“రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” (హెబ్రీ.9:22)
బైబిలు బోధలలో రక్తానికి [blood] మరియు ప్రాయశ్చిత్త [atonement] ప్రయత్నాలకు అవినాభావ సంబంధముంది. లేఖనాల బోధప్రకారము ప్రాయశ్చిత్తమన్నది ఎంతో విలువైనది, అందునుబట్టే ప్రాణాన్నే ఫణంగా పెడితె తప్ప ప్రాయశ్చిత్తానికి మార్గము లేదు అన్నది బైబిలు సూత్రము. ఈ సూత్రాన్ని ప్రతిబింబిస్తు పాత మరియు క్రొత్త నిబంధనా లేఖనాలు మానవుల పాపాలకు ప్రయశ్చిత్తమార్గాలను నిర్ధేశిస్తూ వాటి నెరవేర్పులను మరియు వాటి ఫలితాలను వివరిస్తున్నాయి.
ఈ కారణాన్నిబట్టి బైబిలు ప్రకటించే పాపక్షమాపణ మరియు నిత్యజీవాలను సరిగ్గా అర్థం చేసుకోవటానికై రక్తమునుగురించి మరియు ప్రాయశ్చిత్తమునుగురించి అలాగే వాటిమధ్యవున్న సంబంధాన్నిగురించి లోతుగా ధ్యానించాల్సిన ఆవశ్యకత వుంది.
కొందరు హెబ్రీపత్రిక 9:22 లోని “రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” అన్న క్రొత్తనిబంధన ప్రకటన “రక్తము దేహమునకు ప్రాణము. మీనిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠముమీద పోయుటకై దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమునుబట్టి ప్రాయశ్చిత్తము చేయును” (లేవీయకాండము 17:11) అన్న పాతనిబంధన వచనానికి వివరణ లేక వ్యాఖ్యానము అంటూ అభిప్రాయపడుతుంటారు. నిజానికి అలాంటి అభిప్రాయాన్ని సమర్ధించే ఆధారాలేవి హెబ్రీ పత్రిక 9:22 లో లేవు.
“రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు” అన్నది క్రొత్తనిబంధనలోని ప్రబోధం. అయితే యిది పాతనిబంధన కాలములో ఛాయారూపకంగా పాపపరిహారార్థము నిమిత్తము అర్పించబడిన రక్తబలుల యొక్క సమిష్టి నిజస్వరూపము క్రీస్తునందు నెరవేర్చబడటాన్ని సూచిస్తున్నది. ఇక్కడ “రక్తము చిందించబడుట” అన్న పదజాలము యొక్క భావము కేవలము రక్తాన్ని వొలికించడమని కాదు. రక్తము కారేవిధంగా శరీరాన్ని గాయపరచడమో లేక ఒక అంగాన్ని తెగనరకడమో కాదు. “రక్తము చిందించుట” అంటే “ప్రాణము తీయడము” అని భావము.
“నరుని రక్తమును చిందించువాని రక్తము నరునివలననే చిందింపబడును; ఏలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను.” (ఆది.కాం.9:6)
రక్తము ప్రాణమునకు ఆధారము. మరో మాటలో చెప్పలంటే, రక్తమే ప్రాణము అని చెప్పవచ్చు. ఆ కారణాన్నిబట్టే “మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును” అంటూ ప్రభువైన దేవుడు నోవహు నిబంధనలో భాగంగా పేర్కొనడం జరిగింది. పై వాక్యములోని “నరుని రక్తము చిందించుట” అన్నది నరుని ప్రాణము తీయుటను సూచిస్తున్నది.
సర్వసాధారణంగా నిబంధనలు రక్తం చిందించడముద్వారా అంటే ఒక ప్రాణిని బలి అర్పించడముద్వారా ప్రారంభమవుతాయి. క్రొత్తనిబంధన మరియు పాతనిబంధన రెండు నిబంధనలు కూడా బలులద్వారానే ప్రారంభించబడ్డాయి (ని.కాం.24:3-8; లూకా.26:26-28).
క్రొత్తనిబంధనా నియమాల ప్రకారము మానవాళికి పాపక్షమాపణను అందించడములో “రక్తము చిందించడము” యొక్క పాత్రను గ్రహించటానికి పాతనిబంధనా నియమాలలోని బలుల పాత్రను ధ్యానించి చూడాలి.
దుర్బోధలు
నేటి ఆధునిక జుడాయిజములోని కొందరు రబ్బీలుగా చలామణి అవుతున్నవారు [రబ్బి డానియెల్ అసొర్, రబ్బి టోవియా సింగర్, రబ్బి బ్లూమెంతాల్ మొదలగువారు] అలాగే ఈనాటి యూదా మతప్రవిష్టులు క్రైస్తవ విశ్వాసాన్ని తిరస్కరించే ప్రయత్నములో క్రొత్తనిబంధనా బోధలను తప్పుబట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. తమ ప్రయత్నాలలో భాగంగా క్రొత్తనిబంధనా బోధలను అలాగే క్రైస్తవ విశ్వాసాలను వక్రీకరించడమేగాక పాతనిబంధనా బోధలనుకూడా చెరుపుతు దుర్బోధలకు పాల్పడుతున్నారు. వారు పాతనిబంధన గ్రంథములో మానవుల పాపాలకు ప్రయశ్చిత్తము జరిగించడములోని “రక్తము” యొక్క పాత్రకు సంబంధించి క్రింది దుర్బోధలకు పాల్పడుతున్నారు:
1) రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు [❌]
2) రక్తము/బలి కేవలము తెలియక చేసిన పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తము చేయగలదు [❌]
3) రక్తము/బలి లేకుండానే పశ్చత్తాపహృదయములోనుండి వచ్చిన మాటలు పాపములకు క్షమాపణను అందించగలవు [❌]
పై బోధలు ఏరకంగా దైవలేఖనాలైన పాతనిబంధన లేఖనాలకు వ్యతిరేకమోనన్నది కూలంకశంగా పరిశీలించెందుకు ముందు అవి పురాతన రబ్బీలు వ్రాసిపెట్టిన తాల్ముదు గ్రంథాలకుకూడా వ్యతిరేకమైన బోధలన్నది క్రింది ఆధారాలు నిరూపిస్తున్నాయి:
“ప్రాయశ్చిత్తము అన్నది కేవలము రక్తముద్వారానే సంభవిస్తుంది.” [తాల్ముద్ ట్రాక్టేట్ జెవాహిం 6అ]
“…ప్రాయశ్చిత్తము రక్తముద్వారానేకదా వచ్చేది?” [ట్రాక్టేట్ యొమ 5అ]
మోషేధర్మశాస్త్రములో ప్రాయశ్చిత్తార్థ బలులు
పాతనిబంధనా నియమాలతోకూడిన మోషేధర్మశాస్త్రములో ఆజ్ఙాతిక్రమాలనుండి, అపరాధాలనుండి లేక పాపాలనుండి పవిత్రపరచబడటానికి, క్షమాపణ పొందటానికి, మరియు ప్రాయశ్చిత్తం జరిపించబడటానికి మూడు రకాల బలులు నిర్ధేశించబడ్డాయి:
– దహన [עוֹלָה֙/ఒలా] బలులు (లే.కాం.1:4; యోబు.1:5; 42:8)
– పాపపరిహారార్థ [חַטָּאָה/ఖట్’టాహ్] బలులు (లే.కాం.4:3; 5:6-7,8-9)
– అపరాధపరిహారార్థ [אָשָׁם/ఆషాం] బలులు (లే.కాం.5:6-7,18-19; 6:6-7).
అదేసందర్భములో ఆ యా బలులను అర్పించాల్సిన విధానాలను గురించి కూడా విస్పష్టమైన సూచనలు యివ్వబడ్డాయి (లే.కాం.1-7 అధ్యాయాలు; సం.కాం.5,15 అధ్యాయాలు). మోషేధర్మశాస్త్రము ప్రకారము ప్రాయశ్చిత్తార్థబలులు రెండు దఫాలుగా అర్పించబడేవి. మొదట సమాజమంతటి ప్రాయశ్చిత్తార్థము బలులర్పించబడేవి. అటుతరువాత వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము కొరకుకూడా బలులర్పించబడేవి.
సమాజ బలులు
సమాజము తరపున అర్పించబడే బలులలో ప్రతిదినము ఉదయము ఒక బలి మరియు సాయంకాలము ఒక బలి దహనబలిగా అర్పించడేవి (ని.కాం.29:38-42; సం.కాం.28:3-8; 1దిన.వృ.16:40). ఈ సందర్భంగా బలిపీఠముపై అన్నివేళలలో నిత్యము దహనబలులను దహిస్తూ అగ్ని మండుచు వుండేది అన్న సత్యాన్ని జ్ఙాపకముంచుకోవాలి (లే.కాం.6:12-13)
తెలియక చేసిన పాపముల నిమిత్తం సమాజమంతా ప్రాయశ్చిత్తార్థ బలులను అర్పిస్తూ వుండాలి. తెలియకచేసిన పాపము తెలియపరచబడిన సందర్భములో సమాజము బలినర్పించాలి (లేవీ.4:13-21). ఇవిగాక, సంవత్సరానికి ఒకసారి ప్రధానయాజకుడు తనకు, తన కుటుంభముకు మరియు సమాజమంతటికి సమస్త పాపములనుండి అంటే, బలులు నిర్ధేశించబడిన పాపాలన్నింటికి లేక బలులు నిర్ధేశించబడిన తెలిసితెలియక చేసిన పాపాలన్నింటికి ప్రాయశ్చిత్తము కలుగుటకై బలినర్పించాలి (ని.కాం.30:10; లే.కాం.16:1-34).
“ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులుగాని మీ మధ్యనుండు పరదేశులుగాని మీరందరు ఏడవనెల పదియవ నాడు ఏ పనియైనను చేయక మిమ్మును మీరు దుఃఖపరచు కొనవలెను. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపములనుండి [חַטָּאָה/ఖట్’టాహ్]పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్ము పవిత్రపరచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను…మరియు అతడు యాజకుల నిమిత్తమును సమాజము నిమిత్తమును ప్రాయశ్చిత్తము చేయవలెను. సంవత్సరమునకు ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములనుబట్టి [חַטָּאָה/ఖట్’టాహ్] వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను.” (లే.కాం.16:29-34)
వ్యక్తిగత బలులు
వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము అర్పించబడే బలులలో సమాజములోని ఒక వ్యక్తి తెలియక చేసిన పాపాల నిమిత్తం బలులర్పించబడేవి.
వ్యక్తిగత ప్రాయశ్చిత్తార్థము అర్పించబడే బలులలో భాగంగా సమాజములోని వ్యక్తులు వ్యక్తిగతంగా తాము తెలియక చేసిన పాపాలనుగురించి తెలుసుకున్నప్పుడు ప్రతివ్యక్తి తన స్వంత పాపాల నిమిత్తం బలులర్పించాలంటూ లేఖనాలు స్పష్టముగా సూచించాయి (లేవి.కాం.4:1-12; 5:1-19).
అయితే, ఈ సందర్భంగా యివ్వబడిన సూచనలలో ప్రాయశ్చిత్తార్థము బలిపషువును లేక బలిపక్షిని అర్పించే స్తోమత/ఆర్థిక పరిస్థితి లేని పేదవారి కొరకు యివ్వబడిన ప్రత్యేకమైన వెసళుబాటు వివరాలను మరియు సందర్భాన్ని సరిగ్గా అవగాహన చేసుకోలేక వాక్యసత్యాన్ని వక్రీకరిస్తూ “రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు” అనే వాక్యవ్యతిరేకమైన బోధను [దుర్బోధ] అబద్దబోధకులు ప్రవేశపెట్టారు.
లేవీయకాండములోని 5వ అధ్యాయములో పాపాల ప్రాయశ్చిత్తార్థము పేదవారి కొరకు యివ్వబడిన ప్రత్యేకమైన వెసళుబాటు వివరాలను మరియు సందర్భాన్ని పరిశీలించి చూద్దాము:
“ఒకడు ఒట్టుపెట్టుకొనినవాడై తాను చూచినదాని గూర్చిగాని తనకు తెలిసినదానిగూర్చిగాని సాక్షియై యుండి దాని తెలియచేయక పాపము చేసినయెడల అతడు తన దోషశిక్షను భరించును. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టినయెడల, అది అపవిత్రమృగ కళేబరమేగాని అపవిత్రపశు కళేబరమేగాని అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమేగాని అది అపవిత్రమని తనకు తెలియక పోయినను అతడు అపవిత్రుడై అపరాధి యగును. మనుష్యులకు తగులు అపవిత్రతలలో ఏదైనను ఒకనికి తెలియకుండ అంటినయెడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగినయెడల ఆ సంగతి తెలిసిన తరువాత వాడు అపరాధి యగును. మరియు కీడైనను మేలైనను, మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసెదమని పలుకు మాటలలో మరి దేనినైనను యోచింపక చేసెదనని యొకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకొనిన యెడల, అది తెలిసిన తరువాత వాడు అపరాధియగును. కాబట్టి అతడు వాటిలో ఏవిషయమందైనను అపరాధియగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపమును ఒప్పుకొని తాను చేసిన పాపవిషయమై యెహోవా సన్నిధికి మందలోనుండి ఆడు గొఱ్ఱపిల్లనేగాని ఆడు మేకపిల్లనే గాని పాపపరిహారార్థబలిగా అర్పింపవలెను. అతనికి పాప క్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయ శ్చిత్తము చేయును. అతడు గొఱ్ఱపిల్లను తేజాలని యెడల, అతడు పాపియగునట్లు తాను చేసిన అపరాధ విషయమై రెండు తెల్ల గువ్వలనేగాని రెండు పావురపు పిల్లలనేగాని పాపపరిహారార్థబలిగా ఒకదానిని దహనబలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసికొనిరావలెను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తరు వాత అతడు పాపపరిహారార్థమైనదానిని మొదట నర్పించి, దాని మెడనుండి దాని తలను నులమవలెను గాని దాని నూడదీయకూడదు. అతడు పాపపరిహారార్థబలి పశురక్త ములో కొంచెము బలిపీఠము ప్రక్కను ప్రోక్షింపవలెను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలెను. అది పాపపరిహారార్థబలి. విధిచొప్పున రెండవదానిని దహనబలిగా అర్పింపవలెను. అతడు చేసిన పాపము విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. రెండు తెల్ల గువ్వలైనను రెండు పావురపు పిల్లలైనను తనకు దొరకనియెడల పాపముచేసినవాడు తూమెడు గోధుమపిండిలో పదియవవంతును పాపపరిహారార్థబలి రూపముగా తేవలెను. అది పాప పరిహారార్థబలి గనుక దానిమీద నూనెపోయవలదు. సాంబ్రాణి దానిమీద ఉంచవలదు. అతడు యాజకునియొద్దకు దానిని తెచ్చిన తరువాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠముమీద దానిని దహింపవలెను. అది పాపపరిహారార్థబలి. పై చెప్పినవాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. దాని శేషము నైవేద్య శేషమువలె యాజకునిదగును.” (లేవి.కాం.5:1-13)
పై లేఖనాల వెలుగులో గమనించాల్సిన అంశాలు:
1) ప్రాయశ్చిత్తానికి రక్తము/బలి కాకుండా వేరే మార్గాలున్నాయి అంటూ లేఖనాలు ఎక్కడా ప్రకటించడము లేదు.
2) గొధుమపిండి వలన ప్రాయశ్చిత్తము కలుగుతుంది తద్వారా క్షమాపణ పొందవచ్చు అంటూ కూడా లేఖనాలు ఎక్కడా బోధించడము లేదు.
3) ప్రాయశ్చిత్తము చేయబడుటకు అర్పించాల్సిన బలుల విశయములో సమాజములోని కొందరికి [అందరికి కాదు] ఒక వెసళుబాటు యివ్వబడింది. అది, జంతుబలి లేక పక్షిబలి యివ్వలేని పక్షములో సదరు వ్యక్తి ఆ బలి స్థానములో గోధుమపిండిని అర్పించవచ్చు.
4) జంతుబలి/పక్షిబలి స్థానములో గోధుమపిండిని అర్పించవచ్చు అనే వెసళుబాటు అన్నది తెలిసిచేసిన పాపాలవిశయములో కాదు, అది కేవలము తెలియకచేసిన పాపాలవిశయములోనే యివ్వబడింది.
5) గొధుమపిండి వెసళుబాటు తెలియకచేసిన పాపాలలోని కేవలము మూడు పాపాలవిశయములోనే యివ్వబడింది. అది తెలియక చేసిన అన్ని పాపాల విశయములో వర్తించదు.
6) జంతుబలి స్థానములో స్తోమతలేనివారు తమ పాపాల ప్రాయశ్చిత్తముకొరకై గోధుమపిండి అర్పించినా అది అదివరకే సమాజములోని అందరి నిమిత్తము అర్పించబడి దహించబడుతున్న ఉదయకాలపు దహనబలితో కలిసి దహించబడుతుంది (ని.కాం.29:38-42; సం.కాం.28:3-8; 1దిన.వృ.16:40).
కనుక, జంతుబలిని/పక్షిబలిని అర్పించలేని వ్యక్తి కేవలము గోధుమపిండిని అర్పించినా అది దేవుని సన్నిధిలో దహనబలిగా అర్పించబడిన జంతుబలితో కలిసి దహించబడటాన్నిబట్టి దేవుని దృష్టికి జంతుబలిగా అంగీకరించబడుతుంది అన్నది సుస్పష్టం. ఆకారణాన్నిబట్టే ప్రాయశ్చిత్తము సాధ్యపడుతుంది. ఈ సందర్భములో అర్పించబడిన గోధుమపిండి కేవలము పిండిగానే బలిపీఠముపై దహించబడదు అన్నది గమనములో వుంచుకోవాలి.
పై లేఖనాధారమైన కారణాలనుబట్టి, “రక్తము/బలి ఒక్కటే ప్రాయశ్చిత్తానికి మార్గము కాదు” అన్న రబ్బీల బోధ/వాదన లేఖనాలకు విరుధమైన అబద్దబోధ లేక దుర్బోధ అన్నది నిరూపితమవుతున్నది.
ఇక, వ్యక్తిగత బలుల విశయములో తెలిసి చేసిన పాపాలనిమిత్తంకూడా ప్రత్యేకమైన బలులర్పించడాలి అన్నది మోషేధర్మశాస్త్రము యొక్క విస్పష్టమైన బోధ (లేవీ.కాం.6:1-7; సం.కాం.5:6-7).
“ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహముచేసి పాపియైన [חָטָא/ఖాటా] యెడల…అతడు పాపముచేసి [חָטָא/ఖాటా] అపరాధి యగును గనుక అతడు తాను దోచుకొనిన సొమ్మునుగూర్చి గాని బలాత్కారముచేతను అపహరించినదానిగూర్చిగాని తనకు అప్పగింపబడినదానిగూర్చిగాని, పోయి తనకు దొరి కినదానిగూర్చిగాని, దేనిగూర్చియైతే తాను అబద్ధప్రమాణము చేసెనో దానినంతయు మరల ఇచ్చుకొనవలెను. ఆ మూలధనము నిచ్చుకొని, దానితో దానిలో అయిదవ వంతును తాను అపరాధ [אַשְׁמָה/అష్మా] పరిహారార్థబలి అర్పించు దినమున సొత్తుదారునికి ఇచ్చుకొనవలెను. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును యాజకునియొద్దకు తీసికొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతడు అపరాధి యగునట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతిదాని విషయమై అతనికి క్షమాపణ కలుగును.” (లేవీ.కాం.6:1-7)
“పురుషుడుగాని స్త్రీగాని యెహోవామీద తిరుగబడి మనుష్యులు చేయు పాపములలో [חַטָּאָה/ఖట్’టాహ్] దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును [חַטָּאָה/ఖట్’టాహ్]ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధమువలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో అయిదవవంతు దానితో కలిపి యెవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసికొనుటకు ఆ మనుష్యునికి రక్తసంబంధి లేని యెడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొట్టేలును యాజకుని వగును.” (సం.కాం.5:6-7)
పై లేఖనాధారాలు, “రక్తము/బలి కేవలము తెలియక చేసిన పాపాలకు మాత్రమే ప్రాయశ్చిత్తము చేయగలదు” అన్న ఆధునిక రబ్బీల బోధ/వాదన లేఖనవిరుద్దమైన అబద్ధబోధ లేక దుర్బోధ అన్న సత్యానికి తిరిగులేని సాక్ష్యాలు!
ఇప్పుడు, రబ్బీలు చేస్తున్న మూడవ దుర్బోధ విశయములో లేఖనాలను పరిశీలించి చూద్దాము.
“రక్తము/బలి లేకుండానే పశ్చత్తాపహృదయములోనుండి వచ్చిన మాటలు పాపములకు క్షమాపణను అందించగలవు” అనే తమ బోధను సమర్ధించుకునేందుకు రబ్బీలు పేర్కొనే ఐదు పాతనిబంధన [తనాక్] లేఖన భాగాలను మరియు అవి వారి బోధలను ఏవిధంగా వ్యతిరేకిస్తున్నాయోనన్నది పరిశీలించి చూద్దాము.
మొదటి లేఖన భాగం
“ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవుకావు కోరినయెడల నేను అర్పించుదును దహనబలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు.” (కీర్తన.51:15-17)
51వ కీర్తన యొక్క సందర్భము: దావీదు బత్షేబతో వ్యభిచారము చేసి ఆమె భర్త అయిన ఊరియాను యుద్దములో పథకము ప్రకారం చంపించిన తరువాత నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు దేవుని శిక్షను ప్రక్తటించాడు (2సాముయేలు.11:1-12:14). ఆ సందర్భములో దావీదు దేవుని ఎదుట తన స్వంత పతనావస్థనుబట్టి రచించిన కీర్తన.
పై లేఖనాల వెలుగులో గమనించగలిగే సత్యాలు:
- దావీదు బత్షేబ విశయములో మోషేనిబంధనలోని పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరి పాపము చేసాడు–పొరుగువాని భార్యను ఆశించాడు, వ్యభిచరించాడు, మరియు నరహత్య చేసాడు.
- దావీదు చేసిన మూడు పాపాలలో రెండింటికి అంటే వ్యభిచారానికి మరియు నరహత్యకు ప్రాయశ్చిత్తబలులేవి ధర్మశాస్త్రము సూచించలేదు.
- దావిదు తాను విరచించిన కీర్తనలో “రక్తాపరాధమునుండి నన్ను విడిపింపుము” (కీర్తన.51:14) అంటూ తాను చేసిన నరహత్య పాపమునుండి విడిపించమంటూ దేవున్ని వేడుకున్నాడు.
- ధర్మశాస్త్రమంతటిలో దేవుడు నరహత్య పాపానికి ప్రాయశ్చిత్తముగా ఎలాంటి బలిని కోరలేదు నిర్దేశించనూలేదు. అంటే అలాంటి పాపానికి మానవులర్పించగలిగిన యేజంతుబలి సరిపోదు. అదే సత్యాన్ని దావీదు జ్ఙాపకం చేసుకుంటూ విరిగినలిగిన హృదయాన్నే దేవుని ముందు పెడుతూ తన పాపానికి క్షమాపణను కోరుతున్నాడు.
- నరహత్య చేసిన వ్యక్తిగా దావీదు అర్పించే బలులు/దహనబలులు దేవుని యిష్టమైనవి కావు.
- తాను చేసిన పాపాల తీవ్రతనుబట్టి తనలాంటి వ్యక్తి అర్పించే బలిని దేవుడు కోరేవాడు కాదు అలాగే తనలాంటి వ్యక్తి అర్పించే దహనబలి దేవునికి ఇష్టమైనది కాదు అన్నది దావీదు వ్యక్తపరుస్తున్నాడు (కీర్తన. 51:16). అంతేగాని, దేవుడు అసలు బలులనే యిష్టపడనివాడు అని కాదు.
- తనను తన పాపమునుండి విడిపించినతరువాత “అప్పుడు నీతియుక్తములైన బలులును దహనబలులును సర్వాంగ హోమములును నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠముమీద కోడెలనర్పించెదరు” (కీర్తన.51:19) అంటూ అదే కీర్తనలో దావీదు బలులు దేవునికి ఎప్పుడు అంగీకారముగా వుంటాయో ప్రకటిస్తున్నాడు.
- పాతనిబంధన లేఖనాలలోని బోధ ప్రకారము దేవున్ని ప్రేమించి ఆయనకు లోబడి అటుతరువాత పశ్చత్తాపహృదయముతో బలులను అర్పిస్తే అవి దేవునికి అంగీకారమవుతాయి. అలా కాకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ పాపములోనే కొనసాగుతూ హృదయశుద్ధిలేకుండా బలులర్పిస్తే అవి ఆయనకు అంగీకారము కాదు. ఈ లేఖన సత్యాన్ని యితర ప్రవక్తలుకూడా అనేక పర్యాయాలు వ్యక్తపరచడము జరిగింది (యెషయా.1:11-17; యిర్మీయా.6:19-20; హోషేయ.6:6-8; ఆమోసు.5:21-24).
రెండవ లేఖన భాగం
“ఇశ్రాయేలూ, నీ పాపముచేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవాతట్టుకు తిరుగుము. మాటలు సిద్ధపరచుకొని యెహోవాయొద్దకు తిరుగుడి; మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా మా పాపములన్నిటిని పరిహరింపుము; ఎడ్లకు బదులుగా నీకు మా పెదవుల నర్పించుచున్నాము; నీవంగీకరింపదగినవి అవే మాకున్నవి.” (హోషేయ.14:1-2)
హోషేయ.14:1-2 యొక్క సందర్భము: ప్రవక్త అయిన హోషేయ ఉత్తరరాజ్యమైన ఇశ్రాయేలుకు చెందినవాడు. ఉత్తరరాజ్యం ఇశ్రాయేలు 722 క్రీ.పూ. అష్షూరీయులచేత చెరపట్టబడి కొనిపోబడటానికి ముందు హోషేయ గ్రంథములోని లేఖనపలుకులు యివ్వబడ్డాయి. ఆ సమయానికి దక్షిణరాజ్యం యూదాకుడా చెరపట్టబడలేదు, యెరూషలేములో దేవుని మందిరము నిలిచే వుంది. అక్కడ ధర్మశాస్త్రప్రకారము బలులు అర్పించబడుతూనే వున్నాయి. అయినా ఉత్తరరాజ్యవాసులైన తొమ్మిది గోత్రాల ఇశ్రాయేలీయులు తమ పాపాలలోనే కొనసాగుతూ గిలాదులో ఎడ్లను బలిగా అర్పిస్తుండేవారు (హోషేయ.12:11).
పై లేఖనాల వెలుగులో క్రింది విషయాలను గ్రహించగలము:
- ఉత్తరరాజ్య వాసులు దేవునికి విరుద్ధంగా పాపాలు చేస్తూ వాటిలోనే కొనసాగుతున్నారు.
- అయినా వారు ఎడ్లను బలిగా అర్పిస్తూ దేవుని సహాయాన్ని ఎదురుచూసారు
- ఆలాంటి పరిస్థితిలో జీవిస్తున్న ఉత్తరదేశవాసులను దేవుడు హోషేయ ప్రవక్తద్వారా హెచ్చరిస్తున్నాడు. వారు మొదట దేవునితట్టు తిరగాలి, తరువాత మాటలు సిద్ధపరచుకొని దేవుని యొద్దకు రావాలి. వారు గిలాదులో ఎడ్లను అర్పించడము కాదు, తమ స్వంత పెదాలను దేవునికి అర్పించాలి. వాటి ఫలమే ఎడ్లను బలిగా అర్పించటములాంటిది.
- అప్పుడు దేవుడు వారిని విశ్వాసఘాతకులు కాకుండా గుణపరుస్తాను అని మాటయిస్తున్నాడు (హోషేయ.14:4). దీనిభావం వారు యెరూషలేములో బలులను అర్పించంకుండానే దేవుడు వారి పాపాలను క్షమించి వారిని నీతిమంతులుగా తీరుస్తాడని కాదు. నిజానికి వారు ప్రవక్త మాటలకు లోబడితే వారిని గుణపరచి అవిశ్వాసమునుండి వారిని విడిపించి వారు దేవుని సన్నిధిలో ఆయనకు అంగీకారమయ్యే బలులను అర్పించే వారిగా వారిని మారుస్తాడన్నది దేవుని వాగ్ధానము. అంతేగాని, ఆసమయానికి బలులు నిశేధించబడ్డాయనిగాని లేక బలులు లేకుండానే ఇశ్రాయేలీయులను దేవుడు క్షమించబోతున్నాడనిగాని దాని భావము కాదు.
మూడవ లేఖన భాగం
“ఇట్టి శాసనము సంతకము చేయబడెనని దానియేలు తెలిసి కొనినను అతడు తన యింటికి వెళ్లి, యధాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్లూని, తన యింటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడియుండగా తన దేవునికి ప్రార్థనచేయుచు ఆయనను స్తుతించుచువచ్చెను.” (దానియేలు.6:10)
ఈ లేఖన సత్యాన్ని గ్రహించటానికి గమనములో వుంచుకోవలసిన అంశాలు:
- పై లేఖనము మోషేధర్మశాస్త్ర కాలములో యూదులు బబులోను చెరలో జీవిస్తున్న సమయములోని సంఘటనను గురించి వివరిస్తున్నది.
- పై లేఖనభాగము ప్రభువైన దేవుడు యేర్పరచుకున్న ఒక ప్రవక్తను [దానియేలు] గురించినది.
- పై లేఖనము చెరలోవున్న ఒక యూదు ప్రవక్త యొక్క ప్రార్థన మరియు ఆరాధనను వివరిస్తున్నది.
- పై లేఖనము పాపాలను గురించిగాని లేక పాపప్రాయశ్చిత్తాలను గురించిగాని వివరించడము లేదు.
- పై లేఖన మాదిరి అన్యులకు వర్తించేది కాదు. అంతమాత్రమేగాక చెరలో జీవించని యూదులకుకూడా ఈ లేఖనములోని మాదిరి వర్తించదు.
కాబట్టి పై వాస్తవాల వెలుగులో పాతనిబంధనా గ్రంథము [తనాఖ్] ప్రకారము కూడా రక్తము చిందించబడకుండానే అంటే బలియాగము లేకుండానే ప్రాయశ్చిత్తము సంభవము అంటూ బోధిస్తున్న ఆధునిక రబ్బీల దుర్బోధ వారి స్వంత బోధే కాని లేఖనాధారమైనది కాదు అన్నది మరోసారి సుస్పష్టమవుతున్నది.
నాలుగవ లేఖన భాగం
“యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణ మంతదూరము సంచరించుచు ఇక నలువది దినములకు నీనెవె పట్టణము నాశనమగునని ప్రకటనచేయగా నీనెవె పట్టణపువారు దేవునియందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి, ఘనులేమి అల్పులేమి అందరును గోనె పట్ట కట్టుకొనిరి…ఈ నీనెవెవారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.” (యోనా.3:4-5…10)
మోషేధర్మశాస్త్ర కాలానికి చెందిన సంఘటనను వివరిస్తున్న పై లేఖన భాగము పాతనిబంధన కాలములోకూడా ప్రభువైన దేవుడు అన్యజనులను పాలిస్తూ, పోశిస్తూ, ప్రేమించే దేవుడని నిరూపిస్తున్నది. దీన్ని బట్టి అన్యజనులుకూడా ప్రభువైన దేవుని దృష్టిపథములో వున్నారు అన్నది స్పష్టమవుతున్నది.
పైలేఖన భాగము మోషేధర్మశాస్త్రాన్ని మరియు ప్రవక్తల గ్రంథాలను అందుకున్న (రోమా.9:4-5) దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను గురించికాదు, అవేవీ యివ్వబడని అన్యజనులను గురించినది. మోషేధర్మశాస్త్రము మరియు ప్రవక్తల గ్రంథాలు అందుకోని అన్యజనులు (కీర్తన.147:19-20) ఇశ్రాయేలీయుల వలె గాక దేవునియందు విశ్వాసముంచి తమ్ముతాము తగ్గించుకొని చెడునడతలను మానుకొనడముద్వారా దేవునికి ఇష్టులుగా మారవచ్చు అన్నది పై లేఖనాల బోధగా గ్రహించవచ్చు. ఇది అన్యజనులకు ఇవ్వబడిన విధానము, ఇశ్రాయేలీయులకు యివ్వబడినది కాదు.
ఈ లేఖనము అన్యజనులైన నినెవె పట్టణస్తులు మారుమనస్సు పశ్చత్తాపము పొందడాన్ని బట్టి దేవుడు వారిని క్షమించి వారిపై కుమ్మరించబోతున్న తన ఉగ్రతను ఆపేశాడు అన్న సత్యాన్ని ప్రకటిస్తున్నది. దేవుని ఎదుట అన్యులైన వారి మారిన జీవితము, వ్యక్తపరచిన విశ్వాసము, ప్రదర్శించిన తగ్గింపుస్వభావము అన్నవి వారిని దేవుని శిక్షనుండి తప్పించాయి. అయితే, దీనినిబట్టి వారి పాపాలన్నీ క్షమించబడి నీతిమంతులుగా తీర్చబడ్డారని తద్వారా వారికి నిత్యజీవము లభించబోతున్నదనిగాని లేక వారు దేవుని ప్రజలుగా మారి వాగ్ధానాలన్నింటికి వారసులయ్యారని కాదు.
దేవునినుండి మానవులను వేరుచేసే పాపాలకు ప్రాయశ్చిత్తము రక్తం చిందించబడటముద్వారా అంటే బలియాగముద్వారానే సంభవం అన్నది లేఖన బోధ. ఆ బోధకు వ్యతిరేకమైన సందేశమేది యోనా గ్రంథములో లేదు.
దేవుని ప్రజలుగా ప్రత్యేకపరచబడి దేవునిచేత వాగ్ధానాలు నిబంధనలు చేయబడిన ఇశ్రాయేలు ప్రజల విశయానికొస్తే వారు మోషేధర్మశాస్త్ర బద్ధంగా అలాగే ప్రవక్తల గ్రంథాల బోధలప్రకారం జీవిస్తూ అందులో సూచించబడిన బలులను అర్పించడముద్వారా పాపక్షమాపణ మరియు ప్రాయశ్చిత్తము పొందగలరు. ఇది బైబిలు బోధ. దీనికి విరుద్దమైన బోధ దుర్బోధ.
ఐదవ లేఖన భాగము
“నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించునట్లు నా నామము అక్కడ ఉండునని యే స్థలమునుగూర్చి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన యీ మందిరముతట్టు నీ నేత్రములు రేయింబగలు తెరవబడి యుండునుగాక. మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము…మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడినప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.” (1రాజులు.8:29-34)
ప్రభువైన దేవుడు కోరుకున్న స్థలములో అంటే యెరూషలేములో క్రీస్తుపూర్వము పదవ శతాబ్ధములో అద్భుతమైన అతిసుందరమైన దేవాలయాన్ని కట్టడం పూర్తిచేసిన తరువాత ఆ దేవాలయాన్ని ప్రతిష్టించిన సందర్భములో రాజైన సొలోమోను ఒక సుధీర్ఘ ప్రార్థన చేసాడు. ఆ ప్రార్థనలోని కొంత భాగమే పై లేఖనాలలోని సొలోమోను పలికిన మాటలు.
సొలోమోను చేసిన మందిరప్రతిష్ట ప్రార్థనలోని పై మాటలను పేర్కొంటూ కొందరు రబ్బీలు ఈ విధంగా వ్యాఖ్యానిస్తున్నారు:
దేవుడు అంగీకరించిన సొలోమోను ప్రార్థనలొ ఇశ్రాయేలీయులు పాపము చేసిన సందర్భాలలో చేయాల్సింది బలులను అర్పించటము కాదుగాని వారు తమ పాపాలవిశయములో పశ్చత్తాపపడి దేవునివైపుకు తిరిగి ప్రార్థించిన సందర్భములో వారికి క్షమాపణ మరియు విమోచన లభించాలి అన్నది సొలోమోను యొక్క ప్రార్థన భావం. సొలోమోను చేసిన ప్రార్థనలో పాపాలకు క్షమాపణ ప్రార్థనద్వారా కలుగాలని ఆయన ప్రభువైన దేవునికి విజ్ఙాపణ చేసాడు. ప్రభువైన దేవుడు ఆ ప్రార్థనను విని అంగీకరించాడు. సొలోమోను ప్రార్థన అంతటిలో క్షమాపణకొరకు బలులను అర్పించాలి అని ఒక్కసారికూడా సూచించబడలేదు. కనుక, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు పాపము చేసిన సందర్భాలలో వారు పశ్చత్తాపపడి తమ దేవునివైపుకు తిరిగి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి క్షమాపణను అనుగ్రహిస్తాడు. మానవుల పాపాలు దేవుని ఎదుట క్షమించబడటానికి కావలసింది బలులు లేక రక్తం కాదు కావలసింది, పశ్చత్తాప హృదయం మరియు ప్రార్థన.
క్రింద పేర్కొనబడినట్లుగా ప్రభువైన దేవుడు సొలోమోను ప్రార్థనను అంగీకరించిన సందర్భాన్ని అలాగే ఆ ప్రార్థనలోని కొన్ని ప్రాముఖ్యమైన అంశాలను గమనములో వుంచుకోవాలి:
(1) ఇశ్రాయేలీయుల పక్షంగా వారి క్షమాపణ నిమిత్తము దేవుడు అంగీకరించగలిగిన ప్రార్థనను రాజైన సొలోమోను చేయకముందు జరిగిన విశయం:
“రాజైన సొలొమోనును అతనియొద్దకు కూడి వచ్చిన ఇశ్రాయేలీయులగు సమాజకులందరును మందసము ముందర నిలువబడి, లెక్కింప శక్యముగాని గొఱ్ఱలను ఎడ్లను బలిగా అర్పించిరి.” (1రాజులు.8:5)
(2) రాజైన సొలోమోను ప్రార్థన చేయటము ముగించినతరువాత జరిగిన విశయము:
“అంతట రాజును, అతనితో కూడ ఇశ్రాయేలీయులందరును యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా ఇరువది రెండువేల యెడ్లను, లక్ష యిరువదివేల గొఱ్ఱలను సొలొమోను సమాధానబలులగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజును ఇశ్రాయేలీయులందరును యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమందున్న యిత్తడి బలిపీఠముఆ దహనబలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయెను గనుక రాజు యెహోవా మందిరము ముందరనున్న ఆవరణము మధ్యనుండు స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను నైవేద్యములను సమాధానబలి పశువుల క్రొవ్వును అర్పించెను.” (1రాజులు.8:62-64)
(3) దేవుడు స్వీకరించిన ప్రార్థన వర్తించే సమయము: సొలోమోను ప్రార్థనను బట్టి మందిరము వున్న సమయములో అంతమాత్రమేగాక ఆ మందిరమునందు లేక మందిరములో ప్రార్థనలు విన్నపములు జరిగే సమయములో…
“మరియు ఇశ్రాయేలీయులగు నీ జనులు నీకు విరోధముగా పాపముచేయుటచేత తమ శత్రువులయెదుట మొత్తబడి నప్పుడు, వారు నీతట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని యీ మందిరమందు నిన్నుగూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్ల నీవు ఆకాశమందు విని, ఇశ్రాయేలీయులగు నీ జనులు చేసిన పాపమును క్షమించి, వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము.” (1రాజులు.8:33-34)
(4) బలులను అర్పించే విశయము పేర్కొనకుండానే సొలోమోను దేవుని ప్రజలు దేవుని మందిరము వైపు తిరిగి ప్రార్థిస్తే క్షమించాలని దేవున్ని ప్రార్థించాడు, “పాపము చేయనివాడు ఒకడును లేడు, వారు నీకు విరోధముగా పాపము చేసినయెడల నేమి, నీవు వారిమీద కోపగించుకొని వారిని శత్రువులచేతికి అప్పగించినయెడలనేమి, వారు వీరిని దూరమైనట్టి గాని దగ్గరయైనట్టి గాని ఆ శత్రువుల దేశములోనికి చెరగా కొనిపోయినప్పుడు వారు చెరగా కొనిపోబడిన దేశమందు తాము చేసిన దానిని మనస్సునకు తెచ్చుకొనిమేము దుర్మార్గులమై ప్రవర్తించి పాపము చేసితిమని చెప్పి, తమ్మును చెరగా కొనిపోయిన వారిదేశమందు చింతించి పశ్చాత్తాపపడి నీకు విన్నపము చేసినయెడల తమ్మును చెరగా కొని పోయిన వారియొక్క దేశమందు పూర్ణహృదయముతోను పూర్ణాత్మతోను వారు నీ తట్టు తిరిగి, నీవు వారి పితరులకు దయచేసిన దేశముతట్టును నీవు కోరుకొనిన పట్టణము తట్టును నీ నామఘనతకు నేను కట్టించిన మందిరముతట్టును నిన్నుగూర్చి ప్రార్థనచేసిన యెడల ఆకాశమను నీ నివాసస్థలమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని వారి కార్యమును నిర్వహించి నీకు విరోధముగా పాపముచేసిన నీ జనులు ఏ తప్పులచేత నీ విషయమై అపరాధులైరో ఆ తప్పులను వారికి క్షమించి, వారిని చెరలోనికి కొనిపోయినవారు వారిని కనికరించునట్లు వారియెడల కని కరము పుట్టించుము.” (1రాజులు.8:46-50)
(5) సొలోమోను చేసిన ప్రార్థనను బట్టి ప్రభువైన దేవుడు సొలోమోను కట్టించిన మందిరాన్ని “బలులర్పించు మందిరముగా” కోరుకున్నాడు. అందునుబట్టే ఆ మందిరములో సదా బలులర్పించబడేవి. ఆ విధంగా ఉదయసాయంకాలాలలో అర్పించబడే విస్తారమైన బలులనుబట్టే దేవుడు ఆ మందిరములో చేయబడే ప్రార్థనలకు చెవియొగ్గి తన ప్రజలను క్షమిస్తాను అంటు మాటియిచ్చాడు. అంతేగాక, సొలోమోను చేసిన ప్రార్థనలోని కేవలము కొన్ని అంశాలనుమాత్రమే నిర్ధారిస్తూ తన ఆమోదాన్ని తెలియచేసాడు. అందులో కొన్ని ఈ క్రింది లేఖనాలలో పేర్కొనబడ్డాయి:
“అప్పుడు యెహోవా రాత్రియందు సొలొమోనునకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెనునేను నీ విన్నపము నంగీకరించి యీ స్థలమును నాకు బలులు అర్పించు మందిరముగా కోరుకొంటిని…నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ముతాము తగ్గించుకొని ప్రార్థనచేసి నన్ను వెదకి తమ చెడుమార్గములను విడిచినయెడల, ఆకాశమునుండి నేను వారి ప్రార్థనను విని, వారి పాపమును క్షమించి, వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థనమీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును…అయితే మీరు త్రోవ తప్పి, నేను మీకు నియమించిన కట్టడలను ఆజ్ఞలను విడచి, యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమ స్కారములు చేసిన యెడల నేను మీకిచ్చిన నా దేశ ములోనుండి మిమ్మును పెల్లగించి, నా నామమునకు నేను పరిశుద్ధపరచిన యీ మందిరమును నా సన్నిధినుండి తీసివేసి, సమస్త జనములలో దానిని సామెత కాస్పదముగాను నిందకాస్పదముగాను చేయుదును. అప్పుడు ప్రఖ్యాతి నొందిన యీ మందిరమార్గమున పోవు ప్రయాణస్థులందరును విస్మయమొంది యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకును ఎందుకు ఈ ప్రకారముగా చేసెనని యడుగగా జనులుఈ దేశస్థులు తమ పితరులను ఐగుప్తు దేశమునుండి రప్పించిన తమ దేవుడైన యెహోవాను విసర్జించి యితర దేవతలను అనుసరించి వాటికి పూజానమస్కారములు చేసినందున యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించెనని ప్రత్యుత్తరమిచ్చెదరు.” (2దిన.వృ.7:12-22)
ఈ సందర్భములో ప్రాముఖ్యమైనవిగా లేక్కించబడే పైన పేర్కొనబడిన ఐదు అంశాల వెలుగులో గ్రహించగలిగిన వాస్తవాలు:
సొలోమోను ప్రార్థనను ప్రభువైన దేవుడు అంగీకరించకముందు విస్తారమైన బలులను అర్పించటము జరిగింది. ఆ బలుల ఆధారంగానే దేవుడు ఆయన ప్రార్థనను అంగీకరించి సొలోమోను కట్టించిన మందిరాన్ని “తనకు బలులను అర్పించే మందిరముగా” నిర్ధారించాడు. ఈ కారణముచేత ఈ మందిరములో అర్పించబడే బలులనుబట్టే ఈ మందిరములో చేయబడే ప్రార్థనలను దేవుడు అంగీకరిస్తాడు. అయితే, ఈసందర్భముగా సొలోమోను చేసిన ప్రార్థనలోని అన్ని విన్నపాలనుగాక కేవలము కొన్నింటిని మాత్రమే దేవుడు అంగీకరించాడు.
ప్రభువైన దేవుడు అంగీకరించిన అంశాలలో తన ప్రజలు తమ పాపాలను బట్టి పరాయి చెరలో వుంటూ పశ్చత్తాపపడి దేవుని వైపుకు మళ్ళి మందిరము తట్టు తిరిగి ప్రార్థించిన సందర్భములో వారి పాపాలను క్షమించాలంటూ సొలోమోను చేసిన ప్రార్థన లేదు. కనుక, ఈ సందర్భములో దేవుని ప్రజలు కేవలము తమ పాపాలనుబట్టి పశ్చత్తాపపడి దేవునివైపుకుమళ్ళి మందిరముతట్టుకు తిరిగి ప్రార్థిస్తే వారికి క్షమాపణను అనుగ్రహించాలన్న సొలోమోను విజ్ఙాపనను దేవుడు అంగీకరించలేదు. ఈ విధంగా “బలులులేకుండా కేవలం ప్రార్థనలద్వారానే క్షమాపణ పొందవచ్చు” అంటూ బోధించే రబ్బీల బోధ లేఖనాలకు వ్యతిరేకమైన దుర్బోధ అన్నది మరొక సారి నిరూపితమవుతున్నది.
అయితే, ఇశ్రాయేలీయులు ప్రాయశ్చిత్తార్థముగా అర్పించే బలులన్నవి అన్ని సందర్భాలలో అన్ని అతిక్రమాలకు విరుగుడుగా నియమించబడలేదు అన్న సత్యం మోషేధర్మశాస్త్రములోని అతి ప్రాముఖ్యమైన అంశము. నిజానికి ధర్మశాస్త్రప్రకారము కొన్ని పాపాల ప్రాయశ్చిత్తానికి బలులు లేవు క్షమాపణకూడా లేదు!
మరణకరమైన పాపములు
మోషేధర్మశాస్త్ర నియమాల ప్రకారం అనేక పాపాలకు [తెలిసి చేసినవి మరియు తెలియక చేసినవి] ప్రాయశ్చిత్తము పొందేందుకై మార్గాలున్నా కొన్ని నిర్దిష్టమైన పాపాలకు మరణము తప్ప మరో మార్గము లేదు. మోషేనిబంధనగా యివ్వబడిన పది ఆజ్ఙలలోని సగానికిపైగా ఆజ్ఙలను మీరితే ప్రాయశ్చిత్తార్థ బలిగాని లేక క్షమాపణను పొందే మార్గముగాని ఏదీ మోషేధర్మశాస్త్రములో లేదు. ఆ ఆజ్ఙలకు వ్యతిరేకంగా చేసిన పాపాలకు ప్రతిఫలం మరణదండన అన్నది మోషేధర్మశాస్త్రము యొక్క విస్పష్టమైన తీర్పు. అలాంటి పాపాలకు ఒడిగట్టిన సందర్భాలలో దేవుని వైపుకు తిరిగి పశ్చత్తాపహృదయముతో ప్రార్థిస్తే క్షమించబడతారు అన్న సూచనగాని లేక మాదిరిగాని ఏదీ మోషేధర్మశాస్త్రములో లేదు.
మోషేధర్మశాస్త్రము ప్రకారము మరణదండన విధించబడాల్సిన పాపాలు:
- వ్యభిచారము [లే.కాం.20:10; ద్వి.కాం.22:22]
- జంతుసంభోగము [ని.కాం.22:18; లే.కాం.20:15]
- దేవదూషణ [లే.కాం.24:16]
- అబద్దసాక్ష్యము [ద్వి.కాం.19:16-19]
- అబద్ద ప్రవచనము [ద్వి.కాం.13:6; 18:20]
- విగ్రహారాధన (లే.కాం.20:2; ద్వి.కాం.13:7-19; 17:2-7)
- ఆకాశంలోని సూర్య, చంద్ర, నక్షత్రాదులను పూజించి సేవించటం [ద్వి.కాం.17:3]
- న్యాయాధికారి మాట తిరస్కరించుట [ద్వి.కాం.17:12]
- మానవ అపహరణ [ని.కాం.21:16; ద్వి.కాం.24:7]
- స్వళింగసంపర్కము [లే.కాం.18:22; 20:11-14]
- నరహత్య [ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16]
- మానభంగము [ద్వి.కాం.22:25-27]
- తల్లిదండ్రులకు అవిధేయత [ని.కాం.21:15,17; లే.కాం.20:9; ద్వి.కాం.21:18-21]
- విశ్రాంతిదినాచారాన్ని మీరుట [ని.కాం.31:15; 35:2; సం.కాం.15:32-36]
- చిల్లంగితనము [ని.కాం.22:18; లే.20:27]
మోషేధర్మశాస్త్రములో పేర్కొనబడిన పై పాపాలకు అదే ధర్మశాస్త్రములో ఎలాంటి క్షమాపణ లేక ప్రాయశ్చిత్త మార్గము లేదు!
ఈసందర్భంగా, మోషేధర్మశాస్త్రము యొక్క తీర్పును ప్రతిబింబిస్తూ మానవుల ప్రాయశ్చిత్తార్థ వెల ఎంతగొప్పదో దావీదుద్వారా యివ్వబడిన లేఖనాలు స్పష్టంగా ప్రకటిస్తున్నాయి:
“వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన.49:9)
ధర్మశాస్త్రము చేయలేనిదాన్ని దేవుడు చేసాడు
ధర్మశాస్త్ర విధుల ప్రకారము మరణశిక్షను సంపాదించే పాపాలవిశయములో క్షమాపణా మార్గాన్ని మోషేధర్మశాస్త్రము చూపించలేకపోయింది. అయితే, దాన్ని దేవుడే ధర్మశాస్త్రానికి వేరుగా సాధించి చూపాడు.
మానవాళి రక్షణకై సృష్టికర్త సిద్ధపరచిన రక్షణ మార్గములో మూడు ప్రధాన ఘట్టాలున్నాయి. అవి, (i) విమోచించటము [Redemption], (ii) పరిశుద్ధులనుగా మార్చటము [Sanctification], (iii) నీతిమంతులనుగా తీర్చటము [Justification]. ఈ మాదిరిని ప్రభువైన దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు దాసత్వములోనుండి రక్షించటములో కనుగొనవచ్చు.
ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములో దాసత్వములో కృశించిపోతున్న సందర్భములో వారి మొఱను ఆలకించి దేవుడు మొదట వారిని ఐగుప్తు దాసత్వములోనుండి విమోచించాడు, తరువాత వారిని పరిశుద్ధపరిచాడు, అటుతరువాత వారు దేవుని ఎదుట తమ జీవితాన్ని కొనసాగిస్తూ తమను నిత్యజీవానికి వారసులనుచేసే నీతిని పొందే మార్గాన్ని చూపించాడు. ఆ మార్గానికి సంబంధించిన సూచనల సమీకరణే మోషేధర్మశాస్త్రముగా ఇశ్రాయేలీయులకు యివ్వబడింది.
“మన దేవుడైన యెహోవా మన కాజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనునప్పుడు మనకు నీతి కలుగును.” (ద్వి.కాం.6:25)
విమోచన
బైబిలులో తరచుగా పేర్కొనబడిన “విమోచన” అన్న ప్రక్రియ ఎంతో ఆత్మీయ ప్రాముఖ్యతతో కూడినది. పాతనిబంధనా గ్రంథములోని నిర్గమాకాండము 13వ అధ్యాయములో ఈ పదముయొక్క ప్రాథమిక అర్థం వివరించబడింది.
“యెహోవా నీతోను నీ పితరులతోను ప్రమాణము చేసినట్లు ఆయన కనానీయుల దేశములోనికి నిన్ను చేర్చి దానిని నీకిచ్చిన తరువాత ప్రతి తొలి చూలుపిల్లను, నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలి పిల్లను యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. వానిలో మగసంతానము యెహోవా దగును. ప్రతి గాడిద తొలి పిల్లను వెలయిచ్చి విడిపించి [హీబ్రూ మూలపదం: פָּדָה/పదహ్ = విమోచన] దానికి మారుగా గొఱ్ఱపిల్లను ప్రతిష్ఠింపవలెను. అట్లు దానిని విడిపించని [פָּדָה/పదహ్] యెడల దాని మెడను విరుగదీయవలెను. నీ కుమారులలో తొలిచూలియైన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలెను [פָּדָה/పదహ్]. ఇకమీదట నీ కుమారుడు ఇది ఏమిటని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలముచేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులోనుండి మనలను బయటికి రప్పించెను. ఫరో మనలను పోనియ్యకుండ తన మనస్సును కఠినపరచుకొనగా యెహోవా మనుష్యుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తుదేశములో తొలి సంతాన మంతయు సంహరించెను. ఆ హేతువు చేతను నేను మగ దైన ప్రతి తొలిచూలు పిల్లను యెహోవాకు బలిగా అర్పించుదును; అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయిచ్చి విడిపించుదునని [פָּדָה/పదహ్] చెప్పవలెను. ” (నిర్గ.కాం.13:11-15)
ఒక వ్యక్తిని విమోచించటం లేక వెల యిచ్చి విడిపించటం అంటే ఆ వ్యక్తి స్థానములో దేవుడు నిర్ణయించిన వెలను చెల్లించి ఆ వ్యక్తిని విడిపించటం. అయితే మానవులు నిత్యజీవం పొందేందుకు తమ పాపాలనుండి విమోచించబడాలి. అటుతరువాత నీతిని అంటే నీతికార్యాలను/పుణ్యకార్యాలను/దైవకార్యాలను చేసి వాటి ఫలితంగా పొందగలిగే నీతిని తగిన పరిమాణములో సంపాదించి వుండాలి. అప్పుడే మోక్షం పొందటం సాధ్యం. అయితే, ఏభేదము లేకుండా మానవులందరు పాపానికి దాసులుగా మారిన పరిస్థితినిబట్టి (1రాజులు.8:46; కీర్తన.14:2-3; 143:2; ప్రసంగి.7:20; రోమా.3:23; 5:12) ఈ రకమైన విమోచన అన్నది మానవులలో ఏఒక్కరు పొందలేరు మరియు మరొక మానవునికి అందించనూలేరు అని లేఖనం స్పష్టపరుస్తున్నది:
“ఎవడును ఏ విధముచేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్లు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడును లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే.” (కీర్తన.49:7-9)
ఈ పరిస్థితినిబట్టి ఇక మానవులు మోక్షాన్ని పొందటానికి మిగిలిన ఏకైక మార్గం దైవజోక్యం మాత్రమే. కనుక, దేవుడే మానవులను విమోచించి [פָּדָה/పదహ్], వారిని పరిశుద్ధపరచి, వారు నిత్యజీవితాన్ని పొందేందుకు అవసరమైన నీతిని సంపాదించి వారికి ఆపాదించేందుకు తద్వారా వారికి నీతిమంతుడైన రక్షకునిగా ఉండేందుకు నడుము కట్టాడు. ఈ దైవకార్యాన్ని సూచిస్తూ పాతనిబంధనా లేఖనాలు క్రింది ప్రకటనలను చేస్తూ వచ్చాయి:
“కూపములోనికి దిగిపోకుండ నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది.” (యోబు.33:28)
“నా ఆత్మను నీ చేతికప్పగించుచున్నాను యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే.” (కీర్తన.31:5)
“యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును ఆయన శరణుజొచ్చినవారిలో ఎవరును అపరాధులుగా ఎంచబడరు.” (కీర్తన.34:22)
“ఇశ్రాయేలీయుల దోషములన్నిటినుండి ఆయన వారిని విమోచించును.” (కీర్తన.130:8)
“యెహోవా విమోచించినవారు సంగీతనాదముతో సీయోనునకు తిరిగి వచ్చెదరు నిత్యసంతోషము వారి తలలమీద ఉండును వారు సంతోషానందము గలవారగుదురు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును.” (యెషయా.51:11)
“అయినను పాతాళ వశములోనుండి నేను వారిని విమోచింతును; మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా, నీ విజయ మెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? పశ్చాత్తాపము నాకు పుట్టదు.” (హోషేయ.13:14)
“నీవు చేసినది అంతటినిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు.16:63)
పై వాగ్ధానాలద్వారా మోషేధర్మశాస్త్రము చేయలేనిదాన్ని దేవుడు చేసాడు. అనేక ఆజ్ఙాతిక్రమాల ఫలితంగా మానవులు కూడగట్టుకునే విపరీతమైన పాపాలకు మరిముఖ్యముగా మరణపాత్రమైన పాపాలకు ప్రాయశ్చిత్తమార్గాన్ని ధర్మశాస్త్రముకూడా చూపలేకపొయింది. అలాంటి పాపాలకు పరిష్కారం ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు సిద్ధపరచాడు. అయితే, ఇది ఆయన తన పరిశుద్ధత, న్యాయతత్వం, మరియు ప్రేమల సమిష్టి సహకారంతోనే సిద్ధపరచాడు.
మానవాళి రక్షణ [మోక్షం] కై దైవప్రణాలికాబద్దమైన కార్యసాధనకు ప్రభువైన దేవుడు తనలో భాగమై యున్న తన “వాక్కు” [דָבָר/దాబార్ = λόγος/లొగోస్] ను అభిశేకించి ఈలోకములోకి మెస్సయ్యగా [దేవుని కుమారునిగా లేక దేవుని సేవకునిగా] పంపించాడు. అ దైవాంశసంభూతుని గురించి లేఖనాలిస్తున్న సాక్ష్యం:
“బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.” (మీకా.5:2)
“ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (మాకి.3:1)
పంపబడబోతున్న మెస్సయ్య మొదట తన బలియాగముచేత దేవుని న్యాయతత్వాన్ని తృప్తిపరచి తద్వారా మానవుల పాపాలకు ప్రాయశ్చిత్తాన్ని చేసి తన పునరుత్థానము తదుపరి వారికి నీతిపాలన అందించబోతున్నాడన్న సత్యాన్ని లేఖనాలు భవిశ్యవాణి రూపంలో అందిస్తున్నాయి. అయితే, ఈ సత్యానికి సంచకరువుగా తన ప్రజలైన ఇశ్రాయేలీయులతో ఒక వాగ్ధానం చేస్తూ పరమతండ్రి వారి విమోచనకు తగిన ప్రాయశ్చిత్తాన్ని తానే యేర్పాటుచేయబోతున్నట్లు ప్రకటించాడు:
“నేను యెహోవానని నీవు తెలిసికొనునట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచెదను. నీవు చేసినది అంతటి నిమిత్తము నేను ప్రాయశ్చిత్తము చేయగా దానిని మనస్సునకు తెచ్చుకొని సిగ్గుపడి సిగ్గుచేత నోరు మూసికొందువు; ఇదే యెహోవా వాక్కు.” (యెహెజ్కేలు.16:62-63)
“తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును…ఈ అరువదిరెండు వారములు జరిగిన పిమ్మట ఏమియు లేకుండ అభిషిక్తుడు నిర్మూలము చేయబడును.” (దానియేలు.9:24…26)
“అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్నుతానే అపరాధపరిహారార్థబలిచేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతనివలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తినొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవజ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.” (యెషయా.53:10-11)
“రాత్రి కలిగిన దర్శనములను నేనింక చూచుచుండగా, ఆకాశమేఘారూఢుడై మనుష్యకుమారునిపోలిన యొకడు వచ్చి, ఆ మహావృద్ధుడగువాని సన్నిధిని ప్రవేశించి, ఆయన సముఖమునకు తేబడెను. సకల జనులును రాష్ట్రములును ఆ యా భాషలు మాటలాడువారును ఆయనను సేవించునట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయన కీయబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అదెన్నటికిని తొలగిపోదు; ఆయన రాజ్యము ఎప్పుడును లయముకాదు.” (దానియేలు.7:14)
పాతనిబంధనాగ్రంథములో ప్రవచనాత్మకంగా తెలియచేయబడిన పై దైవప్రణాలికా ప్రకటనలు ప్రభువైన యేసు [యషువ] నందు నెరవేర్చబడటాన్ని గూర్చి క్రొత్తనిబంధనా లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి:
“అంతట ఆయనమోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను, కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడిన వన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయనపేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీమీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి యుండుడని వారితో చెప్పెను.” (లూకా.24:44-49)
“ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై, దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధులయందు మహిమపరచబడుటకును, విశ్వసించినవారందరి యందు ప్రశంసింపబడుటకును, ప్రభువు వచ్చినప్పుడు అట్టివారు ఆయన సముఖము నుండియు ఆయన ప్రభావమందలి మహిమనుండియు పారదోలబడి, నిత్యనాశనమను దండన పొందుదురు. ఏలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యము మీరు నమ్మితిరి.” (2థెస్స.1:6-10)
“మనలను ప్రేమించుచు తన రక్తమువలన మన పాపములనుండి మనలను విడిపించినవానికి మహిమయు ప్రభావ మును యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను జేసెను.” (ప్రకటన.1:6)
“ఏడవ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు — ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను.” (ప్రకటన.11:15)
పరిశుద్ధత మరియు నీతి
“కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తుయేసునందు పరిశుద్ధపరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారికిని, వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతిస్థలములో ప్రార్థించువారికందరికిని శుభమని చెప్పి వ్రాయునది.” (1కొరింథీ.1:2)
“మీలో కొందరు అట్టివారై యుంటిరి గాని, ప్రభువైన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి, పరిశుద్ధపరచబడినవారై నీతిమంతులుగా తీర్చ బడితిరి.” (1కొరింథీ.6:11)
“ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతిబయలుపడుచున్నది; దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలును సాక్ష్యమిచ్చుచున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసమూలమైనదై,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది. ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే, క్రీస్తుయేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు.” (రోమా.3:21-24)
పై లేఖనాలు ప్రకటిస్తున్న విధంగా మానవులు యేసు క్రీస్తును [యషువ మషియాఖ్] ను విశ్వసించటముద్వారా పరిశుద్ధతను మరియు నీతిని పొందగలరు.
ఏనరుడు మానవుల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయజాలడు. కనుక, సృష్టికర్త తానే ఆ కార్యాన్ని నరరూపధారియైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] నందు నిర్వర్తించాడు. మానవులందరి నిమిత్తం ఏర్పరచబడిన ఈ విమోచనా కార్యం దేవుని అనాదికాల సంకల్పములోనిది. అందునుబట్టే ఆ కార్యపు నెరవేర్పు కాలప్రవాహములో ఒకానొక నిర్దుష్టమైన సమయములో సంపూర్తిచేయబడినా దానికి ముందు అలాగే దానికి తరువాతకూడా ఆదిలోనే తాను నిర్దేశించిన ఆ కార్యాన్ని ఆధారం చేసుకొనే దేవుడు నరుల పాపాలను క్షమించి మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఇది న్యాయవర్తనుడైన సృష్టికర్త యొక్క కృపా విధానం.
ఈ విమోచనా సాఫల్యతకు ఏకాలములోనైనా స్వంతనీతిపై లేక స్వంతభక్తిపై ఆధారపడకుండా కేవలము సృష్టికర్తపై మరియు ఆయన సందేశంపై ఆధారపడే అచంచల విశ్వాసమే నరులకు కావలసిన అర్హత.
అటుతరువాతే అంటే ఈలోకములో దైవక్షమాపణను పొంది మోక్షవాగ్ధానాన్ని అందుకున్న తరువాతే పవిత్రమైన ప్రేమాయుక్తమైన నీతి జీవితం సాధ్యమవుతుంది. అది సృష్టికర్త నీనుంచి ఆశిస్తున్న జీవితం.
ప్రభువైన దేవుడు మిమ్ములను దీవించి సర్వసత్యములోకి నడిపించును గాక!