Category Archives: ధర్మశాస్త్రము

Permalink to single post

పాతనిబంధన Vs. క్రొత్తనిబంధన

జూడాయిజంవారి దుర్బోధ

జూడాయిజంలోని కొందరు లేఖనాలను వక్రీకరిస్తూ క్రొత్తనిబంధనను గురించి చేస్తున్న అసత్యబోధలలో క్రొత్తనిబంధనను గురించి క్రింది విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:

  • క్రొత్తనిబంధన అంటే మోషేద్వారా చేయబడిన నిబంధనను కేవలము తిరిగి నూతనపరచడము మాత్రమే. [❌]
  • క్రొత్తనిబంధన అంటే దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేయబోతున్న నిబంధన. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల కారణం, క్రొత్తనిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేదు. [❌]
  • క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన కాదు. అందుకుగల మరొక కారణం, క్రొత్తనిబంధన తరువాత అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను గురించి బోధచేసే అవసరత వుండదు. కాని, అలాంటి జ్ఙానం ఇంకా క్రొత్తనిబంధనలో ప్రవేశించామని ప్రకటిస్తున్న క్రైస్తవులకు రాలేదు. దీన్నిబట్టి యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన క్రొత్తనిబంధన కాదు. [❌]

లేఖనాల సద్బోధ

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

పై లేఖనాలలో ప్రభువైన దేవుడు వాగ్ధానం చేసిన నిబంధన ఒక క్రొత్తనిబంధన. అది కేవలము నూతనపరచబడబోతున్న అదివరకేవుండిన నిబంధన కాదు. ఈ సరికొత్తనిబంధనను గూర్చి పాతనిబంధన కాలములోని ప్రవక్తలద్వారా దేవుడు అనేక వివరాలను ప్రవచనరూపములో అందించాడు (ద్వి.కాం.32:21,43; కీర్తనలు 117:1-2; యెషయా 11:10, 42:5-7; 45:20-25, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60-62, 37:24-28; హోషేయ 2:14-23; జెకర్యా 9:9-17; మలాకి 1:10-11 = లూకా 22:19-20; రోమా.8:2; 1కొరింథీ.11:25; గలతీ.6:2; 1 తిమోతీ.2:3-6; హెబ్రీ.9:15, 12:24).

పాత/మోషే నిబంధన మరియు దానితరువాత చేయబడే క్రొత్తనిబంధన అన్నవి రెండు వేరువేరు నిబంధనలు. లేఖనాల సమగ్ర బోధను కూలంకశంగా పరిశీలించి చూస్తే పాతనిబంధనకు మరియు క్రొత్తనిబంధనకు మధ్యగల వ్యత్యాసాలు అవగతమవుతాయి.

పాతనిబంధన

మోషేనిబంధన (Mosaic Covenant) లేక పాతనిబంధనను (Old Covenant) గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) మోషేనిబంధనను దేవుడు లోకములోని ప్రజలందరితో చేసిన నిబంధనగా లేఖనాలు ఎక్కడా పేర్కొన లేదు.

(2) మోషేనిబంధన అన్నది దేవుడు మోషేకంటే ముందు ఉండిన ప్రజలతో లేక ఇశ్రాయేలీయులతో లేక భక్తులతో చేసిన నిబంధన కాదు.

మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.” (ద్వి.కాం.5:2-3)

పై లేఖన సాక్ష్యం ప్రకారం, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మరియు పన్నెండు గోత్రాల పితరులుగాని లేక హేబేలు, హానోకు, మరియు నోవహు వంటి పాతనిబంధన పరిశుద్ధులలో ఎవరికి మోషే నిబంధనలో పాలు లేదు.

(3) దేవుడు మోషేనిబంధనను కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను/చేసాను అని ఎక్కడా ప్రకటించలేదు.

(4) మోషేనిబంధన అన్నది దేవుడు ప్రధానంగా మోషే నాయకత్వములో ఐగుప్తులోనుండి బయలుదేరిన ఇశ్రాయేలీయులందరితో చేసిన నిబంధన.

అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారుయెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను. ” (ని.కాం.24:7-8)
ఏలయనగా నేను మిమ్మును కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మును విస్త రింపచేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను.” (లేవీ.కాం.26:9)
ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.” (2దిన.వృ.5:10)
యెహోవా దూత గిల్గాలునుండి బయలుదేరి బోకీము నకువచ్చి యీలాగు సెలవిచ్చెను నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి, మీ పితరులకు ప్రమాణముచేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడును మీరను.” (న్యాయాధిపతులు 2:1)

(5) మోషేనిబంధనను దేవుడు ఇశ్రాయేలీయులతోనేగాక వారితోకలిసి వారిమధ్య నివసిస్తూ వారితోపాటే పయనిస్తూ వాగ్ధత్తదేశమైన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న అన్యులతో కూడా చేశాడు.

నీ దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారము గాను నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన ప్రకారముగాను, ​నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించుచున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యులేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకులేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను…మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:10…29)

(6) మోషేనిబంధనను చేస్తున్న సమయములో అక్కడ లేనివారితో అంటే అక్కడవున్నవారి యొక్క రాబోవు తరాలవారితో సహితము దేవుడు ఆ నిబంధనను చేశాడు.

నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్నవారి తోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతివారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.29:14…29)

(7) మోషేనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఇహలోకానికి చెందినవి.

నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినినేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటిని అనుసరించి నడుచుకొనినయెడల నీ దేవు డైన యెహోవా భూమిమీదనున్న సమస్త జనములకంటె నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినయెడల ఈ దీవెనలన్నియు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును…అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్నయెడల, నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనినయెడల, యెహోవా నిన్ను తలగా నియమించునుగాని తోకగా నియమింపడు. నీవు పైవాడ వుగా ఉందువుగాని క్రింది వాడవుగా ఉండవు.” (ద్వి.కాం.28:1..14)

(8) మోషేనిబంధనలో పాలుపొందేవారు దేవుని ఆజ్ఙలను న్యాయవిధులను తామే హృదయాలలో వ్రాసుకోవాలని సూచించబడ్డారు.

కాబట్టి మీరు ఈ నామాటలను మీ హృదయములోను మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతులమీద సూచనలుగా కట్టు కొనవలెను. అవి మీ కన్నులనడుమ బాసికములుగా ఉండవలెను.” (ద్వి.కాం.11:18)

(9) మోషేనిబంధన శరతులతో కూడిన నిబంధన [Conditional Covenant].

మోషే దేవునియొద్దకు ఎక్కి పోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచినీవు యాకోబు కుటుంబికులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసిన దేమనగా నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో, మిమ్మును గద్ద రెక్కలమీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన ననుసరించి నడిచినయెడల మీరు సమస్తదేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్తభూమియు నాదేగదా. మీరు నాకు యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము; నీవు ఇశ్రాయేలీయులతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా” (ని.కాం.19:3-6)

(10) దేవుడు మోషేద్వార చేసిన నిబంధన ద్వైపాక్షిక నిబంధన [Bilateral Covenant].

మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యెహోవా తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు యెహోవా చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి. అప్పుడు మోషే తిరిగి వెళ్లి ప్రజల మాటలను యెహోవాకు తెలియచేసెను.” (ని.కాం.19:7-8)
ప్రజలందరు ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ బూర ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి, భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము; దేవుడు మాతో మాటలాడిన యెడల మేము చనిపోవుదుము.” (ని.కాం.20:19)
మోషే వచ్చి యెహోవా మాటలన్నిటిని విధులన్నిటిని ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరు యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసెదమని యేకశబ్దముతో ఉత్తరమిచ్చిరి...అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి.” (ని.కాం.24:3…7)

(11) మోషేనిబంధన పశువుల రక్తముతో ఆవిష్కరించబడింది.

మరియు మోషే యెహోవా మాటలన్నిటిని వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములు చొప్పున పండ్రెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీయులలో యౌవనస్తులను పంపగా వారు దహనబలుల నర్పించి యెహోవాకు సమా ధానబలులగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసికొని పళ్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠముమీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథమును తీసికొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నియు చేయుచు విధేయులమై యుందుమనిరి. అప్పుడు మోషే రక్తమును తీసికొని ప్రజలమీద ప్రోక్షించి ఇదిగో యీ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పెను.” (ని.కాం.24:4-8)

(12) ప్రభువైన దేవుడు నోవహుద్వారా చేసిన నిబంధన సర్వశరీరులతో చేసిన నిబంధన అంటూ పేర్కొనటమేగాక దాన్ని నిత్య నిబంధనగా అభివర్ణించాడు [ఆది.కాం. 9:16]. అయితే, మోషేనిబంధనను నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ b’rith olam=everlasting covenant] తనాక్ (పాతనిబంధన గ్రంథము) అంతటిలో దేవుడు ఎక్కడా పేర్కొనలేదు.

మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనను తాను మీరను అని పరమతండ్రి వాగ్ధానం చేసాడు (న్యాయాధిపతులు.2:1). అయితే, ఇశ్రాయేలీయులు పదే పదే విశ్వాసఘాతకులుగా మారి ఆ నిబంధనను మీరి భంగం చేసారు (యిర్మీయా.11:10, 31:32; యెహెజ్కేలు.44:7; హోషేయ 6:7, 8:1). ఈ సందర్భంగా వాగ్ధానాన్ని భంగం చేస్తూ వచ్చిన ఇశ్రాయేలు జనాంగాన్ని వుద్దేశించి పరమతండ్రి, “నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను” అంటూ తెగేసి చెప్పేసాడు (యెహెజ్కేలు.16:59). అంటే, తాను చేసిన వాగ్ధానాన్ని మీరి ఇశ్రాయేలు జనాగాన్నంతటిని లయము చేయటమో లేక వారితో ఎలాంటి అనుబంధము కలిగి ఉండకుండ ఉండటమో అని కాదు. అది కేవలము ధర్మశాస్త్రములో తెలియచేసిన విధంగా వారిని శిక్షించటము [లేవీయకాండము 26:14-39].

ఈ నేపథ్యములో ఇశ్రాయేలీయులు నిబంధనను పదే పదే భంగం చేస్తూ వచ్చినా, ప్రభువైన దేవుడు తానుమాత్రం తాను యిచ్చిన మాటచొప్పున ఆ నిబంధనను మీరకుండా లేక భంగం చేయకుండా రాబోవు దినాలలో ఇశ్రాయేలీయులు కష్టపడి తమ స్వంత ప్రయత్నాలచేత, స్వనీతిచేత, లేక స్వభక్తిచేత సంపాదించనవసరములేని ఒక పరిపూర్ణమైన మరియు ఉత్కృష్టమైన పరిష్కార మార్గాని అందించే నిబంధనను గురించి వాగ్ధానం చేసాడు.

ఇశ్రాయేలీయులచేత పదే పదే భంగం చేయబడుతూ వచ్చిన మోషేనిబంధన నిత్యనిబంధన కాదు. దానికితోడు, ఆ నిబంధనతోపాటు యివ్వబడిన నిబంధనానియమాలు లేక ధర్మశాస్త్రము కూడా పరిష్కారాన్ని చూపలేకపోయిన కొన్ని ప్రాముఖ్యమైన సమస్యలు అలాగే ఉండిపోయాయి. అవి ఈ క్రింద యివ్వబడినవి:

  • ధర్మశాస్త్రములోని విధులను గైకొనక మరియు వాటిని స్థిరపరచకుండుటనుబట్టి శాపగ్రస్తులుగా మారిన వ్యక్తులకు తిరిగి నీతిమంతులయ్యే మార్గం ధర్మశాస్త్రము చూపలేదు (ద్వి.కాం.27:26)
  • తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
  • మరణకరమైన పాపాలకు [లే.కాం.20:10; ద్వి.కాం.13:7-19; 17:2-7; లే.కాం.24:17] క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
  • తన స్వరూపమందు తన పోలిక చొప్పున సృష్టికర్త తానే సృష్టించిన లోకములోని మానవులందరికి అబ్రహాము ద్వారా చేసిన వాగ్దానములో [ఆది.కాం.12:3, 28:14] భాగంగా యూదులతో సమానంగా అందరికి ఆత్మీయ మేళ్ళను అందించలేక పొయింది
  • ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16).
    [గమనిక: పాతనిబంధన కాలములోనూ నీతిమంతులున్నారు. అయితే, వారు మోషేధర్మశాస్త్రాన్ని పాటించటముద్వారా గాక, దేవునియందలి విశ్వాసముద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు అన్నది లేఖనాల సాక్ష్యం!]

పై కారణాలన్నింటినిబట్టి ప్రభువైన దేవుడు మోషేనిబంధన లేక పాతనిబంధన స్థానములో నిత్యమూ వుండబోయే ఒక క్రొత్తనిబంధనను చేయబోతున్నట్లు వాగ్ధానం చేసాడు (యెషయా.42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయా.31:31-34; యెహెజ్కేలు 16:60, 37:24-28).

మరోమాటలో చెప్పాలంటే, అపరిపుర్ణంగా మరియు లోపభూయిష్టంగా [హెబ్రీ.8:7] ఉన్న మోషేనిబంధనను తొలగించి దాని స్థానములో దానికన్నా శ్రేష్టమైన వేరొక నిబంధనను అంటే పరిపూర్ణమైన మరియు లోపరహితమైన నిబంధనను అందించబోతున్నట్లు ప్రభువైన దేవుడు తానే ముందుకడుగేసి తన అపార కృపాకనికరాలనుబట్టి ఏకపక్షంగా వాగ్ధానం చేసాడు.

(13) మెస్సయ్య ద్వారా క్రొత్తనిబంధన.

పరమతండ్రి పూర్వ/పాతనిబంధనను మోషేద్వారా చేశాడు (ని.కాం.24:7-8). అయితే, ప్రవక్తలద్వారా తాను వాగ్ధానము చేసిన నిబంధనను/నిత్యనిబంధనను/క్రొత్తనిబంధనను (యెషయా.55:3, 61:8; యిర్మీయ.31:31-34, 32:37-40; యెహెజ్కేలు.16:60, 37:26) తన సేవకుడు/కుమారుడు/మెస్సయ్య ద్వారా చేయబోతున్నట్లు లేఖనాల సాక్ష్యాన్ని అందించాడు (యెషయా 42:5-7, 49:5-8, 55:3-5, 59:20-21, 65:1).

(14) క్రొత్తనిబంధన మరియు అన్యులు.

ప్రవక్తల కాలంలో ఒకవైపు “ఇశ్రాయేలీయులతో నేను ఒక నిబంధన చేయబోతున్నాను” (యెషయా.59:21), “ఇశ్రాయేలీయులతో ఒక నిత్యనిబంధన చేయబోతున్నాను” (యెషయా.55:3, 61:8; యిర్మీయ.32:40; యెహెజ్కేలు.16:60, 37:26), “ఇశ్రాయేలీయులతో ఒక క్రొత్తనిబంధన చేయబోతున్నాను” (యిర్మీయ.31:31) అని ప్రభువైన దేవుడు పదే పదే ప్రకటిస్తూనే మరోవైపు ప్రజలకు [కేవలం ఇశ్రాయేలీయులు అని కాదు లేక కేవలము అన్యజనులు అని కాదు] అంటే మానవులందరికి ఒక నిబంధన అందించబోతున్నట్లు కూడా ప్రకటించాడు [యెషయా.42:1-7, 49:20-21]. నిస్పక్షపాతి అయిన పరమతండ్రి మానవాళికి చేసిన వాగ్ధానాల నెరవేర్పే [ద్వి.కాం.32:21, 43; కీర్తన.82:8, 117:1-2; యెషయా 11:10; 42:5-7; 45:20-24; 49:5-13; 55:1-7; 65:1; హోషేయ 2:21-23; జెకర్యా 9:10] క్రొత్తనిబంధన మరియు దాని ఆవిష్కరణ! 

ఈసందర్భంగా తనాక్ లో (పాతనిబంధన గ్రంథము) ప్రభువైన దేవుడు తాను ఇశ్రాయేలీయులతో మరియు భూనివాసులందరితో చేయబోతున్న నిబంధనను గురించి అనేక పర్యాయాలు సవివరంగా పేర్కొన్నప్పటికిని ఎక్కడకూడా “నిబంధనలు” అంటూ అనేక నిబంధనలు లేక పలువిధనిబంధనలు చేయబోతున్నట్లు సూచించలేదు అన్నది గమనార్హమైన విశయం. దీన్నిబట్టి దేవుడు ఇశ్రాయేలీయులకు వాగ్ధానం చేసిన నిబంధన అలాగే అన్యులకు వాగ్ధానం చేసిన నిబంధన వేరువేరు నిబంధనలు కావుగాని ఒకే సార్వత్రిక నిబంధన అన్నది ప్రస్పుటమవుతున్నది. అదే క్రొత్తనిబంధన!

క్రొత్తనిబంధన

క్రొత్తనిబంధన లేక మెస్సయ్యనిబంధనను గురించి లేఖనాలు ఇస్తున్న సాక్ష్యం:

(1) క్రొత్తనిబంధన అన్నది దేవుడు ముందే భవిశ్యవాణిరూపంలో ప్రవక్తల ప్రవచనాలలో సూచించబడిన నిబంధన.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

(2) క్రొత్తనిబంధన నూతనపరచబడబోయే మోషేనిబంధన కాదు. అసలు అది మోషేనిబంధన వంటిది కానేకాదు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యిపట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31-32)

ఈ సత్యం ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా కూడా తెలియచేయబడింది.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. ” (యెహెజ్కేలు.16:59-60)

పై లేఖములో ప్రభువైన దేవుడు గతములో తాను చేసిన పాత నిబంధనను జ్ఙాపకము చేసుకొని దాన్నే నిత్యనిబంధనగా స్థిరపరుస్తాను అని చెప్పకుండా, పాతనిబంధనను జ్ఙాపకము చేసుకొని అంటే దాని ఉద్దేశాన్ని గమనములో ఉంచుకొని ఆ ఉద్దేశాన్ని నెరవేర్చేందుకై దాని స్థానములో ఒక నిత్యనిబంధనను అంటే నిత్యము ఉండబోయే వేరే నిబంధనను లేక క్రొత్తనిబంధనను చేసి దాన్ని స్థిరపరచబోతున్నట్లు విశదీకరించాడు. స్థిరపరచబడబోతున్నది క్రొత్తనిబంధన, పాతనిబంధన కాదు!

(3) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు ఇశ్రాయేలీయులతో చేయబోతున్నట్లు వాగ్ధానం చేశాడు.

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు.” (యిర్మీయ.31:31)
సీయోనునొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్లుకొనిన వారియొద్దకును విమోచకుడు వచ్చును ఇదే యెహోవా వాక్కు.నేను వారితో చేయు నిబంధన యిది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోటనుంచిన మాటలును నీ నోటనుండియు నీ పిల్లల నోటనుండియు నీ పిల్లల పిల్లల నోటనుండియు ఈ కాలము మొదలుకొని యెల్లప్పుడును తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (యెషయా.59:20-21)

(4) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో మాత్రమే చేస్తాను అని లేఖనాలలో ఎక్కడా ప్రకటించలేదు.

ఉదాహరణకు, దేవుడు “నేను ఇష్మాయేలును ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని దాని భావమా…?
ఒకవేల దేవుడు “నేను ఇష్మాయేలును మాత్రమే ఆశీర్వదిస్తాను” అని సెలవిస్తే తప్పకుండా దాని భావం దేవుడు ఇష్మాయేలును తప్ప ఇంకెవరినీ ఆశీర్వదించడు అని.
లేఖనాలలోని ఈ సున్నిత భావవ్యత్యాసాన్ని గ్రహించని ఆత్మీయ అంధులు యిర్మీయ.31:31 లోని లేఖన వాగ్ధానం కేవలం యూదులకు మాత్రమే చెందినది అందులో అన్యులకు పాలు లేదు అంటు వక్రవ్యాఖ్యానము చేస్తుంటారు. ఇదే లేఖనాలకు కలిపి చెరపడమంటే.

(5) క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు కేవలము ఇశ్రాయేలీయులతో అలాగే ఇశ్రాయేలీయుల మధ్య కానానులో స్థిరపడినవారితో చేయడమేగాక లోకములోని అన్యులందరికి అందులో ప్రవేశము కల్పిస్తున్నట్లు లేఖనాలలో వాగ్ధానరూపములో సూచించాడు.

వారు దైవము కానిదానివలన నాకు రోషము పుట్టించిరి తమ వ్యర్థప్రవర్తనవలన నాకు ఆగ్రహము పుట్టించిరి కాబట్టి జనముకానివారివలన వారికి రోషము పుట్టింతును అవివేక జనమువలన వారికి కోపము పుట్టింతును.” (ద్వి.కాం.32:21)
జనములారా, ఆయన ప్రజలతోకూడ ఆనందించుడి. హతులైన తన సేవకులనుబట్టి ఆయన ప్రతిదండన చేయును తన విరోధులకు ప్రతీకారము చేయును తన దేశము నిమిత్తమును తన ప్రజలనిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయును.” (ద్వి.కాం.32:43)
యెహోవా కృప మనయెడల హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా, యెహోవాను స్తుతించుడి సర్వజనములారా, ఆయనను కొనియాడుడి యెహోవాను స్తుతించుడి.” (కీర్తనలు 117:1-2)
ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెష్షయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును ఆయన విశ్రమస్థలము ప్రభావము గలదగును.” (యెషయా.11:10)
గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును
యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను
.” (యెషయా.42:6-7)
మీ ప్రమాణవాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి జనులు కూడుకొని ఆలోచన చేసికొందురు గాక; పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియ జేసినవాడెవడు?చాలకాలముక్రిందట దాని ప్రకటించినవాడెవడు?యెహోవానగు నేనే గదా? నేను తప్ప వేరొక దేవుడు లేడు.నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే నేను తప్ప మరి ఏ దేవుడును లేడు భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు. నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు. యెహోవాయందే నీతి బలములున్నవని జనులు నన్ను గూర్చి చెప్పుదురు ఆయనయొద్దకే మనుష్యులు వచ్చెదరు ఆయనమీద కోపపడినవారందరు సిగ్గుపడుదురు.” (యెషయా.45:21-24)
“యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని నా దేవుడు నాకు బలమాయెను కాగా తనకు సేవకుడనైయుండి తనయొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయనయొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమున పుట్టించిన యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు నీవు యాకోబు గోత్రపువారిని ఉద్ధరించునట్లును ఇశ్రాయేలులో తప్పింపబడినవారిని రప్పించునట్లును నా సేవకుడవై యుండుట ఎంతో స్వల్పవిషయము; భూదిగంతములవరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై యుండునట్లు నిన్ను నియమించి యున్నాను…బయలువెళ్లుడి అని బంధింపబడినవారితోను బయటికి రండి అని చీకటిలోనున్నవారితోనుచెప్పుచు దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచి పెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించితిని. ” (యెషయా.49:5…8)
“చెవియొగ్గి నాయొద్దకు రండి మీరు వినినయెడల మీరు బ్రదుకుదురు నేను మీతో నిత్యనిబంధన చేసెదను దావీదునకు చూపిన శాశ్వతకృపను మీకు చూపుదును.” (యెషయా.55:3)
“నాయొద్ద విచారణచేయనివారిని నా దర్శనమునకు రానిచ్చితిని నన్ను వెదకనివారికి నేను దొరికితిని. నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను.” (యెషయా.65:1)
“​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును. నీ అక్క చెల్లెండ్రు నీవు చేసిన నిబంధనలో పాలివారు కాకుండినను నేను వారిని నీకు కుమార్తెలుగా ఇయ్యబోవుచున్నాను. నీవు వారిని చేర్చుకొనునప్పుడు నీ వ్రవర్తన మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడుదువు.” (యెహెజ్కేలు.16:60-61)
నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసెదను, అది నాకును వారికిని నిత్య నిబంధనగా ఉండును, నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారిమధ్య నా పరిశుద్ధస్థలమును నిత్యము ఉంచెదను. ​నా మందిరము వారికి పైగానుండును, నేను వారిదేవుడనై యుందును వారు నా జనులైయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధస్థలము నిత్యము ఉండుటనుబట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీయులను పరి శుద్ధపరచువాడనని అన్య జనులు తెలిసికొందురు.” (యెహెజ్కేలు.37:26-28)
నేను దానిని భూమియందు నాకొరకై విత్తుదును; జాలినొందని దానియందు నేను జాలిచేసి కొందును; నా జనము కానివారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడవు అని యందురు; ఇదే యెహోవా వాక్కు.” (హోషేయ.2:23)
సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిదపిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా.9:9-11)
తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచ బడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్య జనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మలాకి.1:11)

యూదులతోపాటు అన్యులనుకూడా ఆశీర్వదించాలన్న సృష్టికర్తయొక్క బృహత్ప్రణాలికను గురించి పై లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. అన్యులతో “క్రొత్తనిబంధన” చేస్తాను అంటూ దేవుడు ఎక్కడా ప్రకటించలేదు. కారణం…వారికి పాతనిబంధన లేదు గనుక. కాని, ఇశ్రాయేలీయులతో యూదులతో ప్రత్యేకంగా “క్రొత్తనిబంధన” చేస్తాను అని దేవుడు ప్రకటించాడు. కారణం…వారికి పాతనిబంధన వుండింది గనుక.

యూదులకు అన్యులకు వేరువేరుగా చేసిన వాగ్ధానాలను ఐక్యపరచి ఒకే నిబంధనద్వారా తన వాగ్ధానాలను నెరవేర్చుకునే స్వాతంత్ర్యము హక్కు సృష్టికర్తకు లేవనేవాడు ఆత్మీయ దుస్థితిలోని అధమస్థానములోవున్న అవిశ్వాసి!

(6) క్రొత్తనిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు ఇశ్రాయేలు జనులందరిని రక్షించబోతున్నాడు.

క్రొత్తనిబంధన ఫలితంగా అనేక అద్భుత పరిస్థితులు నెలకొనబోతున్నాయన్నది లేఖనాల సాక్ష్యం. అయితే, అవన్నీ ఒక్క క్షణములో లేక ఒకే దినములో సంభవించబోతున్నాయంటూ లేఖనాలు వాటి నెరవేర్పుల కాల పరిమితులను స్పష్టపరచలేదు అన్న సత్యాని మరచిపోకూడదు. క్రొత్తనిబంధనా ఫలితాలను ప్రభువైన దేవుడు క్రమక్రమంగా అంచలవారిగా నెరవేర్చబోతున్నాడు.

పై కారణాన్నిబట్టి క్రొత్తనిబంధన అంటే యేసు [యషువ] ద్వారా చేయబడిన నిబంధన తరువాత ఇశ్రాయేలీయులందరు రక్షించబడుతారు అన్న వాగ్ధానం ఇంకా నెరవేరబడలేకపోయినా అది యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడకు ముందు సంభవించబోయే అద్భుత ఘటన అన్నది లేఖనాలు సూచిస్తున్నాయి (రోమా.11:25-36). అయితే, ఈ సంఘటన క్రొత్తనిబంధన కాలములోనే సంభవిస్తుంది అన్నది తిరుగులేని సత్యం.

(7) క్రొత్తనిబంధన ఫలితాలు.

“​ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్న డునుయెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదేయెహోవా వాక్కు.” (యిర్మీయా.31:31-34)

ప్రభువైన దేవుడు ప్రవక్త అయిన యిర్మీయా ద్వారా తెలియచేసిన క్రొత్త నిబంధన యొక్క విశిష్ఠతలు:

  • ఈ నిబంధన ఇశ్రాయేలీయులతో యూదావారితో చేయబడును
  • ఈ నిబంధన మోషేద్వారా చేయబడిన పాతనిబంధన వంటిది కాదు
  • ఈ నిబంధనలో భాగంగా ప్రభువైన దేవుడు తానే తన ధర్మవిధిని వారి మనస్సులలో ఉంచబోతున్నాడు వారి హృదయముమీద వ్రాయబోతున్నాడు
  • ప్రభువైన దేవుడే వారికి దేవుడై ఉండును వారు ఆయనకు జనులై ఉందురు
  • వారు మరి ఎన్న డును యెహోవానుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు
  • ప్రభువైన దేవుడు వారి దోషములను క్షమించి వారి పాపములను ఆయన యెన్నడును జ్ఞాపకము చేసికొనడు గనుక అల్పులేమి ఘనులేమి అందరును ఆయననెరుగుదురు

ఈ సందర్భంగా మరోసారి జ్ఙాపకము చేసుకోవలసిన సత్యం, ప్రభువైన దేవుడు తాను చేసిన నిబంధనలలో భాగంగా కొన్ని వాగ్ధానాలను నిబంధన విశిష్ఠతలుగా ఆయా నిబంధనలతోపాటు తెలియచేసాడు. అయితే, ఆ వాగ్ధానాలన్నీ ఒక్క క్షణములోనె లేక ఒకే దినములోనె నెరవేర్చబడుతాయి అంటూ ప్రభువైన దేవుడు సూచించటం లేదు. వాటి నెరవేర్పులు అన్నవి ఆ నిబంధన అమలులో ఉన్నకాలములో క్రమక్రమంగా నెరవేర్చబడుతాయి. ఈ సత్యం ప్రభువైన దేవుడు నరులతో చేసిన అనేక నిబంధనలను పరిశీలించటముద్వారా గ్రహించవచ్చు.

కనుక, ప్రభువైన యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] కలువరి సిలువపై తన స్వంత రక్తముతో చేయబోతున్న క్రొత్తనిబంధనకు సాదృశ్యముగా చేసిన సంస్కారము తన పన్నెండుగురు శిష్యులతో చేసాడు [మత్తయి.26:26-30; మర్కు.14:22-25; లూకా.22:19-20]. వారంతా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారే. క్రొత్తనిబంధనలో భగంగా ఉన్న ధర్మవిధులు వారి హృదయములో ప్రభువైన దేవుడే తన పరిశుద్ధాత్మద్వారా వ్రాసాడు. ఈ ప్రక్రియను గత రెండువేల సంవత్సరాలుగా ఇశ్రాయేలు మరియు యూదా యింటివారిలోనుండి మెస్సయ్య అయిన యేసు [యషువ] ద్వారా క్రొత్తనిబంధనలో పాలుపొందుతూ వస్తున్న వ్యక్తుల హృదయాలలో పరిశుద్ధాత్మదేవుడే జరిగిస్తున్నాడు.

నిజవిశ్వాసులు అంటే క్రొత్తనిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నందు ఆయన చేసిన బలియాగమునందు విశ్వాసముంచి ఆత్మీయంగా తిరిగి జన్మించిన ప్రతివ్యక్తి, యూదుదైనా లేక అన్యుడైనా, ప్రభువైన దేవుని వ్యక్తిగతంగా ఎరుగుట అన్నది సంభవిస్తుంది. ఆ కారణాన్నిబట్టి క్రొత్తనిబంధనద్వారా దేవుని కుటుంభములో చేరిన ప్రతివ్యక్తి దేవుని కుటుంభములోని మరొక వ్యక్తికి దేవుని తెలుసుకో అంటూ బోధించే ఆవశ్యకత లేదు.

యేసుక్రీస్తు [యషువ మషియాఖ్] శిష్యులతో ప్రారంభమైన క్రొత్త నిబంధన పరిధి విస్తరిస్తూ ప్రభువు యొక్క రెండవ రాకడకు ముందే ఇశ్రాయేలు జనాగమంతా రక్షించబడటముతో పరిపూర్ణమవుతుంది. తద్వారా ప్రభువైన దేవుడు తన ప్రవక్త యిర్మీయాద్వారా క్రొత్తనిబంధనను గురించి చేసిన వాగ్ధానాలన్నీ [యిర్మీయా.31:31-34] సంపూర్ణముగా నెరవేర్చబడుతాయి. అప్పుడు, యూదులందరు అందరు యెహోవాను ఎరుగుదురు గనుక ఒకరికొకరు యెహోవాను పరిచయం చేసే అవసరత వుండదు.

(8) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] బట్టే అన్యులనుకూడా దేవుడు ఇశ్రాయేలీయులతో సమానంగా చేయబోతున్నాడు.

(9) క్రొత్తనిబంధనద్వారా చేయబడిన వాగ్ధానాలు ప్రధానంగా ఆత్మీయ జీవితానికి మరియు రాబోవు యుగానికి చెందినవి.

(10) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] శరతులులేని నిబంధన [Unconditional Covenant] .

(11) దేవుడు వాగ్ధానం చేసిన క్రొత్తనిబంధన [మెస్సయ్యనిబంధన] ఏకపక్ష నిబంధన [Unilateral Covenant].

(12) క్రొత్తనిబంధన (మెస్సయ్యనిబంధన) మెస్సయ్య రక్తముతో ఆవిష్కరించబడింది.

“సీయోను నివాసులారా, బహుగా సంతోషించుడి; యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉండుడి; నీ రాజు నీతిపరుడును రక్షణగలవాడును దీనుడునై, గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీయొద్దకు వచ్చుచున్నాడు. ఎఫ్రాయిములో రథములుండకుండ నేను చేసెదను, యెరూషలేములో గుఱ్ఱములు లేకుండ చేసెదను, యుద్ధపు విల్లు లేకుండ పోవును, నీ రాజు సమాధానవార్త అన్యజనులకు తెలియజేయును, సముద్రమునుండి సముద్రమువరకు యూఫ్రటీసు నది మొదలుకొని భూదిగంతమువరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమునుబట్టి తాము పడిన నీరులేని గోతిలోనుండి చెరపట్టబడిన నీవారిని నేను విడిపించెదను.” (జెకర్యా 9:9-11)
“సీయోను కుమారీ, భయపడకుము, ఇదిగో నీ రాజు గాడిదపిల్లమీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడినప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దానిమీద కూర్చుండెను.” (యోహాను.12:14-15)
“మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చిదీనిలోనిది మీరందరు త్రాగుడి. ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. ” (మత్తయి.26:28)

(13) తాను చేయబోతున్న క్రొత్తనిబంధనను [మెస్సయ్యనిబంధనను] దేవుడు నిత్యనిబంధనగా [עוֹלָֽם׃ בְּרִ֣ית/ brith olam=everlasting covenant] పేర్కొన్నాడు.

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు.16:59-60)

(14) భూమిలోని వంశాలన్నింటికి క్రొత్తనిబంధనలో స్థానం!

అన్యజనులకు తన సేవకున్ని/కుమారున్ని/మెస్సయ్యను నిబంధనగా మరియు వెలుగుగా వుంచుతాను అని విస్పష్టమైన వాగ్ధానాలిచ్చాడు (యెషయా.42:1-7). ఆవాగ్ధానాలయొక్క నేరవేర్పును క్రొత్తనిబంధనలో అన్యజనులందరిని చేర్చడముద్వారా దేవుడు నెరవేర్చాడు!

అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్ధానాలలో ఆయన ద్వారా లోకములోని వంశాలనన్నిటిని ఆశీర్వదిస్తానంటూ వాగ్ధానం చేసాడు (ఆది.కాం.12:3; 18:18, 22:18, 26:4, 28:14=అపో.కా.3:25-26; గలతీ.3:8-14). ఆవాగ్ధానము యొక్క నెరవేర్పు క్రొత్తనిబంధనలో దేవుడు అన్యజనులందరిని చేర్చడముద్వారా నెరవేర్చాడు!

ఒక ప్రత్యేకమైన జనాంగముతో మాత్రమే దేవుడు మోషేనిబంధనను చేసి దాని తరువాత తాను చేయబోతున్న క్రొత్తనిబంధన మోషేనిబంధనవంటిది కాదు అని విస్పష్టముగా నొక్కిచెప్పటముద్వారా (యిర్మీయ.31:31-32) ఆ క్రొత్తనిబంధన ఒక ప్రత్యేకమైన జనాగమునకు మాత్రమేగాక, లోకములోని ప్రజలందరితో చేయబోయే నిబంధన అన్న సత్యానికి తిరుగులేని సాక్షాన్ని అందించాడు.

పక్షపాతరహితుడైన పరమతండ్రి తన నిత్యసంకల్పములోని  మహోత్తర ప్రణాలిక ప్రకారము తన స్వరూపమందు తన పోలికచొప్పున సృష్టింపబడిన మానవులందరిని ఆశీర్వాదించడానికై నిత్యనిబంధనగా వుండే క్రొత్తనిబంధనను ప్రజలతో అంటే మానవులందరితో చేయబోతున్నాడుగనుక ఇశ్రాయేలీయులను అన్యజనులవలన రోషము పుట్టించబోతున్నాను అంటూ ప్రవచనాత్మకంగా ప్రకటించాడు (ద్వి.కాం.32:21). ఒక రకంగా దాని ఫలితమే ఈనాటి యూదులు మరియు జూడాయిజంవారు యషువ మషియాఖ్ (యేసు క్రీస్తు) పై అలాగే ఆయన బోధలపై వేస్తున్న నీలాపనిందలు మరియు వెళ్ళగక్కుతున్న అక్కసు అంతా! 

నన్ను వెదకని వారికి నేను దొరికితిని” మరియు “నా జనము కానివారితో మీరే నా జనము అని నేను చెప్పుదును” అంటూ ఇశ్రాయేలీయులకు మాత్రమేగాక తాను అన్యజనులకు సహితం నిబంధనద్వారా దేవునిగా వుండబోతున్న సత్యాన్ని ప్రవచనాత్మకంగా ముందే ప్రకటించాడు (యెషయా.65:1; హోషేయ.2:23). దాని నెరవేర్పే క్రొత్తనిబంధన!

రాబోవు దినాలలో అంటే క్రొత్తనిబంధన కాలములో దేవునిరాజ్యములోకి అన్యజనుల ప్రవేశమునుగురించి అనేక మంది ప్రవక్తలద్వారా దేవుడు భవిశ్యవాణిరుపములో సూచించాడు:

పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగుచేసి దాని పోయిన చోట్లను బాగుచేసి, ఎదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులనందరిని నా జనులు స్వతంత్రించుకొనునట్లు పూర్వపురీతిగా దానిని మరల కట్టుదును; ఈలాగు జరి గించు యెహోవా వాక్కు ఇదే.” (ఆమోసు.9:11-12) 

సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసముచేతును; సంతోషముగానుండి పాటలు పాడుడి; ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసముచేతును; అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపియున్నాడని మీరు తెలిసి కొందురు.” (జెకర్యా.2:11)

యెహోవా, నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతములనుండి జనములు నీ యొద్దకు వచ్చిమా పితరులు వ్యర్థమును మాయా రూపమును నిష్‌ప్రయో జనమునగు వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పు దురు.” (యిర్మీయ.16:19)

 మోషేనిబంధన మరియు మెస్సయ్యనిబంధన మధ్య వ్యత్యాసాలు

మోషేనిబంధన (పాతనిబంధన)మెస్సయ్యనిబంధన (క్రొత్తనిబంధన)
ముందే ప్రవచించ బడలేదుప్రవక్తలకాలములో ప్రవచించబడింది
రాబోవువాటికి ఛాయా రూపాలుగతములోని ఛాయారూపాల నిజస్వరూపం
ప్రారంభబలి: పశువులుప్రారంభబలి: దేవుని ప్రియకుమారుడు
మధ్యవర్తి: సేవకుడుమధ్యవర్తి: దేవుని ప్రియకుమారుడు
చివరలో నీతిమంతులుగా తీరుస్తుందిప్రారంభములో నీతి ఆపాదిస్తుంది
ధర్మవిధులు వ్యక్తులు వ్రాసుకోవాలిధర్మవిధులు దేవుడే వ్రాస్తాడు
వాగ్దత్తదేశములో పాలుపొందబోతున్నవారికే పరలోకములో ప్రవేశించాలని ఆశించే
వారందరికి
అనేక రక్తబలులర్పిస్తుండాలిరక్తబలులు అర్పించడం లేదు
నిబంధనాకాలము పరిమితమైనదినిబంధనాకాలము నిత్యమైనది
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడలేదు
దేవుడు వాగ్ధానం చేసిన విశ్రాంతి
యివ్వబడింది
వాగ్ధానాలు ఇహలోకానికి చెందినవి వాగ్ధానాలు పరలోకానికి చెందినవి
అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదుల క్రింద అన్యులలోనుండి వచ్చిన విశ్వాసుల స్థానం యూదులతో సమానం
ద్వైపాక్షిక నిబంధన ఏకపక్ష నిబంధన
శరతులతో కూడిన నిబంధనశరతులులేని నిబంధన
అపరిపూర్ణ నిబంధనపరిపూర్ణ నిబంధన
Permalink to single post

తనాక్ లోని రాబోవు కారణజన్ములు

దాదాపు వెయ్యి సంవత్సరాల కాలపరిధిలో వ్రాయబడిన హీబ్రూ మరియు అరామిక్ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము (తనాక్) లో రాబోవు దినాలలో నెరవేర్చబడబోతున్న ఐదు ప్రాముఖ్యమైన పాత్రలను గురించిన భవిశ్యవాణులు ఇవ్వబడ్డాయి. అవి క్రింద ఇవ్వబడిన పాత్రలు:

  1. ప్రవక్త (ద్వి.కాం.18:15-18 = అపో.కా.3:12-26)
  2. పాలకుడు (2 సమూయేలు 7:12-16; 1రాజులు.6:12; కీర్తన.89:19-37, 132:11-12; యెషయా.9:6, 55:4; యిర్మీయా.33:19-26; దానియేలు.7:13-14, 8:25; మీకా.5:2 = మత్తయి.2:1-2, 5; ప్రకటన.1:5)
  3. ప్రధానయాజకుడు (కీర్తన.110:4 = హెబ్రీ.5:5-6, 6:20, 7:11-25)
  4. అభిశిక్తుడు లేక క్రీస్తు (యెషయా.61:1; దానియేలు.9:25-26 = మత్తయి.16:16, 26:63-64; లూకా.2:11, 4:17-21,41; యోహాను.1:41, 4:25, 11:27)
  5. ఏలియా (మలాకి.4:5 = మత్తయి.11:7-15, 17:11-12; లూకా.1:13-17)
Permalink to single post

ఆజ్ఙలు పలురకాలు

దేవుని వాక్యం నిరంతరం నిలుచునది. ఆవాక్యములోని భాగమే దేవుడు నరులకిచ్చిన ఆజ్ఙలు. దేవుని వాక్యములోని భాగమైన ఆయన ఆజ్ఙలుకూడా నిరంతరం నిలుచునవే. దీని భావం అన్ని ఆజ్ఙలు ఆన్ని కాలాలో అందరికీ వర్తిస్తాయని కాదు. దేవుని ఆజ్ఙలన్నీ సత్యమైనవి, నాశనము కానివి, సదా ఉనికిలో వుంటాయని దాని భావం. అయితే వాటి అనువర్తన మరియు అధికార పరిధులు అన్నవి ఆ యా కాలాలకు, వ్యక్తులకు, మరియు సందర్భాలకు పరిమితమై వుంటాయి.

దేవుని ఆజ్ఙలు

దేవుని ఆజ్ఙలు అనేకం. అవి పలురకాలు. ఆజ్ఙలన్నీ ఒకేసారి ఒకే వ్యక్తికి యివ్వబడలేదు. కాలానుగుణంగా సందర్భానుసారంగా వివిధ వ్యక్తులకు వివిధ ఆజ్ఙలు అందించబడ్డాయి. అవన్నీ దేవుని గ్రంథమైన బైబిలులో విపులీకరించబడ్డాయి. అయితే ఏ ఆజ్ఙలు ఎవరికి, ఎప్పుడు, ఎందుకు ఇవ్వబడ్డాయి అన్నవే మానవుల జీవితాలలో వాటి అన్వయింపుకు ప్రధాన నిర్ధేశకాలు. ఈ కారణాన్నిబట్టి దేవుని ఆజ్ఙలు క్రింద యివ్వబడినట్లుగా నాలుగు ప్రధాన భాగాలుగా విభజించబడుతాయి.

1) కాల-పరిమిత ఆజ్ఙలు–ఇవి ఒక పరిమిత సమయానికి లేక కాలానికి మాత్రమే అన్వయించదగిన ఆజ్ఙలు. ఈ ఆజ్ఙలు అన్ని కాలాలకు చెందినవి కావు. ఉదాహరణకు,

తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు.” (ఆది.కాం.2:16-17)

పై ఆజ్ఙను యిచ్చింది దేవుడు. అయితే, ఈ ఆజ్ఙ మానవచరిత్ర ఆరంభకాలానికి మాత్రమే చెందిన ఆజ్ఙ. ఇంగితజ్ఙానమున్న ఎవరుకూడా ఆ ఆజ్ఙను ఈదినాలోకూడా పాటించాలని భావించి పాటించే ప్రయత్నము చేయరు. క్రింద ఇవ్వబడిన లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవే:

ఇశ్రాయేలీయుల సమాజపు వారందరు తమ తమ కూటములలో సాయంకాలమందు దాని చంపి దాని రక్తము కొంచెము తీసి, తాము దాని తిని యిండ్లద్వారబంధపు రెండు నిలువు కమ్ములమీదను పై కమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను.” (ని.కాం.12:7-8)

యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదికిని వారి రథములమీదికిని వారి రౌతులమీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రముమీద నీ చెయ్యి చాపుమనెను.” (ని.కాం.14:26)

యెహోవా మోషేను చూచిఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను; వారు నా ధర్మశాస్త్రము ననుసరించి నడుతురో లేదో అని నేను వారిని పరీక్షించునట్లు ఈ ప్రజలు వెళ్లి ఏనాటి బత్తెము ఆనాడే కూర్చుకొనవలెను. మరియు ఆరవ దినమున వారు తెచ్చుకొనినదానిని సిద్ధపరచుకొనవలెను. వారు దినదినమున కూర్చుకొనుదానికంటె అది రెండంతలై యుండవలెననెను.” (ని.కాం.16:4-5)

2) వ్యక్తి-పరిమిత ఆజ్ఙలు: ఇవి దేవుడు కేవళము ఒక నిర్ధిష్టమైన వ్యక్తికి/వ్యక్తులకు యిచ్చిన ఆజ్ఙలు. ఉదాహరణకు,

కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతని కప్పగించుము; అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థనచేయును, నీవు బ్రదుకు దువు. నీవు ఆమెను అతని కప్పగించని యెడల నీవును నీవారందరును నిశ్చయముగా చచ్చెదరని తెలిసికొనుము.” (ఆది.కాం.20:7)

పై ఆజ్ఙ దేవునిది. అయితే, ఆ ఆజ్ఙను దేవుడు ఎవరికి యిచ్చాడు? లోకములోని మనుషులందరికా…? కాదు. అది కేవళము అబీమెలెకు అన్న కనానుదేశ రాజుకు మాత్రమె యివ్వబడిన ఆజ్ఙ. ఇదే విధంగా క్రింది లేఖనాల వెలుగులో దేవుడు మోషేద్వారా ఇచ్చిన ధర్మశాస్త్రము మరియు దానితోకూడిన విధులు ఆచారాలు అన్నవి ఒక ప్రత్యేకమైన జనులకు అంటే ఇశ్రాయేలీయులకు, వారితో పాటు ప్రయాణముచేస్తూ దేవుడు వాగ్ధానము చేసిన కనానుదేశములోకి ప్రవేశించబోతున్న పరదేశులకు, మరియు వారందరి రాబోవు తరాలవారికి మాత్రమే యివ్వబడ్డాయి అన్న సత్యం విశదమవుతున్నది:

ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను” (ని.కాం.31:16)

నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలెను, నా పరిశుద్ధమందిరమును సన్మానింప వలెను, నేను యెహోవాను. మీరు నా కట్టడలనుబట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన యెడల…మీతో నేను చేసిన నిబంధనను స్థాపించెదను…యెహోవా మోషేద్వారా సీనాయికొండ మీద తనకును ఇశ్రాయేలీయులకును మధ్య నియమించిన కట్టడలును తీర్పులును ఆజ్ఞలును ఇవే.” (లేవీ.కాం.26:2..46)

కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పిత రుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరచుకొనునట్లు, మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుచున్నాను వినుడి. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు…నా దేవుడైన యెహోవా నా కాజ్ఞాపించినట్లు మీరు స్వాధీనపరచుకొనబోవు దేశమున మీరాచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. ఈ కట్టడలన్నిటిని మీరు గైకొని అనుసరింపవలెను. వాటినిగూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచినిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞానవివే చనలు గల జనమని చెప్పుకొందురు. ఏలయనగా మనము ఆయనకు మొఱ పెట్టునప్పుడెల్ల మన దేవుడైన యెహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న యీ ధర్మశాస్త్ర మంతటిలో నున్న కట్టడలును నీతివిధులునుగల గొప్ప జనమేది?…మోషే ఇశ్రాయేలీయులకు నియమించిన శాసనములు కట్టడలు న్యాయవిధులు ఇవి.” (ద్వి.కాం.4:1..8..47)

మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి యిట్లనెను ఇశ్రాయేలీయులారా, నేను మీ వినికిడిలో నేడు చెప్పుచున్న కట్టడలను విధులను విని వాటిని నేర్చుకొని వాటిననుసరించి నడువుడి. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధనచేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైయున్న మనతోనే యీ నిబంధన చేసెను.”  (ద్వి.కాం.5:1-3)

యెహోవా హోరేబులో ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన గాక ఆయన మోయాబుదేశములో వారితో చేయుమని మోషేకు ఆజ్ఞాపించిన నిబంధన వాక్యములు ఇవే. మోషే ఇశ్రాయేలీయులనందరిని పిలిపించి వారితో ఇట్లనెను…నేడు నిన్ను తనకు స్వజనముగా నియమించుకొని తానే నీకు దేవుడైయుండు నట్లు నీ దేవుడైన యెహోవా నేడు నీకు నియమించు చున్న నీ దేవుడైన యెహోవా నిబంధనలోను ఆయన ప్రమాణము చేసినదానిలోను నీవు పాలుపొందుటకై ఇశ్రాయేలీయులలో ప్రతివాడు, అనగా మీలో ముఖ్యు లేమి, మీ గోత్రపువారేమి మీ పెద్దలేమి, మీ నాయకు లేమి మీ పిల్లలేమి, మీ భార్యలేమి, నీ పాళెములోనున్న పరదేశులేమి, నీ కట్టెలను నరుకువారు మొదలుకొని నీ నీళ్లు తోడువారివరకును మీరందరు నేడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచియున్నారు. నేను మీతో మాత్రము కాదు, ఇక్కడ మనతో కూడను ఉండి, నేడు మన దేవుడైన యెహోవా సన్నిధిని నిలుచుచున్న వారితోను ఇక్కడ నేడు మనతోకూడ నుండని వారితోను ఈ నిబంధనను ప్రమాణమును చేయుచున్నాను. …రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మ శాస్త్ర వాక్యములన్నిటి ననుసరించి నడుచుకొనునట్లు బయలుపరచబడినవి యెల్లప్పుడు మనవియు మన సంతతి వారివియునగునని చెప్పుదురు.” (ద్వి.కాం.1…11…29)

సీనాయి పర్వతము మీదికి దిగివచ్చి ఆకాశమునుండి వారితో మాటలాడి, వారికి నీతియుక్తమైన విధులను సత్యమైన ఆజ్ఞలను మేలుకరములైన కట్టడలను ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతిదినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషేద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించితివి.” (నెహెమ్యా.9:13-14)

ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన.147:19-20)

హోరేబు కొండమీద ఇశ్రాయేలీయులందరికొరకై నేను నా సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమును దాని కట్టడలను విధులను జ్ఞాపకము చేసికొనుడి.” (మలాకి.4:4)

3) సందర్భ-పరిమిత ఆజ్ఙలు: కొన్ని ఆజ్ఙలను దేవుడు కొన్ని ప్రత్యేకమైన సందర్భాలకొరకు మాత్రమే యివ్వడం జరిగింది. అలాంటి ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరికి అన్వయించకూడదు. ఉదాహరణకు,

చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయ వలెను.” (ఆది.కాం.6:14)

దేవుడు పై ఆజ్ఙను జారీ చేసాడు. అయితే ఆ ఆజ్ఙ అన్నికాలాలకు అన్వయించ తగిందా? కాదు. అది కేవళము నోవహుకు అదీ జలప్రళయముకు ముందు యివ్వబడిన ఆజ్ఙ. జలప్రళయము తరువాతకూడా అలాంటి ఓడలను నిర్మిస్తూ వెళ్ళండి అని కాదు ఆ ఆజ్ఙ ఉద్దేశం! దానికో సందర్భం వుంది. అలా సందర్భ-పరిమిత ఆజ్ఙలను అన్ని కాలాలలో అందరూ పాటించే ప్రయత్నం చేయకూడదు. ఈ విభాగానికి చెందిన కొన్ని ఆజ్ఙలను క్రింది లేఖనాలలో చూడవచ్చు:

గనుక యెహోవా నీవు వారి మాటలు విని వారికి ఒక రాజును నియమించుమని సమూయేలునకు సెలవియ్యగా” (1సమూయేలు.8:22)

ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలమువరకు యెహోవా ఎదుట ఏడ్చుచుమా సహోదరులైన బెన్యా మీనీయులతో యుద్ధము చేయుటకు తిరిగి పోదుమా? అని యెహోవాయొద్ద విచారణచేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను.” (న్యాయాధిపతులు.20:23)

నీ దేవుడైన యెహోవా వారిని నీకప్ప గించునప్పుడు నీవు వారిని హతము చేయవలెను, వారిని నిర్మూలము చేయవలెను.” (ద్వి.కాం.7:2)

యెహోవా నీవు వెళ్లి ఫిలిష్తీయులను హతముచేసి కెయీలాను రక్షించుమని దావీదునకు సెలవిచ్చెను.” (1సమూయేలు.23:2)

యెహోవా హోషేయద్వారా ఈ మాట సెలవిచ్చెనుజనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించియున్నారు గనుక నీవు పోయి, వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి, వ్యభిచారమువల్ల పుట్టిన పిల్లలను తీసికొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను.” (హోషేయ.1:2)

4) సార్వత్రిక ఆజ్ఙలు: ఇక అన్ని కాలాలకు అందరికి అన్వయించదగిన ఆజ్ఙలనుకూడా దేవుడిచ్చాడు. దైవలేఖనాలలో వాటిని గుర్తించి పాటించాల్సిన ఆవశ్యకత అందరికి అన్ని కాలాలలోనూ వుంది. ఉదాహరణకు,

మీరు ఫలించి అభివృద్ధి నొందుడి; మీరు భూమిమీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి.” (ఆది.కాం.9:7)

పై మాటలను దేవుడు జలప్రళయము తరువాత నోవహుకు ఆయన సంతానానికి ఆజ్ఙాపించాడు. ఈ ఆజ్ఙ సర్వకాలాలకు సర్వజనులకు యివ్వబడిన సార్వత్రిక ఆజ్ఙ. ఈ ఆజ్ఙ సర్వసాధారణంగా అందరికీ అన్నికాలాలకు అన్వయించదగినదైనా ఈ ఆజ్ఙను యిచ్చిన దేవుడే తన సార్వభౌమత్వములో కొందరికి కొన్ని సందర్భాలలో ఈ ఆజ్ఙనుంది మినహాయింపును యివ్వడం జరిగింది. ఉదాహరణకు దేవుడు ప్రవక్త అయిన యిర్మీయకు ఈ ఆజ్ఙ యిచ్చాడు, “ఈస్థలమందు నీకు కుమారులైనను కుమార్తెలైనను పుట్టకుండునట్లు నీవు వివాహము చేసికొన కూడదు” (యిర్మీయ.16:1-2). సార్వత్రిక ఆజ్ఙలనుండి ఇలాంటి మినహాయింపులు అన్నవి సార్వత్రిక ఆజ్ఙలను యిచ్చే దేవునినుండి రావడాన్ని మనం లేఖనాలలో చూడవచ్చు. క్రింది లేఖనాలలోని ఆజ్ఙలు ఈ విభాగానికి చెందినవి:

మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి.” (ఆది.కాం.9:1)

మీ భయమును మీ బెదురును అడవి జంతువు లన్నిటికిని ఆకాశపక్షులన్నిటికిని నేలమీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికిని కలుగును; అవి మీ చేతి కప్పగింపబడి యున్నవి.” (ఆది.కాం.9:2)

ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.” (ఆది.కాం.9:3)

మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు” (ఆది.కాం.9:4)

మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును; దానిగూర్చి ప్రతిజంతువును నరులను విచారణ చేయుదును; ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును.” (ఆది.కాం.9:5)

నరుని రక్తమును చిందించు వాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)

ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు దేవుడిచ్చిన కట్టడలకు/ఆజ్ఙలకు ఆయా వ్యక్తులు విధేయులై నడుచుకోవాలి. సార్వత్రిక కట్టడలకు/ఆజ్ఙలకు మాత్రం అందరు అన్నివేళల విధేయులై నడుచుకోవాలి.

దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల (מִצְוֹתָ֗יו/mishvota) ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి.12:13)

Permalink to single post

మోషేనిబంధన

దేవుడు మోషేద్వారా చేసిన నిబంధనను మోషేనిబంధన [Mosaic Covenant] అని అలాగే పూర్వ/పాత నిబంధన [Previous/Old Covenant] అనికూడా సంబోధిస్తారు.

(1) ఈ నిబంధన దేవుడు ప్రధానంగా ఇశ్రాయేలు వంశస్తులతో చేసాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9).

అయితే, వారితో మాత్రమే కాకుండా నిబంధన సమయములో వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడా లేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతోకూడా (ద్వి.కాం.29:10-15, 29) చేశాడు. ఇది మానవులందరితో చేయబడిన ఆదాము-నిబంధన (ఆది.కాం.3:15-21) లేక నోవహు-నిబంధన (ఆది.కాం.9:1-17) వంటిది కాదు. 

(2) ఈ నిబంధనలో భాగంగా ఇవ్వబడిన నియమవిధులను (ధర్మశాస్త్రాన్ని) ఇశ్రాయేలీయులు పూర్తిగా పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1). ఈ నిబంధనలోనికి ప్రవేశించిన వ్యక్తి (ఇశ్రాయేలీయుడు/యూదుడు) తన జీవితకాలములో ధర్మశాస్త్రములోని యేవొక్కటి తప్పిపోకుండా పాటించాలి. నిబంధనలో పాలుపంపులున్న ప్రతి ఇశ్రాయేలీయుడు/యూదుడు తన జీవితకాలములో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించకపోతే, అంటే ఎప్పుడైనా యేవొక్క ఆజ్ఙ లేక విధి విశయములోనైనా తప్పిపోతే, నిబంధన ప్రకారము అతడు శాపగ్రస్తుడు. (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4) 

(3) ఈ నిబంధనలోని నియమవిధుల ప్రకారము కొన్ని అతిక్రమాలకు మరణమే శిక్ష (సం.కాం.15:30-31). మరిముఖ్యంగా పదిఆజ్ఙలలోని ఆరు ఆజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10). అలాంటి అతిక్రమాలకు ధర్మశాస్త్ర ప్రకారము యేలాంటి విముక్తి లేదు. కాని, ధర్మశాస్త్రము తరువాత ఇవ్వబడిన ప్రవక్తల ఉపదేశము ప్రకారము దేవుడు తన మహా గొప్ప కృపాకనికరాల ఆధారంగా తాను సంకల్పించి యేర్పరచుకొన్న తన సేవకుని అపరాధపరిహారార్థబలినిబట్టి ధర్మశాస్త్రముద్వారా మరణశిక్షకు పాత్రులైన వారందరికి క్షమాపణను అందుబాటులోకి తీసుకొచ్చాడు (యెషయా 53:2-12; దానియేలు 9:24).

దైవచిత్తములోని ఈ నిత్యప్రణాలికయొక్క ఖచ్చితత్వాన్నిబట్టి దేవుడు పాతనిబంధన కాలములో సహితము మరణకరమైన పాపములను చేసినవారినికూడా క్షమించగలిగాడు. ఉదాహరణకు, దావీదు ఊరియా భార్య అయిన బత్షేబ విశయములో చేసిన పాపము దేవుడిచ్చిన పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరడమే. ఈ మూడు ఆజ్ఙాతిక్రమాలలో ధర్మశాస్త్ర ప్రకారము రెండింటికి మరణమే శిక్ష. అయినా, దావీదు దేవుని క్షమాపణను పొందగలిగాడు (2సమూయేలు.12:13). అందుకు కారణం ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తానే త్రొసివేయడముద్వారా దావీదును క్షమించాడని కాదు కాని, ధర్మశాస్త్రబద్దమైన మరణదండన అనే శిక్షను దేవుడు తానే సంకల్పించి యేర్పరచి నెరవేర్చబోతున్న తన కుమారుని అపరాధపరిహారార్థబలిలో నెరవేర్చాడు. అందునుబట్టే దావీదు విరిగినలిగిన హృదయంతో క్షమాపణను కోరినప్పుడు దేవుడతనిని క్షమించాడు (కీర్తన 51:1-19). 

(4) మోషేధర్మశాస్త్రమును తు.చ. తప్పకుండా తన జీవితకాలములో సంపూర్ణముగా పాటించిన వ్యక్తి పాత నిబంధన గ్రంథముగా పేర్కొనబడే యూదుల తనాఖ్ (Old Testament) లో ఎవరూ లేరు. 

ఈనాడు మోషేద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ, దాని ప్రకారం జీవిస్తున్నాము అంటూ భ్రమపడుతున్న వారు క్రింద ఇవ్వబడిన కొన్ని ధర్మశాస్త్ర విధులను పాటించే విశయములో తమ పరిస్తితిని పరిశీలించి చూసుకోవాలి:

i. మీరు ఇంతవరకు తిన్న ఆహారములో పశువుల (ఎద్దు/గొర్రె/మేక/కోడి మొదలైనవి) క్రొవ్వుకూడా వుండిందా? (లే.కాం.3:16) ఒక్కసారి వున్నా మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

ii. తల్లిని లేక తండ్రిని దూశించిన మీ పిల్లలకు ఎప్పుడైనా మరణశిక్ష విధించారా? (లే.కాం.19:27) “మాదేశములో అలాంటిది చట్టపరంగా ఒప్పుకోరండీ” అంటూ సాకులు చెప్పకండి. అలా మీరు చెపితే దేవుని ధర్మశాస్త్రానికన్నా మీరు ఈలోక చట్టానికే గొప్పస్థానమిచ్చీ భయపడి దాసోహమంటున్నారనేగదా దాని భావం! మరోవిశయం, మీ పిల్లలపట్ల మీకున్న ప్రేమ దేవునిపట్లా అలాగే దేవుడు మోషేద్వారా యిచ్చిన ఆజ్ఙలపట్లా వుండాల్సిన ప్రేమకన్న గొప్పదనే కదా?! ఏకారణముచేతనైనా మీరు అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

iii. మీ తల చుట్టూ వెండ్రుకలను, గడ్డపు ప్రక్కలను కత్తిరింపకుండా జీవిస్తున్నారా? (లే.కాం.19:27; యిర్మియా 9:26) గడ్డాన్నే నున్నగా క్షవరం చేసికొని సోగ్గాల్లా తయారవుతుంటే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. తల చుట్టూ వెండ్రుకలను కత్తిరిస్తున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!! 

iv. మీరు వేసుకునే దుస్తులలో వున్ని మరియు జనుపనార (ప్రత్తి/cotton/linen/ఖాదీ) కలిసినవాటిని వేసుకుంటున్నారా? (ద్వి.కాం.22:11) అలా చెస్తే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!  

v. మీరు సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి అక్కడ బలులర్పించి పండుగలను ఆచరిస్ఫున్నారా? (ని.కాం.23:14) లేకపోతే  మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. 

vi. మీరెప్పుడైనా శనివారమునాడు ప్రయాణము చేసారా? (ని.కాం.16:29) అయితే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

vii. మీరెప్పుడైనా శనివారమునాడు ఏపనియైనా చేసారా?(ని.కాం.20:10; లే.కాం.23:3) చేస్తే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

viii. మీరెప్పుడైనా శనివారమునాడు వర్తకములో పాలుగొనడముగాని లేక సరకులు కొనడముగాని చేసారా? (నెహెమ్యా 10:31, 13:15,19; ఆమోసు 8:5) అలా చేసివుంటే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!

ix. విశ్రాంతిదినాచారాన్ని అంటే సబ్బాతు ఆచారాన్ని మీరినవారికి మీ సమాజములో మరణశిక్ష వేసార? (ని.కాం.31:14-15, 35:2) అలా వేయకపోతే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

x. మీ సమాజములో “హాని కలిగిన యెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ” శిక్షగా నియమిస్తున్నారా?(ని.కాం.21:23-25; లే.కాం.24:19-20; ద్వి.కాం.19:21) అలా చేయకపోతున్నట్లయితే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!  

xi.  మీ తలంపులలో లేక హృదయములో మీదికానిది/యితరులది ఆశించిన సందర్భాలున్నాయా? (ని.కాం.20:17) వుంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!

xii. మీరు ఎప్పుడైనా వేరే దేవుని/దేవత పేరును ఉచ్చరించారా? (ని.కాం.23:13) అలా చేసి వున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!  

(5) మోషేధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగమంతా తప్పిపోయిన కారణాన్నిబట్టి పూర్వ/పాత నిబంధన వీగిపోయింది (న్యాయాధిపతులు 2:20; 2రాజులు 17:15-18, 18:11-12; యెషయా 24:5; యిర్మీయ 11:8,10, 31:32; యెహెజ్కేలు 16:59, 44:7; హోషేయ 6:7, 8:1). 

(6) పూర్వ/పాత నిబంధనలో పాలుపంపులున్న వ్యక్తులంతా ఆ నిబంధనలోని నియమాల ప్రకారము శాపగ్రస్తులుగా తేలిపోయారు. నిజానికి, ఈ నిబంధనలోని నియమాల ప్రకారము మానవమాత్రులెవరూ నీతిమంతులుగా తీర్చబడలేరన్నది వెయ్యి సంవత్సరాల (క్రీ.పూ. 1400 – క్రీ.పూ. 400) ప్రవక్తలకాలంలో నిర్ధారణగా తేలిపోయింది (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11). 

(7) పై కారణాలను బట్టి దేవుడైన యెహోవా/యాహ్వే పాత నిబంధన స్థానములో నిత్యము వుండబోయే ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు ప్రవక్తల కాలంలోనే వాగ్ధానము చేసాడు (యెషయా 42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:59-60, 37:24-28). 

ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. ​నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు 16:59-60)

ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. ​అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ 31:31-32) 

(8) అబ్రహామును అలాగే ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులను దేవుడు యెన్నుకొని వారితో చేసిన నిబంధనలద్వారా కేవళము వారిని మాత్రమే అశీర్వదించాలన్నది దేవుని వుద్దేశము కాదు. నిజానికి వారిని అశీర్వదించి వారిద్వారా భూలోకములోని వంశాలన్నిటిని అశీర్వదించాలన్నదే దేవుని నిత్యసంకల్పము (ఆది.కాం.12:1-3, 18:18, 22:18; కీర్తన 22:27-28, 86:9; యెషయా 9:1-2, 11:10, 42:1-4,6, 49:6, 55:1-5, 60:1-3; దానియేలు 7:14; ఆమోసు 9:11-12; హోషేయ 2:23). 

(9) పూర్వ/పాత నిబంధన కాలములోని భక్తులు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించలేక పోవడాన్ని బట్టి ధర్మశాస్త్ర మూలమైన నీతిని పొందలేకపోయారు. అయినా, వారందరూ ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసమూలమైన నీతినిపొంది దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాన్ని పాటించే విశయములో తమవంతు ప్రయత్నాలను చేశారు (ఆది.కాం. 15:5-6; హబక్కూకు 2:4; గలతీ.3:6-9; హెబ్రీ.11:13, 39). 

(10) పాత నిబంధనకాలం ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క సిలువ మరణము వరకు మాత్రమే అన్నది మరచిపోకూడదు. ఈ కారణమును బట్టే ప్రభువైన యేసు క్రీస్తు పవిత్రమైన అమూల్యమైన తన స్వరక్తాన్ని ధారపోయడముద్వారా అంటే తన మరణముద్వారా ప్రతిష్టించి ప్రారంభించబోయే క్రొత్త నిబంధన ఆరంభమువరకు పాత నిబంధన [మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన] యొక్క అసలు అర్థాన్ని తన చుట్టూ వున్నవారికి వివరించి చెప్పాడు, తాను పాటించి చూపాడు, మరియు దాని కోరికను తీర్చి కేవళము ఛాయగా మాత్రమే వుండిన దాని అసలు వుద్దేశాన్ని నెరవేర్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు బాలశిక్షకునిగా వుండిన దాని పాత్రను పూర్తి చేసాడు. తద్వారా క్రొత్త నిబంధనకు దానితోపాటే యివ్వబడే క్రొత్త నియమాలకు [క్రీస్తు ధర్మశాస్త్రానికి] మార్గం సుగమం చేసాడు (మత్తయి 5:17, 28:19-20; యోహాను 13:34-35, 14:25-26,16:12-13; లూకా 22:19-20, 24:44; రోమా.10:4; 1కొరింథీ.9:21; గలతీ.3:24-25).

కనుక, ఈ క్రొత్తనిబంధన కాలములో నిజక్రైస్తవులు అంటే ఆత్మలో తిరిగి జన్మించిన విశ్వాసులు మోషేధర్మశాస్త్రాన్ని కాదు క్రీస్తు (మెస్సయ్య) ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించాలి!

Permalink to single post

తాల్ముద్-జూడాయిజం

తాల్ముద్ అన్నది యూదుమతబోధకులైన రబ్బీలు పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుడిచ్చిన తనాక్ (పాతనిబంధన గ్రంథము) కు వేరుగా వ్రాసుకున్న యూదు మరియు అన్యసాంప్రదాయాలతో కూడిన అనేక గ్రంథాలలో ప్రధానమైనది.

“తాల్మూద్-జూడాయిజం” అన్న మతవిశ్వాసం ప్రధానంగా యూదుమతబోధకులైన రబ్బీల బోధలపై అంటే తాల్ముద్ బోధలపై ఆధారపడినది. కనుక దీన్ని “రబ్బీలజూడాయిజం” (Rabbinic Judaism) అనికూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ జూడాయిజం (Judaism) అనేక శాఖోపశాఖలుగా విడిపోయింది. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా తాల్ముద్-జూడాయిజం లేక రబ్బీలజూడాయిజం అన్నది 175 శాఖలుగా విడిపోయినట్లుగా కొన్ని అధ్యయనాలు చూపిస్తున్నాయి. 70 క్రీ.శ.లో యెరూషలేములోని దేవాలయము అంతముకావటముతో జూడాయిజపు పురోగతికి రెండు తక్షణ ప్రమాదాలను పసికట్టారు రబ్బీలుగా పిలువబడే ఆనాటి యూదుమతబోధకులు. ఒకవైపు యెరూషలేములోని దేవాలయపు నాశనము తనాక్-జూడాయిజపు విధులకు ఆచారాలకు తెరదించితే మరొకవైపు తనాక్-జూడాయిజములోని భక్తిపరులైన వేలాదిమంది యూదులు క్రమక్రమంగా క్రైస్తవ మార్గములోకి మళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే జూడాయిజం అన్నదే వుండదిక. అదే జరిగితే యిక రబ్బీల పాత్రవుండదు వారి ప్రాధాన్యతా వుండదు.

క్రీస్తు శకము రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే రబ్బీలజూడాయిజం (తాల్ముదు-జూడాయిజం) మొలకెత్తి ఐదవ శతాబ్ధముకల్లా వేళ్ళుతన్ని వటవృక్షంగా మారిపోయింది. ఈ ఎదుగుదలలో తాల్ముద్-జూడాయిజం తనాక్-జూడాయిజం నుండి పూర్తిగా వేరై బబులోను లోని ఆచారాలు బోధల ప్రాతిపదికన స్థిరపడి పైకి మాత్రం తనాక్ (పాతనిబంధన గ్రంథం) వేశం ధరించి అంతర్గతంగా తనాక్ యొక్క బోధలకు వ్యతిరేకమైన బోధలను ఆచారాలను ప్రవేశపెడుతూ విస్తరించడం ప్రారంభించింది. నిజానికి ఈరకమైన పోకడలో మొదటి శతాబ్ధములో ప్రారంభమైన నిజక్రైస్తవ్యంనుండి దూరంగా వెళ్ళి ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా పెరిగి విస్తరించిన మతక్రైస్తవ్యానికి మరియు రబ్బీలజూడాయిజానికి దగ్గర పోలికలున్నయనే చెప్పవచ్చు. ఈసందర్భంగా మనం జ్ఙాపకం చేసుకోవలసిన వాస్తవం బైబిల్-క్రైస్తవ్యం లేక నిజక్రైస్తవ్యంలోని విశ్వాసులు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నా వారి సంఖ్య మాత్రం స్వల్పమైనదే. ఈ సత్యం ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలోనే వెల్లడిచేయబడింది:

ఇరుకు ద్వారమున ప్రవేశించుడి; నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే.” (మత్తయి.7:13-14)
“…అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమిమీద విశ్వాసము కనుగొనునా?” (లూకా.18:8)

తాల్ముద్ అన్న పదానికి అధ్యయనం (study) అని అర్థం. తాల్ముద్-జుడాయిజంలో రెండురకాల తాల్ముదు సాహిత్యము వాడుకలోవున్నాయి. ఒకటి, ‘యెరూషలేము తాల్ముద్.’ ఇది 2వ శతాబ్ధము క్రీ.శ. – 3వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో పాలస్తీనాలోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. రెండు, ‘బబులోను తాల్ముద్.’ ఇది 3వ శతాబ్ధము క్రీ.శ. – 4వ శతాబ్ధము క్రీ.శ. మధ్యలో బబులోనులోని రబ్బీలచేత సంకలనం చేయబడింది. కొంతవరకు రెండింటిలోని మూలపాఠాలు ఒకదానితో మరొకటి పోలివున్నా రెండింటిలోని వివరాలు సమాచారాలమధ్య వ్యత్యాసాలుకూడా వున్నాయి. రెండింటిలో బబులోను తాల్ముద్ పెద్దది మరియు క్రొత్తది. కనుక రబ్బీలజూడాయిజంలో బబులోను తాల్ముద్నే ప్రామాణికంగా లేక్కిస్తారు. తాల్ముద్ లో రెండు భాగాలుంటాయి—‘మిష్నా’ (Mishna) మరియు ‘గమారా’ (G’mara).

‘మిష్న’ అన్నది రబ్బీలచేత సంకలనము (compiled) మరియు సంపాదకత్వము (edited) చేయబడిన మౌఖికతోరా (Oral Torah) యొక్క గ్రంథస్థరూపముకాగా, ‘గమరా’ అన్నది మౌఖికతోరా (Oral Torah) యొక్క రబ్బీల వ్యాఖ్యానభాగము (commentary). మొత్తానికి తాల్ముదులోని ఈ రెండు భాగాలుకూడా యూదు మత పెద్దలైన రబ్బీల సృష్టి అన్నది గుర్తుంచుకోవలసిన విశయం!

జూడాయిజం లోని అన్ని శాఖలు తాల్ముద్ సాహిత్యానికి ఒకేవిధమైన ప్రాధాన్యత నివ్వవు అన్నది గమనార్హమైన విశయం. కొన్ని జూడాయిజం శాఖలు తాల్ముద్ గ్రంథాలను రబ్బీల సృష్టిగా గుర్తించి వాటిని తృణీకరిస్తున్నాయి. కారైటు జూడాయిజం, మధ్యయుగం లోని జూడాయిజం మార్మిక శాఖలు, రిఫామ్డ్ జూడాయిజం వారు, ఆధునిక యూదులు మొదలైన జుడాయిజం శాఖలు తాల్మూద్ గ్రంథాలను తిరస్కరిస్తారు.

క్రీస్తు శకము 1వ శతాబ్ధపు మొదటి అర్థభాగములోనే తనాక్-జూడాయిజం (బైబిలు జూడాయిజం) కు తెరపడటముతో రబ్బీలు బెంబేలెత్తిపోయారు. యూదుజాతిని యూదుమతాన్ని సమ్రక్షించే తన బృహత్తర ప్రణాళికలో భాగంగా రబ్బి అకివ రెండవ శతాబ్ధపు ప్రారంభములోనే యూదుమతకొనసాగింపుకు అసలు దేవాలయముతోనే పనిలేకుండా నిరాటంకంగా కొనసాగగలిగే క్రొత్త జూడాయిజపు స్థాపనకై వేరొక తోరా (ఉపదేశము/ధర్మశాస్త్రము) ఆవిశ్కరణకు పూనుకొని మోషేతోపాటు యితర పాతనిబంధన ప్రవక్తలు ఎవరూ కని విని యెరుగని ‘మౌఖిక తోరా’ అన్న భావనకు (concept) రూపకల్పన చేసి దానికి యూదులమధ్య చెల్లుబాటును సంపాదించగలిగాడు. 200 క్రీ.శ. ప్రాంతములో ‘రాజకుమారుడు యూదా’ (Judah the Prince/యెహుదా హనసి: 135 క్రీ.శ.- 217 క్రీ.శ.) అనే రబ్బి మౌఖికతోరాగా చెల్లుబాటుసంపాదించిన యూదుబోధలను (Jewish teachings), పురాణాలను (legends), పిత్రుపారంపార్యాచారాలను (tranditions), ప్రాచిన జ్ఙానబోధలను (ancient wisdom), కొంత యూదుచరిత్రను (Jewish history) సేకరించి వాటన్నిటిని రంగరించి తన సంపాదకత్వముతో క్రొత్త జూడాయిజపు వుద్దరణకు తగిన మతబోధలు, ఆచారాలు, విధులతో కూడిన గ్రంథాన్ని సిద్దపరచి రాబోవుతరాలకు వుపయుక్తంగా వుండేందుకు గ్రంథరూపములో భద్రపరిచాడు. అదే ‘మిష్నా’గా పేరుస్థిరపరచుకొని వాడుకలోకి వచ్చింది.

రబ్బీలు అనబడే యూదా మతబోధకుల కథనం ప్రకారం సీనాయి కొండపై దేవుడు మోషేకు రెండు తోరాలను (ధర్మశాస్త్రాలను) యిచ్చాడట!  అందులో ఒకటి వ్రాతపూర్వకంగా యివ్వబడిన తోరా (Written Torah) మరొకటి మౌఖికతోరా లేక నోటిమాటతో యివ్వబడిన మొదటి తోరా యొక్క వివరణ (Oral Torah). అయితే, బైబిలులో మాత్రం యిందుకు సంబంధించి ఎలాంటి ఆజ్ఙకాని, వివరణగాని, లేక సూచనగాని యివ్వబడలేదు. మోషేద్వారా వ్రాతపూర్వకంగా యిచ్చిన తోరా విశయములో దేవుడు అనేక పర్యాయాలు బైబిలులో సూచించాడు. కాని, మౌఖిక తోరాగా పిలువబడుతున్న రెండవ తోరానుద్దేశించి ఒక్కమాటకూడా మోషేగాని లేక ప్రవక్తలుగాని యేమాటా చెప్పలేదు. ఈ రెండవ తోరా/మౌఖిక తోరా అన్నది యూదుల పితృపారంపార్యాచారాల (traditions of men) ఆధారంగా వునికిలోకి వచ్చి రబ్బీల చేతిలో ప్రామాణికత్వాన్ని మరియు గ్రంథరూపాన్ని సంతరించుకొన్న రబ్బీల స్వసృష్టి అన్నది చెప్పకనే తెలుస్తోంది.

కేవలం యూదుల పిత్రుపారంపార్యాచారాలేకాక పుక్కిటిపురాణాలు (legends) ప్రాచీనుల జ్ఙానసముర్పార్జనలతోపాటు మోషేధర్మశాస్త్రములో వ్రాయబడని ఆచారవివరాలు సహితం రబ్బీల చొరవతో వునికిని సంతరించుకొని మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవ ధర్మశాస్త్రము) రూపములో విరాజిళ్ళుతున్నాయి. ఈకారణంగా తాల్ముదు బోధలు చాలావరకు దైవప్రేరణతో లిఖితరూపములో అందించబడిన మోషేధర్మశాస్త్రముయొక్క బోధలకు వేరుగా మరియు వ్యతిరిక్తంగా వుండటం కద్దు. ఈ వాస్తవాన్ని గ్రహించిన అనేకమంది ఆధునిక యూదుజాతీయులు మతవిశ్వాసాలనే పరిత్యజించి నాస్తికులుగా మారిపోయారు. ప్రపంచములోని మతాలన్నిటిలో నిమ్నమతాసక్తిగలవారు యూదులు. ఈ నేపథ్యములో ప్రపంచవ్యాప్తంగా వున్న యూదులలో కేవళం 38% మాత్రమే మతవిశ్వాసాలకు విలువనిచ్చేవారన్నది  గమనార్హం (HAARETZ, New Poll Shows Atheism on Rise, with Jews Found to Be Least Religious. Website: https://www.haaretz.com/jewish/jews-least-observant-int-l-poll-finds-1.5287579. Accessed date: 17-12-2018).

ఈనాటి జూడాయిజములో (రబ్బీలజూడాయిజములో) సత్యముందని బ్రమించి అందులోకి మతమార్పిడిపొందిన వారిని విస్మయపరచే ఒక వాస్తవమేమిటంటే ఈనాటి రబ్బీలజూడాయిజంకు (తాల్ముద్-జూడాయిజం) మూలపురుషునిగా వుండి దానికి రూపకల్పన చేసినది యూదుడుకాదుగాని ఒక అన్యుడు. అది రబ్బీ అకివ (50 క్రీ.శ.-135 క్రీ.శ.). సిసెరా అనబడిన ఒక దుష్టుడైన అన్యుని వంశములోనుండి వచ్చి జూడాయిజములోకి మతమార్పిడి పొందినవాడు రబ్బీ అకివ (Jewishhistory.org. Rabbi Akiva. Website: https://www.jewishhistory.org/rabbi-akiva-2/, date of access: 18-12-2018). గమనించాలి, అన్యులెవరైనా జూడాయిజములోకి మతమార్పిడిపొందితే అలాంటివారికి ఇశ్రాయేలీయులనిగాని లేక యూదులనిగాని దేవుడు పేర్కొన్నట్లు తనాక్ అంతటిలో ఎక్కడా ఆధారాలు లేవు. దైవలేఖనాలైన తనాక్ (పాతనిబంధనగ్రంథము) బోధప్రకారము అలాంటి అన్యులు నిజదేవున్ని నమ్ముకున్న “అన్యులైన విశ్వాసులుగా” కొనసాగాలి. వారు దేవుని ప్రజలమధ్య నివసింపవచ్చు. దేవుని ప్రజలతో కలిసి మోషేధర్మశాస్త్రాన్ని పాటించి, దేవుని ప్రజలతో కలిసి దేవుని దీవెనలలో వారు పాలుపొందవచ్చు. అంతేకాక, ఇశ్రాయేలీయులను/యూదులను వివాహముకూడా చేసుకోవచ్చు. అలాంటిసందర్భాలలో వారి సంతానము మిశ్రమసంతానముగా లెక్కించబడదు. అయినప్పటికిని వ్యక్తిగతంగా వారికిమాత్రము తనాక్ లేఖనాలు ఇశ్రాయేలీయులని/యూదులని ససేమిరా గుర్తింపు నివ్వదు. ఈ వాస్తవాన్ని గ్రహించని అనేక అమాయక యూదేతరులు తాల్ముద్-జూడాయిజములో చేరి తాము యూదులమయ్యామన్న భ్రమలో కొనసాగుతున్నారు. అలాంటివారిని వుద్దేశించి మెస్సయ్య పలికిన మాటలు కటువైన మాటలు–

యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను;” (ప్రకటన 3:9).

అయితే, ఈనాడు రబ్బీలజూడాయిజములో తనాక్ బోధలకు వ్యతిరేకమైన అనేక బోధలు ఆచారాలు వాడుకలోకి వచ్చాయి. అవి రబ్బీల బోధలలో పుట్టిన మానవకల్పితాలు అన్నది సత్యాన్వేషకులు మరవకూడదు (యెషయా 29:13).

దాదాపుగా క్రీస్తు శకము రెండవ శతాబ్ధములో రబ్బీ అకివ మౌఖికతోరా (నోటిద్వారా యివ్వబడిన రెండవధర్మశాస్త్రము/Oral Torah) అనబడే మోషేధర్మశాస్త్రానికి (మోషే-తోరా) వేరుగా మరొక ధర్మశాస్త్రాన్ని (అన్యధర్మశాస్త్రాము) సిద్ధంచేసి యూదులకు అందించాడు. అదే గత 2000 సంవత్సరాలుగా యూదు మతాచారాలకు జీవనశైలికి అంతిమ తీర్పరిగా మరియు దిశనిర్ధారణకు దిక్సూచిగా కొనసాగుతున్నది. మోషేధర్మశాస్త్రాన్ని పక్కకుబెట్టి దానిస్థానములో వేరొక ధర్మశాస్త్రాన్ని ప్రవేశపెట్టడముద్వారా జూడాయిజపు మతస్తులను ప్రక్కదోవ పట్టించిన అన్యజాతీయుడైన రబ్బీ అకివను తప్పుబట్టేదిపోయి ఈనాటి జూడాయిజం వారు  మోషేఅంతటివాడు అంటు రబ్బీ అకివకు కితాబునిచ్చి అందలమెక్కించి ఆయన సహకారంతో వునికిలోకి వచ్చిన మౌఖికతోరాకు దాసోహమంటూ మానవకల్పిత మతాచారాలతో నిజదేవునికి దూరంగా కొనసాగుతున్నారు. ఈ బాపతు మతమూఢులను చూసి మెస్సయ్య అయిన యషువ (యేసు క్రీస్తు) “మీరు నియమించిన మీ పారంపర్యాచారమువలన దేవుని వాక్యమును నిరర్థకము చేయుదురు” (మార్కు 7:13) అంటూ మందలించడం జరిగింది.

బైబిల్-జుడాయిజముకు ప్రతికూలంగా అవతరించి కొనసాగుతున్న రబ్బీలజుడాయిజం లేక తాల్ముద్-జూడాయిజమే అంత్యకాల జూడాయిజం! ఈరకమైన జుడాయిజమును అనుసరిస్తున్నవారిలో అనేకమంది దేవుని లేఖనాలను అలాగే దేవుడే అభిషేకించి పంపించిన యషువ హ-మషియాఖ్ (యేసు క్రీస్తు) ను తిరస్కరించడమేగాక ఆయనను దుర్భాషలాడుతూ మొదటిశతాబ్ధములో ఆయనను సిలువకప్పగించిన యూదామతపెద్దల స్థాయిలో ఆయనను ద్వేశిస్తూ దూశిస్తూ తాము అపవాదిసంతానమన్న వాస్తవాన్ని నిరూపించుకుంటూ దైవదుషణకు మరియు సత్యతిరస్కారానికి పాల్పడుతున్నారు. వీరి కుయుక్తులకు కుతర్కాలకు అనేకమంది నామకార్థ క్రైస్తవులు యిదివరకే మోసపోయి వారి అడుగుజాడలలో క్రొత్తనిబంధన తిరస్కరిస్తూ, యేసు ప్రభువును ద్వేశిస్తూ తద్వారా దైవదూషణకు పాల్పడుతూ సాతాను సంబంధులుగా నాశనపుత్రులుగా జీవిస్తున్నారు. వీరి ప్రయత్నాలకు విశ్వాసులు సహితం విశ్వాసబ్రష్టులయ్యే అవకాశముందంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి,

అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణవలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి, విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు.” (1తిమోతి.4:1-2)

Permalink to single post

తనాక్-జూడాయిజం

ఈనాటి యూదులు మరియు యూదామతప్రవిష్టులు క్రొత్తనిబంధన గ్రంథాన్ని దైవలేఖనాలుగా ఒప్పుకోరు విశ్వసించరు. వారిదృష్టిలో కేవళము క్రైస్తవులు పాతనిబంధన గ్రంథముగా పేర్కొనే 39 హిబ్రూ లేఖనగ్రంథాలు మాత్రమే దైవలేఖనాలు. దీన్నిబట్టి యూదులు/యూదామతప్రవిష్టులు తాము దైవలేఖనాలుగా విశ్వసించే 39 హిబ్రూ లేఖనగ్రంథాలను (పాతనిబంధన గ్రంథాన్ని) పాతనిబంధన గ్రంథము అని పేర్కొనకుండా “తనాక్” (TaNaK) అన్న ఒక క్రొత్తపేరుతో పిలుస్తారు. 

తనాక్ (TaNaK) అంటే యూదుల పరిభాషలో కేవళము 39 హిబ్రూ లేఖనగ్రంథాల సంపుటి అయిన పాతనిబంధన గ్రంథము. దీన్నే హిబ్రూ భాషలో మిక్రా (Mikra) అనికూడా సంబోధిస్తారు.తనాక్ లోని  39 హిబ్రూ లేఖనగ్రంథాలను యూదులు మూడు ప్రధాన భాగాలుగా విభజించారు–తోరా/Torah (మోషేద్వారా యివ్వబడిన పంచకాండాలు), నెవియిం/Nevi’im (ప్రవక్తలు), మరియు కెతువిం/K’etuvim (వ్రాతలు/లేఖనాలు). ఇవి పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయబడిన దైవ సందేశముతో కూడిన గ్రంథాలు. ఈ 39 గ్రంథాలు 1000 సంవత్సరాల కాలంలో వ్రాయబడ్డాయి (1400 క్రీ.పూ.— 400 క్రీ.పూ.). మూడు హిబ్రూ పదాలలోని (Torah, Nevi’im, K’etuvim) మొదటి అక్షరాలను చేర్చి తనాక్ (TaNaK) అన్న పదాన్ని యేర్పరచుకున్నారు యూదులు. 

“తనాక్ ధార్మిక మార్గం” అన్న మతవిశ్వాసం కేవలం తనాక్ (పాతనిబంధన గ్రంథము) లోని దైవలేఖనాలపై మాత్రమే ఆధారపడిన మతవిశ్వాసం. ఈ మతవిశ్వాసాన్ని బైబిలు విశ్వాసము అనికూడా పేర్కొనవచ్చు. ఇది యెరూషలేములో హేరోదు కట్టించిన రెండవ మందిరము 70 క్రీ.శ. లో నాశనము/ద్వంసము చేయబడినతరువాత క్రమక్రమంగా వునికిని కోల్పోయింది. అంతకు పూర్వము తనాక్ ధార్మిక మార్గం లోని భక్తిపరులు చాలావరకు యేసును (యషువను) క్రీస్తుగా (మెస్సయ్యగా) గుర్తించి ఆయనను వెంబడించి క్రైస్తవులుగా మారిపోయారు. ఆరకంగా తనాక్ ధార్మిక మార్గం తన అస్తమయసమయానికంటే ముందే తనలో రూపుదిద్దుకున్న బైబిలు-క్రైస్తవ్యానికి పురుడుపోసి దేవుని ఆత్మీయ ప్రణాలికలో తన పాత్రను ముగించుకొని తన వారసుడైన “క్రొత్తనిబంధన సమాజము”లో క్రొత్త పేరుతో చిరంజీవిగా నిలిచిపోయింది (యెషయా 65:15).

తనాక్-జూడాయిజం ప్రధానంగా మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రములోని ఆజ్ఙలు, విధులు, గుడారము/దేవాలయము లోని అర్చనాదులు, బలులు, నైవేధ్యాలు, శిక్షలు మొదలైనవాటిచుట్టు కేంద్రీకృతమైనది. అయితే, 70 క్రీ.శ.లో రోమాసైన్యము యెరూషలేములోని దేవుని మందిరాన్ని నాశనముచేసి యూదులమతకేంద్రాన్ని ద్వంసం చేయడముతో తనాక్-జూడాయిజం తన అంతిమదశకు చేరుకున్నది. నిజానికి 40 సంవత్సరాలకుముందే అంటే దాదాపు 30 క్రీ.శ.లో దేవుని ప్రణాలికలోని మానవనిర్మిత మందిరముకుండిన ప్రధాన వుద్దేశము నెరవేర్చబడి సంపూర్ణము చేయబడింది. దేవుని సన్నిధిలో సర్వకాలాలకు సరిపోయిన దైవసుతుని బలియాగము సృష్టిలో దైవసాక్షిగా అర్పించబడింది. దానికి సాదృశ్యంగా పరిశుద్ధస్థలానికి మరియు అతిపరిశుద్ధస్థలానికి మధ్యలో వుండిన తెర తొలగి ప్రతిసంవత్సరము ఒకసారిమాత్రమే దేవుని ప్రజల పాపాలప్రాయశ్చిత్తార్థమై ప్రధానయాజకుడు పశువుల రక్తముతో దేవునిమందిరములోని అతిపరిశుద్ధస్థలములోకి ప్రవేశించే ఆగత్యానికి తెరపడింది. ఈరకంగా తనాక్-జూడాయిజం యొక్క అంతిమదశకు నాంది పడింది. అక్కడే క్రొత్తనిబంధనాసమాజానికి అంకురార్పణ జరిగింది. అయితే, అదేసమయంలో తనాక్-జుడాయిజం కు వేరుగా మరియు ప్రతికూలంగా తాల్మూద్-జూడాయిజం అనే ఒక క్రొత్త జూడాయిజం మొలకెత్తింది. దాన్నే రబ్బీలజూడాయిజం అనికూడా పేర్కోంటారు. అదే ఇనాటి ప్రపంచములో యూదుమతంగా పేరొంది విస్తరిస్తున్నది.

“బైబిల్-క్రైస్తవ్యం” లేక “క్రొత్తనిబంధనాసమాజం” అన్నది మోషేనిబంధన కాలములోనే దేవుడు వాగ్ధానం చేసిన వేరొక నిబంధనకు చెందిన దేవునిప్రజలు (ద్వి.కాం.32:21; కీర్తన.82:8). ఆ వేరొకనిబంధననే “క్రొత్తనిబంధన” అని లేఖనాలు అభివర్ణించాయి. కొందరు తప్పుగా అభిప్రాయపడుతున్నట్లు ఇది నూతనపరచబడిన మోషేనిబంధన కాదు. అసలు యిది మోషేనిబంధనవంటిదేమాత్రము కాదు. “అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు” అంటూ దేవుడే విస్పష్టముగా సెలవిచ్చినవిధంగా ఆ “క్రొత్తనిబంధన” మోషేనిబంధనవంటిది కాదు అన్నది గమనార్హమైన విశయము. అంతేకాక దేవుడే ఈ నిబంధనకు ‘నిత్యనిబంధన’ అంటూ మోషేనిబంధనకులేని ఉత్కృష్టస్థానాన్ని గుర్తింపును తనముద్రగా యిచ్చాడు (యిర్మీయ 31:31-34, 32:37-40).

పాత/పూర్వ నిబంధనగా వున్న మోషేనిబంధనలో భాగంగా యివ్వబడిన మోషేధర్మశాస్త్రము గుడారము/దేవాలయము మరియు దాని ఆచారాలతో విధులతో ముడిపడివుంది. అయితే, క్రొత్తనిబంధనలో భాగంగా అక్షరార్థముగా అలాంటి ఆచారాలు విధులు ఎవీ లేని క్రొత్తధర్మశాస్త్రము లేక క్రీస్తుధర్మశాస్త్రము (Law of Christ—యెషయా.42:4; గలతీ.6:2) యివ్వబడింది (యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6). ఈ క్రొత్తనిబంధనాప్రజలే క్రీస్తు అనబడిన యేసు యొక్క శిష్యులు లేక క్రైస్తవులు. 30 క్రీ.శ.తరువాత ప్రారంభమైన క్రైస్తవ్యం మొదట్లో ఒక దశాబ్ధానికిపైగా కేవళము యూదులతో ప్రారంభమై యూదులమధ్యే విస్తరించింది. ఆ సమయములో కొన్ని వేల యూదులు సత్యాన్ని గ్రహించి జూడాయిజంను వదిలి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు (అపో.కా.21:20).

క్రైస్తవుడు (Christian) అంటే ‘క్రీస్తును వెంబడించే వాడు’ (follower of Christ)అని భావం. ప్రారంభములో ప్రభువైన యేసుక్రీస్తు శిష్యుల యొక్క ప్రత్యేకమైన విశ్వాసము మరియు అబ్బురపరచే జీవనవిధానాలు అన్యులను/అవిశ్వాసులను కదిలించివేసాయి. శిష్యులకున్న ఆ విశిష్ట గుణలక్షణాలే వారు క్రీస్తును వెంబడించే వారని అన్యులు/అవిశ్వాసులు గుర్తించేందుకు తోడ్పడ్డాయి. దాంతో అన్యులు/అవిశ్వాసులు శిష్యులను ఆ పేరుతో అంటే ‘క్రైస్తవులు’ అంటూ పిలవడం మొదలుబెట్టారు (అపో.కాం.11:26). యేసుక్రీస్తునందు విశ్వాసముద్వారా దేవుని పిల్లలైనవారికి క్రైస్తవులు (Christians) అన్న పేరు దైవలేఖనాలు ప్రమాణీకరించడాన్ని క్రొత్తనిబంధనలో చూడగలము (1పేతురు 4:16).

« Older Entries Recent Entries »