిశయాన్ని పేర్కొని వుండేవారు. కాని అలా జరుగలేదు అన్నది యిక్కడ గమనార్హమైన విశయము. 

2. “విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.” (మార్కు.16:1)
ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.” (లూకా.23:54-56) 

మర్కు 16:1 ప్రకారము స్త్రీలు విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత సుగంధద్రవ్యములను కొన్నారు (సిద్ధపరచారు). లూకా 23:56 ప్రకారము స్త్రీలు సుగంధద్రవ్యములను సిద్ధపరచి (కొని) విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు. ఈ రెండు వివరాలు వాస్తవమవటానికి రెండు విశ్రాంతిదినాలు వుండాలి–ఒకటి ప్రత్యేకమైన విశ్రాంతిదినము మరొకటి సాధారణమైన విశ్రాంతిదినము. దీన్ని సమర్థిస్తూ యోహాను 19:31లో యేసుక్రీస్తు మరణించిన మరుసటిదినము మహా విశ్రాంతిదినముగా పేర్కొనబడింది. అలాకాని పక్షములో అంటే శుక్రవారమే యేసు ప్రభువు చనిపోయిన దినము అయితే రెండు వివరాలలో ఒకటిమాత్రమే వాస్తవమవుతుంది! 

3. “యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.” (మత్తయి.12:40) 

పై వాక్యములో ఒకవేళ “మూడు దినాలు” అని వ్రాయబడితే యూదులు దినాన్ని లెక్కించే పద్దతిలో శుక్రవారములోని కొంత భాగము, శనివారము అంతా, మరియు ఆదివారములోని కొంతభాగము కలిపి “మూడుదినాలు” అని లెక్కించే అవకాశముంది. కాని, లేఖనము “మూడు రాత్రింబగళ్ళు” అంటూ చాలా విస్పష్టముగా మూడు సంపూర్ణదినాలను అంటే 72 గంటల సమయాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. లేఖనములోని ఈ స్పష్టతను తిరస్కరిస్తున్నవారు ఒకవేళ లేఖనము మూడు సంపూర్ణ దినాల లేక 72 గంటల సమయపు స్పష్టతను వ్యక్తంచేయాల్సివస్తే ఏలాంటి పదజాలాన్ని వుపయోగించాలోనన్నది ఉదాహరణతో వివరించాలి. 

పాతనిబంధన గ్రంథము (తనాక్) ప్రకారము పస్కా పండుగను ఆచరించడములోని కొన్ని ప్రధాన ఆజ్ఙలు మరియు ఘట్టాలు

1. ఆబీబు/నిసాను మాసము 10వ దినాన నిర్దోషమైన ఏడాది వయసున్న పస్కా పశువును ఏర్పరచుకోవాలి (ని.కాం.12:3)
2. పస్కా పశువును ఆబీబు (నిసాను) మాసము 14వ దినము వరకు సిద్ధపరచాలి (ని.కాం.12:7)
3. నిసాను మాసము 14వ దినము సాయంకాలము పస్కా పశువును వధించాలి (ని.కాం.12:7; యెహోషువ 5:10)
4. ఆరాత్రే పస్కా పశువు మాంసమును కాల్చి పొంగని/పులియని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినవలెను (ని.కాం.12:8)
5. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాలి (ని.కాం.12:42-45)
6. పస్కా పండుగను యెరూషలేములోనే ఆచరించాలి (ద్వి.కాం.16:2-7)
7. పస్కా పశువు వధింపబడిన తరువాతే పులియనిరొట్టెలతోకూడిన పస్కా పండుగను ఆచరించాలి (ని.కాం.12:1-11; ద్వి.కాం.16:2-7)

క్రొత్తనిబంధన గ్రంథము ప్రారంభములో అంటే యేసుక్రీస్తు ఈలోకములో జీవించిన సమయములో నిసాను 14వ దినాన వచ్చే పస్కా పండుగను దానివెంటనే అదే మాసములో 15వ దినాన మొదలయ్యే పులియనిరొట్టెల పండుగను కలిపి పులియనిరొట్టెల పండుగ కాలముగా పరిగణించేవారు (లూకా.22:1). అయితే అదే పండుగ కాలాన్ని ఈనాటి యూదులు పస్కా పండుగ కాలంగా పరిగణించడం గత రెండువేల సంవత్సరాల పరిధిలో జరిగిన మార్పు అన్నది గ్రహించాలి. 

క్రీస్తుశకం రెండవ శతాబ్ధమునుండి పస్కా పండుగ/పులియనిరొట్టెల పండుగ జరుపుకునే విధానములో అనేక ఆచారాలను రబ్బీలు అంటే యూదా మతాధికారులు చొప్పించడము జరిగింది. ఇవేవీ మొదటి శతాబ్ధములోని యూదులు పాటించలేదు. ఈనాడు యూదులు పాటించే “పస్కా సెదెర్” (పస్కా పండుగను ఆచరించే క్రమము) కాలక్రమములో మార్పులు చేర్పులు చెందుతూ నేటి స్థాయికి చేరుకుంది. రెండువేల సంవత్సరాల క్రితం అనుసరించబడిన పస్కా సెదెర్ ఈనాడున్న పస్కా సెదెర్ లా విస్త్రుతమైన ఆచారాలతో కూడింది కాదు. ఈ కారణాన్నిబట్టి యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు పాటించిన పస్కా సెదెర్ కు ఈనాడు యూదులు పాటించే పస్కా సెదెర్ కు మధ్య వ్యత్యాసాలుండటం కద్దు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు/యూదులు మొదటి శతాబ్ధము వరకు పస్కా పశువును వధించి పండుగను ఆచరించేవారు (2ది.వృ.35:1; ఎజ్రా.6:19-21; మార్కు.14:12). ఈనాడు రబ్బీల-జూడాయిజమును అనుసరిస్తున్నవారు ఆ ఆచారమును పాటించడము లేదు. 

పాతనిబంధన గ్రంథములో (తనాక్) పస్కా పండుగను ఆచరించాల్సిన ప్రజలను గురించి, కారణాన్ని గురించి, విధానాన్ని గురించి, అలాగే ఆచరించాల్సిన స్థలమును గురించి దేవుడు వివరించడమేగాక రాబోవు తరాలు అనుసరించదగిన కొన్ని దృష్టాంతాలను కూడా పాతనిబంధన గ్రంథములో (తనాక్) అందించాడు. ఈ వాస్తవాన్ని బట్టి పాతనిబంధన గ్రంథ కాలములో అలాగే క్రొత్తనిబంధన గ్రంథ కాలములో అంటే 1400 క్రీ.పూ. నుండి 100 క్రీ.శ. వరకు దేవుని స్పష్టమైన ఆజ్ఙ ప్రకారము మోషేధర్మశాస్త్రాన్ని (పంచకాండాలను) అనుసరించిన ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దేవుడేర్పరచుకున్న యెరూషలేమునగరములోనే లేఖనాల క్రమములో జరుపుకునేవారు.

ఈనాడు యూదులమంటూ చెప్పుకుంటున్నవారు యూదుమతములో చేరినవారు తనాక్ (పాతనిబంధన) బోధలను ప్రక్కకుబెట్టి ఈ పండుగను ఆచరించే విశయములో దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఙలను తుంగలో తొక్కి రబ్బీల బోధల ప్రకారము అంటే రబ్బీల-జూడాయిజం ప్రకారము పస్కా పండుగను తాముంటున్న దేశములో తాము నివసిస్తున్న ఊరిలో రబ్బీలు నిర్దేశించిన క్రమమములో రబ్బీలు యేర్పరచిన ఆచారాలతో జరుపుకుంటున్నారు! 

ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) జీవితములోని చివరి వారములో జరిగిన ప్రధాన సంఘటనల సంక్షిప్త సూచిక

మూడవదినము/మంగళవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 13వ తారీఖు) — శిష్యులు వెళ్ళి యేసు చెప్పిన మాటల ప్రకారము మేడగదితో కూడిన ఇంటిని కనుగొనటము; 

మూడవదినము/మంగళవారము:రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిస్సాను మాసము 14వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు బుధవారపు ప్రారంభము) యేసు ప్రభువు మరియు శిష్యులు పస్కా పండుగ భోజనము చేయుట; గెత్సేమనే తోటలో ప్రార్థించటము; రోమా సైనికులచేత యేసు ప్రభువు బంధించబడటము; యూదు మతాదికారులముందు యేసు ప్రభువును నిలబెట్టడటము; మరునాడు అంటే నిస్సాను మాసము 15వ తారీఖునాడు పులియనిరొట్టెల పండుగ యొక్క మహావిశ్రాంతిదినము అనబడే మొదటిదినము. కనుక, ఈదినము మరుసటిదినానికి సిద్దపరచు దినము; 

నాలుగవదినము/బుధవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 14వ తారీఖు కొనసాగింపు) — రోమా అధికారి పిలాతుముందు యేసు ప్రభువును దోషిగా నిలబెట్టడము; ఉదయము 9:00 గంటలకు యేసు ప్రభువును సిలువపైకి ఎక్కించడము; మధ్యాహానము 3:00 గంటలకు యేసు ప్రభువు చివరి శ్వాస; ఆరోజు చివరలో యేసు ప్రభువు యొక్క ఆత్మ/ప్రాణము భూగర్భములోకి అంటే పాతాళములోకి వెళ్ళడము మరియు ఆయన మృతదేహము రాతిలో తొలచబడిన సమాధిలో వుంచబడటము; 

నాలుగవదినము/బుధవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు గురువారపు ప్రారంభము); యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిరాత్రిప్రారంభము; మహా విశ్రాంతిదినపు ప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తమ ఇండ్లకు వెళ్ళి విశ్రమించారు; 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): పగలు (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిపగలు; మహా విశ్రాంతిదినపు కొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాన్ని పాటించారు; ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు పిలాతు అనుమతితో సమాధిని భద్రం చేసారు (మత్తయి.27:62-66); 

ఐదవదినము/గురువారము (బేస్తవారము): రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శుక్రవారపు ప్రారంభము) యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవరాత్రి ప్రారంభము; మహా విశ్రాంతిదినము సమాప్తి; ఈదినం సాధారణ విశ్రాంతిదినానికి అంటే శనివారపు విశ్రాంతిదినానికి సిద్దపరచు దినము; 

ఆరవదినము/శుక్రవారము:పగలు (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవపగలుకొనసాగింపు; సిద్దపరచు దినపు కొనసాగింపు; మరునాడు సాధారణ విశ్రాంతిదినము (శనివారము); యేసు ప్రభువును వెంబడించిన ఆ స్త్రీలు ఆయన దేహానికి పూయవలేనని సుగంధద్రవ్యములను కొన్నారు (మార్కు 16:1); 

ఆరవదినము/శుక్రవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శనివారపు ప్రారంభము); సాధారణ విశ్రాంతిదినపు ప్రారంభము; ఇది యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవరాత్రిప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తిరిగి విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు (లూకా.23:56) 

ఏడవదినము/శనివారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు కొనసాగింపు); సాధారణ విశ్రాంతిదినపు కొనసాగింపు; యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవపగలుకొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాచారాని కొనసాగించారు; 

ఏడవదినము/శనివారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు ఆదివారము లేక మొదటిదినము ప్రారంభము); మూడు రాత్రింబగళ్ళు గడిచిపోయాయి; ప్రభువైన యేసు క్రీస్తు (ఆత్మ/ప్రాణము) తన శరీరముతో ఐక్యపరచబడి మృత్యుంజయుడై పునరుత్థానుడయ్యాడు, మరియు మహిమశరీరముతో సమాధిలోనుండి వెళ్ళిపోయాడు; 

మొదటిదినము/ఆదివారము: తెల్లవారుజామున (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు కొనసాగింపు); స్త్రీలు తాము సిద్దపరచిన సుగంధద్రవాలతో సమాధి దగ్గరకు వచ్చారు; సమాధిలో యేసు ప్రభువు దేహము లేదు; 

Permalink to single post

మోషేనిబంధన

దేవుడు మోషేద్వారా చేసిన నిబంధనను మోషేనిబంధన [Mosaic Covenant] అని అలాగే పూర్వ/పాత నిబంధన [Previous/Old Covenant] అనికూడా సంబోధిస్తారు.

(1) ఈ నిబంధన దేవుడు ప్రధానంగా ఇశ్రాయేలు వంశస్తులతో చేసాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9).

అయితే, వారితో మాత్రమే కాకుండా నిబంధన సమయములో వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడా లేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతోకూడా (ద్వి.కాం.29:10-15, 29) చేశాడు. ఇది మానవులందరితో చేయబడిన ఆదాము-నిబంధన (ఆది.కాం.3:15-21) లేక నోవహు-నిబంధన (ఆది.కాం.9:1-17) వంటిది కాదు. 

(2) ఈ నిబంధనలో భాగంగా ఇవ్వబడిన నియమవిధులను (ధర్మశాస్త్రాన్ని) ఇశ్రాయేలీయులు పూర్తిగా పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1). ఈ నిబంధనలోనికి ప్రవేశించిన వ్యక్తి (ఇశ్రాయేలీయుడు/యూదుడు) తన జీవితకాలములో ధర్మశాస్త్రములోని యేవొక్కటి తప్పిపోకుండా పాటించాలి. నిబంధనలో పాలుపంపులున్న ప్రతి ఇశ్రాయేలీయుడు/యూదుడు తన జీవితకాలములో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించకపోతే, అంటే ఎప్పుడైనా యేవొక్క ఆజ్ఙ లేక విధి విశయములోనైనా తప్పిపోతే, నిబంధన ప్రకారము అతడు శాపగ్రస్తుడు. (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4) 

(3) ఈ నిబంధనలోని నియమవిధుల ప్రకారము కొన్ని అతిక్రమాలకు మరణమే శిక్ష (సం.కాం.15:30-31). మరిముఖ్యంగా పదిఆజ్ఙలలోని ఆరు ఆజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10). అలాంటి అతిక్రమాలకు ధర్మశాస్త్ర ప్రకారము యేలాంటి విముక్తి లేదు. కాని, ధర్మశాస్త్రము తరువాత ఇవ్వబడిన ప్రవక్తల ఉపదేశము ప్రకారము దేవుడు తన మహా గొప్ప కృపాకనికరాల ఆధారంగా తాను సంకల్పించి యేర్పరచుకొన్న తన సేవకుని అపరాధపరిహారార్థబలినిబట్టి ధర్మశాస్త్రముద్వారా మరణశిక్షకు పాత్రులైన వారందరికి క్షమాపణను అందుబాటులోకి తీసుకొచ్చాడు (యెషయా 53:2-12; దానియేలు 9:24).

దైవచిత్తములోని ఈ నిత్యప్రణాలికయొక్క ఖచ్చితత్వాన్నిబట్టి దేవుడు పాతనిబంధన కాలములో సహితము మరణకరమైన పాపములను చేసినవారినికూడా క్షమించగలిగాడు. ఉదాహరణకు, దావీదు ఊరియా భార్య అయిన బత్షేబ విశయములో చేసిన పాపము దేవుడిచ్చిన పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరడమే. ఈ మూడు ఆజ్ఙాతిక్రమాలలో ధర్మశాస్త్ర ప్రకారము రెండింటికి మరణమే శిక్ష. అయినా, దావీదు దేవుని క్షమాపణను పొందగలిగాడు (2సమూయేలు.12:13). అందుకు కారణం ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తానే త్రొసివేయడముద్వారా దావీదును క్షమించాడని కాదు కాని, ధర్మశాస్త్రబద్దమైన మరణదండన అనే శిక్షను దేవుడు తానే సంకల్పించి యేర్పరచి నెరవేర్చబోతున్న తన కుమారుని అపరాధపరిహారార్థబలిలో నెరవేర్చాడు. అందునుబట్టే దావీదు విరిగినలిగిన హృదయంతో క్షమాపణను కోరినప్పుడు దేవుడతనిని క్షమించాడు (కీర్తన 51:1-19). 

(4) మోషేధర్మశాస్త్రమును తు.చ. తప్పకుండా తన జీవితకాలములో సంపూర్ణముగా పాటించిన వ్యక్తి పాత నిబంధన గ్రంథముగా పేర్కొనబడే యూదుల తనాఖ్ (Old Testament) లో ఎవరూ లేరు. 

ఈనాడు మోషేద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ, దాని ప్రకారం జీవిస్తున్నాము అంటూ భ్రమపడుతున్న వారు క్రింద ఇవ్వబడిన కొన్ని ధర్మశాస్త్ర విధులను పాటించే విశయములో తమ పరిస్తితిని పరిశీలించి చూసుకోవాలి:

i. మీరు ఇంతవరకు తిన్న ఆహారములో పశువుల (ఎద్దు/గొర్రె/మేక/కోడి మొదలైనవి) క్రొవ్వుకూడా వుండిందా? (లే.కాం.3:16) ఒక్కసారి వున్నా మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

ii. తల్లిని లేక తండ్రిని దూశించిన మీ పిల్లలకు ఎప్పుడైనా మరణశిక్ష విధించారా? (లే.కాం.19:27) “మాదేశములో అలాంటిది చట్టపరంగా ఒప్పుకోరండీ” అంటూ సాకులు చెప్పకండి. అలా మీరు చెపితే దేవుని ధర్మశాస్త్రానికన్నా మీరు ఈలోక చట్టానికే గొప్పస్థానమిచ్చీ భయపడి దాసోహమంటున్నారనేగదా దాని భావం! మరోవిశయం, మీ పిల్లలపట్ల మీకున్న ప్రేమ దేవునిపట్లా అలాగే దేవుడు మోషేద్వారా యిచ్చిన ఆజ్ఙలపట్లా వుండాల్సిన ప్రేమకన్న గొప్పదనే కదా?! ఏకారణముచేతనైనా మీరు అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

iii. మీ తల చుట్టూ వెండ్రుకలను, గడ్డపు ప్రక్కలను కత్తిరింపకుండా జీవిస్తున్నారా? (లే.కాం.19:27; యిర్మియా 9:26) గడ్డాన్నే నున్నగా క్షవరం చేసికొని సోగ్గాల్లా తయారవుతుంటే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. తల చుట్టూ వెండ్రుకలను కత్తిరిస్తున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

iv. మీరు వేసుకునే దుస్తులలో వున్ని మరియు జనుపనార (ప్రత్తి/cotton/linen/ఖాదీ) కలిసినవాటిని వేసుకుంటున్నారా? (ద్వి.కాం.22:11) అలా చెస్తే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

v. మీరు సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి అక్కడ బలులర్పించి పండుగలను ఆచరిస్ఫున్నారా? (ని.కాం.23:14) లేకపోతే  మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. 

vi. మీరెప్పుడైనా శనివారమునాడు ప్రయాణము చేసారా? (ని.కాం.16:29) అయితే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

vii. మీరెప్పుడైనా శనివారమునాడు ఏపనియైనా చేసారా?(ని.కాం.20:10; లే.కాం.23:3) చేస్తే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

viii. మీరెప్పుడైనా శనివారమునాడు వర్తకములో పాలుగొనడముగాని లేక సరకులు కొనడముగాని చేసారా? (నెహెమ్యా 10:31, 13:15,19; ఆమోసు 8:5) అలా చేసివుంటే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

ix. విశ్రాంతిదినాచారాన్ని అంటే సబ్బాతు ఆచారాన్ని మీరినవారికి మీ సమాజములో మరణశిక్ష వేసార? (ని.కాం.31:14-15, 35:2) అలా వేయకపోతే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

x. మీ సమాజములో “హాని కలిగిన యెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ” శిక్షగా నియమిస్తున్నారా?(ని.కాం.21:23-25; లే.కాం.24:19-20; ద్వి.కాం.19:21) అలా చేయకపోతున్నట్లయితే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

xi.  మీ తలంపులలో లేక హృదయములో మీదికానిది/యితరులది ఆశించిన సందర్భాలున్నాయా? (ని.కాం.20:17) వుంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!

xii. మీరు ఎప్పుడైనా వేరే దేవుని/దేవత పేరును ఉచ్చరించారా? (ని.కాం.23:13) అలా చేసి వున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!  

(5) మోషేధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగమంతా తప్పిపోయిన కారణాన్నిబట్టి పూర్వ/పాత నిబంధన వీగిపోయింది (న్యాయాధిపతులు 2:20; 2రాజులు 17:15-18, 18:11-12; యెషయా 24:5; యిర్మీయ 11:8,10, 31:32; యెహెజ్కేలు 16:59, 44:7; హోషేయ 6:7, 8:1). 

(6) పూర్వ/పాత నిబంధనలో పాలుపంపులున్న వ్యక్తులంతా ఆ నిబంధనలోని నియమాల ప్రకారము శాపగ్రస్తులుగా తేలిపోయారు. నిజానికి, ఈ నిబంధనలోని నియమాల ప్రకారము మానవమాత్రులెవరూ నీతిమంతులుగా తీర్చబడలేరన్నది వెయ్యి సంవత్సరాల (క్రీ.పూ. 1400 – క్రీ.పూ. 400) ప్రవక్తలకాలంలో నిర్ధారణగా తేలిపోయింది (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11). 

(7) పై కారణాలను బట్టి దేవుడైన యెహోవా/యాహ్వే పాత నిబంధన స్థానములో నిత్యము వుండబోయే ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు ప్రవక్తల కాలంలోనే వాగ్ధానము చేసాడు (యెషయా 42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:59-60, 37:24-28). 

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు 16:59-60)

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ 31:31-32) 

(8) అబ్రహామును అలాగే ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులను దేవుడు యెన్నుకొని వారితో చేసిన నిబంధనలద్వారా కేవళము వారిని మాత్రమే అశీర్వదించాలన్నది దేవుని వుద్దేశము కాదు. నిజానికి వారిని అశీర్వదించి వారిద్వారా భూలోకములోని వంశాలన్నిటిని అశీర్వదించాలన్నదే దేవుని నిత్యసంకల్పము (ఆది.కాం.12:1-3, 18:18, 22:18; కీర్తన 22:27-28, 86:9; యెషయా 9:1-2, 11:10, 42:1-4,6, 49:6, 55:1-5, 60:1-3; దానియేలు 7:14; ఆమోసు 9:11-12; హోషేయ 2:23). 

(9) పూర్వ/పాత నిబంధన కాలములోని భక్తులు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించలేక పోవడాన్ని బట్టి ధర్మశాస్త్ర మూలమైన నీతిని పొందలేకపోయారు. అయినా, వారందరూ ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసమూలమైన నీతినిపొంది దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాన్ని పాటించే విశయములో తమవంతు ప్రయత్నాలను చేశారు (ఆది.కాం. 15:5-6; హబక్కూకు 2:4; గలతీ.3:6-9; హెబ్రీ.11:13, 39). 

(10) పాత నిబంధనకాలం ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క సిలువ మరణము వరకు మాత్రమే అన్నది మరచిపోకూడదు. ఈ కారణమును బట్టే ప్రభువైన యేసు క్రీస్తు పవిత్రమైన అమూల్యమైన తన స్వరక్తాన్ని ధారపోయడముద్వారా అంటే తన మరణముద్వారా ప్రతిష్టించి ప్రారంభించబోయే క్రొత్త నిబంధన ఆరంభమువరకు పాత నిబంధన [మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన] యొక్క అసలు అర్థాన్ని తన చుట్టూ వున్నవారికి వివరించి చెప్పాడు, తాను పాటించి చూపాడు, మరియు దాని కోరికను తీర్చి కేవళము ఛాయగా మాత్రమే వుండిన దాని అసలు వుద్దేశాన్ని నెరవేర్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు బాలశిక్షకునిగా వుండిన దాని పాత్రను పూర్తి చేసాడు. తద్వారా క్రొత్త నిబంధనకు దానితోపాటే యివ్వబడే క్రొత్త నియమాలకు [క్రీస్తు ధర్మశాస్త్రానికి] మార్గం సుగమం చేసాడు (మత్తయి 5:17, 28:19-20; యోహాను 13:34-35, 14:25-26,16:12-13; లూకా 22:19-20, 24:44; రోమా.10:4; 1కొరింథీ.9:21; గలతీ.3:24-25).

కనుక, ఈ క్రొత్తనిబంధన కాలములో నిజక్రైస్తవులు అంటే ఆత్మలో తిరిగి జన్మించిన విశ్వాసులు మోషేధర్మశాస్త్రాన్ని కాదు క్రీస్తు (మెస్సయ్య) ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించాలి!

Permalink to single post

మెస్సయ్య మానవుడా?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మానవుడా…?

అవును, కన్యమరియకు జన్మించిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] అక్షరాలా మానవుడే! కాని, “ఆయన కేవలం మానవుడు మాత్రమేనా?” అన్నది ఇక్కడి అసలైన ప్రశ్న!

కొందరి వాదనా విధానం: మరి యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు పుట్టుక వుంది మనకూ పుట్టుక వుంది. ఆయనకు దేవుడున్నాడు మనకూ దేవుడున్నాడు. ఆయనకు తండ్రి వున్నాడు మనకూ తండ్రి వున్నాడు. కనుక దేవుని ముందు యేసు క్రీస్తుకు మనకు ఆత్మీయంగా తేడాలున్నప్పటికిని అస్థిత్వంలో ఎలాంటి తేడా లేనట్లే కదా?!

అసలు ఆయనకు మనకు తేడా వుందా…? వుంటే అది ఎలాంటి తేడా…?

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]కు మనకు మధ్య కొన్ని ప్రాథమిక వ్యత్యాసాలున్నాయి

మొదటి ప్రాథమిక వ్యత్యాసం: ఆయన ఈలోకములోకి ప్రవేశించాడు; మనం ఈలోకంలో సృష్టించబడ్డాము.

అప్పుడు యెహోవా నేను సృజించిన [בָּרָא/bara/బరా] నరులును నరులతోకూడ జంతువులును పురుగులును ఆకాశ పక్ష్యాదులును భూమిమీద నుండకుండ తుడిచివేయుదును; (ఆది.కాం.6:7)
నా ఆయుష్కాలము ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసి కొనుము ఎంత వ్యర్థముగా నీవు నరులనందరిని సృజించి [בָּרָא/bara/బరా] యున్నావు?” (కీర్తన.89:47)
వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు [בָּרָא/bara/బరా] జనము యెహోవాను స్తుతించును.” (కీర్తన.102:22)

‘సృష్టించుట’ లేక ‘శూన్యములోనుండి ఉనికిలోకి తెచ్చుట’ అన్న అర్థాన్ని వ్యక్తపరిచే బరా [בָּרָא/bara/బరా] అనే హీబ్రూ పదం బైబిలు అంతటిలో ఒక్కసారికూడా యేసు క్రీస్తుకు [యషువ మషియాఖ్] అన్వయించబడలేదు అన్నది గమనార్హమైన అంశం.

కాబట్టి ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు.బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

రెండవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని అసలైన కుమారుడు; మనం ఆయనయందున్న విశ్వాసమువలన దేవుని కుమారులముగా మార్చబడ్డాము

యేసు క్రీస్తు [యషువ మషియాఖ్]క దేవుని యొద్దనుండి లేక దేవునిలోనుండి వచ్చాడు. కనుక ఆయన అక్షరాల (literally) దేవుని కుమారుడు, కాని భౌతికంగా కాదు. ఆ కారణాన్నిబట్టి లేఖనాలలో ఆయన అద్వితీయకుమారుడుగా [μονογενής υἱός/మొనొగెనెస్ హుయియొస్ = ప్రత్యేకమైన/ద్వితీయములేని కుమారుడు] పేర్కొనబడ్డాడు (యోహాను.3:16,18; హెబ్రీ.11:17; 1యోహాను.4:9). మనం అంటే నిజవిశ్వారులైనవారు ఈలోకములోనే సృష్టించబడ్డాము. అయినా నిజవిశ్వాసులు యేసు క్రీస్తునందు విశ్వాసమూలముగా దత్తపుత్రాత్మనుబట్టి దేవునికి కుమారులముగా మారాము (యోహాను.1:12-13; రోమా.8:15; గలతీ.4:5-7). ఇది అక్షరార్థమైన మరియు భౌతికమైన పుత్రత్వసంబంధము ఎంతమాత్రము కాదు. ఇది ఆత్మీయమైన మరియు అలంకారరూపమైన సంబంధము. 

ఆదియందు [సృష్టికి పూర్వం] వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద [πρὸς τὸν Θεόν] ఉండెను, వాక్యము దేవుడై యుండెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన [యేసు క్రీస్తు/యషువ మషియాఖ్] మహిమను కనుగొంటిమి.” (యోహాను.1:1,14).

యేసు (యషువ) ఈ లోకములోనికి నరునిగా రాకముందు దేవునితో/దేవునిలో దేవుని వాక్కుగా ఉనికిని కలిగివుండి తన ఉనికికి ఆరంభము లేనివాడై తానే ఆదియై వున్నాడు (ప్రకటన.21:6; 22:13). ఆయన సృష్టించబడలేదు, కాని సమస్తమూ–నీవు నేను కూడా–ఆయనకొరకు ఆయనద్వారా సృష్టించబడ్డాయి. “కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు” (యోహాను.1:3). ఆయన కన్యమరియకు జన్మించకముందే దేవుని కుమారుడు! ఆ కారణాన్నిబట్టే దేవుడు తన కుమారుని ఈలోకములోనికి పంపెను అంటూ లేఖనాలు సాక్షమిస్తున్నాయి (సామెతలు.30:4; యోహాను 3:17, గలతీ.4:4; 1యోహాను.4:9).  

మూడవ ప్రాథమిక వ్యత్యాసం: ఆయన దేవుని మర్మము; మనం దేవుని చేతిపని మాత్రమే

ఈలోకములోకి మానవశరీరాన్ని ధరించి విచ్చేసిన సందర్భంగా (యోహాను.1:14; హెబ్రీ.10:5) యేసు [యషువ] ‘దేవుని వాక్కు’గా దేవునిలో వుండి దేవునిగా వున్న (యోహాను.1:1) కారణాన్నిబట్టి తనకున్న దైవత్వపు లక్షణాలను మరియు హక్కులను వినియోగించుకోకుండా వాటిని మరుగుపరచుకొని మానవ పరిధులకు తన్నుతాను పరిమితునిగా చేసుకున్నాడు (ఫిలిప్పీ.2:6-7; హెబ్రీ.2:14). 

పై లేఖన సత్యాలనుబట్టి ఒక నరునిగా జీవించిన యేసు క్రీస్తు దేవుని మర్మమై వున్నాడంటూ లేఖనాలు ఘోశిస్తున్నాయి (కొలొస్సీ.2:2). నిన్నూ నన్నూ లేక ఏనరున్నికూడా ‘దేవుని మర్మము’ అని లేఖనాలు ఎక్కడా ప్రకటించలేదు అన్నది ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవాలి. ఆయనకు మనకు మధ్య వున్న ఈ భేదం అత్యంత ప్రాముఖ్యమైనది. 

పై కారణాలను బట్టి దేవుని ఎదుట కారణజన్ముడు దైవాంశసంభూతుడు అయిన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] మరియు తతిమా మానవులందరు సమానం కాదు. ఈ రెండు వర్గాల మధ్య వున్న అస్థిత్వపు అగాధం అన్నది ఎప్పటికీ పూడ్చబడలేనిది. అందుకే ఆయన దేవున్ని సూచిస్తూ “నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడు” (యోహాను.20:17) అన్నడే కాని “మన దేవుడు మన తండ్రి” అంటు సంబోధించలేదు. ఈ సుక్ష్మమైన అదేసమయములో అత్యంత పాముఖ్యమైన వ్యత్యాసాన్ని విజ్ఙులుమాత్రమే గుర్తించగలరు గ్రహించగలరు.    

Permalink to single post

నిజదేవుని ప్రవృత్తి

సృష్టికర్త అయిన దేవుడు అనంతుడు. ఆయనను గూర్చిన జ్ఙానం కూడా అనంతమైనది. దేవుని గురించిన సంపూర్ణ జ్ఙానం సృష్టించబడిన ఏ వ్యక్తికీ అందనటువంటిది. అయినా, తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టించబడిన మానవులకు ఉపకరించేందుకు వీలుగా దేవుడు తన గురించిన గ్రహింపును కొంతవరకు నిజమైన ప్రవక్తల/అపోస్తలుల గ్రంథాలలో అందించడము జరిగింది. ఆ ప్రత్యక్షత దేవుని ఆత్మ ప్రేరణలో (inspiration) యివ్వబడిందిగనుక దాని గ్రహింపునుకూడా ఆ దేవుని ఆత్మ నడిపింపులోనే (illumination) మానవులు గ్రహించగలరు. అయితే ఈ నడిపింపు అన్నది విశ్వాసుల విధేయత మరియు ఆత్మీయ పరిణితిపై ఆధారపడివుంది. ఈ కారణాన్నిబట్టి బైబిలులోని ప్రత్యక్షతలనుగురించిన విశ్వాసుల గ్రహింపులలో హెచ్చుతగ్గులుండే అవకాశముంది.

పాతనిబంధన గ్రంథములో అంటే యూదుప్రవక్తలద్వారా యివ్వబడిన హీబ్రూ లేఖనాలలో (తనాఖ్) తననుతాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ప్రవృత్తిని అర్థం చేసుకోవడానికి రెండు ప్రాముఖ్యమైన హీబ్రూ పదాలను ధ్యానించడం ఆవశ్యకం–‘యఖీద్’ (יָחִיד = yahid or yachid) మరియు ‘ఎఖద్’ (אֶחָד = ehad or echad). ఎఖద్ అన్న పదానికి గణితశాస్త్ర సంఖ్య ఒకటి, సమిష్టి ఐఖ్యత, సామూహ ఏకత్వం వంటి అర్థాలు (ఉదా: ఆది.కాం. 2:24, 11:6; ద్వి.కాం.6:4), అలాగే యఖీద్ అన్న పదానికి ఏకైక, ఒకేఒక్క, ఏకాకి, ప్రియమైన, విశిష్టమైన, ప్రత్యేకమైన వంటి అర్థాలు (ఉదా: న్యాయాధిపతులు 11:34; కీర్తనలు 25:16; 68:6) ఉన్నాయి.

(1) ఎఖద్ అనే “సమూహ ఏకత్వాన్ని” సూచించే హీబ్రూ భాషా పదం సృష్టికర్త యొక్క అస్తిత్వాన్ని ప్రకటించిన సంధర్భంలో ఆయన ఏకత్వాని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడింది (ద్వి.కాం.6:4). అయితే, ఈ పదం ఒక్కసారయినా నరుని ఏకత్వాన్ని సూచించడానికి వుపయోగించబడలేదు.”ఒక్క దేవుడు” అంటే సంఖ్యాపరంగా ఒకదేవుడని భావం (ఉదా: ఒక్క దేవుడు, యిద్దరుదేవుళ్ళు, ముగ్గురు దేవుళ్ళు…). ఒక్క/ఒక్కడు/ఒక్కటి అన్న గణితశాస్త్ర సంఖ్య గణితశాస్త్ర సూత్రాలకు లోబడుతుంది. అయితే నిజమైన దేవుడు ఏశాస్త్రానికి లోబడడు లేక పరిమితి కాజాలడు. కనుక, ఆ కారణాన్ని బట్టి గణితశాస్త్రపరమైన ఒక్కటి/ఒక్కడు (one/1) అన్న భావార్థం నిజదేవునికి అన్వయించతగదు.

“దేవుడు ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో నిజదేవునిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. ఇదే సత్యాన్ని మరొకవిధంగా చెప్పలంటే దేవుడు అద్వితీయుడు. అంటే, ఆయనను పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు.

“దేవుడు ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే దేవుడు ఒంటరివాడు మరియు ఆయనలో ‘సమూహ ఏకత్వం’ అన్నది యేదిలేదన్నది సూచించబడుతున్నది. అయితే, హీబ్రూలేఖనాలలో ఎక్కడా దేవుని ఉనికి/అస్తిత్వానికి సంబంధించి ఈవిశయం చెప్పబడలేదు అన్నది గమనించదగిన విశయం. దీన్ని బట్టి యూదు లేఖనాలలో తనను తాను ప్రత్యక్షపరచుకున్న సృష్టికర్త ఏకాకి లేక ఒకేఒక్కడు (יָחִיד = యఖీద్) కాదు అన్నది సుస్పష్టం.

(2) నరుని ఏకత్వాన్ని సూచించడానికి యూదు లేఖనాలలో వుపయోగించబడిన హీబ్రూ భాషా పదం యఖీద్. (ఉదా: న్యాయాధిపతులు 11:34). కాని, ఈ పదం ఒక్కసారయినా దేవుని ఏకత్వాన్ని సూచించడానికి ఉపయోగించబడలేదు అన్నది మరవకూడదు.”ఒక్క మనిషి” అంటే సంఖ్యాపరంగా ఒకమనిషని భావం (ఒక్క మనిషి, యిద్దరు మనుషులు, ముగ్గురు మనుషులు…). “మనిషి ఒక్కడు” (אֶחָד = ఎఖద్) అంటే వునికిలో మనిషిగా ఉన్నవాడు ఒక్కడే అని భావం. కాని, హీబ్రూ లేఖనాలలో యెక్కడాకూడా మనిషి వునికికి సంబంధించి ఈలాంటి పదజాలం వుపయోగించబడలేదు. ఇందును బట్టి యూదు లేఖనాలు మనిషి ‘ఒక్కడు’ (אֶחָד = ఎఖద్) లేక ‘సమూహ ఏకత్వం’ కలవాడు అని బోధించడం లేదన్న వాస్తవం నిర్ధారించుకోవచ్చు.

“మనిషి ఏకాకి/ఒకేఒక్కడు” (יָחִיד = యఖీద్) అంటే మనిషి ఒంటరివాడు మరియు అతనిలో ‘సమూహ ఏకత్వం’ ఏదీలేదన్నది సూచించబడుతున్నది. ఈ సత్యాన్ని హీబ్రూ భాషలోని యూదు లేఖనాలు నిర్ద్వంధంగా సూచిస్తున్నయి (కీర్తనలు 25:16; 68:6). దాదాపు ముప్ఫైమంది దైవాత్మచేత ప్రేరేపించబడిన ప్రవక్తలద్వార హీబ్రూలేఖన గ్రంథాలసంపుటి అయిన పాతనిబంధన మానవాళికి అందించబడింది. 39 లేఖన గ్రంథాల సంపుటి అయిన పాతనిబంధనలో ఎఖద్ అన్న పదం 967 సార్లు అలాగే యఖీద్ అన్న పదం 12 సార్లు వుపయోగించబడ్డాయి. అయితే, అందులో ఒక్క ప్రవక్త అయినా దేవుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘యఖీద్’ (יָחִיד = yachid) అన్న పదాన్ని అలాగే నరుని ఏకత్వాన్ని సూచించేందుకు ‘ఎఖద్’ (אֶחָד = echad) అన్న పదాన్ని వుపయోగించడం అన్నది జరగలేదు.

దేవుడు ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్) 

అంటే, దేవుడు ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, దేవుని పోలినవాడు లేక ఆయనలాంటివాడు ఆయనకు వేరుగా సాటిగా పోటీగా ధీటుగా మరొక దేవుడు లేడు. ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఒక్కడు (ఎఖద్) కాదు’ అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, దేవుడు ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, దేవుని అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకివంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘దేవుడు ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

యెహోవా ఒక్కడు/అద్వితీయుడు (ఎఖద్). అంటే, ద్వితీయము లేనివాడు. మరొకవిధంగా చెప్పలంటే, యెహోవాకు వేరుగా, సాటిగా, పోటిగా మరొకడు లేడు. ఆ గ్రహింపులో యెహోవా ఒక్కడు (ఎఖద్) కాదు అన్నవాడు అబద్దికుడు. అదేసమయంలో, యెహోవా ఒంటరివాడు లేక ఏకాకి (యాఖిద్) కాదు అన్నదికూడా గ్రహించాలి. అంటే, యెహోవా అంతర్గత వాస్తవికత (ఉన్నత) అన్నది (ఆయనకు వేరుగా లేక వెలుపల కాదు సుమా) మానవ అంతర్గత వాస్తవికతలా ఒంటరి లేక ఏకాకి వంటిది (యాఖిద్) కాదు. కనుక, ఈ గ్రహింపునుబట్టి ‘యెహోవా ఏకాకి లేక ఒంటరివాడు (యాఖిద్)’ అన్నవాడుకూడా అబద్దికుడు.

(ద్వి.కాం.6:4; యెషయా 45:5,6,14; 46:9; మార్కు 12:29; రోమా 3:30)

దేవుడు సర్వవ్యాప్తి

దేవుడు అంతటా వ్యాపించి వున్నాడు మరియు ఆయన లేని స్థలము అంటూ లేదు. ఈ గుణలక్షణాన్నిబట్టి నిజదేవుడు ఒకేసమయంలో తన ఇచ్ఛప్రకారం రెండు లేక అంతకన్న ఎక్కువ స్థలాలలో ప్రత్యక్షంకూడా కాగలడు. ఇది సృష్టికి (నరులకు) అసాధ్యం, కాని సృష్టికర్తకు (దేవునికి) సుసాధ్యం!

దేవుడు రెండు వేరువేరు స్థలాలలో ఒకే సమయంలో ఇద్దరు వ్యక్తులుగా ప్రత్యక్షమైన సందర్భంలో ఇద్దరు దేవుళ్ళు అనిలెక్కించడము లేక తీర్మానిచడము అవివేకం. ఆవిధంగా ప్రత్యక్షమవగలగడం అన్నది దేవుని ప్రవృత్తి. ఈ సందర్భంగా నిజదేవుడు గణితశాస్త్ర పరిధులకు అతీతమైనవాడు అన్న సత్యాన్ని పరిగణాలోకి తీసుకోవాలి. అలాంటి సందర్భాలలోకూడా ఆయన అద్వితీయుడేనన్నది మరువకూడదు. అది సృష్టికి అతీతంగా వుంటూ కేవళము సృష్టికర్తకు మాత్రమే చెందిన దైవప్రవృత్తి.

(కీర్తనలు 139:7-10; యిర్మీయ 23:24; అపో.కా.17:28)

దేవుని స్వభావం వైవిధ్యంతోకూడినది

అంటే, ఆయన ఏకాకి లేక ఒంటరివాడు కాదు. ఇంకా చెప్పలంటే దేవుని అంతర్ఘత అస్తిత్వం సృష్టించబడిన వ్యక్తుల అస్తిత్వాన్ని పోలిన ఏకత్వంలా వుండక సృష్టిలోనే లేని ‘వైవిధ్యంతో కూడిన ఏకత్వాన్ని’ (Unity in Diversity) కలిగి వున్నాడు. బైబిలు పరిభాషలో చెప్పాలంటే, ఆయన తండ్రికుమారపరిశుద్ధాత్ములనే వైవిధ్యంతో కూడిన ఏకత్వమై యున్న అద్వితీయదేవుడు [అద్వితీయుడు: ద్వితీయములేనివాడు; తనకు వేరుగా సాటిగా పోటిగా ధీటుగా మరొకడు లేనివాడు;].

(ఆది.కాం.1:26; యెషయా 48:15-16; జెకర్యా 2:8-11; మలాకి 3:1; మత్తయి 28:19; యోహాను 1:1, 18)

దేవుడు నరులను తన పోలిక చొప్పున తన స్వరూపమందు సృష్టించినా ఆయన అనేక విధాలుగా నరులకన్నా ఎంతో గొప్పవాడు మరియు వైవిధ్యమున్నవాడు. కనుక, దేవుడు నరులలాంటి వాడు కాదు అన్నది నిరాపేక్షమైన మాట. సర్వసాధారణంగా ఒక నరునిలో/మానవదేహములో ఒక వ్యక్తిమాత్రమే అస్తిత్వాన్ని కలిగివుంటాడు. దేవుడుకూడా అలాగే వుండాలన్న నియమమేదీ లేదు. మరోమాటలో చెప్పాలంటే, నరులలో లేని వైవిధ్యం/బహుళత్వం దేవునిలో వుండే అవకాశం వుంది. నిజానికి వుంది అని గ్రహించడానికి పైన వివరించిన విధంగా లేఖనాలు తిరుగులేని ఆధారాలెన్నో అందిస్తున్నాయి.

సృష్టికర్త ప్రవృత్తిని సంపూర్ణంగా కాకపోయినా పరిమితస్థాయిలోనైనా సరిగ్గా అవగాహన చేసుకోవటానికి మానవ మేధస్సుకు వున్న పరిమితులే పెద్ద ఆటంకం అన్నది లేఖనాల ప్రకటన:

ప్రకృతి సంబంధియైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెఱ్ఱితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవముచేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు.” (1కొరింథీ.2:14)

« Older Entries Recent Entries »