“కాబట్టి ప్రభువు తానే యొక సూచన [אוֹת/oth/ఓథ్] మీకు చూపును. ఆలకించుడి, కన్యక [עַלְמָה/అల్మ] గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము ].” (యెషయా 7:14)
పై ప్రవచనాత్మక లేఖన సందేశములో గుర్తించాల్సిన సత్యాలు:
(1) ఆదిమ హెబ్రీ భాషలో ‘అల్మ’ [עַלְמָה/alma] అనే పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము లేని యువతి. ఈ పదం 7 సార్లు తనాక్ లో వుపయోగించబడింది.
ఉదాహరణ: “అందుకు ఫరో కుమార్తె వెళ్లుమని చెప్పగా ఆ ‘చిన్నది’ [עַלְמָה/అల్మ] వెళ్లి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను.” (ని.కాం.2:8).
ఇక్కడ మోషే అక్క పెళ్ళి అయిన స్త్రీ కాదు అందుకే పై లేఖనములో ఆల్మ [עַלְמָה/alma] అనే పదము ఆమెకు ఉపయోగించబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
తనాక్ అంతటిలో అల్మ [עַלְמָה/alma] అనే హెబ్రీ పదం వివాహము జరిగిన యువతిని సూచించటానికి ఒక్కసారి కూడా ఉపయోగించబడలేదు అన్న వాస్తవము ఈ సందర్భములో గమనార్హమైన విశయము.
(2) క్రీస్తుకు పూర్వమే 3వ శతాబ్ధములో హెబ్రీ భాషలోని తనాక్ లేఖనాలను గ్రీకు భాషలోకి అనువదించారు. అనువదించినవారు ఆదిమ హెబ్రీ మరియు గ్రీకు భాషలలో ప్రావీణ్యత సంపాదించిన యూదు పండితులు. వారు తమ లేఖనాలలోని మరియు దినాలలోని పదాల భావాలను పదాలమధ్య బేధాలను బాగా యెరిగినవారు. వారు అనువదించిన తనాక్ యొక్క గ్రీకు లేఖనాలను సెప్టూజింట్ [Septuagint] అని పేర్కొంటారు. సెప్టూజింటులో యెషయా 7:14లోని పదాన్ని గ్రీకులో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అనే పదంగా అనువదించారు. ఇదే పదం క్రొత్తనిబంధనలోని మత్తయి వ్రాసిన సువార్తలో వుపయోగించబడింది:
“ఇదిగో కన్యక [παρθένος/parthenos] గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు” (మత్తయి 1:23).
గ్రీకు భాషలో ‘పార్థెనోస్’ [παρθένος/parthenos] అన్న పదానికున్న అర్థాలు: యువతి; యవ్వన స్త్రీ; కన్యక/పురుష సంయోగము ఎరుగని యువతి; స్త్రీ సాంగత్యము ఎరుగని పురుషుడు.
(3) ఆదిమ హెబ్రీ భాషలో ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అనే పదముకూడా యవ్వన స్త్రీలకు వాడబడింది. ఈ పదం 50 సార్లు తనాక్ లో వుపయోగించబడింది. ఈ పదానికున్న అర్థాలు: యవ్వన స్త్రీ; కన్యక.
తనాక్ (పాతనిబంధన) లో వుపయోగించబడిన హెబ్రీ భాషాపదం బెతూల [בְּתוּלָה/betulah] లో కన్యత్వము స్పష్టముగా ప్రతిబింబించడములేనందుననే ఈ పదాన్ని వుపయోగించిన కొన్ని సందర్భాలలో కన్యత్వాన్ని సూచించడానికి కన్యత్వ వివరణ యివ్వబడింది: ఉదాహరణలు:
“ఆ చిన్నది మిక్కిలి చక్కనిది; ఆమె బెతూల (בְּתוּלָה/bethulah), ఏ పురుషుడును ఆమెను కూడలేదు;” (ఆది.కాం.24:16)
“తనకు సమీపముగానున్న శుద్ధ సహోదరియగు అవివాహిత బెతూల (בְּתוּלָה/bethulah), అను వీరియొక్క శవమునుముట్టి తన్ను అపవిత్రపరచుకొనవచ్చును.” (లేవీ.కాం.21:3)
(4) అల్మ [עַלְמָה/alma] అన్న హెబ్రీ పదము 7 సార్లు తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో వుపయోగించబడినా ఒక్కసారికూడా వివాహమైన యవ్వన యువతికి ఆపాదించబడలేదు. అయితే, ‘బెతూల’ [בְּתוּלָה/bethulah] అన్న హెబ్రీ పదము మాత్రము తనాక్ (పాతనిబంధన గ్రంథము) లో ఒకసారి వివాహమైన యవ్వన యువతికికూడా ఆపాదించబడింది. “పెనిమిటి పోయిన బెతూల [בְּתוּלָה/bethulah] గోనెపట్ట కట్టు కొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము.” (యోవేలు 1:8). దీన్నిబట్టి బెతూల కన్న అల్మ అన్న హెబ్రీ పదమే కన్యకకు సరియైన పదమని గ్రహించవచ్చు. అందుకే పరిశుద్ధాత్ముడు తన ప్రవక్తలద్వారా ‘కన్యక’ అన్న భావాన్ని సూచించడానికి ఆదిమ హెబ్రీభాషలోని ‘అల్మ’ [עַלְמָהalma] మరియు గ్రీకు భాషలోని ‘పార్తెనోస్’ παρθένος/parthenos] అన్న పదాలను వుపయోగించడము జరిగింది. విజ్ఙలు ఈ సత్యాన్ని గ్రహించగలరు!
(5) హిజ్కియా తల్లి అయినా, హిజ్కియా భార్య అయినా, లేక యెషయా భార్య అయినా కన్యక (עַלְמָה/అల్మ; παρθένος/పార్తెనోస్) కాదు. కనుక, యెషయా 7:14 హిజ్కియా విశయములోగాని, హిజ్కియా కుమారుని విశయములోగాని లేక యెషయా కుమారుని విశయములోగాని వర్తించదు, నెరవేర్చబడలేదు!
(6) యెషయా 7:14 లో యివ్వబడిన ప్రవచనములోని ప్రధానమైన భాగము “ప్రభువు తానే యొక సూచన మీకు చూపును.” ఇక్కడ ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) అన్నది సర్వసాధారణ సంభవాన్ని గూర్చినది కాదు. అది ఒక ‘ప్రత్యేకమైన గుర్తు’ లేక అసాధారణ సంఘటన.
ప్రభువైన దేవుడు తానే యివ్వబోతున్న ఆ గొప్ప సూచన ఎలాంటి సూచనతో సరితూగుతుందో అంతకుముందే 11వ వచనములో సూచించాడు, “అది పాతాళమంత లోతైనను సరే ఊర్థ్వలోకమంత ఎత్తయినను సరే” (యెషయా.7:11). అలాంటి గొప్ప సూచన ఏదీ రాజైన ఆహాజుకు తోచకపోయి వుండవచ్చు.
అలాంటి సందర్భములో ప్రభువైన దేవుడే ఒక సూచనను ఒక ప్రత్యేకమైన గుర్తును అంటే ఒక అసాధారణ సంభవాన్ని గుర్తుగా అందించటము జరిగింది. అలాంటిది ఎప్పుడు ఎక్కడ జరుగని విశయము. చరిత్రలో ఎవరూ కనీ వినీ ఎరుగని సంఘటన. నిజంగానే అది పాతాళమంత లోతైనది ఊర్థ్వలోకమంత ఎత్తయినది–ఒక కన్య [పురుష సంయోగము ఎరుగని యువతి] గర్భవతియై కుమారుని కనటం.
దేవుడైన ప్రభువు తానే చూపించబోయే ‘సూచన’ [א֑וֹת/oth/ఓథ్=ప్రత్యేకమైన గుర్తు] మానవాతీత శక్తికి సంబంధించినదనటానికి ఈ సందర్భములో మోషేకాలములో దేవుడే చేసిన రెండు ‘సూచనలను’ [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] జ్ఙాపకము చేసుకోవాలి:
“మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠముగలదై హిమమువలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా, అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్మునుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరమువలె ఆయెను. మరియు ఆయనవారు నిన్ను నమ్మక, మొదటి సూచనను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి వినకపోయిన యెడల రెండవ దానిబట్టి విందురు. వారు ఈ రెండు సూచనలను [הָאֹ֣ת/haOth/హఓథ్=ప్రత్యేకమైన గుర్తు] బట్టి నమ్మక నీమాట వినకపోయిన యెడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి యెండిన నేలమీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలోనుండి తీసిన నీళ్లు పొడినేలమీద రక్తమగుననెను.” (ని.కాం.4:6-9).
పై లేఖనాల వెలుగులో పాతాళమంత లోతుగా ఊర్థ్వలోకమంత ఎత్తుగా వుండే ప్రభువైన దేవుడు తానే చూపే ఆ ‘సూచన’ ఏమిటి…?
“ఒక వివాహమైన యవ్వన యువతి గర్భము ధరించి కుమారుని కనును” అన్నది అనవసరమైన పదప్రయోగముతో కూడిన ప్రకటన అన్నది అటుంచి, అసలు అలాంటిది ప్రకృతిలో సంభవించే అత్యంత సాధారణమైన సంఘటన అన్నది ఇంగిత జ్ఙానమున్న ఎవరైన యిట్టే చెప్పగలరు. అందులో సూచన అంటూ యేమీలేదు! అలాంటి అత్యంతసాధారణ సంఘటనను దేవుడొక ‘సూచనగా’ [ప్రత్యేకమైన గుర్తుగా] పేర్కొన్నాడంటూ వ్యాఖానించడమే అవివేకము, హాస్యాస్పదము!
అయితే, “కన్యక [పురుష సంయోగము ఎరుగని యవ్వన స్త్రీ] గర్భముధరించి కుమారుని కనును” అన్నది అసాధారణమైన విశయము. అలాంటి సంఘటన ప్రకృతిలో జరిగే అవకాశం లేదు. ఒకవేల అలాంటిదేదైనా జరిగితే దాన్ని ఒక మహాద్భుత ఘటనగా గుర్తించాల్సిందే. అలాంటిది సార్వభౌముడైన దేవుడు మాత్రమే జరిగించగలడు. అది ‘సూచన’గా చెప్పబడుటకు అర్హతకలిగిన సంఘటన. అందుకే ప్రవక్తద్వారా దేవుడే ఆ సంఘటనను యెషయా. 7:14 లో ఒక సూచనగా పేర్కొన్నాడన్నది గ్రహించాలి.
(7) ప్రవక్త అయిన యెషయాద్వారా యివ్వబడిన భవిశ్యవాణిలోని దైవసత్యాన్ని తిరస్కరించిన శాస్త్రులు, పరిశయ్యులు, మరియు రబ్బీలు అలాగే ఈనాటి రబ్బీలమతములోని వారు ఆత్మీయ అంధకారములోనే కొనసాగుతూ 2000 సంవత్సరాల క్రితం బేత్లెహేములో మరియ అనబడే ‘కన్యక’ జీవితములో జరిగిన ప్రవచనాత్మకమైన ‘సూచన’ (אוֹת/oth/ఓథ్) యొక్క నెరవేర్పును స్వీకరించకపోగా దాని నేరవేర్పును కాలరాచే దుష్టప్రయత్నముతో తాము నాశనమార్గములో పయనిస్తూ అమాయకులను కూడా దారితప్పిస్తున్నారు! అలాంటివారిని ఉద్దేశించే మెస్సయ్య యిలా వాపోయాడు:
“అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు.” (మత్తయి 23:15)
యూదు వివాహ సాంప్రదాయము
యూదుల సాంప్రదాయము ప్రకారము యూదు వివాహము రెండు దశలుగా జరుగుతుంది. మొదటి దశను ‘కిద్దుషిన్’ అని రెండవ దశను ‘నిసుఇన్’ అని పేర్కొంటారు. ప్రాచీనకాలములో ఈ రెండు దశలుకూడా దాదాపు ఒక సంవత్సరపు యెడముతో వేరువేరు సందర్భాలలో రెండు ప్రత్యేకమైన వేడుకలుగా జరుపుకునేవారు. అయితే, ఈ సాంప్రదాయము క్రీస్తు శకము పన్నెండవ శతాబ్దమువరకు కొనసాగి అటుతరువాత రబ్బీల చొరవతో మారిపోయింది. ఈ మార్పునుబట్టే ఈనాడు యూదుల వివాహములోని రెండు దశలను వెనువెంటనే పూర్తిచేసి ఒకే వేడుకగా జరుపుకుంటున్నారు.
కిద్దుషిన్ అంటే ప్రధానము చేయబడుట [betrothal]. ఈ దశను పూర్తిచేయటములో సాంప్రదాయ ప్రకారము యూదులు ఎన్నుకునేందుకు వీలుగా రెండు రకాల విధానాలు అందుబాటులో వుండేవి. అవి, (అ) కన్యాశుల్కము: పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకు బహుమానముగా ధనాన్ని యివ్వటము; (ఆ) పత్రము: పెళ్ళికొడుకు తాను పెళ్ళికూతురును వివాహము చేసుకోబోతున్నట్లు వ్రాతపూర్వకంగా మాట యిస్తూ వ్రాసిన పత్రాన్ని పెళ్ళికూతురుకు అందించటము.
కిద్దుషిన్ [ప్రధానము] దశ పూర్తి అయిన తరువాత ఆ యిరువురు స్త్రీ పురుషులు సంపూర్ణ భార్యాభర్తలుగా యూదు సమాజము ఎదుట లెక్కించబడుతారు. అయినను వారి వివాహములోని రెండవదశ అయిన నిసుఇన్ [పెండ్లి] పూర్తి అయ్యేవరకు వారిరువురి మధ్య శారీరక సంబంధము వుండకూడదు.
మరియ యోసేపుల వివాహము
యూదులకు రాజు మరియు ప్రపంచానికి ప్రభువు అయిన యషువ హ మషియాఖ్ [యేసు క్రీస్తు] ను మొదటి శతాబ్ధములో గర్భాన మోసి కన్న మరియ మరియు యోసేపుల వివాహమును గురించిన కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు క్రొత్తనిబంధనా గ్రంథములో వివరించబడ్డాయి (మత్తయి.1:18-25; లూకా.1:26-38, 2:1-20).
మరియ యోసేపుల మధ్య ప్రధానము [కిద్దూషిన్] జరిగింది. ప్రధానము చేయబడటానికి మరియు పెళ్ళితంతు [నిసుఇన్] జరగటానికి మధ్య కొంత కాలము గడిచింది. ఆ మధ్యకాలములోనే మరియ దైవశక్తి చేత గర్భవతిగా మారింది. ఆ సమయానికి పైన వివరించిన ప్రాచీన యూదు వివాహ సాంప్రదాయము ప్రకారము మరియ కన్యకే [పురుష సమ్యోగము లేని యువతి] అయినా అప్పటికే కిద్దూషిన్ [ప్రధానము] జరిగివుండటాన్నిబట్టి ఆమె యూదు సమాజములో స్త్రీగా [గ్రీకు: γυναικός/గునాయ్‌కొస్=భార్య] లెక్కించబడింది.
పై కారణాన్ని బట్టి క్రొత్తనిబంధన గ్రంథములో మత్తయిద్వారా యివ్వబడిన లేఖనాలలో మరియ కన్యకగా (మత్తయి.1:18) పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో స్త్రీగా (గలతీ.4:4) పేర్కొనబడటము గమనించగలము.
యూదు వివాహ సాంప్రదాయాలలోని లోతుపాతులను గూర్చిన అవగాహనలేని అవిశ్వాసులు కొందరు మత్తయి మరియు పౌలులద్వారా యివ్వబడిన లేఖనాలలోని ఈ తేడాను పేర్కొంటూ యిద్దరిలో ఎవరో ఒకరు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు అంటూ విశ్వాసులను కలవరపరచే ప్రయత్నంగా ప్రశ్నలను లేవనెత్తుతుంటారు. అయితే, ఈలాంటి దుష్ట ప్రయత్నాల ఫలితం అవిశ్వాసులు తమ అజ్ఙానాన్నే బయటవేసుకోవటము!
అపోస్తలుడైన పౌలు ద్వారా యివ్వబడిన లేఖనాలను కొందరు వక్రీకరిస్తున్న విశయాన్ని గూర్చి అపోస్తలుడైన పేతురుద్వారా యివ్వబడిన లేఖనాలు హెచ్చరించటాన్ని ఈ సందర్భముగా జ్ఙాపకము చేసుకోవాలి:
“…మన ప్రభువుయొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని యెంచుకొనుడి. ఆలాగు మన ప్రియ సహోదరుడైన పౌలుకూడ తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి యున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోను బోధించుచున్నాడు; అయితే వాటిలో కొన్నిసంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులును, అస్థిరులైనవారును, తక్కిన లేఖనములను అపార్థముచేసినట్లు, తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలిసికొనియున్నారు గనుక మీరు నీతివిరోధుల తప్పుబోధవలన తొలగింపబడి, మీకు కలిగిన స్థిరమనస్సును విడిచి పడిపోకుండ కాచు కొనియుండుడి.” (2పేతురు.3:15-17)
అవిశ్వాసుల అభ్యంతరాలు
అభ్యంతరము #1
“మూలభాషలో ‘ఆ అమ్మాయి’ (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి]) అని వుంది.”
వివరణ:
అవును యెషయా 7:14 లో వున్న పదజాలము ప్రకారము ప్రభువైన దేవుని సూచనగా ఉన్నది గర్భవతిగా వుండి కుమారుని కనబోతున్న ‘ఆ అమ్మాయి’ అని పేర్కొనబడి వుంది. కారణం…? గర్భవతియై కుమారుని కనబోతున్నది ఏదో ఒక కన్యక కాదు. అది ప్రభువైన దేవుడే తన ప్రణాలికలో ఉద్దేశించి దృష్టించిన కన్యక. అందునుబట్టి సూచనగా వుండబోతున్నది దేవుని దృష్టిలోవున్న ఒక ప్రత్యేకమైన కన్యక అని సూచించటానికి ‘ఆ అమ్మాయి’ అని మూలభాషలో పేర్కొనబడింది.
అభ్యంతరము #2
“మూలభాషలో “ఆ అమ్మాయి గర్భవతి అయింది” (the alma [అల్మ/עַלְמָה=కన్య/యవ్వన యువతి] is with child) అని వుంది.”
వివరణ:
దైవ లేఖనాలలోని ప్రవచనాలు భవిశ్యద్ కాలానికి చెందినా వాటిని గూర్చిన సమాచారము లేక వివరాలను లేఖనాలు వ్యాకరణపరంగా భూత, భవిశ్యద్, వర్తమాన కాలాలలోని యేకాలములోనైనా వ్యక్తపరచటం పరిపాటి. కనుక, యెషయా 7:14 లో వున్న ప్రవచన ప్రకటన “అ అమ్మాయి గర్భవతి అయింది” అంటూ భూతకాలములో వ్యక్తపరచటమన్నది అసాధారణమైన విశయమేమీ కాదు.
అభ్యంతరము #3
“ఒకవేల ఈ వాక్యములో “ఒక/ఆ కన్యక గర్భవతి అవుతుంది” అని వుంటే ఒక యూదుడైన యోసేపు తాను వివాహమాడిన అమ్మాయి లేక కన్యక గర్భవతిగా వుందన్నది గ్రహించినప్పుడు యెషయా 7:14 లోని ప్రవచనము తన కళ్ళముందే నెరవేరుతున్నదంటూ ఆనందముతో ఎగిరి గంతులు వేసేవాడు కదా?”
వివరణ:
మరియ భర్త యోసేపు మతపరమైన పండితుడు కాదు లేక ఒక ప్రవక్త అంతకన్న కాదు. అతను ఒక సామాన్యమైన వడ్రంగి. తాను వివాహమాడిన యువతి గర్భము ధరించింది అన్న విశయము తెలిసినప్పుడు అందరిలా అతనికి కూడా సర్వసాధారణమైన కారణము అక్రమసంబంధమే తటస్థించి వుంటుంది గాని యెషయాలోని ఒక ప్రవచనము తాను ప్రధానము చేసుకున్న యువతిలో నెరవేర్చబడబోతున్నదని ఊహించుకొని తద్వారా ఎగిరి గంతులువేసేందుకు తగిన కారణాలు లేవు. నిజానికి దేవదూతే తన కలలో ప్రత్యక్షమై మరియ గర్భానికి గల హేతువును వివరించి చెప్పినప్పుడుకూడా యోసేపు ఎగిరి గంతులు వేయలేదు అన్నది ఈ సందర్భములో జ్ఙాపకము చేసుకోవాలి.
అభ్యంతరము #4
“యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:15 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేసరికి పెరుగు తేనె తిన్నట్లు ఎక్కడ వ్రాయబడివుంది?”
వివరణ:
బైబిలులోని ప్రవచనాల నెరవేర్పుకు ఆధారాలు కొన్ని సార్లు బైబిలులో మరికొన్ని సార్లు చరిత్రలో లభించటం కద్దు. అయితే, ప్రవచనాల నెరవేర్పు వివరాలన్నవి పూసగుచ్చినట్లు ప్రతీది బైబిలులోనో లేక చరిత్ర గ్రంథాలలోనో తప్పకుండా వుంటుందని లేక వుండాలని నిర్ధారించే నియమమేదీ లేదు. ఒక ప్రవచనము యొక్క ప్రధానాంశపు నెరవేర్పు తప్ప ద్వితీయశ్రేణి వివరాలు చాలమట్టుకు కాలగర్భములో కనుమరుగవుతాయి.
యెషయా.7:15 లో వ్రాయబడివున్నట్లు “కీడును విసర్జించుటకును మేలును కోరు కొనుటకును అతనికి తెలివి వచ్చునప్పుడు అతడు పెరుగు, తేనెను తినును” అన్నవి ప్రవచనములోని ద్వితీయశ్రేణి వివరాలు. వీటి నెరవేర్పు తప్పకుండా వ్రాయబడి వుండాలి అన్న నియమమేదీ లేదు. కనుక, ఈ వివరాలు యషువ [యేసు] లో నెరవేర్చబడినప్పటికి అవి వ్రాయబడలేదు. ఒక వేల ఈ ద్వితీయశ్రేణి వివరాల నెరవేర్పు యషువలో నెరవేర్చబడినట్లు వ్రాయబడలేదు కనుక అది యషువను గురించి కాదు అని అభిప్రాయపడేవారు మరి ఆ వివరాల నెరవేర్పు వారు కోరుతున్న విధానములో ఏవ్యక్తిలో నెరవేర్చబడిందని వ్రాయబడిందో లేఖనాల ఆధారంగా చూపించ బద్దులై వున్నారు.
అభ్యంతరము #5
యెషయా 7:14 యేసువారిలో నెరవేర్చబడితే 7:16 ప్రకారము ఆయన కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే యిద్దరు రాజుల దేశము పాడుచేయబడింది అని ఎక్కడ వ్రాయబడి వుంది?
వివరణ:
యెషయా.7:13-16 వరకుగల వచనాలలోని ప్రవచనాంశాలు:
- ప్రభువు తానే దావీదు వంశస్థులకు ఒక సూచన [אוֹת/oth/ఓథ్] చూపును, అది కన్యక [עַלְמָה/alma] గర్భవతియై కుమారుని కనడము.
- కన్యక గర్భవతియై కనిన కుమారునికి ఆమె ఇమ్మానుయేలు [దేవుడు మనకు తోడు] అనే పేరుతో పిలవటము [קָרָא/kawraw/ఖర = to call/పిలవడము].
- ఆ కుమారుడు కీడును విసర్జించించి మేలును కోరుకొనే వయస్సుకు చేరుకున్నప్పుడు పెరుగు తేనే తినును. ఇది 1-3 సంవత్సరాలు వయస్సులో జరిగే విశయము.
- ఆ కుమారునికి పెరుగు తేనెను తినే వయస్సు రాకముందే దావీదు వంశస్థులను భయపెట్టే యిద్దరు రాజుల దేశము [הָאֲדָמָה֙/హఅధామహ్/HaAdham] నిర్లక్ష్యము/పాడుచేయబడును [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట]
యెషయా.7:16 లో గమనించాల్సిన అంశాలు:
- “కీడును విసర్జించుటకును మేలును కోరుకొనుటకును ఆ బాలునికి తెలివిరాక మునుపు నిన్ను భయపెట్టు ఆ యిద్దరు రాజుల దేశము పాడుచేయబడును” అన్న వివరణ యొక్క నెరవేర్పు ఎక్కడో ఒకదగ్గర వ్రాయబడి వుండాలి నియమమేదీ లేదు.
- ఈ సందర్భములో యివ్వబడుతున్న ప్రవచనము రాజైన ఆహాజుకు మాత్రమే పరిమితమవడము లేదు. 13-14 వచనాల ప్రకారము ఇక్కడ యివ్వబడుతున్న ప్రవచనము దావీదు వంశస్థులందరిని ఉద్దేశించి యివ్వబడింది అన్నది గమనములో వుంచుకోవాలి.
- చరిత్రను పరిశీలించి చూస్తే ఈ ప్రవచన యొక్క నెరవేర్పు యషువ [యేసు] జనన సమయములో చోటుచేసుకున్న సత్యము అవగతమవుతుంది.
- దావీదు వంశస్థులు భయపెట్టే యిద్దరు రాజుల దేశము నిర్లక్ష్యము చేయబడును. నిర్లక్ష్యము లేక విడిచిపెట్టబడుట అన్నది యిద్దరు రాజులకుజరిగే విశయముకాదు. అది రెండు దేశాలుకు జరిగే విశయముకూడా కాదు. అది యిద్దరు రాజులు [వేరువేరు సమయాలలో] పాలించిన ఒకే దేశానికి సంభవించే విశయము.
- దావీదు వంశస్థులను భయపెట్టిన యిద్దరు రాజులు షొమ్రోనురాజు మరియు సిరియారాజు. షొమ్రోను రాజులు ఉత్తరదేశమైన ఇశ్రాయేలురాజ్యమును పాలించారు. కాని, వారిదేశాన్ని సిరియా రాజులు జయించి పాలించటం జరిగింది. ఆ విధంగా ఈ దేశము రెండు రాజుల దేశముగా ప్రవచనవాక్యము గుర్తిస్తున్నది. అయినా ఈ సంఘటన రాజైన ఆహాజు కాలములో సంభవించలేదు. కనుక, ఇది ఆహాజునుద్దేశించి చెప్పబడిన ప్రవచనము కాదు అన్నది సుస్పష్టము.
యెషయా.7:13-16 లేఖనాలలోని ప్రవచన నెరవేర్పులు క్రొత్తనిబంధన గ్రంథములో యివ్వబడ్డాయి. యోసేపు ప్రధానము చేసుకున్న కన్యమరియ ఒక అద్భుతముద్వారా కన్న యషువ [యేసు] యొక్క జననములో ఈ ప్రవచన నెరవేర్పును చూడగలము:
40 క్రీ.పూ. లో రోమా ప్రభుత్వము ఎదోమీయుడైన హేరోదు [Herod the Great] ను ఇశ్రాయేలుదేశముతో [షొమ్రోను రాజ్యానికి] కలిపి ఎదోము మరియు యూదా దేశాలకు రాజుగా నియమించింది.
4 క్రీ.పూ.లో హేరోదు మరణించాడు (మత్తయి.2:19-22). అయితే, అదే సంవత్సరము హేరోదురాజు కుమారుడు ఆర్కెలాయు [Herod Archelaus] తండ్రి స్థానములో ఒక రాజుగా కాకుండా మొదట కేవలము ఒక నాయకునిగా అటుతరువాత రోమా చక్రవర్తి గుర్తింపుతో ఒక ‘జాతీయ నాయకుడు’ [Ethnarch] అన్న బిరుదుతో మాత్రమే హేరోదు రాజ్యములోని ప్రధాన భాగాలైన యూదా, సమరయ, మరియు ఎదోములకు నాయకునిగా వ్యవహరించాడు.
కన్యమరియ కుమారుడు యషువ [యేసు] 4 క్రీ.పూ. వ సంవత్సరములో జన్మించాడు అన్నది చరిత్రకారుల అంచనా. ఆ సంఘటన తరువాత ఒక సంవత్సరములోపే హేరోదు కూడా మరణించాడు. ఈ రెండు ప్రాముఖ్యమైన సంఘటనలు ఒకే సంవత్సరములో చోటుచేసుకున్నా మొదటిది సంవత్సరములోని ఆదిలో రెండవది అదే సంవత్సరపు చివరలో చోటుచేసుకున్న సంఘటనలుగా అర్థముచేసుకోవచ్చు.
పై చారిత్రక వాస్తవాల వెలుగులో దావీదు వంశస్తులను భయపెట్టిన రెండు రాజుల దేశమైన సమరయ లేక ఇశ్రాయేలుదేశం యషువ [యేసు] పుట్టి కీడు మేలుల భేదం తెలుసుకునే తెలివివచ్చేలోపలే అంటే 3 క్రీ.పూ. వ సంవత్సరమునుండి 6 క్రీ.శ. వ సంవత్సరము మధ్య రాజులేని రాజ్యంగా నిర్లక్ష్య స్థితికి [תֵּעָזֵ֤ב/తెఅజెబ్/TeAzeb = abandon/విడిచిపెట్టబడుట] దిగజారింది.
ఇది యెషయా.7:16 యొక్క స్పష్టమైన నెరవేర్పు. ఈ లేఖనములోని ప్రవచన నెరవేర్పు యెషయా.7:14లో దేవుడే యిచ్చిన సూచన అయిన “కన్యక గర్భము ధరించి కుమారుని కనును” అన్న ప్రవచనము యొక్క స్పష్టమైన నెరవేర్పే యషువ [యేసు] యొక్క జననము.
అభ్యంతరము #6
“యెషయా.7:14 లో “కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును” అన్న ప్రవచనము ప్రకారమే మరియ కన్యక అయివుండి యేసు [యషువ] ను కంటే మరియ ఆయనకు ఇమ్మానుయేలు అన్న పేరు పెట్టినట్లు ఎక్కడ వుంది?”
వివరణ:
పై లేఖనములోని ప్రవచనాన్ని గమనించాల్సిన అంశాలు:
ఈ లేఖనములోని ప్రధానమైన ప్రవచనము దేవుని సూచన అంటే “కన్యక గర్భవతియై కుమారుని కనటము.” ఆ కుమారునికి ఒక ప్రత్యేకమైన పేరు పెట్టడము/పిలవడము అన్నది ద్వితీయశ్రేణి అంశము.
ఆ పేరుపెట్టేది లేక ఆ పేరుతో పిలిచేది ఆయన తల్లి.
యెషయా 8:3 లోని ఆజ్ఙ ప్రకారము తన కుమారునికి మహేరు షాలాల్ హాష్ బజ్ అన్న పేరు పెట్టమని దేవుడైన ప్రభువు ప్రవక్త అయిన యెషయాకు ఆజ్ఙాపించాడు. ఆ ఆజ్ఙకు లోబడి ప్రవక్త అయిన యెషయా ఆ పేరు తన కుమారునికి పెట్టాడు అన్నది ఇంగితజ్ఙానమున్న నిజవిశ్వాసులు ఎవరైనా ఇట్టే గ్రహించగలరు. కాని, దాని నెరవేర్పు వివరాలు లేఖన గ్రంథములో [పాతనిబంధనలో] లేవు. అలా వుండాలి అన్న నియమమేదీ లేదు. పేరుపెట్టిన వివరాలు గ్రంథములో లేని కారణాన్నిబట్టి యెషయా తన కుమారునికి దేవుడు చెప్పిన పేరును పెట్టలేదు అని వూహించుకోవటము సరికాదు.
పైన యివ్వబడిన లేఖన మాదిరిని అనుసరిస్తూ చూస్తే కన్యమరియ తన కుమారుని ఇమ్మానుయేలు అని పిలుచుకొన్నదని గ్రహించటానికి ఇంగితజ్ఙానముంటే సరిపోతుంది.
చివరిగా, ఇమ్మానుయేలు అంటే “దేవుడు మనకు తోడు” అని భావము. కన్యమరియ కుమారునికి దేవదూత ఆజ్ఙనను అనుసరించి యోసేపు యషువ [యేసు] అని పేరుపెట్టాడు. యషువ/యేసు [ישובה/Yah’Shua] అంటే “యెహోవా రక్షించును” అని భావము. “యెహోవా రక్షించును” అంటే “దేవుడు మనకు తోడు” అనే కదా దాని భావము! దేవుడు మనకు తోడు లేకపోతే “యెహోవా రక్షించును” అన్నది సాధ్యము కాదు. అందుచేత, “యెహోవా రక్షించును” అన్న పదజాలములో “దేవుడు మనకు తోడు” అన్న సత్యము నిక్షిప్తమై వున్నది. ఈ కారణాన్ని బట్టే యెషయా.7:14 లోని ప్రవచన నెరవేర్పు కన్యమరియ కుమారుడైన యేసు వారి జననము అన్నది మత్తయి.1:21-22 లో నిర్ధారించబడింది. ఈ ఉత్కృష్టమైన దైవసత్యాన్ని అవిశ్వాసులు అజ్ఙానులు గ్రహించజాలరు, విడమర్చిచెప్పినా స్వీకరింపలేరు.
అభ్యంతరము #7
“క్రైస్తవులు క్రొత్తనిబంధన గ్రంథములో క్రింది విశయాలు వ్రాసుకొన్నారు:
“యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది; (మత్తయి.1:18-20)
“క్రైస్తవులు పైవిధంగా వ్రాసుకున్నారు కాబట్టి తద్వారా వారు పరాయి వ్యక్తి భార్యను అంటే యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు అని చెప్పడముతో సమానము. ఈ రకమైన విశ్వాసముగల క్రైస్తవుల ఆలోచనావిధానము మతము ఎంత మూర్ఖమైనదో చెడ్డదో అర్థమవుతున్నది.”
వివరణ:
క్రొత్తనైబంధన గ్రంథము క్రైస్తవులు వ్రాసుకున్న గ్రంథము కాదు. యేసే [యషువ] క్రీస్తు [హమషియాఖ్] అన్న విశ్వాసములోకి వచ్చిన యూదులు దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాసిన లేఖనాల సంపుటి క్రొత్తనిబంధన గ్రంథము.
క్రొత్తనిబంధన గ్రంథము దైవగ్రంథముగా విశ్వసించే ఏ క్రైస్తవుడుకూడా “యోసేపు భార్య అయిన మరియను దేవుడు ఆశించి వ్యభిచరించాడు” అని విశ్వసించడు, చెప్పజాలడు. నిజానికి ఇంతటి నీచమైన నికృష్టమైన తలంపే క్రైస్తవుల దరికికూడా రాదు. ఈ రకమైన తలంపును భావనను క్రైస్తవులకు అంటగట్టే ప్రయత్నము చేసే వ్యక్తులు ఈ ప్రయత్నములో తమ స్వభావము తమను ప్రభావితం చేస్తున్న తమ మతస్వభావము ఎంత సంస్కారహీనమైనవో నీచాతినీచమైనవో నిరూపిస్తున్నారు. ఈ రకమైన అలోచనా సరళి దైవవిరోధి అయిన బయెల్జెబూలు [בַּעַל זְבוּב/Baal Zebub] యొక్క దాసుల ప్రత్యేకత.
ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ప్రభువైన దేవున్ని ఈ రకమైన దూషణకు గురిచేసేవారు అత్యంత శాపగ్రస్తులు. వారు అతిగొప్ప శిక్షకు పాత్రులు. అలాంటివారికి వారి మాటలతీరుకు దూరంగా వుండటం దైవసంబధులకు శ్రేయస్కరం!