మోషేనిబంధన
దేవుడు మోషేద్వారా చేసిన నిబంధనను మోషేనిబంధన [Mosaic Covenant] అని అలాగే పూర్వ/పాత నిబంధన [Previous/Old Covenant] అనికూడా సంబోధిస్తారు.
(1) ఈ నిబంధన దేవుడు ప్రధానంగా ఇశ్రాయేలు వంశస్తులతో చేసాడు (ని.కాం.19:3-6, 24:3-8; ద్వితీ.కాం.4:7-8, 5:1-5, 29:1; మలాకి 4:4; రోమా.2:11-12, 3:19, 9:4; ఎఫెసీ. 2:11-12; హెబ్రీ.8:9).
అయితే, వారితో మాత్రమే కాకుండా నిబంధన సమయములో వారిమధ్య జీవిస్తూ వారితోపాటు వాగ్దత్త దేశమైన కానానులో స్వాస్థ్యము పొందబోతున్న అన్యులతో/పరదేశులతో అలాగే ఆసమయములో అక్కడ వారితోకూడా లేని వారిసంబంధికులందరితో అంటే కనానుదేశములో స్వాస్థ్యము పొందబోతున్న రాబోవుతరాలతోకూడా (ద్వి.కాం.29:10-15, 29) చేశాడు. ఇది మానవులందరితో చేయబడిన ఆదాము-నిబంధన (ఆది.కాం.3:15-21) లేక నోవహు-నిబంధన (ఆది.కాం.9:1-17) వంటిది కాదు.
(2) ఈ నిబంధనలో భాగంగా ఇవ్వబడిన నియమవిధులను (ధర్మశాస్త్రాన్ని) ఇశ్రాయేలీయులు పూర్తిగా పాటించాలి (ని.కాం.15:26; ద్వి.కాం.5:29, 6:2; 12:32; 13:18, 26:18, 27:1). ఈ నిబంధనలోనికి ప్రవేశించిన వ్యక్తి (ఇశ్రాయేలీయుడు/యూదుడు) తన జీవితకాలములో ధర్మశాస్త్రములోని యేవొక్కటి తప్పిపోకుండా పాటించాలి. నిబంధనలో పాలుపంపులున్న ప్రతి ఇశ్రాయేలీయుడు/యూదుడు తన జీవితకాలములో ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించకపోతే, అంటే ఎప్పుడైనా యేవొక్క ఆజ్ఙ లేక విధి విశయములోనైనా తప్పిపోతే, నిబంధన ప్రకారము అతడు శాపగ్రస్తుడు. (ద్వి.కాం.27:26; యిర్మీయా 11:1-4)
(3) ఈ నిబంధనలోని నియమవిధుల ప్రకారము కొన్ని అతిక్రమాలకు మరణమే శిక్ష (సం.కాం.15:30-31). మరిముఖ్యంగా పదిఆజ్ఙలలోని ఆరు ఆజ్ఙలను మీరిన వారికి మరణశిక్ష (ద్వి.కాం.13:1-18; 17:2-5; లే.కాం.24:11-16; ని.కాం.31:14-15, 35:2; ద్వి.కాం.21:18-21; ని.కాం.21:17; ని.కాం.21:12-14; లే.కాం.20:10). అలాంటి అతిక్రమాలకు ధర్మశాస్త్ర ప్రకారము యేలాంటి విముక్తి లేదు. కాని, ధర్మశాస్త్రము తరువాత ఇవ్వబడిన ప్రవక్తల ఉపదేశము ప్రకారము దేవుడు తన మహా గొప్ప కృపాకనికరాల ఆధారంగా తాను సంకల్పించి యేర్పరచుకొన్న తన సేవకుని అపరాధపరిహారార్థబలినిబట్టి ధర్మశాస్త్రముద్వారా మరణశిక్షకు పాత్రులైన వారందరికి క్షమాపణను అందుబాటులోకి తీసుకొచ్చాడు (యెషయా 53:2-12; దానియేలు 9:24).
దైవచిత్తములోని ఈ నిత్యప్రణాలికయొక్క ఖచ్చితత్వాన్నిబట్టి దేవుడు పాతనిబంధన కాలములో సహితము మరణకరమైన పాపములను చేసినవారినికూడా క్షమించగలిగాడు. ఉదాహరణకు, దావీదు ఊరియా భార్య అయిన బత్షేబ విశయములో చేసిన పాపము దేవుడిచ్చిన పది ఆజ్ఙలలో మూడు ఆజ్ఙలను మీరడమే. ఈ మూడు ఆజ్ఙాతిక్రమాలలో ధర్మశాస్త్ర ప్రకారము రెండింటికి మరణమే శిక్ష. అయినా, దావీదు దేవుని క్షమాపణను పొందగలిగాడు (2సమూయేలు.12:13). అందుకు కారణం ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు తన ధర్మశాస్త్రాన్ని తానే త్రొసివేయడముద్వారా దావీదును క్షమించాడని కాదు కాని, ధర్మశాస్త్రబద్దమైన మరణదండన అనే శిక్షను దేవుడు తానే సంకల్పించి యేర్పరచి నెరవేర్చబోతున్న తన కుమారుని అపరాధపరిహారార్థబలిలో నెరవేర్చాడు. అందునుబట్టే దావీదు విరిగినలిగిన హృదయంతో క్షమాపణను కోరినప్పుడు దేవుడతనిని క్షమించాడు (కీర్తన 51:1-19).
(4) మోషేధర్మశాస్త్రమును తు.చ. తప్పకుండా తన జీవితకాలములో సంపూర్ణముగా పాటించిన వ్యక్తి పాత నిబంధన గ్రంథముగా పేర్కొనబడే యూదుల తనాఖ్ (Old Testament) లో ఎవరూ లేరు.
ఈనాడు మోషేద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని ప్రకటిస్తూ బోధిస్తూ, దాని ప్రకారం జీవిస్తున్నాము అంటూ భ్రమపడుతున్న వారు క్రింద ఇవ్వబడిన కొన్ని ధర్మశాస్త్ర విధులను పాటించే విశయములో తమ పరిస్తితిని పరిశీలించి చూసుకోవాలి:
i. మీరు ఇంతవరకు తిన్న ఆహారములో పశువుల (ఎద్దు/గొర్రె/మేక/కోడి మొదలైనవి) క్రొవ్వుకూడా వుండిందా? (లే.కాం.3:16) ఒక్కసారి వున్నా మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
ii. తల్లిని లేక తండ్రిని దూశించిన మీ పిల్లలకు ఎప్పుడైనా మరణశిక్ష విధించారా? (లే.కాం.19:27) “మాదేశములో అలాంటిది చట్టపరంగా ఒప్పుకోరండీ” అంటూ సాకులు చెప్పకండి. అలా మీరు చెపితే దేవుని ధర్మశాస్త్రానికన్నా మీరు ఈలోక చట్టానికే గొప్పస్థానమిచ్చీ భయపడి దాసోహమంటున్నారనేగదా దాని భావం! మరోవిశయం, మీ పిల్లలపట్ల మీకున్న ప్రేమ దేవునిపట్లా అలాగే దేవుడు మోషేద్వారా యిచ్చిన ఆజ్ఙలపట్లా వుండాల్సిన ప్రేమకన్న గొప్పదనే కదా?! ఏకారణముచేతనైనా మీరు అలా చేయకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
iii. మీ తల చుట్టూ వెండ్రుకలను, గడ్డపు ప్రక్కలను కత్తిరింపకుండా జీవిస్తున్నారా? (లే.కాం.19:27; యిర్మియా 9:26) గడ్డాన్నే నున్నగా క్షవరం చేసికొని సోగ్గాల్లా తయారవుతుంటే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. తల చుట్టూ వెండ్రుకలను కత్తిరిస్తున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
iv. మీరు వేసుకునే దుస్తులలో వున్ని మరియు జనుపనార (ప్రత్తి/cotton/linen/ఖాదీ) కలిసినవాటిని వేసుకుంటున్నారా? (ద్వి.కాం.22:11) అలా చెస్తే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
v. మీరు సంవత్సరానికి మూడుసార్లు యెరుషలేముకు వెళ్ళి అక్కడ బలులర్పించి పండుగలను ఆచరిస్ఫున్నారా? (ని.కాం.23:14) లేకపోతే మీరు మోషేధర్మశాస్త్రానికి విరుద్ధంగా పాపము చేసినట్లే.
vi. మీరెప్పుడైనా శనివారమునాడు ప్రయాణము చేసారా? (ని.కాం.16:29) అయితే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
vii. మీరెప్పుడైనా శనివారమునాడు ఏపనియైనా చేసారా?(ని.కాం.20:10; లే.కాం.23:3) చేస్తే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
viii. మీరెప్పుడైనా శనివారమునాడు వర్తకములో పాలుగొనడముగాని లేక సరకులు కొనడముగాని చేసారా? (నెహెమ్యా 10:31, 13:15,19; ఆమోసు 8:5) అలా చేసివుంటే మీరు మోషెధర్మశాస్త్రమును మీరి పాపము చేసినట్లె. శాపగ్రస్తునివి/శాపగ్రస్తురాలువు అయినట్లే!!!
ix. విశ్రాంతిదినాచారాన్ని అంటే సబ్బాతు ఆచారాన్ని మీరినవారికి మీ సమాజములో మరణశిక్ష వేసార? (ని.కాం.31:14-15, 35:2) అలా వేయకపోతే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!
x. మీ సమాజములో “హాని కలిగిన యెడల ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పల్లు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బ” శిక్షగా నియమిస్తున్నారా?(ని.కాం.21:23-25; లే.కాం.24:19-20; ద్వి.కాం.19:21) అలా చేయకపోతున్నట్లయితే మీరు మీసమాజమంతా మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మీసమాజమంతా శాపగ్రస్తులు అయినట్లే!!!
xi. మీ తలంపులలో లేక హృదయములో మీదికానిది/యితరులది ఆశించిన సందర్భాలున్నాయా? (ని.కాం.20:17) వుంటే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!
xii. మీరు ఎప్పుడైనా వేరే దేవుని/దేవత పేరును ఉచ్చరించారా? (ని.కాం.23:13) అలా చేసి వున్నట్లయితే మీరు మోషేధర్మశాస్త్రాన్ని మీరి పాపముచేసినట్లే. మీరు మోషేధర్మశాస్త్ర ప్రకారము శాపగ్రస్తులు అయినట్లే!!!
(5) మోషేధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలు జనాంగమంతా తప్పిపోయిన కారణాన్నిబట్టి పూర్వ/పాత నిబంధన వీగిపోయింది (న్యాయాధిపతులు 2:20; 2రాజులు 17:15-18, 18:11-12; యెషయా 24:5; యిర్మీయ 11:8,10, 31:32; యెహెజ్కేలు 16:59, 44:7; హోషేయ 6:7, 8:1).
(6) పూర్వ/పాత నిబంధనలో పాలుపంపులున్న వ్యక్తులంతా ఆ నిబంధనలోని నియమాల ప్రకారము శాపగ్రస్తులుగా తేలిపోయారు. నిజానికి, ఈ నిబంధనలోని నియమాల ప్రకారము మానవమాత్రులెవరూ నీతిమంతులుగా తీర్చబడలేరన్నది వెయ్యి సంవత్సరాల (క్రీ.పూ. 1400 – క్రీ.పూ. 400) ప్రవక్తలకాలంలో నిర్ధారణగా తేలిపోయింది (1రాజులు 8:46; కీర్తనలు 14:1-3, 53:1-3, 143:2; ప్రసంగి 7:20; రోమా.3:20; గలతీ.2:16, 3:10-11).
(7) పై కారణాలను బట్టి దేవుడైన యెహోవా/యాహ్వే పాత నిబంధన స్థానములో నిత్యము వుండబోయే ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నట్లు ప్రవక్తల కాలంలోనే వాగ్ధానము చేసాడు (యెషయా 42:1-3,6, 55:1-5, 61:1-11; యిర్మీయ 31:31-34; యెహెజ్కేలు 16:59-60, 37:24-28).
“ప్రభువైన యెహోవా ఈలాగున సెలవిచ్చుచున్నాడుచేసిన నిబంధనను భంగము చేయవలెనని ప్రమాణమును తృణీక రించుదానా, నీవు చేసినట్టే నేను నీకు చేయబోవుచున్నాను. నీ యౌవన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొని యొక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరతును.” (యెహెజ్కేలు 16:59-60)
“ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యెహోవా వాక్కు.” (యిర్మీయ 31:31-32)
(8) అబ్రహామును అలాగే ఆయన సంతానమైన ఇశ్రాయేలీయులను దేవుడు యెన్నుకొని వారితో చేసిన నిబంధనలద్వారా కేవళము వారిని మాత్రమే అశీర్వదించాలన్నది దేవుని వుద్దేశము కాదు. నిజానికి వారిని అశీర్వదించి వారిద్వారా భూలోకములోని వంశాలన్నిటిని అశీర్వదించాలన్నదే దేవుని నిత్యసంకల్పము (ఆది.కాం.12:1-3, 18:18, 22:18; కీర్తన 22:27-28, 86:9; యెషయా 9:1-2, 11:10, 42:1-4,6, 49:6, 55:1-5, 60:1-3; దానియేలు 7:14; ఆమోసు 9:11-12; హోషేయ 2:23).
(9) పూర్వ/పాత నిబంధన కాలములోని భక్తులు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణముగా పాటించలేక పోవడాన్ని బట్టి ధర్మశాస్త్ర మూలమైన నీతిని పొందలేకపోయారు. అయినా, వారందరూ ధర్మశాస్త్రానికి వేరుగా విశ్వాసమూలమైన నీతినిపొంది దేవుడిచ్చిన మోషే ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తూ దాన్ని పాటించే విశయములో తమవంతు ప్రయత్నాలను చేశారు (ఆది.కాం. 15:5-6; హబక్కూకు 2:4; గలతీ.3:6-9; హెబ్రీ.11:13, 39).
(10) పాత నిబంధనకాలం ప్రభువైన యేసు క్రీస్తు [యషువ మషియాఖ్] యొక్క సిలువ మరణము వరకు మాత్రమే అన్నది మరచిపోకూడదు. ఈ కారణమును బట్టే ప్రభువైన యేసు క్రీస్తు పవిత్రమైన అమూల్యమైన తన స్వరక్తాన్ని ధారపోయడముద్వారా అంటే తన మరణముద్వారా ప్రతిష్టించి ప్రారంభించబోయే క్రొత్త నిబంధన ఆరంభమువరకు పాత నిబంధన [మోషేద్వారా ఇశ్రాయేలీయులతో చేసిన నిబంధన] యొక్క అసలు అర్థాన్ని తన చుట్టూ వున్నవారికి వివరించి చెప్పాడు, తాను పాటించి చూపాడు, మరియు దాని కోరికను తీర్చి కేవళము ఛాయగా మాత్రమే వుండిన దాని అసలు వుద్దేశాన్ని నెరవేర్చి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులకు బాలశిక్షకునిగా వుండిన దాని పాత్రను పూర్తి చేసాడు. తద్వారా క్రొత్త నిబంధనకు దానితోపాటే యివ్వబడే క్రొత్త నియమాలకు [క్రీస్తు ధర్మశాస్త్రానికి] మార్గం సుగమం చేసాడు (మత్తయి 5:17, 28:19-20; యోహాను 13:34-35, 14:25-26,16:12-13; లూకా 22:19-20, 24:44; రోమా.10:4; 1కొరింథీ.9:21; గలతీ.3:24-25).
కనుక, ఈ క్రొత్తనిబంధన కాలములో నిజక్రైస్తవులు అంటే ఆత్మలో తిరిగి జన్మించిన విశ్వాసులు మోషేధర్మశాస్త్రాన్ని కాదు క్రీస్తు (మెస్సయ్య) ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ జీవించాలి!