అవిశ్వాసుల అపోహలు మరియు అభ్యంతరాలు
– ఆదివారము తెల్లవారుజామున యేసుసమాధి వద్దకు వచ్చింది ఎంతమంది స్త్రీలు? ఒక్కరా అంటే మగ్ధలేనే మరియనా (యోహాను.20:1)? ఇద్దరా (మత్తయి.28:1)? ముగ్గురా (మార్కు.16:1)? లేక అనేకులా (లూకా.24:1)?
– యేసు సమాధిలో స్త్రీలు చూసింది ఒక వ్యక్తినా/దేవదూతనా (మత్తయి.28:2-7; మార్కు.16:4-7) లేక యిద్దరు వ్యక్తులనా/దేవదూతలనా (లూకా.24:4-8)?
– యేసు సిలువ వేయబడింది లేక మరణించింది యేరోజు?
– యేసు పునరుత్థానుడైన తరువాత మొట్టమొదట ఎవరికి కనిపించాడు? మగ్ధలేనే మరియకా (మార్కు.16:9) లేక యితర స్త్రీలకా (మత్తయి.28:8)?
– యేసు సమాధిలోనుండి లేచింది యేరోజు?
– యేసు సమాధిలో ఎన్ని గంటలు మరియు రోజులు వున్నాడు?
– యేసు మరణపునరుత్థానములో యోనా సూచక క్రియ ఏవిధంగా నేరవేర్చబడింది (మత్తయి.12:39-40)?
అవిశ్వాసులు మరియు బైబిలు వ్యతిరేకులు క్రొత్తనిబంధన గ్రంథములోని దైవసత్యాలను తిరస్కరించే తమ వ్యర్థ ప్రయత్నాలాలో భాగంగా పై ప్రశ్నలను లేవనెత్తడం సహజంగా జరిగే విశయమే. అయితే, సత్యం అన్ని వేళల సరళంగానే అందించబడాలి అన్న నియమమేదీ లేదు. మరిముఖ్యంగా, దైవ సత్యం అన్నది మానవాళికి చాలామట్టుకు మర్మఘర్బితంగా యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
క్రొత్తనిబంధన గ్రంథములోని వివరణలు సత్యాన్వేషకులకు మరియు సత్యద్వేషులకు వేరువేరుగా అగుపించే అవకాశాలు ఎక్కువ. బైబిలును తప్పు బట్టి తమ వక్రవ్యాఖ్యానాలద్వారా అమాయకులను తప్పు మార్గం పట్టించే సత్యద్వేషులకు బైబిలులోని ప్రతి సత్యం ఒక అసత్యంగా ప్రతి మర్మం పరస్పర వ్యతిరిక్తంగా కనిపించడం సర్వసాధారణమైన విశయం. అలాంటివారి అజ్ఙానాన్ని దుష్టప్రయత్నాలను ప్రక్కకు పెట్టి సహృదయముతో సత్యాన్ని స్వీకరించే సత్యాన్వేషకులకు సహకరించే సదుద్దేశముతో క్రింది వివరాలను మీముందు వుంచడమైనది. సత్యాన్వేషకులు, సహృదయులు, మరియు విజ్ఙులు అయిన వారిని క్రింది వివరాలను పరిశీలించి సత్యాన్ని స్వీకరించాల్సిందిగా సగౌరవంగా అహ్వానిస్తున్నాము.
నలుగురు సువార్తికులద్వారా యివ్వబడిన యేసు క్రీస్తు మరణపునరుత్థానాల వివరాల సమగ్ర సారాంశము
యూదులు దినాన్ని లెక్కించే విధానము ప్రకారము యేసు క్రీస్తును బుధవారము నిస్సాను 14వ తారీఖునాడు మధ్యరాత్రి తరువాత రోమా సైనికులు బంధించి తీసుకువెళ్ళారు. ప్రాతఃకాలము 6 గంటలకుముందే రోమా అధిపతి పొంతిపిలాతు అతనికి తీర్పుతీర్చి సిలువ వేయబడుటకు అప్పగించాడు (యోహాను.18:28; 19:14).
అదేదినము ఉదయము 9 గంటల ప్రాంతములో ఆయనను సిలువవేసారు (మార్కు.15:25). ఆరోజు మధ్యాహానము 12 గంటలనుండి 3 గంటలవరకు ఆదేశమంతా చీకటికమ్మింది (మత్తయి.27:45; మార్కు.15:33; లూకా.23:44). 3 గంటలకు ఆయన ప్రాణం విడిచాడు (మార్. 15:33-37).
అదేరోజు సాయంత్రము 6 గంటలలోపే ఆయన దేహాన్ని దగ్గరిలోనే వున్న ఒక తోటలోని రాతి సమాధిలో వుంచారు (మార్కు.15:42-47; యోహాను.19:41-42). ఇదంతా దగ్గరలోనే నిలుచుండి ఆయనను వెంబడించిన స్త్రీలు (యాకోబు మరియు యోసేపుల తల్లి మరియ, జెబదీ కుమారుల తల్లి, మగ్దలేనె మరియ, మరియు సలోమి) చూసి తమ యిళ్ళకు వెళ్ళి ఆ దినమంతా (బుధవారము సాయంత్రము మొదలుకొని గురువారము సాయంత్రమువరకు) విశ్రమించారు. అది ప్రత్యేకమైన లేక మహావిశ్రాంతిదినం (యోహాను.19:31). అదేదినం ఆ రాతిసమాధిని అధికారులు భద్రంచేసారు (మత్తయి.27:62-66).
ఆ ప్రత్యేక లేక మహావిశ్రాంతిదినముగడిచిన తరువాత శుక్రవారమునాడు స్త్రీలు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను కొని సిద్దపరచి (మార్కు 16:1) మరునాడు అంటే శనివారము సాధారణ విశ్రాంతిదినము గనుక తిరిగి ఆ దినమంతా విశ్రమించారు (లూకా.23:56).
శనివారము సాయంకాలము 6 గంటల ప్రాంతములో ఆయన సమాధినుండి తిరిగి లేచాడు! ఇది ఆయన చనిపోకముందు చెప్పిన ప్రవచనాల ఆధారంగా మూడు పగళ్ళు మూడు రత్రుళ్ళు గడచాయి (మత్తయి.12:40) గనుక ఆయన మరణాన్ని జయించి తిరిగిలేచింది శనివారపు చివరిలో లేక ఆదివారపు ప్రారంభములో (బైబిలు లెక్క ప్రకారము ఒక దినము అంటే సాయంత్రము మొదలుకొని మరుసటి సాయంత్రము వరకు) నన్నది గ్రహించవచ్చు.
ఆదివారము పెందరాళ్ళే యింకా చాలా చీకటిగానున్నప్పుడే యేసు క్రీస్తును వెంబడించిన స్త్రీలు తాము శుక్రవారమునాడు సిద్దపరచిన సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలాలను తీసుకొని ఆయన దేహానికి పూయడానికి సమాధివైపు బయలుదేరారు (మార్కు.16:1-2; లూకా.24:1). మగ్దలేనె మరియ వారిలో ఒకతి (మత్తయి.28:1; యోహాను.20:1). అయితే సమాధి ద్వారానికి అడ్డంగా వుంచబడిన రాతినిగురించి ఆ స్త్రీలు కొంత చింతనచేయాల్సి వచ్చింది (మార్కు.16:3).
ఆ స్త్రీలు సమాధిని సమీపించడానికి ముందే ఆదివారము తెల్లవారుజామున భూకంపము రావడము, పరలోకమునుండి దేవదూత వచ్చి సమాధికి అడ్డుగా వుంచబడిన రాతిని తొలగించి దానిపై కూర్చోవడం జరిగింది (మత్తయి.28:2). ఇదంతా చూసిన కావలివారు భయముతో స్పృహతప్పి పడిపోయారు (మత్తయి.28:4). అటుతరువాత దేవదూత సమాధిలోకి ప్రవేశించి యేసు దేహముంచబడిన స్థలములో ఆయన తల వుంచబడిన కుడిభాగములో కూర్చున్నాడు (మార్కు 16:5). మరికొంత సమయములోనే మరొక దేవదూత వచ్చి యేసు కాళ్ళు వుంచబడిన యెడమభాగములో కుర్చోవడము జరిగింది (లూకా.24:4).
స్త్రీలు యింకా సమాధికి దూరంగా వుండగానే సమాధి రాతి తొలగించబడినట్లు (మార్కు.16:4; లూకా 24:2; యోహాను 20:1) అక్కడే కావలివాళ్ళు నేలపై మృతజీవులలా నిశ్ఛలంగా పడివున్నట్లు గమనించారు (మత్తయి.28:5). ఆ దృశ్యాన్ని చూసిన స్త్రీలు యేసు శరీరాన్ని యెవరో యెత్తుకొనిపోయారన్న తీర్మానానికి వచ్చారు. దాంతో మగ్దలేనె మరియ పేతురుకు మరియు ఇతర శిష్యులకు ఆ విశయాన్ని తెలియచేయడానికి వెంటనే మిగతా స్త్రీలను వదిలి అక్కడినుండే వెనుదిరిగి తిరిగి నగరమువైపు వెళ్ళింది (యోహాను.20:2).
మగ్దలేనే మరియ తమను విడిచి వెనక్కు వెళ్ళినతదుపరి తతిమా స్త్రీలు ధైర్యం కూడగట్టుకొని తెరచి వుంచిన సమాధిలోనికి ప్రవేశించి అక్కడ యేసు శరీరము లేకుండుట గమనించారు. అంతలోనే మొదట అక్కడ కుడివైపున ఆసీనుడైవున్న దేవదూత వారికి ప్రత్యక్షమయ్యాడు (మార్కు.16:5) ఆ దేవదూత వారిని చూసి లేచి మాట్లాడుతున్నప్పుడు రెండవదూత కూడ వారికి ప్రత్యక్షమై నిలబడ్డాడు (లూకా.24:4). కుడివైపునున్న దేవదూత యేసుక్రీస్తు యొక్క పునరుత్థానమును గురించి వారికి ప్రకటించి ఆ వార్తను యేసు శిష్యులకు తెలుపవలసినదంటూ వారికి సూచించాడు (మత్తయి.28:6-7). అదివిన్న ఆ స్త్రీలు భయముతోను ఆనందముతోను సమాధిని విడిచి వెళ్ళిపోయారు (మత్తయి.28:8; మార్కు.16:8).
వారందరు తిరిగి నగరములోకి వచ్చారు కాని తాము చూసిన మరియు విన్న విశయాలను యితరులకు చెప్పడానికి తటపటాయిస్తూ వుండిపోయారు (మార్కు.16:8). స్త్రీలు సమాధిని విడిచివెళ్ళిన తరువాత యిద్దరుదేవదూతలు అదృశ్యమయిపోయారు. చివరికి ధైర్యం కూడగట్టుకొని అ స్త్రీలు శిష్యులదగ్గరకు వెళ్ళి తాము చూసిన విశయాలను తెలియచేసారు (లూకా.24:9-12).
రమారమి అదేసమయములో మగ్దలేనే మరియ యేసు శిష్యులను కలిసి యేసు దేహాన్ని ఎవరో ఎత్తుకుపోయారన్న వార్త అందించింది (యోహాను 20:2). మగ్దలేనే మరియ మరియు మిగత స్త్రీలు ఆశ్చర్యపరిచే అసాధారణవిశయాలను చెప్పడం శిష్యులు విని వారి మాటలను నమ్మలేక పోయారు (లూకా.24:11). పేతురు మరియు యోహానులు స్త్రీలు చెప్పినది వాస్తవమో కాదోనని తేల్చుకోవడానికి పరుగెత్తి సమాధివద్దకు వెళ్ళారు (లూకా.24:12; యోహాను.20:3). మగ్దలేనే మరియ వారివెంబడే బయలుదేరింది కాని వారిలా పరుగెత్త లేక వారికి చాలా దూరంగా వెనుకబడిపోయింది.
మొదటగా సమాధిని చేరుకున్న యోహాను తరువాత అతని వెనుకే వచ్చిన పేతురు ఇరువురూ కలిసి సమాధిలోనికి ప్రవేశించారు. వారికి యేసు శరీరానికుండిన వస్త్రాలు తప్ప యేసు దేహం కనిపించలేదు సమాధిలో. దాంతో ఆశ్చర్యచకితులై వారిద్దరూ తిరిగి తాముంటున్న ఇంటికి వచ్చేసారు (యోహాను.20:4-4-10).
ఆ తరువాత అక్కడికి చేరుకున్న మగ్దలేనే మరియ సమాధిలోనికి ప్రవేశించింది. ఆమె ప్రవేశించడానికి ముందే యిద్దరు దేవదూతలు తిరిగి దృశ్యరూపులయ్యారు. సమాధిలోనికి ప్రవేశించిన మరియ ఆ యిద్దరు దేవదూతలను చూసింది. అందులోని కుడివైపుననున్న దూత ఆమెతో మాట్లాడాడు (యోహాను.20:11-13). అదివిని వెనుకకు తిరిగిన మరియకు అక్కడే నిలుచున్న యేసు కనిపించాడు, కాని ఆ ప్రాతఃకాల మసకచీకటిలో ఆమె అది యేసు అని గుర్తించలేక అతన్ని అక్కడి తోటమాలి అని భ్రమించింది. అయితే, అప్పుడే “మరియా” అంటూ యేసు ఆమెను సంబోధిస్తూ పిలవడంతో ఆమె అతన్ని గుర్తుపట్టింది (యోహాను.20:14-16).
యేసు ఆమెతో సంభాశించి తన శిష్యులకు తెలుపమంటూ ఒక సందేశాన్ని యిచ్చి ఆమెను వారిదగ్గరకు పంపించాడు (మార్కు.16:9; యోహాను.20:17). పునరుత్థానుడైన యేసు ప్రభువును మొట్టమొదట చూసింది మగ్దలేనే మరియ (మార్కు.16:9). దీని తరువాత సమాధిలో తాము చూసిన విన్న విశయాలను శిష్యులకు చెప్పి అక్కడినుండి తమలోని ఒకరి ఇంటికి వెళ్ళిన స్త్రీలకు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. వారు పునరుత్థానుడైన ప్రభువును చూసి ఆయనను పూజించారు. వారి ఆరాధనను స్వీకరించిన యేసు వారితో మాట్లాడి వారికో సందేశాన్ని యిచ్చి తన శిష్యులదగ్గరకు తిరిగి పంపించాడు (మత్తయి 28:9-10).
పై సంఘటనలన్నీ జరుగుతున్న సమయములో కావలివారు స్పృహలోకివచ్చి లేచి నగరములోకి పరిగెత్తుకొనిపోయి యూదామతనాయకులకు తాము చూసినవి తమకు జరిగినవి అన్నీ వివరించి చెప్పారు (మత్తయి.28:11-15).
ఈసమయానికంతా తోమా తప్ప మిగతా శిష్యులంతా చేరి తప్పిపోయిన ప్రభువు శరీరమును గురించి చర్చించసాగారు. అంతలో ప్రభువైన యేసు మరణములోంచి లేచి సజీవునిగా కనిపించాడంటూ వారిని ఆశ్చర్యముతో తలమునకలుచేసే వార్తను మగ్దలేనే మరియ మోసుకొచ్చింది (మార్కు.16:11; లూకా.24:10; యోహాను.20:18). ఇదే వార్తను నిర్ధారిస్తూ తతిమా స్త్రీలు కూడా శిష్యుల వద్దకు వచ్చి తమకు ప్రభువు తమకు కనిపించి చెప్పిన విశయాలన్నిటిని వారికి పూసగుచ్చినట్లు వివరించి చెప్పారు (లూకా.24:9).
ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయినతరువాత మూడు సంపూర్ణదినాలు అంటే 72 గంటల సమయం భూగర్భములో (పాతాళములో) వున్నాడు అనటానికి మూడు లేఖన ఆధారాలు
1. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము [μεγάλη=గొప్ప; పెద్ద;] గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.” యోహాను.19:31)
పాతనిబంధన గ్రంథములో వివరించిన ప్రకారము సబ్బాతు లేక విశ్రాంతిదినము అన్నది ఒక ప్రత్యేకమైన దినము. ఆ దినములో ఇశ్రాయేలీయులు సమాజముగా దేవుని ఎదుట కూడాలి మరియు వారు ఆదినము జీవనోపాధియైన ఏపనీ చేయకూడదు. విశ్రాంతిదినము రెండు రకాలు. ఒకటి, వారాంతములో వచ్చే సాధారణ విశ్రాంతిదినము (ఏడవదినము లేక శనివారము). రెండు, సంవత్సరములో ఒకేసారి వచ్చే యేడు ప్రత్యేకమైన పండుగ దినాలు. ఈ ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలు వారములోని ఏదినమైనా రావచ్చు. అవి క్రింద యివ్వబడిన పండుగలు:
(i) పులియనిరొట్టెల పండుగ యొక్క మొదటి దినము లేక “పెసహ్” ( ఆబీబు/నిసాను మాసము 15వ దినము)–లే.కాం.23:7; సం.కాం.28:17-18
(ii) పులియనిరొట్టెల పండుగ యొక్క చివరి/యేడవ దినము లేక “యోం తొవ్” ( ఆబీబు/నిసాను మాసము 21వ దినము)–ని.కాం.12:18, 13:6; లే.కాం.23:8; సం.కాం.28:25
(iii) పెంతెకోస్తు పండుగ లేక “షవూత్” (సివాను మాసము 6వ దినము)–లే.కాం.23:15-21
(iv) బూరధ్వనుల పండుగ లేక “రోష్-హ షాన” (తిష్రీ మాసము మొదటి దినము)–లే.కాం.23:24-25; సం.కాం.29:1
(v) పాపప్రాయశ్చిత్తార్థదిన పండుగ లేక “యోం కిప్పూర్” (తిష్రీ మాసము 10వ దినము)–లే.కాం.23:23-32; సం.కాం.29:7-8
(vi) పర్ణశాలల పండుగ లేక “సుక్కోత్” (తిష్రీ మాసము 15వ దినము)–లే.కాం.23:33-35; సం.కాం.29:12
(vii)పర్ణశాలల పండుగ యొక్క చివరి దినము లేక “షెమిని అట్జెరెత్” (తిష్రీ మాసము 22వ దినము)–లే.కాం.23:36,39; సం.కాం.29:35
పై ఏడు పండుగదినాలు మహావిశ్రాంతిదినాలు. ఆదినాలలో ఇశ్రాయేలీయులు దేవుని ఎదుట కూడి సమాజముగా ఆరాధించాలి మరియు వారు ఆదినమంతటిలో జీవనోపదియైన ఏపని చేయకూడదు. యేసు ప్రభువు మరణించిన దినానికి మరుసటి దినము ఏడు ప్రత్యేకమైన మహావిశ్రాంతిదినాలలోని ఒక దినము (యోహాను.19:31). ఒకవేళ, యేసు ప్రభువు మరణించిన దినపు మరుసటి రోజు అయిన మహావిశ్రాంతిదినము కూడా సాధారణ విశ్రాంతిదినమైన శనివారమునాడే వస్తే అది ఒక అసాధారణమైన విశయముగా పరిగణించవచ్చు. అలాంటి అసాధారణ సంఘటన సంభవిస్తే నలుగురు సువార్తికులలో ఒక్కరైనా ఆవిశయాన్ని పేర్కొని వుండేవారు. కాని అలా జరుగలేదు అన్నది యిక్కడ గమనార్హమైన విశయము.
2. “విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.” (మార్కు.16:1)
“ఆ దినము సిద్ధపరచు దినము; విశ్రాంతి దినారంభము కావచ్చెను. అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి.” (లూకా.23:54-56)
మర్కు 16:1 ప్రకారము స్త్రీలు విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత సుగంధద్రవ్యములను కొన్నారు (సిద్ధపరచారు). లూకా 23:56 ప్రకారము స్త్రీలు సుగంధద్రవ్యములను సిద్ధపరచి (కొని) విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు. ఈ రెండు వివరాలు వాస్తవమవటానికి రెండు విశ్రాంతిదినాలు వుండాలి–ఒకటి ప్రత్యేకమైన విశ్రాంతిదినము మరొకటి సాధారణమైన విశ్రాంతిదినము. దీన్ని సమర్థిస్తూ యోహాను 19:31లో యేసుక్రీస్తు మరణించిన మరుసటిదినము మహా విశ్రాంతిదినముగా పేర్కొనబడింది. అలాకాని పక్షములో అంటే శుక్రవారమే యేసు ప్రభువు చనిపోయిన దినము అయితే రెండు వివరాలలో ఒకటిమాత్రమే వాస్తవమవుతుంది!
3. “యోనా మూడు రాత్రింబగళ్లు తివిుంగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును.” (మత్తయి.12:40)
పై వాక్యములో ఒకవేళ “మూడు దినాలు” అని వ్రాయబడితే యూదులు దినాన్ని లెక్కించే పద్దతిలో శుక్రవారములోని కొంత భాగము, శనివారము అంతా, మరియు ఆదివారములోని కొంతభాగము కలిపి “మూడుదినాలు” అని లెక్కించే అవకాశముంది. కాని, లేఖనము “మూడు రాత్రింబగళ్ళు” అంటూ చాలా విస్పష్టముగా మూడు సంపూర్ణదినాలను అంటే 72 గంటల సమయాన్ని నొక్కి వక్కాణిస్తున్నది. లేఖనములోని ఈ స్పష్టతను తిరస్కరిస్తున్నవారు ఒకవేళ లేఖనము మూడు సంపూర్ణ దినాల లేక 72 గంటల సమయపు స్పష్టతను వ్యక్తంచేయాల్సివస్తే ఏలాంటి పదజాలాన్ని వుపయోగించాలోనన్నది ఉదాహరణతో వివరించాలి.
పాతనిబంధన గ్రంథము (తనాక్) ప్రకారము పస్కా పండుగను ఆచరించడములోని కొన్ని ప్రధాన ఆజ్ఙలు మరియు ఘట్టాలు
1. ఆబీబు/నిసాను మాసము 10వ దినాన నిర్దోషమైన ఏడాది వయసున్న పస్కా పశువును ఏర్పరచుకోవాలి (ని.కాం.12:3)
2. పస్కా పశువును ఆబీబు (నిసాను) మాసము 14వ దినము వరకు సిద్ధపరచాలి (ని.కాం.12:7)
3. నిసాను మాసము 14వ దినము సాయంకాలము పస్కా పశువును వధించాలి (ని.కాం.12:7; యెహోషువ 5:10)
4. ఆరాత్రే పస్కా పశువు మాంసమును కాల్చి పొంగని/పులియని రొట్టెలతో చేదు కూరలతో దాన్ని తినవలెను (ని.కాం.12:8)
5. పస్కా పండుగను ఇశ్రాయేలీయులు మాత్రమే పాటించాలి (ని.కాం.12:42-45)
6. పస్కా పండుగను యెరూషలేములోనే ఆచరించాలి (ద్వి.కాం.16:2-7)
7. పస్కా పశువు వధింపబడిన తరువాతే పులియనిరొట్టెలతోకూడిన పస్కా పండుగను ఆచరించాలి (ని.కాం.12:1-11; ద్వి.కాం.16:2-7)
క్రొత్తనిబంధన గ్రంథము ప్రారంభములో అంటే యేసుక్రీస్తు ఈలోకములో జీవించిన సమయములో నిసాను 14వ దినాన వచ్చే పస్కా పండుగను దానివెంటనే అదే మాసములో 15వ దినాన మొదలయ్యే పులియనిరొట్టెల పండుగను కలిపి పులియనిరొట్టెల పండుగ కాలముగా పరిగణించేవారు (లూకా.22:1). అయితే అదే పండుగ కాలాన్ని ఈనాటి యూదులు పస్కా పండుగ కాలంగా పరిగణించడం గత రెండువేల సంవత్సరాల పరిధిలో జరిగిన మార్పు అన్నది గ్రహించాలి.
క్రీస్తుశకం రెండవ శతాబ్ధమునుండి పస్కా పండుగ/పులియనిరొట్టెల పండుగ జరుపుకునే విధానములో అనేక ఆచారాలను రబ్బీలు అంటే యూదా మతాధికారులు చొప్పించడము జరిగింది. ఇవేవీ మొదటి శతాబ్ధములోని యూదులు పాటించలేదు. ఈనాడు యూదులు పాటించే “పస్కా సెదెర్” (పస్కా పండుగను ఆచరించే క్రమము) కాలక్రమములో మార్పులు చేర్పులు చెందుతూ నేటి స్థాయికి చేరుకుంది. రెండువేల సంవత్సరాల క్రితం అనుసరించబడిన పస్కా సెదెర్ ఈనాడున్న పస్కా సెదెర్ లా విస్త్రుతమైన ఆచారాలతో కూడింది కాదు. ఈ కారణాన్నిబట్టి యేసు ప్రభువు మరియు ఆయన శిష్యులు పాటించిన పస్కా సెదెర్ కు ఈనాడు యూదులు పాటించే పస్కా సెదెర్ కు మధ్య వ్యత్యాసాలుండటం కద్దు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు/యూదులు మొదటి శతాబ్ధము వరకు పస్కా పశువును వధించి పండుగను ఆచరించేవారు (2ది.వృ.35:1; ఎజ్రా.6:19-21; మార్కు.14:12). ఈనాడు రబ్బీల-జూడాయిజమును అనుసరిస్తున్నవారు ఆ ఆచారమును పాటించడము లేదు.
పాతనిబంధన గ్రంథములో (తనాక్) పస్కా పండుగను ఆచరించాల్సిన ప్రజలను గురించి, కారణాన్ని గురించి, విధానాన్ని గురించి, అలాగే ఆచరించాల్సిన స్థలమును గురించి దేవుడు వివరించడమేగాక రాబోవు తరాలు అనుసరించదగిన కొన్ని దృష్టాంతాలను కూడా పాతనిబంధన గ్రంథములో (తనాక్) అందించాడు. ఈ వాస్తవాన్ని బట్టి పాతనిబంధన గ్రంథ కాలములో అలాగే క్రొత్తనిబంధన గ్రంథ కాలములో అంటే 1400 క్రీ.పూ. నుండి 100 క్రీ.శ. వరకు దేవుని స్పష్టమైన ఆజ్ఙ ప్రకారము మోషేధర్మశాస్త్రాన్ని (పంచకాండాలను) అనుసరించిన ఇశ్రాయేలీయులు పస్కా పండుగను దేవుడేర్పరచుకున్న యెరూషలేమునగరములోనే లేఖనాల క్రమములో జరుపుకునేవారు.
ఈనాడు యూదులమంటూ చెప్పుకుంటున్నవారు యూదుమతములో చేరినవారు తనాక్ (పాతనిబంధన) బోధలను ప్రక్కకుబెట్టి ఈ పండుగను ఆచరించే విశయములో దేవుడిచ్చిన స్పష్టమైన ఆజ్ఙలను తుంగలో తొక్కి రబ్బీల బోధల ప్రకారము అంటే రబ్బీల-జూడాయిజం ప్రకారము పస్కా పండుగను తాముంటున్న దేశములో తాము నివసిస్తున్న ఊరిలో రబ్బీలు నిర్దేశించిన క్రమమములో రబ్బీలు యేర్పరచిన ఆచారాలతో జరుపుకుంటున్నారు!
ప్రభువైన యేసు క్రీస్తు (యషువ మషియాఖ్) జీవితములోని చివరి వారములో జరిగిన ప్రధాన సంఘటనల సంక్షిప్త సూచిక
మూడవదినము/మంగళవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 13వ తారీఖు) — శిష్యులు వెళ్ళి యేసు చెప్పిన మాటల ప్రకారము మేడగదితో కూడిన ఇంటిని కనుగొనటము;
మూడవదినము/మంగళవారము:రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిస్సాను మాసము 14వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు బుధవారపు ప్రారంభము) యేసు ప్రభువు మరియు శిష్యులు పస్కా పండుగ భోజనము చేయుట; గెత్సేమనే తోటలో ప్రార్థించటము; రోమా సైనికులచేత యేసు ప్రభువు బంధించబడటము; యూదు మతాదికారులముందు యేసు ప్రభువును నిలబెట్టడటము; మరునాడు అంటే నిస్సాను మాసము 15వ తారీఖునాడు పులియనిరొట్టెల పండుగ యొక్క మహావిశ్రాంతిదినము అనబడే మొదటిదినము. కనుక, ఈదినము మరుసటిదినానికి సిద్దపరచు దినము;
నాలుగవదినము/బుధవారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 14వ తారీఖు కొనసాగింపు) — రోమా అధికారి పిలాతుముందు యేసు ప్రభువును దోషిగా నిలబెట్టడము; ఉదయము 9:00 గంటలకు యేసు ప్రభువును సిలువపైకి ఎక్కించడము; మధ్యాహానము 3:00 గంటలకు యేసు ప్రభువు చివరి శ్వాస; ఆరోజు చివరలో యేసు ప్రభువు యొక్క ఆత్మ/ప్రాణము భూగర్భములోకి అంటే పాతాళములోకి వెళ్ళడము మరియు ఆయన మృతదేహము రాతిలో తొలచబడిన సమాధిలో వుంచబడటము;
నాలుగవదినము/బుధవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు గురువారపు ప్రారంభము); యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిరాత్రిప్రారంభము; మహా విశ్రాంతిదినపు ప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తమ ఇండ్లకు వెళ్ళి విశ్రమించారు;
ఐదవదినము/గురువారము (బేస్తవారము): పగలు (ఆబీబు/నిసాను మాసము 15వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మొదటిపగలు; మహా విశ్రాంతిదినపు కొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాన్ని పాటించారు; ప్రధాన యాజకులు మరియు పరిసయ్యులు పిలాతు అనుమతితో సమాధిని భద్రం చేసారు (మత్తయి.27:62-66);
ఐదవదినము/గురువారము (బేస్తవారము): రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శుక్రవారపు ప్రారంభము) యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవరాత్రి ప్రారంభము; మహా విశ్రాంతిదినము సమాప్తి; ఈదినం సాధారణ విశ్రాంతిదినానికి అంటే శనివారపు విశ్రాంతిదినానికి సిద్దపరచు దినము;
ఆరవదినము/శుక్రవారము:పగలు (ఆబీబు/నిసాను మాసము 16వ తారీఖు కొనసాగింపు) — యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన రెండవపగలుకొనసాగింపు; సిద్దపరచు దినపు కొనసాగింపు; మరునాడు సాధారణ విశ్రాంతిదినము (శనివారము); యేసు ప్రభువును వెంబడించిన ఆ స్త్రీలు ఆయన దేహానికి పూయవలేనని సుగంధద్రవ్యములను కొన్నారు (మార్కు 16:1);
ఆరవదినము/శుక్రవారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు శనివారపు ప్రారంభము); సాధారణ విశ్రాంతిదినపు ప్రారంభము; ఇది యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవరాత్రిప్రారంభము; యేసు ప్రభువును వెంబడించిన స్త్రీలు తిరిగి విశ్రాంతిదినాచారము ప్రకారము విశ్రమించారు (లూకా.23:56)
ఏడవదినము/శనివారము: పగలు (ఆబీబు/నిసాను మాసము 17వ తారీఖు కొనసాగింపు); సాధారణ విశ్రాంతిదినపు కొనసాగింపు; యేసు ప్రభువు (ఆత్మ/ప్రాణము) భూగర్భములో మరియు ఆయన దేహము సమాధిలో వుండిన మూడవపగలుకొనసాగింపు; స్త్రీలు విశ్రాంతిదినాచారాని కొనసాగించారు;
ఏడవదినము/శనివారము: రాత్రి/సాయంత్రము (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు ప్రారంభము — యూదుల/బైబిలు ఆదివారము లేక మొదటిదినము ప్రారంభము); మూడు రాత్రింబగళ్ళు గడిచిపోయాయి; ప్రభువైన యేసు క్రీస్తు (ఆత్మ/ప్రాణము) తన శరీరముతో ఐక్యపరచబడి మృత్యుంజయుడై పునరుత్థానుడయ్యాడు, మరియు మహిమశరీరముతో సమాధిలోనుండి వెళ్ళిపోయాడు;
మొదటిదినము/ఆదివారము: తెల్లవారుజామున (ఆబీబు/నిసాను మాసము 18వ తారీఖు కొనసాగింపు); స్త్రీలు తాము సిద్దపరచిన సుగంధద్రవాలతో సమాధి దగ్గరకు వచ్చారు; సమాధిలో యేసు ప్రభువు దేహము లేదు;