అబద్ధ బోధకులను గుర్తించటమెలా?
దుర్బోధ
దుర్బోధలు అన్నవి అబద్ధ బోధకులు చేస్తున్న తప్పుడు బోధలు. ఇవి దేవుని పొలానికి పట్టిన అతి ప్రమాదకరమైన చీడపురుగులు. వీటి బారినపడి అనేకమంది క్రైస్తవులు ఆత్మీయంగా నిర్వీర్యమౌతూ నిత్యనాశనానికి చేరువౌతున్నారు.
దుర్బోధ అంటే లేఖనాలు బోధించనివాటిని బోధిస్తున్నట్లుగా లేక బోధిస్తున్న వాటిని బోధించనట్లుగా బోధించటము. అంతేగాక, అనువాదాలపైనే పూర్తిగా ఆధారపడి మూలభాషలోని పదాల అసలు భావాన్ని, సందర్భాన్ని, కాలాన్ని మరియు సాహిత్య సాధనాలను/పద్ధతులను [Literary devices/techniques] పరిగణాలోకి తీసుకోకుండా చేసే బోధ!
ప్రభువైన యేసు క్రీస్తు తన స్వరక్తముతో సంపాదించిన నిజవిశ్వాసుల యొక్క సహవాసమైన సంఘము పుట్టినప్పటినుండే అబద్ధ బోధకులు లేక దుర్బోధకులు మరియు వారి దుష్ట ప్రయత్నాలు అన్నవి మొదలై ఇప్పటికీ కొనసాగుతున్నాయి. గనుక, తస్మాత్ జాగ్రత్త!
ఈ విశయములో లేఖనాలు పదేపదే చేస్తున్న హెచ్చరికను గుర్తుంచుకొని జాగ్రత్త పడటం అన్నది ప్రతివిశ్వాసి యొక్క గురుతర బాధ్యత:
“దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్లిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియును; వారు మందను కనికరింపరు. మరియు శిష్యులను తమవెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు.” (అపో.కా.20:28-30)
“మరియు అబద్ధప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలెనే మీలోను అబద్దబోధకులుందురు; వీరు తమ్మును కొనిన ప్రభువునుకూడ విసర్జించుచు, తమకుతామే శీఘ్రముగా నాశనము కలుగజేసికొనుచు, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరిచేష్టలను అనుసరించి నడుతురు; వీరినిబట్టి సత్యమార్గము దూషింపబడును. వారు అధిక లోభులై, కల్పనావాక్యములు చెప్పుచు, మీవలన లాభము సంపాదించుకొందురు; వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు.” (2పేతురు.2:2-3)
“జనులు హితబోధను సహింపక, దురదచెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగుచేసికొని, సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.” (2తిమోతి.4:3-4)
“క్రీస్తుబోధ యందు నిలిచియుండక దానిని విడిచి ముందునకుసాగు ప్రతివాడును దేవుని అంగీకరింపనివాడు; ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించు వాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినయెడల వానిని మీ యింట చేర్చుకొనవద్దు; శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడగును.” (2యోహాను.9-11)
దుర్బోధకులకుండే సర్వసాధారణ లక్షణాలు:
- తమకు అన్నీ తెలుసు అని భ్రమిస్తుంటారు, భ్రమపెడుతుంటారు.
- పరిశుద్ధ లేఖనాలకు తాము యిచ్చే వివరణే నూటికి నూరు శాతం సరియైన వ్యాఖ్యానం అంటూ నమ్మబలుకుతుంటారు.
- తమతో విభేదించేవారిని తీవ్రమైన పదజాలముతో విమర్శిస్తుంటారు.
- ఇతరులను మరియు యితరుల విశ్వాసాలను కించపరచటం హేళనచేయటం వీరికి వెన్నతో పెట్టిన విధ్య.
- ఇతరులకు అలాగే యిరతుల విశ్వాసాలకు తీర్పుతీర్చే విశయములో వీరు తెచ్చిపెట్టుకున్న అధికారాన్ని మేకపోతు గాంభీర్యముతో ప్రదర్శిస్తుంటారు.
- అందరికి అంటే లోకములో ఉన్నవారందరికి, క్రైస్తవులందరికి, లేక పాస్టరులందరికి ఒక్క మాటలో తీర్పుతీర్చటమన్నది తరచు వీరిలో కనిపించే నికృష్టమైన ఆత్మీయ వ్యాధి.
- అపోస్తలుల బోధకన్న వారి మాదిరికన్న తాము చెప్పేదే వేదవాక్యమన్నట్లు వాక్య వ్యతిరేకమైన సంచలన వ్యాఖ్యానాలు చేస్తూ తమ చుట్టూ భజనకారులను ప్రొగు చేసుకునే ప్రయత్నములో ఉంటారు.
- లేఖనాలు [బైబిలు] చెప్పేదానికి పూర్తిగా వ్యతిరేకంగా బోధించటం వీరి ప్రత్యేక లక్షణం.
ఉదాహరణలు:
అ) బైబిలు–“అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై…” (ఆది.కాం.17:1)
అబద్ద బోధకులు–“యెహోవా అబ్రాముకు ప్రత్యక్షమై అంటే, @-#$%=్*!~. కనుక, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షము కాలేదు.”
ఆ) బైబిలు–“ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.” (యోహాను.1:1)
అబద్ద బోధకులు–“వాక్యము దేవుడై యుండెను అంటే, ~!@#$%్*(). కనుక, వాక్యము దేవుడై యుండలేదు.”
ఇ) బైబిలు–“పదునొకండుమంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్లిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరిగాని, కొందరు సందేహించిరి.” (మత్తయి.28:16-17)
అబద్ద బోధకులు–“శిష్యులు యేసుకు మ్రొక్కిరి అంటే, #$@!%్)*్(. కనుక, శిష్యులు యేసుకు మ్రొక్కలేదు.”
ఈ) బైబిలు–“అందుకు తోమా ఆయనతో నా ప్రభువా, నా దేవా అనెను.” (యోహాను.20:28)
అబద్ద బోధకులు–“తోమా యేసుతో నా దేవా అనెను అంటే, ్%*$(#)@!-. కనుక, యేసు దేవుడు కాదు తోమా ఆయనను నా దేవా అని సంబోధించలేదు. ఒకవేళ తోమా ఆయనను ‘నా దేవా’ అని సంబోధించినా యేసు దేవుడు కాదు. తోమాకు దేవుడెవరో తెలియదు లేక తోమా అబద్ధం చెప్పాడు. తోమాకన్న నాకు ఎక్కువ తెలుసు, యేసు దేవుడు కాదు.”
ఉ) బైబిలు–“గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశమువైపు చూచు చున్నారు? మీయొద్దనుండి పరలోకమునకు చేర్చుకొన బడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి.” (అపో.కా.1:11)
అబద్ద బోధకులు–“ఆ రీతిగానే యేసు తిరిగి వచ్చును అంటే, ~$%్<)>?(*#@!. కనుక, యేసు ఆరీతిగానే తిరిగి రాడు.”
ఊ) బైబిలు–“ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.” (ప్రకటన.20:6)
అబద్ద బోధకులు–“మొదటి పునరుత్థనములో పాలుపొందేవారు క్రీస్తుతోకూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు అంటే, *?\్?%)$>#@<!(. కనుక, వెయ్యి సంవత్సరముల రాజ్యములేదు వారు క్రీస్తుతోకూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయటమూ లేదు.”
క్రింది ప్రశ్నలకు వారి నుండి జవాబులను రాబట్టగలిగితే వారి గుట్టు బట్టబయలు అవుతుంది:
1.
బైబిలులోని 66 గ్రంథాలన్నీ దైవగ్రంథాలని నమ్ముతారా? [పాతనిబంధన గ్రంథము 39 + క్రొత్తనిబంధన గ్రంథము 27]
2. దేవుడు అద్వితీయుడు. అయితే, ఆయనది లెక్కలలో, ముక్కలలో, లేక మూసలలో ఇమిడే అస్తిత్వం కాదు. కనుక, నిజదేవున్ని మానవ మేధస్సుతో సంపూర్ణముగా అర్థం చేసుకోలేము అని గ్రహించారా? [ద్వి.కాం.6:4; రాజులు.8:27; కీర్తన.139:1-12; మార్కు.12:29; 2కొరింథి.1:14]
3. నజరేయుడైన యేసు [యషువ] ప్రవచించబడిన రాబోవు క్రీస్తు [మెస్సయ్య] అన్న సత్యాన్ని ఒప్పుకుంటారా? [యోహాను.4:25-26; అపో.కా.2:36; 1యోహాను.2:22]
4. యేసు క్రీస్తు [యషువ మెస్సయ] మీ పాపాల కొరకు శ్రమలను అనుభవించి శిలువపై మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తారా? [లూకా.24:46-48; 1యోహాను.4:10]
5. యేసుక్రీస్తు [యషువ మెస్సయ] మీ ప్రభువని అంగీకరిస్తారా? [అపో.కా.10:36; యోహాను.13:13; రోమా.10:9-13]
6. అపోస్తలుల బోధ మరియు మాదిరినిబట్టి, ప్రభువైన యేసు క్రీస్తు[యషువ మెస్సయ]ను “నా ప్రభువా” మరియు “నా దేవా” అని సంబోధించగలరా? [మత్తయి.22:42-45; యోహాను.1:1,14; 20:28; రోమా.9:5; ఫిలిప్పీ.2:5-8; తీతుకు.2:13; హెబ్రీ.1:8]
7. తండ్రికి ఏవిధంగా προσκυνέω/ప్రొస్కునెహొ [ఆరాధన; పూజ్యభావముతో మ్రొక్కటము] ఆపాదిస్తూ ఘనపరుస్తారో అదేవిధంగా కుమారుడైన ప్రభువైన యేసు క్రీస్తు[యషువ మెస్సయ]కు కూడా προσκυνέω/ప్రొస్కునెహొను అపాదిస్తూ ఘనపరచగలరా? [మత్తయి.28:9, 17; యోహాను.4:24; 5:23; ప్రకటన.5:11-14]
పై ప్రశ్నలలో ఏ ఒక్క దానికైనా ‘లేదు’ అన్న సమాధానమిచ్చినా ఆ బోధకుడు అబద్ధ బోధకుడు లేక దుర్బోధకుడు అన్నది గ్రహించాలి.
కొందరు పై ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పకుండా దాటివేసే ప్రయత్నము చేస్తుంటారు లేదా అసలు జవాబు చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నము కూడా చేయవచ్చు. అలాంటివారు అబద్ధ బోధకులు అన్నది వెంటనే గ్రహించవచ్చు.
ఈ సందర్భంగా, ఏ అబద్ధ బోధకుడు కూడా నేను అబద్ధ బోధకున్ని అని ఒప్పుకోడు లేక ఆ వాస్తవాన్ని ప్రకటిస్తూ తిరుగడు అన్నది విశ్వాసులు గమనములో ఉంచుకోవాలి!
అయినా, అబద్ధ బోధకుల బోధలు మరియు వారి జీవిత విధానం చాలావరకు ఈ సత్యాన్ని బహిర్గతం చేస్తుండటాన్ని చూడవచ్చు. అయితే, కొన్ని సార్లు దుర్బోధకులు తమ అసలు రంగు కనబడకుండా ఉండేందుకై గొర్రె చర్మాన్ని ధరించి వచ్చే అవకాశముంది.
అంటే, పై ప్రశ్నలన్నింటికి “అవును” అంటూ యదార్థ రహిత సమాధానాలను చెప్పి రహస్యముగా వాక్య విరుద్ధ బోధలను కొనసాగించే ప్రయత్నం చేస్తుంటారు. వీరి కుయుక్తులకు నటనలకు అమాయక నామకార్థ క్రైస్తవులు, స్థిరమైన ఆత్మీయ పునాది లేనివారు, అలాగే వాక్యజ్ఙానం కరువైన వారు మోసపోయి వారి దుర్బోధలకు బలి అవుతుంటారు.
దుర్బోధకులు అనుసరించే కుయుక్తుల విశయములో విశ్వాసులు అమిత జాగ్రత్త కలిగినవారై తమ విశ్వాస జీవితాన్ని లేఖనాల వెలుగులో దేవునికి ఇష్టమైన విధానములో కొనసాగించటానికి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
“ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి…తొట్రిల్లకుండ మిమ్మును కాపాడుటకును, తన మహిమ యెదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులనుగా నిలువ బెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా, మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములును కలుగును గాక.” (యూదా.20-25)