Author Archives: Admin

Permalink to single post

తాల్ముద్-జూడాయిజం

తాల్ముద్ అన్నది యూదుమతబోధకులైన రబ్బీలు పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడిచ్చిన తనాక్ (పాతనిబంధన గ్రంథము) కు వేరుగా వ్రాసుకున్న యూదు మరియు అన్యసాంప్రదాయాలతో కూడిన అనేక గ్రంథాలలో ప్రధానమైనది.

“తాల్మూద్-జూడాయిజం” అన్న మతవిశ్వాసం ప్రధానంగా యూదుమతబోధకులైన రబ్బీల బోధలపై అంటే తాల్ముద్ బోధలపై ఆధారపడినది. కనుక దీన్ని “రబ్బీలజూడాయిజం” (Rabbinic Judaism) అనికూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూడాయిజం (Judaism) అనేక శాఖోపశాఖలుగా విడిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తాల్ముద్-జూడాయిజం లేక రబ్బీలజూడాయిజం అన్నది 175 శాఖలుగా విడిపోయినట్లుగా కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 70 క్రీ.శ.లో యెరూషలేములోని దేవాలయము అంతముకావటముతో జూడాయిజపు పురోగతికి రెండు తక్షణ ప్రమాదాలను పసికట్టారు రబ్బీలుగా పిలువబడే ఆనాటి యూదుమతబోధకులు. ఒకవైపు యెరూషలేములోని దేవాలయపు నాశనము తనాక్-జూడాయిజపు విధులకు ఆచారాలకు తెరదించితే మరొకవైపు తనాక్-జూడాయిజములోని భక్తిపరులైన వేలాదిమంది యూదులు క్రమక్రమంగా క్రైస్తవ మార్గములోకి మళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జూడాయిజం అన్నదే వుండదిక. అదే జరిగితే యిక రబ్బీల పాత్రవుండదు వారి ప్రాధాన్యతా వుండదు.

క్రీస్తు శకము రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే రబ్బీలజూడాయిజం (తాల్ముదు-జూడాయిజం) మొలకెత్తి ఐదవ శతాబ్ధముకల్లా వేళ్ళుతన్ని వటవృక్షంగా మారిపోయింది. ఈ ఎదుగుదలలో తాల్ముద్-జూడాయిజం తనాక్-జూడాయిజం నుండి పూర్తిగా వేరై బబులోను లోని ఆచారాలు బోధల ప్రాతిపదికన స్థిరపడి పైకి మాత్రం తనాక్ (పాతనిబంధన గ్రంథం) వేశం ధరించి అంతర్గతంగా తనాక్ యొక్క బోధలకు వ్యతిరేకమైన బోధలను ఆచారాలను ప్రవేశపెడుతూ విస్తరించడం ప్రారంభించింది. నిజానికి ఈరకమైన పోకడలో మొదటి శతాబ్ధములో ప్రారంభమైన నిజక్రైస్తవ్యంనుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా పెరిగి విస్తరించిన మతక్రైస్తవ్యానికి మరియు రబ్బీలజూడాయిజానికి దగ్గర పోలికలున్నయనే చెప్పవచ్చు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన వాస్తవం బైబిల్-క్రైస్తవ్యం లేక నిజక్రైస్తవ్యంలోని విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా వారి సంఖ్య మాత్రం స్వల్పమైనదే. ఈ సత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలోనే వెల్లడిచేయబడింది:

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి.7:13-14)
“…అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా.18:8)

తాల్ముద్ అన్న పదానికి అధ్యయనం (study) అని అర్థం. తాల్ముద్-జుడాయిజంలో రెండురకాల తాల్ముదు సాహిత్యము వాడుకలోవున్నాయి. ఒకటి, ‘యెరూషలేము తాల్ముద్.’ ఇది 2వ శతాబ్ధము క్రీ.శ. – 3వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో పాలస్తీనాలోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. రెండు, ‘బబులోను తాల్ముద్.’ ఇది 3వ శతాబ్ధము క్రీ.శ. – 4వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో బబులోనులోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. కొంతవరకు రెండింటిలోని మూలపాఠాలు ఒకదానితో మరొకటి పోలివున్నా రెండింటిలోని వివరాలు సమాచారాలమధ్య వ్యత్యాసాలుకూడా వున్నాయి. రెండింటిలో బబులోను తాల్ముద్ పెద్దది మరియు క్రొత్తది. కనుక రబ్బీలజూడాయిజంలో బబులోను తాల్ముద్నే ప్రామాణికంగా లేక్కిస్తారు. తాల్ముద్ లో రెండు భాగాలుంటాయి—‘మిష్నా’ (Mishna) మరియు ‘గమారా’ (G’mara).

‘మిష్న’ అన్నది రబ్బీలచేత సంకలనము (compiled) మరియు సంపాదకత్వము (edited) చేయబడిన మౌఖికతోరా (Oral Torah) యొక్క గ్రంథస్థరూపముకాగా, ‘గమరా’ అన్నది మౌఖికతోరా (Oral Torah) యొక్క రబ్బీల వ్యాఖ్యానభాగము (commentary). మొత్తానికి తాల్ముదులోని ఈ రెండు భాగాలుకూడా యూదు మత పెద్దలైన రబ్బీల సృష్టి అన్నది గుర్తుంచుకోవలసిన విశయం!

జూడాయిజం లోని అన్ని శాఖలు తాల్ముద్ సాహిత్యానికి ఒకేవిధమైన ప్రాధాన్యత నివ్వవు అన్నది గమనార్హమైన విశయం. కొన్ని జూడాయిజం శాఖలు తాల్ముద్ గ్రంథాలను రబ్బీల సృష్టిగా గుర్తించి వాటిని తృణీకరిస్తున్నాయి. కారైటు జూడాయిజం, మధ్యయుగం లోని జూడాయిజం మార్మిక శాఖలు, రిఫామ్డ్ జూడాయిజం వారు, ఆధునిక యూదులు మొదలైన జుడాయిజం శాఖలు తాల్మూద్ గ్రంథాలను తిరస్కరిస్తారు.

క్రీస్తు శకము 1వ శతాబ్ధపు మొదటి అర్థభాగములోనే తనాక్-జూడాయిజం (బైబిలు జూడాయిజం) కు తెరపడటముతో రబ్బీలు బెంబేలెత్తిపోయారు. యూదుజాతిని యూదుమతాన్ని సమ్రక్షించే తన బృహత్తర ప్రణాళికలో భాగంగా రబ్బి అకివ రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే యూదుమతకొనసాగింపుకు అసలు దేవాలయముతోనే పనిలేకుండా నిరాటంకంగా కొనసాగగలిగే క్రొత్త జూడాయిజపు స్థాపనకై వేరొక తోరా (ఉపదేశము/ధర్మశాస్త్రము) ఆవిశ్కరణకు పూనుకొని మోషేతోపాటు యితర పాతనిబంధన ప్రవక్తలు ఎవరూ కని విని యెరుగని ‘మౌఖిక తోరా’ అన్న భావనకు (concept) రూపకల్పన చేసి దానికి యూదులమధ్య చెల్లుబాటును సంపాదించగలిగాడు. 200 క్రీ.శ. ప్రాంతములో ‘రాజకుమారుడు యూదా’ (Judah the Prince/యెహుదా హనసి: 135 క్రీ.శ.- 217 క్రీ.శ.) అనే రబ్బి మౌఖికతోరాగా చెల్లుబాటుసంపాదించిన యూదుబోధలను (Jewish teachings), పురాణాలను (legends), పిత్రుపారంపార్యాచారాలను (tranditions), ప్రాచిన జ్ఙానబోధలను (ancient wisdom), కొంత యూదుచరిత్రను (Jewish history) సేకరించి వాటన్నిటిని రంగరించి తన సంపాదకత్వముతో క్రొత్త జూడాయిజపు వుద్దరణకు తగిన మతబోధలు, ఆచారాలు, విధులతో కూడిన గ్రంథాన్ని సిద్దపరచి రాబోవుతరాలకు వుపయుక్తంగా వుండేందుకు గ్రంథరూపములో భద్రపరిచాడు. అదే ‘మిష్నా’గా పేరుస్థిరపరచుకొని వాడుకలోకి వచ్చింది.

రబ్బీలు అనబడే యూదా మతబోధకుల కథనం ప్రకారం సీనాయి కొండపై దేవుడు మోషేకు రెండు తోరాలను (ధర్మశాస్త్రాలను) యిచ్చాడట!  అందులో ఒకటి వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరా (Written Torah) మరొకటి మౌఖికతోరా లేక నోటిమాటతో యివ్వబడిన మొదటి తోరా యొక్క వివరణ (Oral Torah). అయితే, బైబిలులో మాత్రం యిందుకు సంబంధించి ఎలాంటి ఆజ్ఙకాని, వివరణగాని, లేక సూచనగాని యివ్వబడలేదు. మోషేద్వారా వ్రాతపూర్వకంగా యిచ్చిన తోరా విశయములో దేవుడు అనేక పర్యాయాలు బైబిలులో సూచించాడు. కాని, మౌఖిక తోరాగా పిలువబడుతున్న రెండవ తోరానుద్దేశించి ఒక్కమాటకూడా మోషేగాని లేక ప్రవక్తలుగాని యేమాటా చెప్పలేదు. ఈ రెండవ తోరా/మౌఖిక తోరా అన్నది యూదుల పితృపారంపార్యాచారాల (traditions of men) ఆధారంగా వునికిలోకి వచ్చి రబ్బీల చేతిలో ప్రామాణికత్వాన్ని మరియు గ్రంథరూపాన్ని సంతరించుకొన్న రబ్బీల స్వసృష్టి అన్నది చెప్పకనే తెలుస్తోంది.

కేవలం యూదుల పిత్రుపారంపార్యాచారాలేకాక పుక్కిటిపురాణాలు (legends) ప్రాచీనుల జ్ఙానసముర్పార్జనలతోపాటు మోషేధర్మశాస్త్రములో వ్రాయబడని ఆచారవివరాలు సహితం రబ్బీల చొరవతో వునికిని సంతరించుకొని మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవ ధర్మశాస్త్రము) రూపములో విరాజిళ్ళుతున్నాయి. ఈకారణంగా తాల్ముదు బోధలు చాలావరకు దైవప్రేరణతో లిఖితరూపములో అందించబడిన మోషేధర్మశాస్త్రముయొక్క బోధలకు వేరుగా మరియు వ్యతిరిక్తంగా వుండటం కద్దు. ఈ వాస్తవాన్ని గ్రహించిన అనేకమంది ఆధునిక యూదుజాతీయులు మతవిశ్వాసాలనే పరిత్యజించి నాస్తికులుగా మారిపోయారు. ప్రపంచములోని మతాలన్నిటిలో నిమ్నమతాసక్తిగలవారు యూదులు. ఈ నేపథ్యములో ప్రపంచవ్యాప్తంగా వున్న యూదులలో కేవళం 38% మాత్రమే మతవిశ్వాసాలకు విలువనిచ్చేవారన్నది  గమనార్హం (HAARETZ, New Poll Shows Atheism on Rise, with Jews Found to Be Least Religious. Website: https://www.haaretz.com/jewish/jews-least-observant-int-l-poll-finds-1.5287579. Accessed date: 17-12-2018).

ఈనాటి జూడాయిజములో (రబ్బీలజూడాయిజములో) సత్యముందని బ్రమించి అందులోకి మతమార్పిడిపొందిన వారిని విస్మయపరచే ఒక వాస్తవమేమిటంటే ఈనాటి రబ్బీలజూడాయిజంకు (తాల్ముద్-జూడాయిజం) మూలపురుషునిగా వుండి దానికి రూపకల్పన చేసినది యూదుడుకాదుగాని ఒక అన్యుడు. అది రబ్బీ అకివ (50 క్రీ.శ.-135 క్రీ.శ.). సిసెరా అనబడిన ఒక దుష్టుడైన అన్యుని వంశములోనుండి వచ్చి జూడాయిజములోకి మతమార్పిడి పొందినవాడు రబ్బీ అకివ (Jewishhistory.org. Rabbi Akiva. Website: https://www.jewishhistory.org/rabbi-akiva-2/, date of access: 18-12-2018). గమనించాలి, అన్యులెవరైనా జూడాయిజములోకి మతమార్పిడిపొందితే అలాంటివారికి ఇశ్రాయేలీయులనిగాని లేక యూదులనిగాని దేవుడు పేర్కొన్నట్లు తనాక్ అంతటిలో ఎక్కడా ఆధారాలు లేవు. దైవలేఖనాలైన తనాక్ (పాతనిబంధనగ్రంథము) బోధప్రకారము అలాంటి అన్యులు నిజదేవున్ని నమ్ముకున్న “అన్యులైన విశ్వాసులుగా” కొనసాగాలి. వారు దేవుని ప్రజలమధ్య నివసింపవచ్చు. దేవుని ప్రజలతో కలిసి మోషేధర్మశాస్త్రాన్ని పాటించి, దేవుని ప్రజలతో కలిసి దేవుని దీవెనలలో వారు పాలుపొందవచ్చు. అంతేకాక, ఇశ్రాయేలీయులను/యూదులను వివాహముకూడా చేసుకోవచ్చు. అలాంటిసందర్భాలలో వారి సంతానము మిశ్రమసంతానముగా లెక్కించబడదు. అయినప్పటికిని వ్యక్తిగతంగా వారికిమాత్రము తనాక్ లేఖనాలు ఇశ్రాయేలీయులని/యూదులని ససేమిరా గుర్తింపు నివ్వదు. ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక అమాయక యూదేతరులు తాల్ముద్-జూడాయిజములో చేరి తాము యూదులమయ్యామన్న భ్రమలో కొనసాగుతున్నారు. అలాంటివారిని వుద్దేశించి మెస్సయ్య పలికిన మాటలు కటువైన మాటలు–

యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;” (ప్రకటన 3:9).

అయితే, ఈనాడు రబ్బీలజూడాయిజములో తనాక్ బోధలకు వ్యతిరేకమైన అనేక బోధలు ఆచారాలు వాడుకలోకి వచ్చాయి. అవి రబ్బీల బోధలలో పుట్టిన మానవకల్పితాలు అన్నది సత్యాన్వేషకులు మరవకూడదు (యెషయా 29:13).

దాదాపుగా క్రీస్తు శకము రెండవ శతాబ్ధములో రబ్బీ అకివ మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవధర్మశాస్త్రము/Oral Torah) అనబడే మోషేధర్మశాస్త్రానికి (మోషే-తోరా) వేరుగా మరొక ధర్మశాస్త్రాన్ని (అన్యధర్మశాస్త్రాము) సిద్ధంచేసి యూదులకు అందించాడు. అదే గత 2000 సంవత్సరాలుగా యూదు మతాచారాలకు జీవనశైలికి అంతిమ తీర్పరిగా మరియు దిశనిర్ధారణకు దిక్సూచిగా కొనసాగుతున్నది. మోషేధర్మశాస్త్రాన్ని పక్కకుబెట్టి దానిస్థానములో వేరొక ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టడముద్వారా జూడాయిజపు మతస్తులను ప్రక్కదోవ పట్టించిన అన్యజాతీయుడైన రబ్బీ అకివను తప్పుబట్టేదిపోయి ఈనాటి జూడాయిజం వారు  మోషేఅంతటివాడు అంటు రబ్బీ అకివకు కితాబునిచ్చి అందలమెక్కించి ఆయన సహకారంతో వునికిలోకి వచ్చిన మౌఖికతోరాకు దాసోహమంటూ మానవకల్పిత మతాచారాలతో నిజదేవునికి దూరంగా కొనసాగుతున్నారు. ఈ బాపతు మతమూఢులను చూసి మెస్సయ్య అయిన యషువ (యేసు క్రీస్తు) “మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” (మార్కు 7:13) అంటూ మందలించడం జరిగింది.

బైబిల్-జుడాయిజముకు ప్రతికూలంగా అవతరించి కొనసాగుతున్న రబ్బీలజుడాయిజం లేక తాల్ముద్-జూడాయిజమే అంత్యకాల జూడాయిజం! ఈరకమైన జుడాయిజమును అనుసరిస్తున్నవారిలో అనేకమంది దేవుని లేఖనాలను అలాగే దేవుడే అభిషేకించి పంపించిన యషువ హ-మషియాఖ్ (యేసు క్రీస్తు) ను తిరస్కరించడమేగాక ఆయనను దుర్భాషలాడుతూ మొదటిశతాబ్ధములో ఆయనను సిలువకప్పగించిన యూదామతపెద్దల స్థాయిలో ఆయనను ద్వేశిస్తూ దూశిస్తూ తాము అపవాదిసంతానమన్న వాస్తవాన్ని నిరూపించుకుంటూ దైవదుషణకు మరియు సత్యతిరస్కారానికి పాల్పడుతున్నారు. వీరి కుయుక్తులకు కుతర్కాలకు అనేకమంది నామకార్థ క్రైస్తవులు యిదివరకే మోసపోయి వారి అడుగుజాడలలో క్రొత్తనిబంధన తిరస్కరిస్తూ, యేసు ప్రభువును ద్వేశిస్తూ తద్వారా దైవదూషణకు పాల్పడుతూ సాతాను సంబంధులుగా నాశనపుత్రులుగా జీవిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు విశ్వాసులు సహితం విశ్వాసబ్రష్టులయ్యే అవకాశముందంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి,

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1తిమోతి.4:1-2)

Permalink to single post

తనాక్-జూడాయిజం

ఈనాటి యూదులు మరియు యూదామతప్రవిష్టులు క్రొత్తనిబంధన గ్రంథాన్ని దైవలేఖనాలుగా ఒప్పుకోరు విశ్వసించరు. వారిదృష్టిలో కేవళము క్రైస్తవులు పాతనిబంధన గ్రంథముగా పేర్కొనే 39 హిబ్రూ లేఖనగ్రంథాలు మాత్రమే దైవలేఖనాలు. దీన్నిబట్టి యూదులు/యూదామతప్రవిష్టులు తాము దైవలేఖనాలుగా విశ్వసించే 39 హిబ్రూ లేఖనగ్రంథాలను (పాతనిబంధన గ్రంథాన్ని) పాతనిబంధన గ్రంథము అని పేర్కొనకుండా “తనాక్” (TaNaK) అన్న ఒక క్రొత్తపేరుతో పిలుస్తారు. 

తనాక్ (TaNaK) అంటే యూదుల పరిభాషలో కేవళము 39 హిబ్రూ లేఖనగ్రంథాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము. దీన్నే హిబ్రూ భాషలో మిక్రా (Mikra) అనికూడా సంబోధిస్తారు.తనాక్ లోని  39 హిబ్రూ లేఖనగ్రంథాలను యూదులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు–తోరా/Torah (మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలు), నెవియిం/Nevi’im (ప్రవక్తలు), మరియు కెతువిం/K’etuvim (వ్రాతలు/లేఖనాలు). ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దైవ సందేశముతో కూడిన గ్రంథాలు. ఈ 39 గ్రంథాలు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడ్డాయి (1400 క్రీ.పూ.— 400 క్రీ.పూ.). మూడు హిబ్రూ పదాలలోని (Torah, Nevi’im, K’etuvim) మొదటి అక్షరాలను చేర్చి తనాక్ (TaNaK) అన్న పదాన్ని యేర్పరచుకున్నారు యూదులు. 

“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం తన అస్తమయసమయానికంటే ముందే తనలో రూపుదిద్దుకున్న బైబిలు-క్రైస్తవ్యానికి పురుడుపోసి దేవుని ఆత్మీయ ప్రణాలికలో తన పాత్రను ముగించుకొని తన వారసుడైన “క్రొత్తనిబంధన సమాజము”లో క్రొత్త పేరుతో చిరంజీవిగా నిలిచిపోయింది (యెషయా 65:15).

తనాక్-జూడాయిజం ప్రధానంగా మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలు, విధులు, గుడారము/దేవాలయము లోని అర్చనాదులు, బలులు, నైవేధ్యాలు, శిక్షలు మొదలైనవాటిచుట్టు కేంద్రీకృతమైనది. అయితే, 70 క్రీ.శ.లో రోమాసైన్యము యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనముచేసి యూదులమతకేంద్రాన్ని ద్వంసం చేయడముతో తనాక్-జూడాయిజం తన అంతిమదశకు చేరుకున్నది. నిజానికి 40 సంవత్సరాలకుముందే అంటే దాదాపు 30 క్రీ.శ.లో దేవుని ప్రణాలికలోని మానవనిర్మిత మందిరముకుండిన ప్రధాన వుద్దేశము నెరవేర్చబడి సంపూర్ణము చేయబడింది. దేవుని సన్నిధిలో సర్వకాలాలకు సరిపోయిన దైవసుతుని బలియాగము సృష్టిలో దైవసాక్షిగా అర్పించబడింది. దానికి సాదృశ్యంగా పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో వుండిన తెర తొలగి ప్రతిసంవత్సరము ఒకసారిమాత్రమే దేవుని ప్రజల పాపాలప్రాయశ్చిత్తార్థమై ప్రధానయాజకుడు పశువుల రక్తముతో దేవునిమందిరములోని అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించే ఆగత్యానికి తెరపడింది. ఈరకంగా తనాక్-జూడాయిజం యొక్క అంతిమదశకు నాంది పడింది. అక్కడే క్రొత్తనిబంధనాసమాజానికి అంకురార్పణ జరిగింది. అయితే, అదేసమయంలో తనాక్-జుడాయిజం కు వేరుగా మరియు ప్రతికూలంగా తాల్మూద్-జూడాయిజం అనే ఒక క్రొత్త జూడాయిజం మొలకెత్తింది. దాన్నే రబ్బీలజూడాయిజం అనికూడా పేర్కోంటారు. అదే ఇనాటి ప్రపంచములో యూదుమతంగా పేరొంది విస్తరిస్తున్నది.

“బైబిల్-క్రైస్తవ్యం” లేక “క్రొత్తనిబంధనాసమాజం” అన్నది మోషేనిబంధన కాలములోనే దేవుడు వాగ్ధానం చేసిన వేరొక నిబంధనకు చెందిన దేవునిప్రజలు (ద్వి.కాం.32:21; కీర్తన.82:8). ఆ వేరొకనిబంధననే “క్రొత్తనిబంధన” అని లేఖనాలు అభివర్ణించాయి. కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు ఇది నూతనపరచబడిన మోషేనిబంధన కాదు. అసలు యిది మోషేనిబంధనవంటిదేమాత్రము కాదు. “అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు” అంటూ దేవుడే విస్పష్టముగా సెలవిచ్చినవిధంగా ఆ “క్రొత్తనిబంధన” మోషేనిబంధనవంటిది కాదు అన్నది గమనార్హమైన విశయము. అంతేకాక దేవుడే ఈ నిబంధనకు ‘నిత్యనిబంధన’ అంటూ మోషేనిబంధనకులేని ఉత్కృష్టస్థానాన్ని గుర్తింపును తనముద్రగా యిచ్చాడు (యిర్మీయ 31:31-34, 32:37-40).

పాత/పూర్వ నిబంధనగా వున్న మోషేనిబంధనలో భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రము గుడారము/దేవాలయము మరియు దాని ఆచారాలతో విధులతో ముడిపడివుంది. అయితే, క్రొత్తనిబంధనలో భాగంగా అక్షరార్థముగా అలాంటి ఆచారాలు విధులు ఎవీ లేని క్రొత్తధర్మశాస్త్రము లేక క్రీస్తుధర్మశాస్త్రము (Law of Christ—యెషయా.42:4; గలతీ.6:2) యివ్వబడింది (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). ఈ క్రొత్తనిబంధనాప్రజలే క్రీస్తు అనబడిన యేసు యొక్క శిష్యులు లేక క్రైస్తవులు. 30 క్రీ.శ.తరువాత ప్రారంభమైన క్రైస్తవ్యం మొదట్లో ఒక దశాబ్ధానికిపైగా కేవళము యూదులతో ప్రారంభమై యూదులమధ్యే విస్తరించింది. ఆ సమయములో కొన్ని వేల యూదులు సత్యాన్ని గ్రహించి జూడాయిజంను వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు (అపో.కా.21:20).

క్రైస్తవుడు (Christian) అంటే ‘క్రీస్తును వెంబడించే వాడు’ (follower of Christ)అని భావం. ప్రారంభములో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క ప్రత్యేకమైన విశ్వాసము మరియు అబ్బురపరచే జీవనవిధానాలు అన్యులను/అవిశ్వాసులను కదిలించివేసాయి. శిష్యులకున్న ఆ విశిష్ట గుణలక్షణాలే వారు క్రీస్తును వెంబడించే వారని అన్యులు/అవిశ్వాసులు గుర్తించేందుకు తోడ్పడ్డాయి. దాంతో అన్యులు/అవిశ్వాసులు శిష్యులను ఆ పేరుతో అంటే ‘క్రైస్తవులు’ అంటూ పిలవడం మొదలుబెట్టారు (అపో.కాం.11:26). యేసుక్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలైనవారికి క్రైస్తవులు (Christians) అన్న పేరు దైవలేఖనాలు ప్రమాణీకరించడాన్ని క్రొత్తనిబంధనలో చూడగలము (1పేతురు 4:16).

Permalink to single post

యెషయాలో మెస్సయ్యా

యెషయా గ్రంథములో దేవుడైన యేహోవా చేత ‘నా సేవకుడు’ అని పిలువబడింది ఎవరు? 

యెషయా 52:13 – 53:12 వరకున్న లేఖనాలలో ఇశ్రాయేలీయులనందరిని సమిష్టిగా పేర్కొంటూ ‘నా సేవకుడు’ అన్న పదజాలము ఉపయోగించబడింది అంటూ కొందరు అలాగే ఇశ్రాయేలు చరిత్రలో నీతిమంతులయిన ఇశ్రాయేలీయులనందరిని కలిపి సాదృశ్యముగా సూచించడానికి ‘నా సేవకుడు’ అన్న అలంకార పదజాలము ఉపయోగించబడింది అంటు మరికొందరు భాష్యం చెప్పే ప్రయత్నం చేస్తూంటారు.  మరి అలాంటి అభిప్రాయాలను లేఖనాలు సమర్ధిస్తున్నాయా అన్నదే ఇక్కడ కీలకమైన ప్రశ్న. 

1) ‘నాసేవకుడు ‘ (עַבְדִּ֑י=అబ్’ది) అన్నఏకవ్యక్తి పదజాలం యెషయా గ్రంథములో అనేకసార్లు ఉపయోగించబడింది
 
– 16 సార్లు వుపయోగించబడింది.  
– ప్రవక్త యెషయా ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 20:3)  
– హిల్కియా కుమారుడు ఎల్యాకీము  ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 22:20)
– రాజైన దావీదు ‘నా సేవకుడు’  గా పేర్కొనబడ్డాడు (యెషయా 37:35)    
– యాకోబు సంతానము లేక ఇశ్రాయేలు జనాంగము ‘నా సేవకుడు’ గా పేర్కొనబడింది (యెషయా 41:8-9; 44:1,2,21; 45:4; 49:3).  
– అప్పటికింకా నామము బహిర్గతం చేయబడని ఒక విశిష్టమైన వ్యక్తి ‘నా సేవకుడు’ గా పేర్కొనబడ్డాడు (యెషయా 42:1,19; 43:10; 49:5-8; 52:13-53:12).  

2) యెషయా గ్రంథములో ప్రభువైన దేవుడు ఉపయోగించిన ‘నాసేవకుడు’ అన్న పదజాలం భవిష్యత్తులో రాబోవుతున్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి విశయంలో ఉపయోగించబడింది. అయితే, అదివరకేవచ్చిన/ఉండిన వ్యక్తులనుగాని లేక జనాంగాన్నిగాని ఉద్దేశించి ‘నాసేవకుడు’ అంటూ పేర్కొంటునప్పుడు ఆవ్యక్తియొక్క లేక జనాంగము యొక్క నామాన్ని కూడా అదేసందర్భములో స్పష్టంగా పేర్కొనడం చూస్తాము.    

యెషయా గ్రంథములో దేవుడు (ప్రభువైన యెహోవా) ఏర్పరచుకున్న ప్రత్యేకమైన ‘సేవకుడు’ ప్రవక్త అయిన యెషయా కాదు, రాజైన దావీదు కాదు, కోశాధికారి అయిన ఎల్యాకీముకూడా కాదు. ఆమాటకొస్తే, ఆయన యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగము యొక్క సాదృశ్య రూపము అంతకన్నా కాదు.    

3) దేవుడైన యెహోవా ‘నాసేవకుడు’ అంటూ ప్రవక్త అయిన  యెషయాద్వారా పరిచయం చేసిన ఆప్రత్యేకమైన కారణజన్ముని గూర్చి లేఖనాలు సెలవిస్తున్న సత్యాలు

– అతడు దేవుడైన యెహోవాకు ప్రాణప్రియుడు (యెషయా.42:1)  [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతనియందు యెహోవా ఆత్మ వుండును (యెషయా.42:1) [ఇది అనంతకాలమునుండే కొనసాగుతున్నది]
– అతడు అన్యజనులకు న్యాయము అందిస్తాడు (యెషయా.42:1) [తండ్రి మహిమతో రాజుగా వచ్చినప్పటినుండి] 
– అతని ఉపదేశము/ధర్మశాస్త్రము (తోర) కొరకు దూరప్రాంత ప్రజలలుకూడా ఎదురుచూస్తారు (యెషయా.42:4) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు ప్రభువైన యెహోవాచేత అన్యజనులకు వెలుగుగా నియమించబడ్డాడు (యెషయా.42:7) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]
– అతడు యెహోవా యొక్క దూత (యెషయా.42:19) [పాతనిబంధన కాలమునుండి]
– అతడు యెహోవా యొక్క సాక్షి (యెషయా.43:10) [ఆయన పరిచర్య ప్రారంభించినప్పటినుండి]  
– అతడు ఇశ్రాయేలీయులను తిరిగి యెహోవ యొద్దకు తీసుకు వచ్చేవాడు (యెషయా.49:5) [పరిచర్య ప్రారంభించినది మొదలుకొని తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు భూదిగంతములవరకు యెహోవా కలుగజేయు రక్షణకు సాధనముగా వుంటాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు అన్యజనులకు వెలుగుగా వుండేందుకు యెహోవా చేత నియమించబడ్డాడు (యెషయా.49:6) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు]
– అతడు మనుషులచేత నిరాకరించబడినవాడు (యెషయా.49:7, 53:2) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]
– అతడు జనులచేత అసహ్యించుకోబడ్డవాడు (యెషయా.49:7, 53:3) [ఆయన ఇహలోకములో నరునిగా జీవించిన సమయములో]    
– అతడు యెహోవాచేత ప్రజలకు నిబంధనగా (క్రొత్తనిబంధనగా) నియమించబడ్డవాడు (యెషయా.42:7; 49:8) [క్రొత్తనిబంధననుండి తాను తిరిగి వచ్చేంతవరకు] 
– అతడు మన (ప్రజల) రోగములను, వ్యసనములను వహిస్తాడు (యెషయా.53:4)
– అతడు మన (ప్రజల) స్థానములో శిక్ష అనుభవిస్తాడు (యెషయా.53:5)
– అతడు పొందే శిక్షనుబట్టి మనము (ప్రజలు) స్వస్థత పొందుతాము (యెషయా.53:5) 
– అతడు దేవుని ప్రజల స్థానములో శిక్షించబడుతాడు మరియు ప్రాణత్యాగము చేస్తాడు (యెషయా.53:8)
– అతడు ఏ పాపము చెయకున్నా మరణశిక్షను అనుభవిస్తాడు (యెషయా.53:9)
– అతడు తననుతాను పాపపరిహారార్థబలిగా చేసుకుంటాడు (యెషయా.53:10)
– అతడు (మరణములోనుండి తిరిగి బ్రతుకుటద్వారా) దీర్ఘాయుష్మంతుడవుతాడు (యెషయా.53:10)
– అతనిద్వారా యెహోవా యొక్క ప్రణాలిక నెరవేర్చబడుతుంది (యెషయా.53:10)
– అతడు నీతిమంతుడైన యెహోవా సేవకుడు (యెషయా.53:11) 
– అతడు ప్రజల దోషములను తాను భరించి వారిని నిర్దోషులుగా చేస్తాడు (యెషయా.53:11)
– అతడు మరణమునొందునంతగా తన ప్రాణమును ధారపోస్తాడు (యెషయా.53:12)
– అతడు ప్రజల పాపములను భరిస్తూ వారి కొరకు విజ్ఙాపన చేస్తాడు (యెషయా.53:12)

పై వైశిష్టాలన్నీకూడా కన్యమరియ యొక్క కుమారుడైన యేసు (యషువ) జీవితములో ప్రస్పుటముగా నేరవేర్చబడటాన్ని క్రొత్తనిబంధన లేఖనాలలో వివరించబడింది. ఈ రకంగా ఇశ్రాయేలీయుడైన ఒక వ్యక్తి జీవితములో పై ప్రత్యేకతలన్నీ నెరవేర్చబడటమన్నది చరిత్రలో కన్యమరియ కుమారుడు యేసు (యషువ) జీవితములో తప్ప మరొకరి జీవితములో నెరవేర్చబడలేదు. ఇది దేవుడే మాట యిచ్చి నెరవేర్చాడన్న సత్యము కేవళము సత్యాన్వేషకులైన విజ్ఙులు గ్రహించగలరు. తద్వారా అలాంటివారు మాత్రమే పరమతండ్రి యొక్క నిత్యసంకల్పములోని యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) యొక్క పాత్రను గుర్తించి స్వీకరించగలరు.

జూడాయిజములోని కొందరు దుర్బోధకులు లేఖనాలను వక్రీకరించే ప్రయత్నములో యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అన్నది కన్యమరియ కుమారుడు యేసు [యషువ] కాదు అంటూ అసందర్భ అభ్యంతరాలను అనేకం లేవనెత్తుతుంటారు. అలాంటివారు చెప్పేది సత్యమయితే మరి పైన చూపిన యెషయా గ్రంథములోని “నా సేవకుడు” అనబడిన ఆ వ్యక్తి ఎవరు? ఆవ్యక్తిలో పైన ప్రవచనాత్మకంగా పేర్కొనబడ్డ విశయాలు నెరవేర్చ బడ్డాయా? ఆ వివరాలను అందిస్తేతప్ప ఆ వ్యక్తి యేసు కాదు అనడానికి వారికి అర్హత లేదు.

4) యెషయా గ్రంథము 42:1-7; 43:10; 49:5-8; 52:13-53:12 వాక్యాలలో ప్రభువైన యెహోవా చేత ‘నాసేవకుడు’ అంటు పేర్కొనబడింది యాకోబు సంతానమైన ఇశ్రాయేలీయుల సమిష్టి జనాంగాని సూచించే ఒక అలంకార రూపమైన వ్యక్తి కాదుగాని, దేవుడే యెన్నుకొన్న ఒక ప్రత్యేకమైన వ్యక్తి అని గ్రహించడానికిగల కారణాలు:

అ) యెషయా.42:1-7 వచనాల ధ్యానము: ఈ వాక్యాలలో ప్రవక్త అయిన యెషయా పేరుగాని, రాజైన దావీదు పేరుగాని, లేక కోశాధికారి ఎల్యాకీము పేరుగాని పేర్కొనబడలేదు. అంతమాత్రమేగాక యాకోబు లేక ఇశ్రాయేలు అన్న జనాంగము పేరుకూడా పేర్కొనబడలేదు. కనుక, ఈ వాక్యాలలో పేర్కొనబడిన వ్యక్తి అప్పటికింకా పేరు వెల్లడి చేయబడని దేవుడైన యెహోవా చేత ఏర్పరచుకోబడిన ఒక ప్రత్యేకమైన వ్యక్తి అన్నది సుస్పష్టము.       

అంతేకాక, దేవుడైన యెహోవా ఈ వ్యక్తిని కాపాడి ప్రజలకు అంటే కేవలం అన్యులకే అనికాదు అందరికీ (ఇశ్రాయేలీయులకు మరియు అన్యులకు) నిబంధనగా నియమించబోటున్నట్లు వాగ్ధానము చేసాడు. ప్రజలతో అంటే మానవులందరితో చేయబడే నిబంధన నోవహునిబంధన తరువాత మెస్సయ్యనందు చేయబడే క్రొత్తనిబంధనే. 

ఆ) యెషయా.43:10 వచన ధ్యానము:

ఇ) యెషయా.49:5-6 వచనాల ధ్యానము:

“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడునగు యెహోవా మనుష్యులచేత నిరాకరింపబడినవాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్ముల సేవకుడునగు వానితో ఈలాగు సెలవిచ్చుచున్నాడు యెహోవా నమ్మకమైనవాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెననియు రాజులు గ్రహించి లేచెదరు అధికారులు నీకు నమస్కారము చేసెదరు.” 

– పై వాక్యాలలోని ‘నా సేవకుడు ‘ అన్నది యాకోబు/ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేషించి వాడబడిన పదజాలము కాదు. అది యెహోవా యెన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని ఉద్దేషించి పేర్కొనబడింది. ఆ వ్యక్తి ఇశ్రాయేలు ప్రజలను తిరిగి ప్రభువైన దేవుని  యొద్దకు తీసుకువచ్చేవాడు, వారిని ఉద్దరించేవాడు. ఆ ప్రత్యేకమైన వ్యక్తే ‘నా సేవకుడు ‘ (మత్తయి 12:18) లేక ‘తన సేవకుడు ‘ (అపొ.కా.3:13) అనబడిన యేసు (యషువ) అన్న సత్యాన్ని దేవుడు తన ఆత్మ ప్రేరణతో క్రొత్తనిబంధన లేఖనాలలో స్పష్టపరచాడు.   

ఈ) యెషయా.52:13-53:12 వచనాల ధ్యానము

– అది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. ‘నా సేవకుడు ‘ అంటూ ఇశ్రాయేలు ప్రజలను సంబోధించిన ప్రతిసారి యాకోబు లేక ఇశ్రాయేలు అన్న నామాన్ని విస్పష్టముగా పేర్కొనడాన్ని యెషయా గ్రంథములో చూడగలము. అయితే ఇక్కడ ‘నా సేవకుడు ‘ అని ప్రకటిస్తున్న సందర్భములో యాకోబు అనిగాని ఇశ్రాయేలు అనిగాని పేర్కొనలేదన్నది గమనించాలి. దీన్ని బట్టి ఇక్కడ వివరించబడుతున్నది ఇశ్రాయేలు జనాంగాన్ని గురించి కాదుగాని ప్రభువైన దేవుడు తానే ఎన్నుకొనిన ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి అన్నది గ్రహించాలి.  

– ఇక్కడ ‘నా సేవకుడు ‘ అన్నది ఇశ్రాయేలు ప్రజలనుద్దేషించి కాదు. కారణం, ఇక్కడ వివరించబడుతున్న ‘నా సేవకుడు ‘  “తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును.” (యెషయా 53:10). అపరాధపరిహారార్థబలి/పాపపరిహారార్థబలి విశయములో లేఖనాలు సెలవిస్తున్న ప్రకారం “ఎవడైనను పాపపరిహారార్థబలిగా అర్పించుటకు గొర్రెను తీసికొని వచ్చినయెడల నిర్దోషమైనదాని తీసికొనివచ్చి” (లేవి.కాం.4:32).

అయితే, మోషే మొదలుకొని మలాకి వరకు గల సమయంలో పరమతండ్రి మాటలలో ఇశ్రాయేలీయులు…

  • లోబడనొల్లని ప్రజలు [ని.కాం.32:9]
  • పాపుల సంతానం [సం.కాం.32:14]
  • దేవునికి విరోధముగా సణిగే సమాజం [సం.కాం.14:27]
  • పాపిష్టి జనము [యెషయా.1:4]
  • సొదొమ మరియు గొమొఱ్ఱా జనులు [యెషయా.1:10]
  • విగ్రహారాధికులు [యిర్మీయ.11:17]
  • హృదయ సున్నతిలేనివారు [యిర్మీయా.9:25]
  • వేశ్య [యెహెజ్కేలు.16:15]
  • అపవిత్రులు [యెహెజ్కేలు.36:16]
  • బహిష్ట స్త్రీ వంటి అపవిత్రత గలవారు [యెహెజ్కేలు.36:16]
  • వ్యభిచారులు [1ది.వృ.5:25; హోషేయ.1:2]
  • అనీతిమంతులు [ఆమోసు.5:7, 6:13]
  • కిరాతకులు [ఆమోసు.7:2]
  • ముష్కరులు మరియు భ్రష్టులు [జెఫన్యా.3:1]
  • దొంగలు మరియు శాపగ్రస్తులు [మలాకి.3:9]

– అత్యంత గమనార్హమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేలు ప్రజలు ‘నీతిమంతులు’ అంటూ బైబిల్ అంతటిలో మచ్చుకు ఒక్కసారి అయినా లేఖనాలు పేర్కొనటంలేదు, గుర్తించటంలేదు! కనుక, ఇశ్రాయేలీయులకు అపరాధపరిహారార్థబలిగా ఉండే అర్హత ఏమాత్రములేదు. ఆమాటకొస్తే, వారికే అంటే వారినే ప్రక్షాళనము చేసేందుకు ఒక  అపరాధపరిహారార్థబలి అవసరమన్నది సుస్పష్టము. ఆ బలి ప్రభువైన దేవుడు ఎన్నుకొనిన ‘ఆయన సేవకుడు,’ ఆ సేవకుడు మెస్సయ్యగా విచ్చేసిన యషువ [యేసు].        

– ఇక్కడ ‘నా సేవకుడు’ అన్నది ఇశ్రాయేలు ప్రజలను గురించి కాదు. “అన్యాయపు తీర్పునొందినవాడై అతడు కొనిపోబడెను అతడు నా జనుల యతిక్రమమునుబట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలోనుండి అతడు కొట్టివేయబడెను అయినను అతని తరమువారిలో ఈ సంగతి ఆలోచించినవారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను ధనవంతునియొద్ద అతడు ఉంచబడెను నిశ్చయముగా అతడు అన్యాయమేమియు చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నకున్న అనుభవజ్ఞానముచేత అనేకులను నిర్దోషులుగా చేయును.”  (యెషయా 53:8-11).  

పై వాక్యాలలోని అతడు యెవరు? నా జనులు ఎవరు? నా జనులు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అయితే ‘అతడు’ ఇశ్రాయేలీయుల కొరకు బలిపశువుగా మారాడు అన్నది అర్థమవుతున్నది. మరి ‘అతడే’ ఇశ్రాయేలు జనాంగము అని కాదు! ఆ ‘అతడు’ ప్రభువైన దేవుని యొక్క ‘నీతిమంతుడైన నా సేవకుడు.’ ఆయనే మెస్సయా. పై వాక్యాలలో పేర్కొనబడ్డట్టుగా ఆ మెస్సయ్య నిర్వర్తించబోయే కార్యాలను నిర్వర్తించినది యేసు (యషువ). దీన్ని బట్టి కూడా యేసు (యషువ) మెస్సయా (మషియాఖ్/క్రీస్తు) అని నిరూపితమవుతున్నది.  

Permalink to single post

బైబిలు వెలుగులో యషువ (యేసు)

దేవుడు ఈలోకములోని కొందరు వ్యక్తులను ఎన్నుకొని వారిద్వారా తన సందేశాన్ని మానవులకు అందిస్తూ వచ్చాడు. దేవునిచేత ఎన్నుకోబడి దేవుని తరపున పంపించబడినవారిలో ప్రధానమైనవాడు మోషే (ని.కాం.3:14-15).

మోషే తరువాత వచ్చిన ప్రవక్తలందరుకూడా (యిర్మీయ.26:5) ఈలోకములోనుండి దేవునిచేత ఎన్నుకోబడి పంపబడ్డవారే. ఈ రకంగా దేవుడు మోషే మొదలుకొని మలాకి వరకు దాదాపు వెయ్యి సంవత్సరాల వ్యవధిలో అనేకమంది ప్రవక్తలను ఎన్నుకొని తన సందేశాలతో తన ప్రజల యొద్దకు పంపిస్తూ వచ్చాడు. అయినా వారిలో ఒక్కరుకూడా పరలోకములోనుండి దిగివచ్చినవారు లేరు. బాప్తీస్మమిచ్చు యోహానుకూడా ఇదే కోవకు చెందినవాడు.

దేవునియొద్దనుండి [παρὰ Θεοῦ/పారా థియూ=from God] పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.” (యోహాను.1:6)

అయితే, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు మానవాళికి కేవలము తన అంతిమ సందేశాన్ని అందించటానికి మాత్రమేగాక వారికి రక్షకునిగా మారి వారి పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని అందించే పరిపూర్ణ బలిగా తననుతాను అర్పించుకునేందుకై అద్వితీయుడైన తన స్వంత కుమారున్ని పరలోకములోనుండి ఈ లోకములోనికి పంపించాడు అన్నది లేఖనాలు ఘంఠాపథంగా చేస్తున్న ప్రకటన.

పరలోకములోనుండి ఈలోకములోకి దైవాంశసంభూతునిగా విచ్చేసిన యేసు క్రీస్తుకు మరియు ఈ లోకములోనుండే ప్రవక్తలుగా ఎన్నుకోబడిన వారికి మధ్య ఉన్న ప్రాథమిక అస్తిత్వ వ్యత్యాసాన్ని గ్రహించలేని ఆత్మీయ అంధత్వముతోకూడిన దుర్బోధకులు ప్రభువైన యేసు క్రీస్తును కేవలము ఒక నరునిగా మరియు ప్రవక్తలలో ఒకనిగా మాత్రమే చిత్రీకరించె ప్రయత్నం చేస్తారు. ఈ వాస్తవాన్ని బట్టి దైవ సంబంధులు లేఖనాల సమిష్టి బోధను పరిశీలించి అబద్ధ బోధకుల వక్రవ్యాఖ్యానాలకు ప్రతికూలంగా యివ్వబడిన లేఖన బోధలోని సత్యాన్ని గ్రహించాలి.

I. యషువ ఈలోకములో శరీరధారిగా ప్రవేశించకముందు ఉనికిని కలిగివున్నవాడు

“యేసు వారితో ఇట్లనెను దేవుడు మీ తండ్రియైనయెడల మీరు నన్ను ప్రేమింతురు; నేను దేవుని యొద్దనుండి బయలుదేరి వచ్చి [Θεοῦ ἐξῆλθον/థియూ ఎక్సెల్తోన్ = came out of God/దేవునిలోనుండి వచ్చాను] యున్నాను, నా అంతట నేనే వచ్చియుండలేదు, ఆయన నన్ను పంపెను.” (యోహాను.8:42)

“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి [ἐξῆλθον/ఎక్సెల్తోన్ = came out of/లోనుండి వచ్చాను] లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)

(i) మట్టిలోనుండి సృష్టించబడిన ఆదాములా గాక పరలోకములోనుండి వచ్చాడు:

“నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని.” (యోహాను.6:38)
దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి ఎవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నాడు.” (యోహాను.6:47)
“అలాగైతే మనుష్యుకుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన యెడల ఏమందురు?” (యోహాను.6:62)
“యేసునేను ఎక్కడనుండి వచ్చితినో యెక్కడికి వెళ్లుదునో నేనెరుగుదును గనుక నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పు కొనినను నా సాక్ష్యము సత్యమే; నేను ఎక్కడనుండి వచ్చుచున్నానో యెక్కడికి వెళ్లుచున్నానో మీరు ఎరుగరు.” (యోహాను.8:14)
“మీరు నన్ను ప్రేమించి, నేను దేవునియొద్దనుండి బయలుదేరి వచ్చితినని నమి్మతిరి గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:27-28)
“మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.” (1కొరింథి.15:47)

(ii) ఈలోకములోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆయనకు తండ్రి ఒక శరీరాన్ని అమర్చాడు:

“దేవుడు తన సొంత కుమారుని పాపశరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:4)
“కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పు చున్నాడు. బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి.” (హెబ్రీ.10:5)

(iii) విశ్వాసుల తండ్రియైన అబ్రహాముకంటే ముందు ఉన్నవాడు [ఉండినవాడు కాదు]:

“యేసు అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని [I am, not I was] మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.” (యోహాను.8:58)

(iv) తండ్రియైన దేవుని యొద్ద వసించాడు:

“మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండు మనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడును లేడు.” (యోహాను.3:13)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“జీవవాక్యమునుగూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము.” (1యోహాను.1:1-2)

(v) తండ్రియైన దేవునితో సృష్టికార్యములో పాల్గొన్నాడు:

ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండ కలుగలేదు.” (యోహాను.1:2-3)
“ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.” (1కొరింథీ.8:6)
“ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను. ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్న వాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.” (కొలొస్సీ.1:16-17)
“ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.” (హెబ్రీ.1:2)
తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములుకూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు.” (హెబ్రీ.8-12)

(vi) ఉనికికి ప్రారంభము లేనివాడు:

“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
“అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడును వంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆది యైనను జీవనమునకు అంతమైనను లేనివాడునైయుండి దేవుని కుమారుని పోలియున్నాడు.” (హెబ్రీ.7:3)

(vii) దేవుని వాక్కుగా [Λόγος/లోగొస్] దేవునితో వున్నాడు:

“ఇవి జరిగినతరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా, భయపడకుము; నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను.” (ఆది.కాం.15:1)
“అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా” (2సమూయేలు.7:4)
“అంతలో యెహోవా వాక్కు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1రాజులు.6:11)
“ఆ రాత్రియందు దేవునివాక్కు నాతానునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (1ది.వృ.17:3)
యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యెషయా.38:4)
“మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.” (యిర్మీయా.2:1)
“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను…ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి” (యోహాను.1:1-2,14)
“రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.” (ప్రకటన.19:13)

(viii) దేవుని రూపము [μορφή/మోర్ఫే=form] నందుండి దైవత్వములోని అంతర్గత వాస్తవముగా [Internal Reality] ఉన్న వ్యక్తి:

ఆయన దేవుని స్వరూపము [μορφή/మోర్ఫే=form/రూపము] కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని” (ఫిలిప్పీ.2:6)

II. లోకములోనికి యషువ ప్రవేశము

బైబిలులో ‘లోకము’ [గ్రీకు మూల పదం: κόσμος/కాస్మోస్] అన్న పదము మూడు వివిధ అర్థాలను వ్యక్తపరుస్తూ ఉపయోగించబడింది. కొన్ని సందర్భాలలో ‘లోకము’ అన్న పదం విశ్వమంతటిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.13:35; యోహాను.13:1; 17:5,24), మరికొన్ని సందర్భాలలో భూమిపై వసిస్తున్న నరులందరిని సూచిస్తూ ఉపయోగించబడింది (మత్తయి.4:8; యోహాను.1:29; 3:16; 4:42; 17:6), ఇంకొన్ని సందర్భాలలో కేవలము భూలోకములోని అవిశ్వాసులను మాత్రమే సూచించటానికి వుపయోగించబడింది (యోహాను.1:10; 3:17; 7:7: 14:17; 17:14,18). ఈ పదము ఉపయోగించబడిన లేఖన సందర్భమే ఆ పదం ఏ భావముతో అక్కడ ఉపయోగించబడిందో గ్రహించటానికి ప్రధాన ఆధారము.

ఈలోకములోకి శరీరధారిగ విచ్చేయకముందు ఆయనకున్న స్థాయి మరియు అస్తిత్వము

(i) దేవుడైన తండ్రికి కుమారుడు: కన్యమరియకు జన్మించక పూర్వమే ఆయన దేవునికి కుమారుడు (కీర్తనలు 2:7,12; సామెతలు 30:4). మరోవిధంగా చెప్పుకోవాలంటే ఆయన దేవునిలోనుండి ఉద్భవించినవాడు! ఆ కారణాన్నిబట్టే ఆయన ఈ లోకములోనికి రాకముందే ఆయనను దేవుని కుమారుడంటూ లేఖనాలు పేర్కొంటున్నాయి:

“లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపలేదు.” (యోహాను.3:17)
తండ్రి ప్రతిష్ఠచేసి యీ లోకములోనికి [విశ్వములోనికి] పంపినవానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా?” (యోహాను.10:36)
“నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు [విశ్వములోనికి] వచ్చియున్నాను; మరియు లోకమును [విశ్వమును] విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను.” (యోహాను.16:28)
“అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను; ఆయన స్త్రీయందు పుట్టి,” (గలతీ.4:4)
“దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించునట్లు, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి [భూమిపై వసిస్తున్న నరుల మధ్యకు] పంపెను; దీనివలన దేవుడు మనయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.” (1యోహాను.4:8-10)

(ii) దైవత్వములోని వ్యక్తి: దైవత్వపు లక్షణాలను కలిగిన వ్యక్తిగా ఆయనను లేఖనాలు పరిచయం చేస్తున్నాయి (మీకా 5:2; యోహాను 1:1,14, 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-6; కొలొస్సీ.1:15,17; తీతుకు.1:13; హెబ్రీ.1:3,8)

(iii) నిత్యత్వములో తండ్రిచేత ప్రేమించబడ్డాడు: సృష్టికిముందే తండ్రియైన దేవునితో వసించాడు మరియు తండ్రిచేత ప్రేమించబడ్డాడు (యోహాను 17:5,24)

III. ఈలోకములోనికి యషువ విచ్చేసిన విధానము

– తన దైవత్వపు అధికారాలను/హాక్కులను ఉపయోగించకుండా రిక్తునిగా చేసుకోవటముద్వారా దైవత్వాన్ని మరుగుపరచుకొన్నాడు (ఫిలిప్పీ.2:7; హెబ్రీ.2:9,17-18)
– శరీరధారిగా అంటే పాపశరీరాకారముతో (పాపశరీరముతో కాదు సుమా!) వచ్చాడు (యోహాను 1:14; రోమా.8:4; హెబ్రీ.10:5). కనుకనే ఒక మనిషిగా జన్మించిన ఆయనకు తల్లిదండ్రులు, తోబుట్టువులు, అలాగే దేవుడు కూడా వున్నారు. అంతేగాక, ఈలోకములో మానవులకివ్వబడిన పరిమితులలో జీవించాడు.
– దాసునిస్వరూపములో వచ్చాడు (ఫిలిప్పీ.2:7-8)

IV. దేవుడు ఈ లోకస్తుల యెదుట యషువకు నిర్దేశించిన స్థానము/పాత్ర

– ‘రక్షకుడు’ మరియు ‘ప్రభువు’ (కీర్తనలు 110:1; మత్తయి.1:21; లూకా.1:43, 20:41-44; అపో.కార్య.2:36)
– దైవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా వసించిన దేవుని ‘మర్మము’ (కొలొస్సీ.2:2,9)
– దేవునికి మరియు నరులకు ‘మధ్యవర్తి’ (1తిమోతి.2:5-6). కేవలం ఒక నరుడు మాత్రమే దేవునికి మరియు నరులకు నడుమ మధ్యవర్తి కాలేడు. అలాగే, కేవలం దేవుడు మాత్రమే నరులకు మరియు దేవునికి మధ్య మధ్యవర్తిగా వుండలేడు. దైవత్వములో దేవునిగావుంటూ అదేసమయములో నరులమధ్య నరునిగా వున్న దైవాంశసంభూతుడే దేవునికి మరియు నరులకు మధ్య నిజమైన మధ్యవర్తిగా వుండగలడు.

V. ఈ సృష్టి అంతటిలో యషువకున్న గొప్పతనం

– ఆదాముకంటే గొప్పవాడు (1కొరింథీ.15:22,45)
– సొలొమోనుకంటే గొప్పవాడు (మత్తయి 12:42; లూకా 11:31)
– యోనాకంటే గొప్పవాడు (మత్తయి 12:41; లూకా 11:32)
– దావీదుకంటే గొప్పవాడు (కీర్త.110:1; మత్తయి 22:44; ప్రకటన 22:16)
– మోషేకంటే గొప్పవాడు (హెబ్రీ. 3:1-6)
– యాకోబు/ఇశ్రాయేలుకంటే గొప్పవాడు (యోహాను.4:12-14)
– అబ్రహాముకంటే గొప్పవాడు (యోహాను 8:54-58)
– మెల్కీసెదెకుకంటే గొప్పవాడు (హెబ్రీ.7:1-25)
– దేవదూతలకంటే గొప్పవాడు (మత్తయి 13:41-42; హెబ్రీ 1:4,6)
– విశ్రాంతిదినముకంటే గొప్పవాడు (మత్తయి 12:8; యోహాను.5:17-18)
– అందరికంటే గొప్పవాడు (ఎఫెసీ 1:20-21; ఫిలిప్పీ 2:9-11)
– దేవుని మందిరముకంటే గొప్పవాడు (మత్తయి.12:6; యోహాను.2:19-21)

VI. యషువ తనకు మరియు తండ్రికి మధ్య వున్న అవినాభావసంబంధాన్ని గురించి తెలియజేసిన సత్యాలు

– “తండ్రియందు నేనును నాయందు తండ్రియు యున్నాము” (యోహాను 10:38; 14:10-11).
– “నేనును తండ్రియును ఏకమై యున్నాము.” (యోహాను 10:30)
– “నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహి మపరచబడి యున్నాను.” (యోహాను 16:15; 17:10)
– “తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెను” (యోహాను 5:23).
– “నన్ను చూసినవాడు తండ్రిని చూచియున్నాడు” (యోహాను 12:45; 14:9).
– “నాయందు విశ్వాసముంచు వాడు…నన్ను పంపిన వానియందు విశ్వాసముంచుచున్నాడు. (యోహాను 12:44)
– “కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడుకాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించు వాడు.” (1యోహాను 2:23)
– “నన్ను ద్వేశించువాడు నా తండ్రినికూడా ద్వేశించుచున్నాడు.” (యోహాను. 7:7; 15:23)
– “తండ్రిగాక యెవడును కుమారుని ఎరుగడు; కుమారుడుగాకను, కుమారుడెవనికి ఆయనను బయలుపరచ నుద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు.” (మత్తయి 11:27)
– “నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము.” (యోహాను 17:2)

VII. యషువ యెడల నిజవిశ్వాసులకుండాల్సిన దృక్పథము/వైఖరి విశయములో తండ్రి చిత్తము

– దేవుని స్వరూపియైన ఆయన మహిమను చూడాలి (2కొరింథీ.4:4; కొలొస్సీ.1:15)
– ఆయన దేవుని అద్వితీయ కుమారుడని విశ్వాసముంచాలి (యోహాను 3:36, 12:44; 1యోహాను 5:10)
– తండ్రిని ఘనపరచునట్లుగా/అదేవిధంగా [καθὼς/కాతోస్=just as/same as/even as; అదేవిధంగా/ఆరకంగానే] ఆయనను ఘనపరచవలెను (మత్తయి.2:9-11, 28:9,17; యోహాను 5:23, 20:28; హెబ్రీ.1:6; ప్రకటన 5:8-14)
– ఆయనను దేవుని అద్వితీయ కుమారునిగా గుర్తించి దేవుని అద్వితీయ కుమారునికి ఏస్థానమిచ్చి ఏవిధంగా గౌరవించాలోనన్నది అపోస్తలుల వ్రాతలలో మరియు వారి మాదిరిలో చూపించబడిందో ఆవిధమైన స్థానాన్ని గౌరవాన్ని ఆయనకు యివ్వనివ్యక్తి తండ్రినే అగౌరవపరచి త్రుణీకరించినవాడుగా లెక్కించబడుతాడు (యోహాను 5:23). అలాంటివాడే క్రీస్తువిరోధి (1యోహాను 2:22-23)

యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) కు నిజవిశ్వాసులు ఇవ్వాల్సిన స్థానము గురించి అపోస్తలుల బోధ మరియు మాదిరి

– అపోస్తలుల బోధ ప్రకారం ఆయన దేవున్ని తన తండ్రిగా ప్రకటించుకొని దేవునితో సమానునిగా చేసుకొన్నాడు (యోహాను 5:18, 10:30-38)
– అపోస్తలులు ఆయనను దేవునిగా గుర్తించారు (యోహాను 1:1, 20:28; 2కొరింథీ.4:4; ఫిలిప్పీ.2:6; రోమా.9:5; కొలొస్సీ.1:15; తీతుకు 1:13; హెబ్రీ.1:8). తండ్రి మరియు కుమారుడు ఇరువురిని ఒకే దేవుడు అని దైవాత్మచేత నడిపించబడిన అపోస్తలులు గుర్తించడానికి నిజదేవుని ప్రవృత్తే కారణం!
– అపోస్తలుల బోధ ప్రకారము అంటే క్రొత్తనిబంధన బోధప్రకారము ప్రొస్కినియో (προσκυνέω=bowing down/worship/show reverance;మ్రొక్కుట/ఆరాధన/పూజ్యభావముతోకూడిన నమస్కారము) అన్నది కేవలము దేవునికే చెందాలి (మత్తయి 4:10). మనుషులకు ఆపాదించకూడదు (అపో.కా.10:26). దేవదూతలకుకూడా ఆపాదించకూడదు (ప్రకటన 19:10, 22:9). అయినా, ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రొస్కినియో (προσκυνέω) ను దేవునిచే దర్శించబడి నడిపించబడిన తూర్పుదేశ జ్ఙానులు ఆపాదించారు (మత్తయి 2:9-11), సాధారణ యూదులు ఆపాదించారు (యోహాను 9:38), అపోస్తలులుకూడా ఆపాదించారు (మత్తయి 28:9,17), మరియు  దేవదూతలు సహితం ఆపాదించారు (హెబ్రీ.1:6). మనుషులు తనకు ప్రొస్కినియో (προσκυνέω) ఆపాదిస్తున్నప్పుడు పేతురు తిరస్కరించాడు, దేవదూత నివారించాడు, కాని ప్రభువైన యేసుక్రీస్తు మాత్రము దాన్ని అంగీకరించి స్వీకరించాడు. కారణం, ఆయన ప్రొస్కినియోకు (προσκυνέω) అర్హుడు! అందుకే యుగాంతమందుకూడా సృష్టియావత్తూ తండ్రికి మరియు కుమారునికి సమిష్టిగా ప్రొస్కినియో (προσκυνέω) అర్పించబోతున్నారన్నది లేఖనము ప్రవచనాత్మకంగా మనకు ప్రకటిస్తున్నది (ప్రకటన 5:8-16).

“దేవుని స్వరూపియైయున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము, ఈ యుగసంబంధమైన దేవత అవిశ్వాసులైనవారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. అంధకారములోనుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను.” (2కొరింథీ.4:4-5)

Permalink to single post

అంత్యకాల జూడాయిజం

ప్రపంచంలోని ప్రాచీన మతాలలో జుడాయిజం (Judaism) లేక యూదుమతం ఒకటి. ఇది మధ్యప్రాచ్యంలో (Middle-East) ఆవిర్భవించినా ప్రపంచములోని అనేక దేశాలలో అనుసరించబడుతున్నది. ఈ మతం ప్రధానంగా యూదులమధ్య యూదులకొరకు యూదు మతపెద్దలైన రబ్బీలచేత ప్రారంభించబడినా ఈమధ్యే విస్తృతమైన మతప్రచారాన్ని మతమార్పిడులనుకూడా చేపట్టింది.

గత రెండువేల సంవత్సరాలుగా ప్రపంచములో ఉనికిని కొనసాగిస్తున్న యూదుమతం నిజానికి ఒకప్పటి బైబిలువిశ్వాసం లేక తనాక్ ధార్మిక మార్గం యొక్క కొనసాగింపు కాదుగాని దాని తదనంతరము ఆవిర్భవించి విస్తరిస్తున్న తాల్ముద్ ఆధారిత మతం లేక రబ్బీలమతం అన్నది గమనములో వుంచుకోవాలి. ఈనాటి యూదుమతం (జూడాయిజం) బైబిలు ప్రబోధాలకు మరియు వాటిపై ఆధారపడిన విశ్వాసానికి సుదూరమైనది. నిజానికి దీన్ని ‘అంత్యకాల జూడాయిజం’ అని అభివర్ణించవచ్చు.

‘జూడాయిజం’ (Judaism) మరియు ‘యూదుమతం’ అన్న పదప్రయోగాలు గాని లేక అవి ప్రాతినిథ్యం వహిస్తున్న మతవిధానము గాని క్రీస్తుకు పుర్వమున్న దైవప్రవక్తలెవరు ఎరుగనివి. అయితే, జూడాయిజం [యూదుమతం] అంటే యూదుల మతం అన్నది ఈనాటి సర్వసాధారణ భావం. కాని, పాతనిబంధన గ్రంథం (తనాక్) అంతటిలో ఒక్కసారికూడా ఈ పదం ఉపయోగించబడలేదు. వాస్తవానికి ఈ పదం రబ్బీల సృష్టి!

‘యూదుడు’ అన్నపదం ‘యూదా’ అనే హెబ్రీ నామములోనుండి పుట్టిన పదమైనప్పటికిని ఇది అబ్రహాము ఎరుగని పదం, మోషే ఎరుగని పదం, చివరకు దావీదుగాని లేక అతని సంతానములోనుండి వచ్చిన ఏలికలలోనివారుగాని ఇశ్రాయేలీయుల గోత్రాలన్నీ దాసత్వములోకి వెళ్ళకముందు వరకు ఎరుగని పదం.

ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకముగా పదేపదే పాపము చేయడముద్వారా తమతో దేవుడు చేసిన నిబంధనను భంగంచేసి తత్ఫలితంగా దేవుని ఉగ్రతను కొనితెచ్చుకున్నారు. దాని పర్యవసానమే దేవుడు 722 క్రీ.పూ. లో పది గోత్రాలతోకూడిన ఉత్తరరాజ్యం ఇశ్రాయేలును అన్యులైన అష్షూరుదేశస్తులకు అలాగే 586 క్రీ.పూ. లో రెండు గోత్రాలతోకూడిన దక్షిణరాజ్యం యూదాను బబులోనుదేశస్తులకు బానిసలుగా అప్పగించాడు. ఆరకమైన దుస్థితిలో వారు కొనసాగుతున్న సమయములో కేవలము రెండు గోత్రాల ప్రజలను అంటే యూదా గోత్రము మరియు బెన్యామీను గోత్రము వారిని సూచిస్తూ పలికేందుకు పుట్టింది ‘యూదులు’ (יְהוּדִים/యెహుదిం) అన్న పదం. ఈనాటి కొందరు యూదు పండితుల అభిప్రాయప్రకారం ఆఫ్రికాలోని నల్లజాతీయులను వివక్షతతో ‘నీగ్రోలు’ అంటూ పేర్కొన్నట్లు అన్యజాతీయులు ఇశ్రాయేలీయుల రెండుగోత్రాలవారిని తిరస్కారభావంతో ‘యూదులు’ అంటూ పిలవడం ప్రారంభించారు. చరిత్రాధారాలను బట్టి చూస్తే ప్రారంభములో బబులోనుదేశస్తులు యూదా రాజ్యములోనుండి వచ్చిన వారందరిని యుదులు అంటూ పిలిచారు. అప్పట్లో ఇది మతాన్నికాక జాతీయతను ఎత్తిచూపే పదంగా ఉపయోగించబడింది.

ఈ నేపద్యంలో ఇశ్రాయేలీయులు చెరలో వున్న సమయములో ప్రవక్తలు వ్రాసిన గ్రంథాలలో ‘యూదుడు’ మరియు ‘యూదులు’ అన్న పదాలు చూడగలము. కాలక్రమేణా ఈ పదాలు ఇశ్రాయేలు గోత్రాలన్నింటిలోనివారికి ఆపాదించడం మొదలైంది. ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలు పాతనిబంధన (తనాక్) బోధలతో మరియు యెరూషలేములోని దేవుని ఆలయముతో ముడిపడివుండటాన్ని ఈసందర్భంగా జ్ఙాపకం చేసుకోవాలి. ఈ కారణాన్నిబట్టి 70 క్రీ.శ. లో రోమీయులు యెరూషలేములో రెండవసారి కట్టబడిన దేవుని మందిరాన్ని ద్వంసముచేయడముతో ఇశ్రాయేలీయుల మతవిశ్వాసాలకు ఉపద్రవం యేర్పడింది. ఈ పరిస్థితి తమ మతగ్రంథాలను సంస్కరిస్తూ క్రొత్త గ్రంథాలను వ్రాసుకునేందుకు యూదుల మతపెద్దలకు అంటే ‘రబ్బీలకు’ తోడ్పడింది.

అప్పటినుండి యూదుజాతీయులు మరియు యూదుమతప్రవిష్టులు (యూదుమతాన్ని స్వీకరించినవారు) బైబిలు గ్రంథబోధలను ప్రక్కకుబెట్టి పాతనిబంధన లేఖనాలకు రబ్బీలు చెప్పే పొంతనలేని వ్యాఖ్యానాలను, వారు చేసే బోధలను, అలాగే వారు ప్రవేశపెట్టిన పితృపారంపార్యాచారాలను పాటించడం మొదలుబెట్టారు.

ప్రఖ్యాత ననాతన యూదు రచయిత మరియు రబ్బీ (యూదు బోధకుడు) ఖెయిం షిమ్మెల్ తాను వ్రాసిన “మౌఖిక తోరా” అన్న గ్రంథములో యదార్థంగా ఒప్పుకుంటూ వ్రాసిన మాటలు:

తోరాలో వ్రాయబడిన అసలు మాటల ప్రకారం యూదులు ఎప్పుడూ జీవించలేదు, అయితే వారు జీవించింది రబ్బీలు ప్రవేశపెట్టిన సంప్రదాయాల ప్రకారం! (రబ్బీ ఖెయిం షిమ్మెల్)

ఈ మతస్తులు తమ మతప్రచారములో ఇతర మతస్తులను ఆకట్టుకునేందుకు హెబ్రీ బైబిలును విరివిగా పేర్కొంటుంటారు. అయినా, వీరి మత విశ్వాసాలు ఆచారవ్యవహారాలు ప్రధానంగా రబ్బీలు చేసిన బోధలపై వారు ప్రవేశపెట్టిన ఆచారాలపై ఆధారపడి వుంటాయి.

యెరూషలేములోని హీబ్రూ విశ్వవిధ్యాలయములో ఆచార్యునిగా పనిచేసిన కిప్పాను ధరించి జుడాయిజములో కొనసాగుతున్న అవిగ్దోర్ షినాన్ ప్రస్తుతమున్న జూడాయిజంలోని వారు పాటించే ఆచారాల మూలాలను వివరిస్తూ చెప్పిన సత్యం,

“మా ధార్మికవిధ్య పాతనిబంధనాగ్రంథంపై (తనాక్ పై) ఆధారపడింది కాదు. ఈనాడు మేము అనుకరిస్తున్న ఆచారాలు పాతనిబంధనాగ్రంథపు ఆచారాలు కావు, అవి మా పూర్వికులలోని విజ్ఙులు (sages) ప్రారంభించిన ఆచారాలు.
      
“సబ్బాతు (విశ్రాంతిదిన) ఆచారాలు, కష్రుత్  నియమాలు మొదలైనవి లేఖనాలలో పాతనిబంధన గ్రంథములో లేనివి. పాతనిబంధనాగ్రంథములో సినగోగు లేదు, కద్దీష్ లేదు, కోల్ నిద్రె లేదు, బార్ మిట్స్ వ లేదు, తల్లీల్ లేదు. ఈనాడు యూదుత్వానికి చెందినదంటూ నిర్వచించబడే వాటిలో మొదలును పరిశోధించి చూస్తే అవి పాతనిబంధనాగ్రంథములోనివి కావుగాని మాపూర్వికులలోని విజ్ఙులు (sages) అందించిన సాహిత్య గ్రంథములలోనివి. అక్కడే ప్రతీది మొదలయ్యింది. యూదుమతం పాతనిబంధ గ్రంథములో ఎక్కడుంది? మోషే యూదుడని పిలువబడలేదు. అబ్రహాముకూడా అలా పిలువబడలేదు. కేవళం మొర్దెకై “యూదుడైన మొర్దెకై” గా పిలువబడ్డాడు, అదీ పాతనిబంధన గ్రంథములోని చివరి భాగములో పారసీకుల కాలములో జరిగిన సంఘటన.” (ఆచార్య అ. షినాన్) 

వీరు ఒకవైపు పాతనిబంధనాగ్రంథము యొక్క సహజ కొనసాగింపుగా యివ్వబడిన క్రొత్తనిబంధనాగ్రంథాన్ని తప్పుబడుతూ, తిరస్కరిస్తూ, ఇంకా దానిపై ఎన్నో అసత్యారోపణలు చేస్తూ మరొకవైపు పాతనిబంధనాగ్రంథానికి వేరైన వ్యతిరేకమైన బోధలు కలిగిన రబ్బీల గ్రంథాలలోని అంటే మిష్నా మరియు గమరాలతోకూడిన యెరూషలేము తాల్ముదు, బబులోను తాల్ముదు, జోహర్ మొదలైన బబులోనులోని అన్యుల ప్రభావముతో వ్రాయబడిన గ్రంథాలలోని ప్రబోధాలను మరియు ఆచారాలను అనుసరించే ప్రయత్నం చేస్తుంటారు.

ఈనాటి జూడాయిజం వారు అనుకరిస్తున్న అనేక ఆచారాలు సాంప్రదాయాలు ఒకప్పుడు యూదులు చెరలో జీవిస్తున్నప్పుడు వారిని చెరగా తీసుకుపోయిన అన్యజనుల ఆచారాలలోనుండి అరువుతీసుకున్నవే:

తలిస్మానులు, హంసాలు (హస్తరూప తాయత్తులు), లాగ్ బౌమ (ఒమెర్ 33వ దినాన జరుపుకునే యూదుమత పండుగ), కిప్పా (యూదులు ధరించే పుర్రె టోపి) ధరించటం, మరణించిన ఆత్మలతో షంభాషించే సమావేశాలు, టెఫిలీనులను కట్టుకోవడము, ద్వారబంధాలకు మెజుజాలను వ్రేలాడదీయడము, ప్రసిద్దిగాంచిన రబ్బీల సమాధులపై సాష్టాంగపడటము, మాంసాన్ని మరియు పాలవ్యుత్పత్తులను వేరుచేసే కష్రుత్ నియమాలను పాటించటం, మంత్రజాలాలు, కౌమార ప్రాయపు ప్రారంభ వేడుకలు (బార్ మిట్జ్వ) జరుపుకోవటం, పేరెన్నికగల రబ్బీల చిత్రపటాలను గోడలకు వ్రేలాడదీయడం, మంత్రోచ్చరణలు, మరియు వివాహ వేడుకలలో ద్రాక్షారసాన్ని త్రాగుటకు ఉపయోగించే గాజు పాత్రను పగలగొట్టడం మొదలైనవి.

ఓసారి ఓ జ్ఙాని యిలా అన్నాడు, “రబ్బీలు పెంపొందించిన జూడాయిజాన్ని ఈరోజు మోషే గనుక దర్శిస్తే ఆ మహానుభావుడే దాన్ని ఏకోశనా గుర్తించలేడు!”

ఇది చాలదన్నట్లు వారిలో కొందరు ముఖ్యంగా అన్యజాతులలోనుండి జూడాయిజమును స్వీకరించినవారు క్రొత్తనిబంధన గ్రంథాన్ని అలాగే పరమతండ్రి అభిషేకించి పంపిన మెస్సయ్యను తూలనాడుతు దుర్భాషలతో దుమ్మెత్తిపోస్తుంటారు. వారి ప్రయత్నం మధ్యాహ్నపు సూర్యునిపై దుమ్మెత్తిపోసే మూర్ఖుల ప్రయత్నాలను తలదన్నేస్థాయిలో వుంటుంది.

ఇతరుల విశ్వాసాలను ప్రశ్నించటం, పరిశోధించటం, లేక తిరస్కరించటం అన్నవి సభ్యసమాజములో ప్రతివ్యక్తికీ వున్న సాధారణ హక్కులు. కాని, పనిగట్టుకొని ఇతరులను వ్యక్తి దూషణకు గురిచేయటము లేక ఇతరుల విశ్వాసాలను దూషించటము తూలనాడటము అన్నవి సంస్కారవంతులు చేసే పనికాదు. అవి సంస్కారహీనులకు చెందినవి.

మానవాళి రక్షణకై/విమోచనకై పరమతండ్రి చూపిన అపార ప్రేమ యొక్క ప్రత్యక్షతగా తననుతాను పాపపరిహారార్థబలిగా సమర్పించుకున్న మెస్సయ్య అయిన యషువ (యేసు) పై తాము ఎత్తిపోసే దుర్భాషల దుమ్ము తమ కళ్ళలలో, నోటిలో, మరియు బ్రతుకుళ్ళోనే పడుతుందన్న చేదు నిజాన్ని గ్రహించలేని అజ్ఙానాంధులు ఈబాపతు జూడాయిజం వారు!

తమ మతవిశ్వాసాల ప్రచారానికై క్రొత్తనిబంధనను శంకించేందుకు అనువుగా అనేక తర్కరాహిత్యమైన, ద్వంద్వనీతీప్రాయమైన, సాహిత్యపరిజ్ఙానలోపముతోకూడిన ప్రశ్నలు సంశయాలను లేవనెత్తుతు అమాయక క్రైస్తవులను విశ్వాసభ్రష్టులను చేస్తున్నారు. ఇలాంటివారినిగూర్చే క్రొత్తనిబంధనా లేఖనాలు రెండువేల సంవత్సరాలక్రితమే ప్రవచనాత్మకంగా క్రింది మాటలలో హెచ్చరించాయి:

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. (1తిమోతీ.4:1-2)

తమ మోసపూరిత కుతంత్రాలను ప్రయోగించే ప్రయత్నములో వీరు సోషల్ మీడియాను మరిముఖ్యంగా వాట్సాప్ గ్రూపులను విరివిగా ఉపయోగిస్తుంటారు. తమ విశ్వాసాలతో ఏకీభవించనివారిని వ్యక్తిగత దూషణ చేయటం, ఇతరుల విశ్వాసాలను తూలనాడటం, క్రొత్తనిబంధన లేఖనాలను ఎగతాళిచేయటం, ప్రభువైన యేసు క్రీస్తును దూషించటం వీరి ప్రత్యేక లక్షణాలు. వారి భాషా మరియు పదజాలము పతనావస్తలోవున్న వారి వ్యక్తిగత స్వభావలక్షణాలనేగాక వారిపై ప్రభావాన్ని చూపుతున్న వారి మత స్వభావాన్నికూడా అవగతం చేసుకోవడానికి ఉపకరిస్తాయి.

ఈరకమైన ప్రయత్నాలు ప్రముఖంగా నామకార్థ క్రైస్తవులమధ్య చేయటం ఈ మతవిశ్వాసుల ప్రధాన వ్యూహంగా గమనించగలం.

ఈనాటి క్రైస్తవ్యములో అధిక శాతం నామకార్థ క్రైస్తవులు లేక మతక్రైస్తవులేనన్నది సుస్పష్టం. పొట్టు విస్తారం, గింజలు స్వల్పం! అన్యమతాలనుండి మరియు దుర్బోధకులనుండి క్రైస్తవ సత్యం పై జరుగుతున్న దాడికి అనేకులు కదిలిపోయి నిజక్రైస్తవ్యాన్ని వదిలి నాశనమార్గాలలోకి అడుగిడుతున్నారు. ఇది అనిర్వార్యం. గాలివీస్తేనే పొట్టు గింజలు వేరయ్యేది. గాలికి పొట్టులాంటి క్రైస్తవులు చెదరగొట్టబడ్డప్పుడే స్థిరంగా నిలిచే గింజలలాంటి నిజక్రైస్తవులు గుర్తించబడేది.

ఆయన (మెస్సయ్య) చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.” (లూకా.3:17)

Permalink to single post

ధర్మశాస్త్రపు నీతి Vs. దేవుని నీతి

మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)…

  • మేలైనది
  • నీతిగలది
  • శ్రేష్టమైనది
  • సత్యమైనది
  • నమ్మదగినది
  • పరిశుద్ధమైనది
  • అర్థంకానిది కాదు
  • దూరమైనది కాదు
  • ప్రయోజనకరమైనది
  • దేవుడు నియమించినది
  • పూర్వ/పాత నిబంధనలోనిది
    (ద్వి.కాం.30:11; నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11; 1తిమోతి.1:8-11; 2తిమోతి.3:16-17)

మోషేధర్మశాస్త్రముద్వారా నీతిమంతులుగా తీర్చబడవచ్చు. అందుకు శరతులు ఈ క్రింద యివ్వబడినవి

అ) ధర్మశాస్రములోని ఆజ్ఙలన్నింటిని పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1; రోమా.2:13; యాకోబు 2:10)
ఆ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను అన్నివేళలా పాటించాలి (ద్వి.కాం.5:29, 6:2) 
ఇ) ధర్మశాస్త్రములోని ఆజ్ఙలను తప్పిపోకుండా పాటించాలి (ద్వి.కాం.27:26; యిర్మీయా.11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)
ఈ) అప్పుడు, ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా తీర్చబడగలరు (ద్వి.కాం.6:25) 
ఉ) ధర్మశాస్త్రాన్ని పాటించడములో తప్పిపోతే (కొంత తప్పినా) శాపగ్రస్తులవుతారు    (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4; గలతీ.3:10; యాకోబు 2:10-11)

పై వాస్తవాలను బట్టి పాతనిబంధనగా గుర్తించబడిన తనాక్ గ్రంథమంతటిలో కేవలము మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణముగా అనుసరించడముద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడిన వ్యక్తి ఒక్కరుకూడా లేరు అన్నది గమనార్హమైన విశయం.

పరమతండ్రి మోషేధర్మశాస్త్రములో పాపాము చేసినవారికి శాపవిమోచననొసిగే పాపక్షమాపణ మార్గాలను విశదీకరించాడు

i. సమాజ పాపాలకు బల్యర్పణలను (రక్తబలులు) నిర్ధేశించాడు.
(లేవీ.కాం.; సం.కాం.15:22-26)       
ii. వ్యక్తిగత పాపాలకు:
– తెలిసి చేసిన కొన్ని పాపాలకు బల్యర్పణలు (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:6-8, 15:)
– యాదృచ్ఛిక పాపాలకు బల్యర్పణలు లేక గొధుమ పిండితో కూడిన నైవేద్యము/హోమద్రవ్యము (లేవీ.కాం.4:1-31, 5:1-13; సం.కాం.15:27-29)
– దైవదూషణతోకూడిన ధిక్కారంతో చేసిన పాపాలకు మరణశిక్ష (సం.కాం.15:30-31)
iii. మోషేధర్మశాస్త్రములోని పదిఆజ్ఙలను మీరిన వారికి శిక్షలు:
పదిఆజ్ఙలలోని ఆరు అజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష. (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10) 

గమనిక: కేవలము యాదృచ్ఛిక పాపాల విశయములో మాత్రమే ఒకవేళ రక్తబలులర్పించే పరిస్థితి లేక స్థోమత లేని సందర్భాలలో గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశమివ్వబడింది. ఈ వెసలుబాటు అంటే గోధుమపిండి యర్పణద్వారా పాపక్షమాపణ పొందే అవకాశం అన్నది తెలిసి చేసిన పాపాల విశయములో ఇవ్వబడలేదు.   

మోషేధర్మశాస్త్రము చేయలేనివి

– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులకు నీతిమీంతులయ్యే మార్గం చూపలేదు
– తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
– మరణకరమైన పాపాలకు క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి యివ్వలేదు
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అందించలేదు
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని యివ్వలేదు
– ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16)

సృష్టికర్త మోషేధర్మశాస్త్రనికి వేరుగా అది చేయలేని వాటిని చేశాడు

– దేవుని ఆజ్ఙలను మీరి పాపము చేసిన వ్యక్తులను నీతిమంతులుగా చేశాడు [అబ్రహాము (ఆది.కాం.12:11-13; 15:6; 20:1-2, 5; రోమా.4:3; గలతీ.3:6)]
– తెలిసీతెలియక చేసిన అన్ని పాపాలకు (పరిశుద్ధాత్మ దూశణకు తప్ప) క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం అనుగ్రహించాడు (అపో.కా.13:39; కొలొస్సీ.2:13; 1యోహాను.1:9)
– మరణకరమైన పాపము చేసిన వ్యక్తులకు క్షమాపణను అందించాడు [దావీదు (2సమూయేలు.12:1-13)]
– అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి ఇచ్చాడు (ఎఫెసీ.2:11-22; 1పేతురు.2:9-10)
– అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అనుగ్రహించాడు (2పేతురు.1:1)
– అన్యులకు యూదులలాంటి స్థానాన్ని ఇచ్చాడు (గలతీ.3:28-29)
– పాపులైన అనేకమందిని యూదులు మరియు యూదేతరులు అన్న భేదం లేకుండా నీతిమంతులుగా మార్చాడు (రోమా.3:23-30)

 లేఖనాల ప్రకారం పరమతండ్రి… 

  • నోవహునిబంధనను మానవులందరితో చేసాడు (ఆది.కాం.9:9-10) 
  • అబ్రహామునిబంధనను అబ్రహాము సంతతితో చేసాడు [మానవులందరితో కాదు] (ఆది.కాం.17:7-8) 
  • దావీదునిబంధనను దావీదు సంతతితో చేసాడు [ఇశ్రాయేలీయులందరితో కాదు] (2సమూయేలు.23:5; యిర్మీయా.33:20-22) 

అయితే, మోషేనిబధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేసాడా…?

లేఖనాల సాక్ష్యం ప్రకారము ప్రభువైన దేవుడు మోషేనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేసినా అది కేవలం వారితో మాత్రమే కాకుండా వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడాలేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతో కూడా (ద్వి.కాం.29:29) చేశాడు. కాని, మానవులందరితో లేక అన్యులందరితో కాదు (ద్వి.కాం.29:11-15). 

లేఖనాలు ప్రకటిస్తున్నదాని ప్రకారం…

  • నోవహునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం. 9:16)
  • అబ్రహామునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/brith olam] (ఆది.కాం.17:7,19; 1దిన.వృ.16:15-18; కీర్తన.105:8-12)
  • దావీదునిబంధన నిత్యనిబంధన [עוֹלָֽם׃ בְּרִ֣ית/berith olam] (2సమూయేలు.23:5). 

కాని, మోషేనిబంధనను నిత్యనిబంధనగా లేఖనాలు పేర్కొనడం లేదు! 

గమనార్హమైన విశయం

మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి తనాక్ లో ఎక్కడా పేర్కొనలేదు. తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని నిత్యనిబంధనలకు మరియు మోషేనిబంధనకు గల ఈ వ్యత్యాసం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుని నిత్య సంకల్పములో రూపకల్పన చేయబడిన క్రొత్తనిబంధన మోషేనిబంధన స్థానములో ఆవిష్కరించబడి నిత్యనిబంధనగా కొనసాగబోతున్నందున (యిర్మీయా.31:31-34, 32:37-40) తనాక్ లో ఎక్కడకూడా మోషేనిబంధనను నిత్యనిబంధనగా పరమతండ్రి పేర్కొనలేదు. ఇది ఆయన ఆనాదికాల ప్రణాళిక. ఆయన బుద్ధి జ్ఙానముల బాహుళ్యము ఎంతో గొప్పది అనడానికి ఇదో మచ్చుతునక! 

మోషేధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా అన్నికాలాలలో తప్పిపోకుండా నెరవేర్చి తద్వారా నీతిమంతులుగా తీర్చబడినవారు పాతనిబంధన గ్రంథమంతటిలో (తనాక్) ఒక్కరు కూడా లేరు. మరోమాటలో చెప్పలంటే మోషేధర్మశాస్త్రము ఒక్కరినికూడా నీతిమంతునిగా తీర్చలేకపోయింది. (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11)

[గమనిక: పాతనిబంధన గ్రంథములో (తనాక్) లో నీతిమంతులున్నారు. అయితే వారు విశ్వాసమునుబట్టి నీతిమంతులని పేర్కొనబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం! (ఆది.కాం.15:6; హబక్కూకు.2:2; గలతీ.3:12)] 

మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1). 

అయితే, ఇశ్రాయేలీయులు తామే పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆనిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1). 

ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను అంటూ చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59). 

ఈ నేపథ్యములో దేవుడు ఇశ్రాయేలీయులచేత భంగం చేయబడిన మోషేనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక సరిక్రొత్తనిబంధనను చేయబోతున్నట్లుకూడా వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).

అయితే, ఆ క్రొత్తనిబంధన పూర్వముండిన మోషేనిబంధనవంటిది కాదు అన్న పరమతండ్రి ప్రకటన ఇక్కడ అతిప్రాముఖ్యమైన అంశంగా గుర్తుంచుకోవాలి.

“​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు…”  (యిర్మీయా.31:31-32)    

పరమతండ్రి పూర్వ లేక పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). కాని, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్షాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).

క్రొత్తనిబంధనను పరమతండ్రి కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాడా…?

లేఖనాల సాక్ష్యం ప్రకారము… 

– ప్రభువైన దేవుడు క్రొత్తనిబంధనను ప్రధానంగా ఇశ్రాయేలీయులతో చేయబోతున్నా అది కేవలం వారితో మాత్రమే చేస్తాను అని ఎక్కడా చెప్పలేదు.

– ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను,” “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు/మానవకోటికి (కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలం అన్యజనులు అని కాదు) అంటే మానవులందరికి నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు (యెషయా.42:1-7, 49:5-8; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28). నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ! 

– అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!

– అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14 = అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!

– ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ నిబంధన (క్రొత్తనిబంధన) ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్ష్యాన్ని అందించాడు.

– పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని  మహోత్తర ప్రణాళిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడు గనుక ఇశ్రాయేలీయులకు ‘అన్యజనుల వలన రోషము పుట్టించబోతున్నాను’ అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు మరియు విషం అంతా!

– “నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే అన్యజనులు సహితం ప్రవేశించేందుకు వీలుగా దేవుని రాజ్య ద్వారాలను తెరచిన క్రొత్తనిబంధన!    

మోషేధర్మశాస్త్రము చేయలేకపోయినదాన్ని దేవుడు చేసాడు:

కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు లేదు. క్రీస్తుయేసునందు జీవమునిచ్చు ఆత్మయొక్క నియమము పాపమరణముల నియమమునుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము ననుసరింపక ఆత్మననుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని పాప పరిహారమునిమిత్తము దేవుడు తన సొంత కుమారుని (యషువ మషియాఖ్/యేసు క్రీస్తు) పాప శరీరాకారముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను.” (రోమా.8:1-4)

ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలమూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు; ధర్మశాస్త్రమువలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు.[ఆది.కాం.15:6;  యెషయా.46:13, 53:8-11; హబక్కూకు.2:4; దానియేలు.9:24] అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది.” (రోమా.3:20-22) 

మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయబడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2కొరింథీ.3:14-16) 

« Older Entries Recent Entries »