ధర్మశాస్త్రము
ధర్మశాస్త్రము (תּוֹרָה) — పదవివరణ
ధర్మశాస్త్రము అన్న తెలుగు పదము హీబ్రూ లేఖనాలలోని తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న హీబ్రూభాషా పదపు అనువాదము. ఈ హీబ్రూ పదము హీబ్రూ లేఖనాల సంపుటి అయిన పాతనిబంధన (తనాక్/TaNaK) గ్రంథములో 219 సార్లు వుపయోగించబడింది.
ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్నపదము యొక్క అర్థము
తోరాహ్ (תּוֹרָה/Torah) అనే హీబ్రూ పదానికి వున్న ప్రధానమైన అర్థాలు: ఉపదేశము; చట్టము. (నియమము, ఆజ్ఙ, సూచన మొదలైన భావాలు కూడా వున్నాయి)
ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదం బైబిలులో వుపయోగించబడిన విధానము
తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న హీబ్రూ పదం హీబ్రూ లేఖనాలలో వుపయోగించబడిన విధానాలు మరియు సందర్భాలు:
- ఇది దేవుడు ఇశ్రాయేలీయులకు మోషేద్వారా యిచ్చిన ఉపదేశము/సుచనలకు విరివిగా వాడబడింది.
“మోషే ధర్మశాస్త్రగ్రంథములో [תּוֹרָה/torah] వ్రాయబడిన ప్రకారము” (యెహోషువ 8:30) - దేవుడు అబ్రహాముకు చేసిన ఉపదేశము/సూచనలకు ఉపయోగించబడింది.
“ఏలయనగా అబ్రాహాము నా మాట విని నేను విధించిన దాని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను [תּוֹרָה/torah] గైకొనెనని చెప్పెను.” (ఆది.కాం.26:5) - దహనబలినిగూర్చి చేయబడిన ఉపదేశము/సూచనకు ఉపయోగించబడింది.
“నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇట్లనుము ఇది దహనబలినిగూర్చిన విధి [תּוֹרָה/torah].” (లే.కాం.6:9) - కుష్టరోగానికి సంబంధించిన ఉపదేశము/సూచనలకు వాడబడింది.
“ఒకడు ఎప్పుడు అపవిత్రుడగునో, యెప్పుడు పవిత్రుడగునో తెలియజేయుటకు ఇది కుష్ఠమును గూర్చిన విధి [תּוֹרָה/torah].” (లేవీ.కాం.14:57) - అలాగే తల్లి తన కుమారునికి చేసే ఉపదేశానికి వాడబడింది.
“నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము నీ తల్లి ఉపదేశమును [תּוֹרָה/torah] త్రోసివేయకుము.” (సామెతలు 6:20) - ఈ పదం గుణవంతురాలయిన భార్య చేసే ఉపదేశానికి/సూచనలకు కూడా వాడబడింది.
“జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము [תּוֹרָה/torah] ఆమె బోధించును.” (సామెతలు 31:26) - చివరకు, రాబోవు మెస్సయ్య అన్యజనులకు చేయబోయె బోధను సూచిస్తూకూడా ఈ పదం ఉపయోగించబడింది.
“భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధ [תּוֹרָה/torah] కొరకు కనిపెట్టును.” (యెషయా.42:4)
ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదము బైబిలులో దేన్ని సూచిస్తుంది?
ధర్మశాస్త్రము/తోరాహ్ (תּוֹרָה/Torah) అన్న పదము బైబిలులో దేన్ని సూచిస్తున్నదోనన్నది తెలుసుకోవడానికి అది వుపయోగించబడిన సందర్భమే ప్రధానము. సందర్భాన్ని సరిగ్గా అర్థముచేసుకోగలిగితే అది సూచిస్తున్నదాన్ని కూడా సరిగ్గా అర్థము చేసుకోగలము. అయితే, సర్వసాధారణంగా బైబిలులో ఈపదము ఈ క్రింది వాటిని సూచిస్తుంది:
(1) దేవుని ఉపదేశము–ఒక ప్రవక్తకు/ప్రవక్తద్వారా యివ్వబడిన ఉపదేశము కావచ్చు లేక ప్రవక్తలందరి ద్వారా యివ్వబడిన సమిష్టి ఉపదేశము కావచ్చు.
(2) మోషేద్వారా దేవుడు ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధనకు సంబంధించిన ఉపదేశము అలాగే అందులో భాగంగా యివ్వబడిన నియమవిధులు అంటే పది ఆజ్ఙలు మరియు మతాచారాలు, పండుగలు, బలులు, శిక్షలు మొదలైనవి.
(3) మోషే వ్రాసిన పంచకాండాలు—ఆదికాండము, నిర్గమాకాండము, లేవీయకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము.
(4) తనాక్ (TaNaK) లోని గ్రంథాలన్ని—39 (ఆదికాండము మొదలుకొని మలాకి గ్రంథము వరకు)
మోషేధర్మశాస్త్రము
మోషేధర్మశాస్త్రము అంటే అది మోషే స్వంతంగా వ్రాసి ఇచ్చిన చట్టమనిగాని లేక మోషే వ్యక్తిగతంగా ప్రతిపాదించిన చట్టమనిగాని కాదు. ప్రభువైన దేవుడే తాను ప్రత్యేకపరచుకొన్న జనాంగముతో ఒక నిబంధన చేసి అందులో భాగంగా ఆ నిబంధన వీగిపోకుండా నిలిచుండెందుకు ఆ జనాంగము పాటించాల్సిన నియమాల వివరాలను మోషేద్వారా అందించడము జరిగింది. ఆ నిబంధన నియమాల సంపుటినే మోషేధర్మశాస్త్రముగా లేఖనాలు పేర్కొంటున్నాయి. ఇందుకుగల లేఖన సాక్ష్యాలు:
“యెహోవా మందిరములోనికి తేబడిన ద్రవ్యమును బయటికి తీసికొని వచ్చినప్పుడు,మోషేద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రముగల గ్రంథము యాజకుడైన హిల్కీయాకు కన బడెను.” (2దినవృ.34:14)
“మోషే ధర్మశాస్త్రగ్రంథములో వ్రాయబడిన ప్రకారము” (యెహోషువ.8:30)
“కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించు టకు మనస్సు దృఢము చేసికొని, యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక” (యెహోషువ.23:6)
“నీ దేవుడైన యెహోవా అప్పగించినదానిని కాపాడి,ఆయన మార్గముల ననుసరించిన యెడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకొందువు. మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడియున్న దేవుని కట్టడలను ఆయన నియమించిన ధర్మమంతటిని ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము;” (1రాజులు.2:3)
“ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ధర్మశాస్త్రమందు ప్రవీణతగల శాస్త్రిమరియు అతని దేవుడైన యెహోవా హస్తము అతనికి తోడుగా ఉన్నందున అతడు ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించును.” (ఎజ్రా.7:6)
“ఏడవ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములలో నివాసులై యుండిరి. అప్పుడు జనులందరును ఏక మన స్కులై, నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చియెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్రగ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా” (నెహెమ్యా.8:1)
“అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయు లగునట్లు దేశపు జనులలో ఉండకుండ తమ్మును తాము వేరుపరచుకొనిన యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయకులు నెతీనీయులు అందరును, దేవుని దాసుడైన మోషేద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము ననుసరించి నడుచుకొనుచు, మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి.” (నెహెమ్యా.10:28)
“ఇశ్రాయేలీయులందరు నీ ధర్మశాస్త్రము నతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి. మేము పాపము చేసితివిు గనుకనేను శపించెదనని నీవు నీ దాసుడగు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసియున్నట్లు ఆ శాపమును మామీద కుమ్మరించితివి.” (దానియేలు.9:11)
మోషేధర్మశాస్త్రము (מֹשֶׁ֣ה תּוֹרַ֖ת /tawrat Moshe)…
- మేలైనది
- నీతిగలది
- శ్రేష్టమైనది
- సత్యమైనది
- నమ్మదగినది
- పరిశుద్ధమైనది
- ప్రయోజనకరమైనది
- దేవుడు నియమించినది
- పూర్వ/పాత నిబంధనలోనిది
(నెహెమ్యా 9:13; కీర్తనలు. 19:7, 119:72,142; రోమా. 7:12,16; 15:4; 1కొరింథీ.10:1-11; 1తిమోతి.1:11; 2తిమోతి.3:16-17)
మోషేధర్మశాస్త్రము యివ్వబడిన ప్రజలు
మోషేధర్మశాస్త్రము మోషేద్వారా చేయబడిన నిబంధనలోని ప్రధానమైన భాగము. దేవుడు తాను ఎన్నుకొనిన ప్రజలైన ఇశ్రాయేలీయులతో అలాగే వారిమధ్య జీవిస్తూ వారితోపాటు ప్రయాణం చేస్తూ వాగ్ధత్తదేశములో ప్రవేశించబోతున్న అన్యులతో, అంతేగాక వారందరి రాబోవు తరాలతోకూడా చేసిన నిబంధన మోషేనిబంధన. (ని.కాం.24:7-8; లేవీ.కాం.26:9; ద్వి.కాం.5:2-3, 29:10-29; న్యాయాధిపతులు 2:1; 2దిన.వృ.5:10)
మోషేద్వారా దేవుడు తన వాక్కులను అంటే ధర్మశాస్త్రాన్ని తాను ఎన్నుకున్న యాకోబు సంతానానికి అందించినది మొదలుకొని దాదాపు నాలుగువందల సంవత్సరాల కాలవ్యవధి తరువాతకూడా అన్యజనాంగాలకు దేవుని వాక్కులుగాని లేక న్యాయవిధులుగాని తెలియపరచబడలేదు అన్న నగ్నసత్యాన్ని లేఖనాలు నిర్ద్వందంగా నిర్ధారిస్తున్నాయి:
“ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేసెను తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలునకు తెలియజేసెను. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసియుండలేదు ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే యున్నవి. యెహోవాను స్తుతించుడి.” (కీర్తన.147:19-20)
“వీరు ఇశ్రాయేలీయులు; దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలును ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులును వాగ్దానములును వీరివి. పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్. (రోమా.9:4-5)
పది ఆజ్ఙలు కాని, మోషే ధర్మశాస్త్రము కాని లేక దేవుని వాక్కులు కాని అందుకోని అన్యజనులందరు దేవునికి మరియు తోటివారికి వ్యతిరేకంగా పాపము చేయవచ్చు అని పై వాక్యముల యొక్క భావము కాదు.
ఆదాము సంతానముగా ఈలోకములో జన్మిస్తున్న ప్రతివ్యక్తి మంచి చెడుల జ్ఙానాన్ని సహజసిద్ధంగా పెంపొందించుకుంటాడన్నది లేఖన బోధ (ఆది.కాం.3:22; యెషయా.7:15). దానితో పాటు ప్రతివ్యక్తి యొక్క మనసాక్షికూడా ధర్మశాస్త్రము లేని అన్యులలో ధర్మశాస్త్రము యొక్క పాత్రను పోశిస్తుందని లేఖనాలు వివరిస్తున్నాయి:
“దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు; ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసినయెడల వారు ధర్మశాస్త్రము లేనివారైనను, తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టివారి మనస్సాక్షి కూడ సాక్ష్యమిచ్చుచుండగను, వారి తలంపులు ఒక దానిమీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పులేదని చెప్పుచుండగను…” (రోమా.2:11-16)
ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ఆయా వ్యక్తులకు దేవుడు కట్టడలు/ఆజ్ఙలు ఇచ్చాడు. ఇది ప్రత్యక్షంగా యివ్వబడిన దేవుని వాక్కులద్వారానైన జరుగవచ్చు లేక మంచి చెడుల జ్ఙానముతోకూడిన మనసాక్షిద్వారానైనా జరుగవచ్చు. ఆయా వ్యక్తులు ఆయా కట్టడలకు/ఆజ్ఙలకు విధేయులై నడుచుకోవాలి. సార్వత్రిక కట్టడలకు/ఆజ్ఙలకు మాత్రం అందరు అన్నివేళల విధేయులై నడుచుకోవాలి.
ఇందునుబట్టి, ధర్మశాస్త్రము ఇవ్వబడిన ఇశ్రాయేలీయులైనా లేక ధర్మశాస్త్రము ఇవ్వబడని అన్యజాతులవారైనా అందరూ దేవునియందు భయభక్తులు కలిగి దేవుని కట్టడలలో అంటే సార్వత్రిక కట్టడలలో/ఆజ్ఙలలో నడుచుకుంటూ జీవించాలి అంటూ లేఖనాలు ఘోషిస్తున్నాయి:
“దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల (מִצְוֹתָ֗יו/mishvota) ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.” (ప్రసంగి.12:13)
మోషేనిబంధన అన్యులందరితో లేక లోకములోని ప్రజలందరితో చేసిన నిబంధన కాదు. అదేవిధంగా అందులోని భాగమైన మోషేధర్మశాస్త్రముకూడా లోకములోని ప్రజలందరికి యివ్వబడిన ధర్మశాస్త్రము కాదు.
దేవుడు అబ్రహాముకు వాగ్ధానముచేసిన పాలస్తీనా దేశస్వాస్థ్యమును తిరిగి మోషేద్వారా వాగ్ధానముగా పొందిన ఇశ్రాయేలీయులు, వారి మధ్య నివసించిన అన్యులు, మరియు వారందరి రాబోవు తరాలకు మాత్రమే మోషేధర్మశాస్త్రము యివ్వబడింది.
మోషేధర్మశాస్త్రములో మార్పులు
అ. మోషే కాలములో మార్పులు
- నిర్గమాకాండములో ఆజ్ఙాపించినదాని ప్రకారము పస్కా పశువును ఐగుప్తులో వారు నివసిస్తున్న స్థలములో వధించి దాని మాంసమును తమతమ ఇండ్లలోనే భుజించాలి లేక ఒక్క ఇంటిలోనే భుజించాలి మరియు దాని మాంసములో కొంచెమైనను బయటికి తీసుకుపోకూడదు (ని.కాం.12:7-11, 21-23, 46-47)
ద్వితీయోపదేశకాండములో ఆజ్ఙాపించినదాని ప్రకారము పస్కాపశువును తాము నివసిస్తున్న స్థలములో లేక పురములో వధించకూడదు. అయితే పస్కాపశువును యెరూషలేములోనే వధించి, దాన్ని అక్కడే కాల్చి భుజించి ఉదయమున తిరిగి తమతమ ఇండ్లకు వెళ్ళాలి (ద్వి.కాం.16:5-7) - దేవుడు హోరేబులో మోషేద్వారా ఇశ్రాయేలీయులతో నిబంధన చేసి యిచ్చిన ధర్మశాస్త్రము (ద్వి.కాం.అధ్యాయాలు 1-28)
దేవుడు హోరేబుతరువాత మోయాబు దేశములో మోషేద్వారా ఇశ్రాయేలీయులకు యిచ్చిన ధర్మశాస్త్రము (ద్వి.కాం.అధ్యాయాలు 28-31)
ఆ. ప్రవక్తల కాలములో మార్పులు
(1) మోషేధర్మశాస్త్ర ప్రకారము రాజు అనేక స్త్రీలను వివాహము చేసికొనకూడదు (ద్వి.కాం.17:17)
❌
ప్రవక్తల బోధ ప్రకారము రాజైన దావీదు అనేకమంది స్త్రీలను వివాహము చేసుకున్నాడు. (2సముయేలు.12:7-8 & 1ది.వృ.3:1-9, 14:3)
(2) మోషేధర్మశాస్త్రపు బోధ ప్రకారము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రతి సంవత్సరము యేడు పండుగలను జరుపుకోవాలి (లేవీ.కాం.23:1-44).
❌
ప్రవక్తల బోధ ప్రకారము దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు/యూదులు పూరీము అనే మరొక పండుగనుకూడా ప్రతి సంవత్సరము జరుపుకోవాలని నిర్ణయించబడింది (ఎస్తేరు.9:20-32)
(3) మోషేధర్మశాస్త్ర ప్రకారము విధవరాలిని పెండ్లిచేసుకోకూడదు (లే.కాం.21:7-14)
❌
ప్రవక్తల బోధ ప్రకారము యాజకులకు భార్యలై విధవరాడ్రుగా మారిన వారిని పెండ్లిచేసుకోవచ్చు (యెహెజ్కేలు 44:22)
(4) మోషేధర్మశాస్త్ర ప్రకారము అపవిత్రత తరువాత యేడు దినములు లెక్కించాలి (సం.కాం.19:11-14)
❌
ప్రవక్తల బోధ ప్రకారము పవిత్రుడైనతరువాత యేడుదినములు లెక్కించాలి (యెహెజ్కేలు 44:26)
(5) మోషేధర్మశాస్త్ర ప్రకారము జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షిస్తాడు (సం.కాం.5:29-31)
❌
ప్రవక్తల బోధ ప్రకారము జారస్త్రీని/వ్యభిచారిని దేవుడు శిక్షించడు (హోషేయ 4:14)
(6) మోషేధర్మశాస్త్ర ప్రకారము విడాకుల పత్రము వ్రాయడముద్వారా భర్త భార్యను పరిత్యజించవచ్చు (ద్వి.కాం.24:1-4; యిర్మీయ.3:8)
❌
ప్రవక్తల బోధ ప్రకారము భర్త భార్యను పరిత్యజించడము దేవునికి అసహ్యము (మలాకి.2:16)
(7) మోషేధర్మశాస్త్ర ప్రకారము దేవుడు బలులర్పించడాన్ని నిర్దేశించాడు (లేవీ.కాం.4:1-35; 5:4-12)
❌
ప్రవక్తల బోధ ప్రకారము దేవుడు బలులను కోరడములేదు (1సమూయేలు.15:22; కీర్తన.40:6, 51:16; హోషేయ.6:6)
(8) మోషేధర్మశాస్త్ర ప్రకారము దేవుని సన్నిధిలో (గుడారములో) దేవుని మందసము ఎదుట పాటలు పాడేవారిని వాయిద్యాలు వాయించేవారిని మోషే నియమించలేదు. దేవుని సన్నిధిలో బూరలను వూదాలి కాని ఆర్భాటము చేయకూడదు (సం.కాం.10:7-10)
❌
ప్రవక్తల బోధ ప్రకారముదేవుని మందసము ఎదుట పాటలు పాడుటకు వాయిద్యములు వాయించుటకు సేవకులను దావీదు నియమించెను. (1దిన.వృత్తాం.15:16-22, 16:4-6, 25:1-8; 2దిన.వృత్తాం.23:18; 29:25-30)
(9) మోషేధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచార పాపానికి మరియు నరహత్య పాపానికి శిక్ష మరణదండన (లే.కాం.20:10; ద్వి.కాం.22:22; ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)
❌
ప్రవక్తల బోధ ప్రకారము బత్షేబ విశయములో అలాగే ఆమె భర్త అయిన ఊరియా విషయములో దావీదు చేసిన పాపాలకు శిక్షగా దావీదుకు మరణదండన విధించబడలేదు (2సమూయేలు.12:13)
(10) మోషేధర్మశాస్త్ర ప్రకారము అబద్ధ సాక్ష్యానికి మరియు నరహత్యకు శిక్ష మరణదండన (ద్వి.కాం.19:16-19 & ని.కాం.21:12; లే.కాం.24:17; సం.కాం.35:16)
❌
ఆహాబు తన పొరుగువాడైన నాబోతు ద్రాక్షాతోటను ఆశపడి నాబోతుకు వ్యతిరేకంగా అబద్ధ సాక్షాన్ని సృష్టించి అతని మరణానికి కారకుడయ్యాడు. అయినా, ప్రవక్తల బోధ ప్రకారము మరణదండనను పొందకుండా క్షమాపణను పొందగలిగాడు (1రాజులు.21:1-29)
(11) మోషేధర్మశాస్త్ర ప్రకారము విగ్రహారాధన మరియు చిల్లంగితనము మరణదండనకు పాత్రమైన పాపాలు (లే.కాం.20:2; ద్వి.కాం.13:7-19; 17:2-7 & ని.కాం.22:18; లే.20:27)
❌
మనష్షె దేవునికి వ్యతిరేకంగా విగ్రహారాధన మరియు చిల్లంగితనము చేశాడు, కాని ప్రవక్తల బోధ ప్రకారము మరణదండనను పొందకుండ క్షమాపణను పొందాడు (2దిన.వృ.33:1-13)
(12) మోషేధర్మశాస్త్ర ప్రకారము యాజకధర్మము అహరోనుకు మరియు అతని కుమారులకు యివ్వబడింది. యాజకధర్మానికి వేరేవారు సమీపిస్తే మరణశిక్ష విధించాలి (సం.కాం.3:10, 38, 16:40)
❌
ప్రవక్తల బోధ ప్రకారము దావీదు వంశములోనుండి రాజుగా వచ్చే మెస్సయ్య యాజకునిగాకూడా వుండబోతున్నాడు (కీర్తన.110:4; జెకర్యా.6:12-13)
(13) పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (సం.కాం.15:4-10)
– గొర్రెపిల్ల + ముప్పావు ద్రాక్షారసము
– పొట్టేలు + పడి నూనె + నాలుగు పళ్ళ పిండి + పడి ద్రాక్షారసము
– కోడెదూడ + పడిన్నర నూనె + ఆరుపళ్ళ గొధుమ పిండి
❌
పండుగదినాలలో/నియామక కాలములలో అర్పించబడవలసిన బలులు మరియు నైవేద్యములు (యెహెజ్కేలు.46:11)
– ఎద్దు/పొట్టేలు + తూమెడు పిండి
– గొర్రెపిల్ల + శక్తికొలది పిండి + తూము ఒకటింటికి మూడుపళ్ళ నూనె
(ఇ) మెస్సయ్య కాలములో మార్పులు
పాతనిబంధన గ్రంథములో వాగ్ధానముచేయబడిన రాబోవు మోషేవంటి ప్రవక్త, మెల్కీజెదెకు క్రమములోని యాజకుడు, మరియు దావీదు వంశములోని రాజు మూడు పాత్రల సమ్మేళనమే రాబోవు మెస్సయ్య.
ఇశ్రాయేలీయులమధ్య, వారిలోనుండి వారికొరకు మోషేవంటి ప్రవక్తగా విచ్చేసిన యషువ మెషియాఖ్ (యేసు క్రీస్తు) ద్వారా దేవుడు తాను వాగ్ధానము చేసిన విధంగా తన మాటలను (ధర్మశాస్త్రాన్ని/ఉపదేశాన్ని) మానవకోటికి అందించాడు:
“ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞాపించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.” (ద్వి.కాం.18:16-19)
మెస్సయ్యగా వచ్చిన యేసు (యషువ) మోషేధర్మశాస్త్రనికన్నా శ్రేష్టమైన ధర్మశాస్త్రాన్ని మనకందించాడు:
“ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు గనుక ముందియ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్‌ప్రయోజన మైనందునను అది నివారణ చేయబడియున్నది; అంత కంటె శ్రేష్ఠమైన నిరీక్షణ దానివెంట ప్రవేశపెట్టబడెను. దీనిద్వారా, దేవునియొద్దకు మనము చేరుచున్నాము.” (హెబ్రీ.7:18-19)
“నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి.28:20)
“నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు గాని యిప్పుడు మీరు వాటిని సహింప లేరు. అయితే ఆయన, అనగా సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యము లోనికి నడిపించును; ఆయన తనంతట తానే యేమియు బోధింపక, వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసికొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమ పరచును. తండ్రికి కలిగినవన్నియు నావి, అందుచేత ఆయన నావాటిలోనివి తీసికొని మీకు తెలియజేయునని నేను చెప్పితిని.” (యోహాను.16:12-15)
మోషేధర్మశాస్త్రము యొక్క ఉద్దేశము
దేవుని పరిశుద్ధత మరియు న్యాయం అన్న రెండు ప్రాముఖ్యమైన దైవప్రామాణికతలనుగూర్చిన సాక్ష్యాన్ని అందించటం (లేవీ.కాం.11:44-45, 19:2; ద్వి.కాం.32:4).
దేవుడెన్నుకున్న ప్రజలు నీతిని సంపాదించే మార్గాన్ని చూపటం (ద్వి.కాం.6:25; రోమా.2:13).
దేవుని ప్రజలు దేవుడు వాగ్ధానము చేసిన పాలస్తీనాదేశములోకి ప్రవేశించి దాన్ని స్వాధీనపరచుకొనుటకు (ద్వితీ.కాం.4:1…5-6).
రాబోవు దినాలలో మెస్సయ్య యొక్క ఆగమనము, ఉపదేశము, మరియు ప్రాయశ్చిత్తార్థ బలియాగమునందు ప్రేమాధారంగా అనుగ్రహించబడబోయే దేవుని నీతి యొక్క ప్రత్యక్షతకు ఛాయారూపాన్ని అందించటం (హెబ్రీ.10:1).
మోషే వంటి ప్రవక్త రాబోతున్న మెస్సయ్య. ఆయన తన ఆగమనముతో మోషే ఉపదేశానికి (ధర్మశాస్త్రానికి) సంపూర్ణత చేకూర్చి నూతన నిబంధనకు నూతన ఉపదేశానికి (ధర్మశాస్త్రానికి) నాంది పలుకుతాడు. ఆయన రాకడతో మోషే ఉపదేశానికన్నా శ్రేష్టమైన ఆయన ఉపదేశానికి తలవొగ్గాలి. ఆయన మాట విననివాడు సర్వనాశనమవుతాడు అన్నది లేఖన హెచ్చరిక:
“ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనబడకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయ మున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నావంటి ప్రవక్తను నీ సహోదరులలో నీకొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను. వారు చెప్పిన మాట మంచిది; వారి సహో దరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివానిని దాని గూర్చి విచారణ చేసెదను.” (ద్వి.కాం.18:16-18)
“ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది.” (కొలొస్సీ.2:17)
“మోషే యిట్లనెనుప్రభువైన దేవుడు నావంటి యొక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీకొరకు పుట్టించును; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట విన వలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.” (అపో.కా.3:22-23)
మోషేధర్మశాస్త్రపు అనువర్తన (applicability)
మోషేనిబంధన నోవహునిబంధనలా, అబ్రహామునిబంధనలా, మరియు దావీదునిబంధనలా నిత్యనిబంధన కాదు. అందునుబట్టి, మోషేనిబంధనలో భాగమైన మోషేధర్మశాస్త్రముకూడా నిత్యమూ వర్తించేది కాదు.
మోషేధర్మశాస్త్రానికి ప్రారంభము వుంది (1446 క్రీ.పూ.; సీనాయి పర్వతము; నిర్గమాకాండము 19-20 అధ్యాయాలు; ద్వి.కాం.4:8; నెహెమ్యా.9:13-14).
అలాగే దానికి అంతము కూడా వుంది (యిర్మీయా.31:32-33; యెషయా 24:5; యెహెజ్కేలు 44:7; 30 క్రీ.శ.; కలువరి కొండ; లూకా 22-24 అధ్యాయాలు; రోమా 10:4; గలతీ.3:19; ఎఫెసీ.2:14; హెబ్రీ.8:13, 10:9).
మోషేధర్మశాస్త్రము యొక్క అధికారము అమలులోవుండే కాలపరిమితి:
- అబ్రహాముకు వాగ్ధానము చేయబడిన “సంతానము” అంటే మెస్సయ్య వచ్చువరకు యివ్వబడింది (గలతి.3:17-19)
- దేవుని ప్రజలను విశ్వాసమునుబట్టి నీతిమంతులుగా తీర్చే మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) దగ్గరకు నడిపించే వరకు (గలతి.3:24)
- మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) రెండవ నిబంధనను స్థిరపరచే వరకు (హెబ్రీ.10:9)
- ప్రవక్తలద్వారా వాగ్ధానము చేయబడిన క్రొత్తనిబంధన ప్రారంభమయ్యే వరకు (యిర్మీయ 31:32-33; యెహెజ్కేలు 16:60-62; హెబ్రీ.8:13)
- మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) నందు మోషేధర్మశాస్త్రము యొక్క లక్ష్యము నెరవేరే వరకు (రోమా.10:4; 2కొరింథీ.3:14)
- మెస్సయ్య (యషువ మషియాఖ్/מָשִׁ֣יחַ יְהוֹשׁוּעַ) సిలువలో ఒక అడ్డుగోడగా వున్న దాన్ని తొలగించినంత వరకు (ఎఫెసి.2:14; కొలస్సీ.2:13-15)
- దానికన్నా శ్రేష్టమైనది ప్రవేశపెట్టబడినంతవరకు (రోమా.8:2; హెబ్రీ.7:18-19)
మోషేనిబంధన స్థానములో చేయబడిన మెస్సయ్యనిబంధన లేక క్రొత్తనిబంధనలో భాగంగా క్రీస్తుధర్మశాస్త్రము/క్రీస్తునియమము/క్రీస్తువుపదేశము యివ్వబడింది [νόμον/నొమోస్ = గలతీ.6:2; మెస్సయ్యతోర–యెషయా 42:4 = యోహాను.13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6].
క్రొత్తనిబంధనద్వారా దేవుని సంబంధులుగా మారిన నిజవిశ్వాసులు యిప్పుడు క్రీస్తుధర్మశాస్త్రము ప్రకారము జీవించబద్ధులై ఉన్నారు:
“నేను మీకు ఏ యే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొన వలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను.” (మత్తయి.28:20)
“నా చిన్నపిల్లలారా, మీరు పాపము చేయకుండు టకై యీ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రియొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై యున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు. మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసి కొందుము.” (1యోహాను.2:3)
మోషేధర్మశాస్త్రము యొక్క పరిమితి
మోషేధర్మశాస్త్రము పరిమితులు గలది. దానిలో సంపూర్ణత లేని కారణాన్ని బట్టి దేవుడు తిరిగి ప్రవక్తలద్వారా తన వాక్కులను అందిస్తూ ధర్మశాస్త్రానికి మార్పులు చేయటము జరిగింది. పైన ఆధారాలతో వివరించిన విధంగా దేవుడు మోషే కాలములోనేగాక ప్రవక్తల కాలములోకూడా తన ధర్మశాస్త్రానికి మార్పులు చేశాడు. దానితో దేవుని పక్షంగా మానవకోటికి అవసరమైన పరిపూర్ణ మరియు సంపూర్ణ ధర్మశాస్త్రము అందివుండింటే ఇక మెస్సయ బోధ/తోర (యెషయా:42:4) యొక్క ఆవశ్యకత వుండేది కాదు.
అయితే, ప్రవక్తల కాలములో సవరించబడిన ధర్మశాస్త్రముకూడా సంపూర్ణమైనది లేక పరిపూర్ణమైనది కాదు. ఆ కారణాన్నిబట్టి దేవుడు తన ప్రియకుమారుడైన మెస్సయ్య ద్వారా శ్రేష్టమైన, సంపూర్ణమైన, మరియు పరిపూర్ణమైన ధర్మశాస్త్రాన్ని అందించాడు. అదే నూతననిబంధనలో భాగంగా యివ్వబడిన నూతననిబంధనాగ్రంథపు బోధ.
ఈ సందర్భంగా మోషేధర్మశాస్త్రము చేయలేనివాటిలోని కొన్ని ప్రాముఖ్యమైన వాటిని ఈ క్రింద చూడవచ్చు:
- ధర్మశాస్త్రములోని విధులను గైకొనక మరియు వాటిని స్థిరపరచకుండుటనుబట్టి శాపగ్రస్తులుగా మారిన వ్యక్తులకు తిరిగి నీతిమంతులయ్యే మార్గం ధర్మశాస్త్రము చూపలేదు (ద్వి.కాం.27:26)
- తెలిసిచేసిన అనేక పాపాలకు క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం యివ్వలేదు
- మరణకరమైన పాపాలకు క్షమాపణ మార్గం నిర్దేశించలేదు
- అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి యివ్వలేదు
- అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అందించలేదు
- అన్యులకు యూదులలాంటి స్థానాన్ని యివ్వలేదు
- ఒక్క పాపినికూడా నీతిమంతునిగా/నీతిమంతురాలుగా తీర్చలేకపోయింది (రోమా.3:20; అపో.కా.13:39; గలతీ.2:16)
అయితే, పరమతండ్రి అయిన సృష్టికర్త మోషేధర్మశాస్త్రానికి వేరుగా అది చేయలేని వాటిని చేశాడు:
- విశ్వాసమూలముగా మానవులను నీతిమంతులను చేసాడు [అబ్రహాము (ఆది.కాం.12:11-13; 15:6; 20:1-2, 5; రోమా.4:3; గలతీ.3:6)]
- తెలిసీతెలియక చేసిన అన్ని పాపాలకు (పరిశుద్ధాత్మ దూశణకు తప్ప) క్షమాపణ/ప్రాయశ్చిత్తం పొందే మార్గం అనుగ్రహించాడు (అపో.కా.13:39; కొలొస్సీ.2:13; 1యోహాను.1:9)
- మరణకరమైన పాపాలకు సహితం క్షమాపణను అందించాడు [దావీదు (2సమూయేలు.12:1-13)]
- అన్యులకు అంటే యూదేతరులకు పరిశుద్దస్థలములోకి ప్రవేశించె అనుమతి ఇచ్చాడు (ఎఫెసీ.2:11-22; 1పేతురు.2:9-10)
- అన్యులకు యూదులతో సమానంగా ఆత్మీయ మేళ్ళను అనుగ్రహించాడు (2పేతురు.1:1)
- అన్యులకు యూదులలాంటి స్థానాన్ని ఇచ్చాడు (గలతీ.3:28-29)
- పాపులైన అనేకమందిని యూదులు మరియు యూదేతరులు అన్న భేదం లేకుండా నీతిమంతులుగా మార్చాడు (రోమా.3:23-30)
మోషేధర్మశాస్త్రము – క్రొత్తనిబంధన విశ్వాసులు
అన్యజనుల రక్షణ మరియు మోషేధర్మశాస్త్రము
అన్యజనులు రక్షణ పొందటనికి అలాగే వారు రక్షణలో కొనసాగటానికి మోషేధర్మశాస్త్రమును పాటించనవసరము లేదు. ఈవిశయములో యూదయనుండివచ్చిన కొందరు దుర్బోధకులు వారితోపాటు వారిని సమర్ధించిన పరిసయ్యుల తెగలోనుండి క్రొత్తనిబంధన విశ్వాసులుగా మారిన వారికి మరియు అపోస్తలులకు మధ్య వాగ్వివాధం జరగడం తద్వారా అన్యజనులలోనుండి విశ్వాసులుగా మారిన వారు తాము పాటించాల్సిన నియమాల వివరాలను అపోస్తలులు అందించటాన్ని గురించి క్రింది లేఖనాలలో చూడవచ్చు:
“కొందరు యూదయనుండి వచ్చిమీరు మోషేనియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపొస్తలులయొద్దకును పెద్దలయొద్దకును వెళ్లవలెనని సహో దరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘమువలన సాగనంపబడి, ఫేనీకే సమరయ దేశములద్వారా వెళ్లుచు, అన్యజనులు దేవునివైపు తిరిగిన సంగతి తెలియపరచి సహో దరులకందరికిని మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా, సంఘపువారును అపొస్తలులును పెద్దలును వారిని చేర్చుకొనిరి; దేవుడు తమకు తోడైయుండి చేసినవన్నియు వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరులేచి, అన్యజనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. అప్పుడు అపొస్తలులును పెద్దలును ఈ సంగతినిగూర్చి ఆలోచించుటకు కూడివచ్చిరి. బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియును. మరియు హృద యములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి, వారినిగూర్చి సాక్ష్య మిచ్చెను. వారి హృదయములను విశ్వాసమువలన పవిత్ర పరచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడమీద పెట్టి మీ రెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా? అలాగే వారును రక్షణ పొందుదురు అనెను.” (అపో.కా.15:1-11)
“కాబట్టి అన్యజనులలోనుండి దేవునివైపు తిరుగుచున్నవారిని మనము కష్టపెట్టక విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతుపిసికి చంపినదానిని, రక్తమును, విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఏలయనగా, సమాజమందిరములలో ప్రతి విశ్రాంతిదినమున మోషే లేఖనములు చదువుటవలన మునుపటి తరములనుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పెను.” (అపో.కా.16:19-21)
“అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరుగల యూదాను సీలను తమలో ఏర్పరచుకొని, పౌలుతోను బర్నబాతోను అంతియొకయకు పంపుట యుక్తమని అపొస్తలులకును పెద్దలకును వీరు వ్రాసి, వారిచేత పంపిన దేమనగా అపొస్తలులును పెద్దలైన సహోదరులును అంతియొకయ లోను, సిరియలోను, కిలికియలోను నివసించుచు అన్యజనులుగానుండిన సహోదరులకు శుభము. కొందరు మాయొద్దనుండి వెళ్లి, తమ బోధచేత మిమ్మును కలవరపరచి, మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మే మధికారమిచ్చి యుండలేదు గనుక మనుష్యులను ఏర్పరచి, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరుకొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతోకూడ మీయొద్దకు పంపుట యుక్తమని మాకందరికి ఏకాభిప్రాయము కలిగెను. కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విస ర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటె ఎక్కువైన యే భారమును మీ మీద మోపకూడదని, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్తపడితిరా అది మీకు మేలు. మీకు క్షేమము కలుగును గాక.”
పై లేఖనాలలోని సారాంశము…
యూదయ నుండి వచ్చిన కొందరు మరియు వారితో ఏకీభవించిన పరిసయ్యుల తెగలోనుండి విశ్వాసులుగా మారినవారు చేసిన బోధ: రక్షణపొందుటకు మోషేధర్మశాస్త్రమును పాటించాలి.
పౌలు మరియు బర్నబాల బోధ: రక్షణపొందుటకు మోషేధర్మశాస్త్రమును పాటించనవసరము లేదు.
అపోస్తలుల సమాలోచన: అన్యజనులలోనుండి విశ్వాసులుగా మారిన వారు తమ విశ్వాసముద్వారా దేవుని పరిశుద్ధాత్మను పొంది దేవుని చేత సాక్ష్యము పొందారు. వారి విశ్వాసమును బట్టి దేవుడు వారి హృదయాలను పవిత్ర పరచాడు. ఈ కారణాన్నిబట్టి మనమైనను మన పితరులైనను మోషేధర్మశాస్త్రమును పాటించుట అన్న మోయలేకపోయిన కాడిలాంటిదాన్ని వారిపై మోపకూడదు. అన్యజనులలోనుండి దేవుడు రక్షించుకున్న వారిపై మోషేధర్మశాస్త్రమనే కాడీని మోపే ప్రయత్నము చేస్తే అది దేవున్ని శోధించడమే.
అన్యులలోనుండి వచ్చిన విశ్వాసులకు అపోస్తలుల లేఖ: కొందరు అంటే యూదయనుండి వచ్చినవారు అలాగే పరిసయ్యుల తెగలోనుండి విశ్వాసులుగా మారినవారు మీవద్దకు వచ్చి మీ విశ్వాసాన్ని కలవరపరచడం జరిగింది. వారిని మేము పంపలేదు, వారు బోధించిన విశయాలను చెప్పే అధికారము మేము వారికి యివ్వలేదు. మీరు పాటించాల్సిన ఆవశ్యకమైనవి ఇవి: విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతుపిసికి చంపినదానిని, జారత్వమును విసర్జింపవలెను.
క్రొత్తనిబంధనలో పాలుపొందినవిశ్వాసులకు మోషేధర్మశాస్త్రము పట్ల ఉండాల్సిన వైఖరిని గురించి అపోస్తలుడైన పౌలుద్వారా యివ్వబడిన లేఖనాలలో మరికొంత స్పష్టత యివ్వబడింది:
“యూదులను సంపాదించుకొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించుకొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని.” (1కొరింథీ.9:20)
“మరియు వారి మనస్సులు కఠినములాయెను గనుక నేటివరకును పాతనిబంధన చదువబడునప్పుడు, అది క్రీస్తునందు కొట్టివేయ బడెనని వారికి తేటపరచబడక, ఆ ముసుకే నిలిచియున్నది. నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్ల ముసుకు వారి హృదయముల మీదనున్నది గాని వారి హృదయము ప్రభువువైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుకు తీసివేయబడును.” (2కొరింథీ.3:14-16)
“నేను క్రీస్తుతోకూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నే నిప్పుడు శరీర మందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారునియందలి విశ్వాసమువలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకము చేయను; నీతి ధర్మశాస్త్రమువలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్‌ప్రయోజనమే.” (గలతీ.2:19-21)
“ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరు శాపమునకు లోనైయున్నారు. ఎందుకనగాధర్మశాస్త్రగ్రంథమందు వ్రాయబడిన విధులన్నియుచేయుటయందు నిలుకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడియున్నది.” (గలతీ.3:10)
“ఆలాగైతే ధర్మశాస్త్ర మెందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడెనో ఆ సంతానము వచ్చువరకు అది అతి క్రమములనుబట్టి దానికి తరువాత ఇయ్యబడెను; అది మధ్యవర్తిచేత దేవదూతల ద్వారా నియమింపబడెను.” (గలతీ.3:19)
“కాబట్టి మనము విశ్వాసమూలమున నీతి మంతులమని తీర్చబడునట్లు క్రీస్తు నొద్దకు మనలను నడి పించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయెను. అయితే విశ్వాసము వెల్లడియాయెను గనుక ఇక బాలశిక్షకుని క్రింద ఉండము.” (గలతీ.3:24-25)
“మీలో ధర్మశాస్త్రమువలన నీతిమంతులని తీర్చబడువారెవరో వారు క్రీస్తులోనుండి బొత్తిగా వేరుచేయబడియున్నారు, కృప లోనుండి తొలగిపోయి యున్నారు.” (గలతీ.5:4)
మోషేధర్మశాస్త్రము యొక్క పాత్ర
మెస్సయ్యకు పూర్వం:
1) సృష్టికర్తయైన దేవున్ని మరియు ఆయన నైజాన్ని తెలియపరుస్తుంది (ని.కాం.18:11; ద్వి.కాం.4:35)
2) రాబోవు వాటికి మరియు క్రీస్తుకు ఛాయ రూపము (కొలొస్సీ.2:17; హెబ్రీ.10:1)
3) ఇశ్రాయేలీయులకు బాలశిక్షకుడు (గలతీ.3:24)
4) పాపమంటే యేమిటో తెలియపరుస్తుంది (రోమా.7:7)
5) మానవ ప్రయత్నాల దివాళుకోరుతనాన్ని మరియు విమోచకుని ఆవశ్యకతను నొక్కివక్కాణిస్తుంది (రోమా.3:9,19)
6) హృదయాలలో నిరీక్షణను కలిగిస్తుంది (రోమా.15:4)
7) విశ్వాసనికి మాదిరిని చూపిస్తుంది (హెబ్రీ.11:4)
8) ఆత్మీయ సత్యాలను అలంకారరూపంలో అందిస్తుంది (గలతీ.4:24)
9) బుద్దిచెబుతుంది/బోధిస్తుంది (రోమా.15:4; 1కొరింథీ.10:5-11)
10) ధర్మవిరోధుల కొరకు మరియు పాపులకు కొరకు నియమింపబడినది (గలతీ.3:19; 1తిమోతి 1:8-11)
11) వాగ్ధానము చేయబడిన సంతానము అంటే మెస్సయ్యా వచ్చువరకు నియమించబడింది (గలతీ.3:19)
12) నెరవేర్చబడాల్సినవన్నీ నెరవేర్చబడేవరకు వునికిలో వుంటుంది (మత్తయి.5:18)
మెస్సయ్య నుండి:
1) ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది (2తిమోతి.3:16-17)
2) పాపమంటే యేమిటో తెలియపరుస్తుంది (రోమా.7:7)
3) విశ్వాసనికి మాదిరిని చూపిస్తుంది (హెబ్రీ.11:4)
4) ఆత్మీయ సత్యాలను అలంకారరూపంలో అందిస్తుంది (గలతీ.4:24)
5) బుద్దిచెబుతుంది/బోధిస్తుంది (రోమా.15:4; 1కొరింథీ.10:5-11)
6) ధర్మవిరోధుల కొరకు మరియు పాపులకు కొరకు నియమింపబడినది (గలతీ.3:19; 1తిమోతి 1:8-11)
మెస్సయ్య మోషేధర్మశాస్త్రాన్ని తప్పుబట్టి కొట్టివేయడానికి రాలేదు. అయితే, ఒక యూదునిగా దాన్ని పరిపూర్ణంగా పాటించడమే [φυλάσσω/ఫులస్సో=అనుసరించుట/పాటించుట] కాకుండా దానిలోని ఛాయారూపాలను నెరవేర్చి [πληρόω/ప్లెరూహ్=నెరవేర్చబడుట/సంపూర్తి అవుట] మానవుల రక్షణ/మోక్షముకై దేవుడేర్పరచిన ప్రణాలికలోని దాని పాత్రను సంపూర్తి పూర్తిచేయటానికి వచ్చాడు (మత్తయి.5:17; గలతీ.3:25).
ఇప్పుడు మోషేధర్మశాస్త్రము పట్ల ఉండాల్సిన దైవసంబధుల వైఖరి
క్రొత్తది అంటే క్రొత్తనిబంధన మరియు అందులోని భాగమైన క్రీస్తుధర్మశాస్త్రము [Law of Christ (గలతీ.6:2)] లేక మెస్సయ్యతోర [యెషయా 42:4 = యోహాను 13:34, 14:26, 16:12-15; 1కొరింథీ.9:21; 1యోహాను 2:3-6] వచ్చినదనుక మోషేధర్మశాస్త్రము రద్దుచేయబడి [καταργέω/కతర్గెవొ=తొలగుట/రద్దు—రోమా.7:1-6; 2కొరింథీ.3:14; ఎఫెసి.2:14; కొలస్సీ.2:13-15] తొలగించబడింది [ἀθέτησις/అథెటెసిస్=నివారణ/రద్దు; ἀναιρέω/అనాహిరెయొ=ముగింపు/తీసివేయుట–హెబ్రీ.7:18-19, 8:13, 10:9].
దీనిభావం…
- మోషేధర్మశాస్త్రము ఉనికిలో లేకుండా అదృశ్యమయిందని కాదు.
- మోషేధర్మశాస్త్రన్ని చదవకూడదని కాదు.
- మోషేధర్మశాస్త్రములో తెలుసుకోవలసిన విశయాలు లేవని కాదు.
- మోషేధర్మశాస్త్రములో విశ్వాసులు అన్వయించుకోవలసిన విశయాలు లేవని కాదు.
- మోషేధర్మశాస్త్రాము యొక్క అధికారము క్రింద విశ్వాసులు లేరని (రోమా.6:14; గలతీ.4:21, 5:18).
- మోషేధర్మశాస్త్రము యొక్క ఆజ్ఙలు/విధులను పాటించడముద్వారా నీతిని పొందే ఆగత్యము విశ్వాసులకు లేదని (గలతీ.5:4).
- మోషేధర్మశాస్త్రము విశ్వాసులకు కాదు అవిశ్వాసులకు నియమించబడిందని (1తిమోతి.1:8-10).
- మోషేధర్మశాస్త్రాన్ని విశ్వాసులు ధర్మానుకూలంగా ఉపయోగించాలి. అంటే, క్రొత్తనిబంధన బోధల వెలుగులో క్రొత్తనిబంధన బోధలకు వ్యతిరిక్తముకానివాటిని విశ్వాసులు ఉపయోగించుకోవాలి (1తిమోతి.1:11).
పది ఆజ్ఙలు
మోషేధర్మశాస్త్రములో అందించబడిన కొన్ని బోధలను మెస్సయ్య బోధలో తిరిగి ప్రవేశపెట్టడమైనది. అందులోని అతి ప్రధానమైన భాగం దశాజ్ఙలు. క్రొత్తనిబంధనలో ప్రవేశించి దేవుని ప్రజలుగా మారిన నిజవిశ్వాసులు దశాజ్ఙలకు వ్యతిరేకంగా జీవించకూడదు. అయితే, ఇది మోషేధర్మశాస్త్రాన్ని బట్టి కాదుగాని మెస్సయ్య ధర్మశాస్త్రాన్నిబట్టి మాత్రమే నన్నది గుర్తుంచుకోవాలి.
మొదటి ఆజ్ఙ
“బైబిలులో ప్రత్యక్షపరచుకున్న దేవున్నితప్ప వేరొక దేవున్ని కలిగిఉండకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:3; ద్వి.కాం.5:7 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.4:10; లూకా.4:8
క్రొత్తనిబంధన తరువాత: ప్రకటన.14:7
రెండవ ఆజ్ఙ
“పూజించుటకు సృష్టిలోని రూపాలను లేక విగ్రహాలను చేసికోకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:4-6; ద్వి.కాం.5:8-10 =
క్రొత్తనిబంధన తరువాత: అపో.కా.15:20; 1కొరింథీ.6:9-10; గలతీ.5:19-20; ఎఫెసీ.5:5
మూడవ ఆజ్ఙ
“దేవుని నామాన్ని వ్యర్థముగా ఉచ్ఛరింపరాదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:7; ద్వి.కాం.5:11 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:33-37
క్రొత్తనిబంధన తరువాత: 1తిమోథి.6:1; యాకోబు.2:7
నాలుగవ ఆజ్ఙ
“విశ్రాంతిదినాన్ని పరిశుద్ధముగా ఆచరించవలెను.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:8-11; ద్వి.కాం.5:12-15 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.12:8; లూకా.23:56
ఐదవ ఆజ్ఙ
“తల్లిని తండ్రిని సన్మానించవలెను.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:12; ద్వి.5:16 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.15:4-9; 19:19; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29-30; ఎఫెసీ.6:1-3
ఆరవ ఆజ్ఙ
“నరహత్య చేయకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:13; ద్వి.కాం.5:17 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:21-22; 19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29-30, 13:9
ఏడవ ఆజ్ఙ
“వ్యభిచరింపకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:14; ద్వి.కాం.5:18 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.5:27-28, 19:18; మార్కు.10:11-12, 19; లూకా.16:18, 18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.7:2-3, 13:9
ఎనిమిదవ ఆజ్ఙ
“దొంగిలకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:15; ద్వి.కాం.5:19 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: రోమా.13:9; ఎఫెసీ.4:28; 1పేతురు.4:15; ప్రకటన.9:21
తొమ్మిదవ ఆజ్ఙ
“పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:16; ద్వి.కాం.5:20 =
క్రొత్తనిబంధనకు ముందు: మత్తయి.19:18; మార్కు.10:19; లూకా.18:20
క్రొత్తనిబంధన తరువాత: అపో.కా.5:3-4; రోమా.13:9; ఎఫెసీ.4:25
పదవ ఆజ్ఙ
“పొరుగువాని భార్యనైనను, ఆస్థినైనను లేక దేనినైనను ఆశింపరాదు.”
పాతనిబంధన తరువాత: ని.కాం.20:17; ద్వి.కాం.5:21 =
క్రొత్తనిబంధనకు ముందు: లూకా.12:15
క్రొత్తనిబంధన తరువాత: రోమా.1:29, 7:7, 13:9; 1 కొరింథీ.6:9-10; గలతీ.5:19-21; ఎఫెసీ.5:3,5
Great content dear brother ?
THANQ